1 రాజులు
1
1 దావీదురాజు ముసలివాడయ్యాడు. చాలా పెద్ద వయసు వచ్చింది. వారు అతనికి దుప్పట్లు కప్పినా ఇంకా చలిపెడుతూనే ఉంది. 2 అందుచేత అతని సేవకులు అతనితో “మా యజమానులూ రాజూ అయిన మీ కోసం పడుచుకన్నెను వెదకడం మంచిది. రాజైన మీ దగ్గరే ఆమె ఉంటూ మిమ్మల్ని ఆదరిస్తుంది. మీ కౌగిట్లో ఆమె పడుకొంటే మా యజమానులైన రాజుకు వేడి కలుగుతుంది” అన్నారు.
3 వాళ్ళు చక్కని యువతిని వెదకి వెదకి షూనేం గ్రామస్థురాలు అబీషగును చూచి రాజుదగ్గరికి తీసుకువచ్చారు. 4 ఆ పడుచు చాలా అందకత్తె. ఆమె రాజును ఆదరిస్తూ అతనికి సేవ చేస్తూ ఉంది గాని రాజు ఆమెతో శయనించలేదు.
5 తరువాత హగ్గీతు కొడుకు అదోనీయా “నేను రాజునవుతాను” అంటూ తనను హెచ్చించుకున్నాడు. రథాలనూ రౌతులనూ తనకు ముందు పరుగెత్తడానికి యాభైమంది మనుషులనూ ఏర్పాటు చేసుకొన్నాడు. 6 అంతకు ముందు “ఇలా ఎందుకు చేశావు?” అని అతని తండ్రి అతణ్ణి ఎన్నడూ అడ్డగించినవాడు కాడు. అతడు చాలా అందమైన వాడు. అబ్‌షాలోం తరువాత పుట్టినవాడు. 7 అతడు సెరూయా కొడుకు యోవాబుతో అబ్యాతారుయాజితో సమాలోచన జరిపాడు. వాళ్ళు అతడి పక్షం వహించి సహాయం చేశారు. 8 కానీ సాదోకుయాజి, యెహోయాదా కొడుకు బెనాయా, నాతానుప్రవక్త, షిమీ, రేయీ, దావీదుకు చెందిన శూరులు అదోనీయాతో ఏకీభవించలేదు. 9 అదోనీయా గొర్రెలనూ ఎడ్లనూ బాగా బలిసిన దూడలనూ ఏన్‌రోగెల్ దగ్గర ఉన్న జోహెలేతు రాయి దగ్గర బలిగా అర్పించాడు. ఆ సమయంలో అతడు తన తోబుట్టువులైన రాకుమారులందరినీ యూదా వారిలో రాజు పరివారాన్నంతా అక్కడికి పిలిచాడు. 10 కానీ నాతానుప్రవక్తనూ బెనాయానూ దావీదుకు చెందిన శూరులనూ తన తమ్ముడైన సొలొమోనునూ పిలవలేదు.
11 అప్పుడు సొలొమోను తల్లి అయిన బత్‌షెబతో నాతాను “హగ్గీతు కొడుకు అదోనీయా రాజయ్యాడని మీరు వినలేదా? మన యజమాని దావీదుకు ఈ విషయం తెలియదు. 12 ఇప్పుడు మీకో సలహా చెప్పనివ్వండి. మీ ప్రాణాన్ని మీ కొడుకు సొలొమోను ప్రాణాన్ని ఇలా దక్కించుకోవాలి: 13 మీరు దావీదు రాజు దగ్గరకు వెళ్ళి ఆయనతో ఈ విధంగా చెప్పండి: ‘నా యజమానీ! రాజా! మీ తరువాత నా కొడుకు సొలొమోను తప్పక సింహాసనం ఎక్కి పరిపాలన చేస్తాడని మీ దాసురాలైన నాతో శపథం చేశారు గదా! మరి, అదోనీయా ఎందుకు రాజయ్యాడు?’ 14 మీరు రాజుతో అలా చెపుతుండగానే నేను మీ వెనుకే లోపలికి వచ్చి మీ మాటలు బలపరుస్తాను.”
15 అందుచేత బత్‌షెబ లోపలి గదిలోకి రాజు దగ్గరికి వెళ్ళింది. రాజు చాలా ముసలివాడు. అతనికి షూనేం గ్రామస్థురాలు అబీషగు పరిచర్య చేస్తూ ఉంది. 16 బత్‌షెబ రాజు ఎదుట సాగిలపడింది. రాజు “నీకేం కావాలి?” అని అడిగాడు.
17 ఆమె అతనితో ఇలా అంది: “నా యజమానీ! మీ తరువాత నా కొడుకు సొలొమోను తప్పక మీ సింహాసనం ఎక్కి పరిపాలన చేస్తాడని మీ దేవుడైన యెహోవా పేర మీ దాసురాలైన నాతో శపథం చేశారు. 18 మరి వినండి. నా యజమానులైన రాజా, మీకు తెలియకుండానే అదోనీయా రాజయ్యాడు. 19 అతడు చాలా ఎడ్లనూ బలిసిన దూడలనూ గొర్రెలనూ బలిగా అర్పించి రాకుమారులందరినీ అబ్యాతారు యాజినీ సేనాధిపతి అయిన యోవాబునూ పిలిచాడు. మీ దాసుడైన సొలొమోనును మాత్రం పిలవలేదు. 20 నా యజమానులైన రాజా! మీ తరువాత ఎవరు సింహాసనం ఎక్కుతారో అని ఇస్రాయేల్ వారంతా మీ మాటకోసం ఎదురు చూస్తున్నారు. 21 నా యజమానులైన రాజా, మీరేమీ చెప్పకపోతే మీరు కన్ను మూసి మీ పూర్వీకుల దగ్గరికి చేరిన తరువాత వారు నన్నూ నా కొడుకు సొలొమోన్నూ అపరాధులుగా ఎంచుతారు.”
22 ఆమె రాజుతో ఇంకా మాట్లాడుతూ ఉండగానే నాతానుప్రవక్త లోపలికి వచ్చాడు. 23 “ఇడుగో! నాతానుప్రవక్త వచ్చాడ”ని రాజుకు తెలియజేశారు. అతడు రాజు ఎదుటికి వచ్చి రాజుకు సాష్టాంగపడ్డాడు. 24 అప్పుడు నాతాను ఇలా అన్నాడు: “నా యజమానీ, రాజా, మీ తరువాత అదోనీయా మీ సింహాసనం ఎక్కి పరిపాలిస్తాడని మీరు చెప్పారా? 25 ఇవ్వేళే అతడు వెళ్ళి చాలా ఎడ్లనూ బలిసిన దూడలనూ గొర్రెలనూ బలిగా అర్పించాడు. రాకుమారులందరినీ సేనాధిపతులనూ అబ్యాతారుయాజినీ పిలిచాడు. ఇప్పుడే వారు అతడి సముఖంలో అన్నపానాలు చేస్తూ ‘అదోనీయరాజు చిరకాలం జీవించాలి’ అంటున్నారు. 26 కానీ మీ దాసుడైన నన్నూ సాదోకుయాజినీ యెహోయాదా కొడుకు బెనాయానూ మీ దాసుడైన సొలొమోన్నూ అతడు పిలవలేదు. 27 ఒకవేళ ఈ సంగతి నా యజమానులూ రాజులూ అయిన మీ ఆజ్ఞమేరకే జరుగుతూ ఉంటే, మీ తరువాత ఎవరు సింహాసనం ఎక్కుతారో ఆ సంగతి మీ దాసులతో చెప్పలేదన్నమాటే.”
28 అందుకు దావీదురాజు “బత్‌షెబను తిరిగి నా దగ్గరికి రమ్మను” అన్నాడు. బత్‌షెబ లోపలికి తిరిగి వచ్చి రాజు ముందర నిలబడింది. 29 అప్పుడు రాజు శపథం చేస్తూ ఇలా అన్నాడు: “అన్ని ఆపదలనుంచి నన్ను రక్షించిన యెహోవా జీవంమీద ఆనబెట్టి చెపుతున్నాను – 30 నా తరువాత నీ కొడుకు సొలొమోను తప్పక నా స్థానంలో సింహాసనమెక్కి పరిపాలన చేస్తాడని ఇస్రాయేల్ ప్రజల దేవుడు యెహోవా పేర శపథం చేశాను. ఈ వేళే అలా జరిగించి తీరుతాను.”
31 బత్‌షెబ రాజు ముందర సాష్టాంగపడి “నా యజమానులైన దావీదురాజు సదా జీవిస్తాడు గాక” అంది. 32 దావీదురాజు “సాదోకుయాజినీ నాతానుప్రవక్తనూ యెహోయాదా కొడుకు బెనాయానూ నా దగ్గరికి రమ్మను” అన్నాడు. వారు రాజు సమక్షంలోకి వచ్చాక 33 రాజు వారితో ఇలా అన్నాడు: “మీరు మీ యజమానినైన నా సేవకులను తీసుకొని నా కొడుకు సొలొమోనును నా సొంత కంచరగాడిదపై ఎక్కించి గీహోన్ ఊటదగ్గరికి తీసుకుపోండి. 34 అక్కడ సాదోకుయాజి, నాతానుప్రవక్త ఇస్రాయేల్‌ప్రజల పై రాజుగా అతణ్ణి అభిషేకించాలి. పొట్టేలుకొమ్ము బూర ఊదుతూ ‘సొలొమోను రాజు చిరకాలం జీవించాలి’ అని చాటించండి. 35 అతడు తిరిగి వచ్చినప్పుడు మీరు అతని వెంట రావాలి. అతడు వచ్చి నా సింహాసనం మీద కూర్చోవాలి. నేనతణ్ణి ఇస్రాయేల్, యూదా ప్రజలపై రాజుగా నియమించాను. అతడు నా స్థానంలో పరిపాలన చేస్తాడు.”
36 యెహోయాదా కొడుకు బెనాయా రాజుకు జవాబిస్తూ “తథాస్తు! నా యజమానులైన రాజుయొక్క దేవుడు యెహోవా ఆ మాట స్థిరపరుస్తాడు గాక! 37 నా యజమానులైన రాజుకు యెహోవా తోడుగా ఉన్నట్టే సొలొమోనుకు కూడా ఉంటాడు గాక! నా యజమానులైన దావీదురాజు పరిపాలనకంటే సొలొమోను పరిపాలన గొప్ప చేస్తాడు గాక!” అన్నాడు.
38 అప్పుడు సాదోకుయాజి, నాతానుప్రవక్త, యెహోయాదా కొడుకు బెనాయా, కెరేతివారు, పెలేతివారు వెళ్ళి సొలొమోనును దావీదురాజు కంచరగాడిదపై ఎక్కించి గీహోన్ ఊటదగ్గరికి తీసుకుపోయారు. 39 సాదోకుయాజి దేవుని గుడారంలో నుంచి నూనె ఉన్న కొమ్ము తీసుకొని సొలొమోనును అభిషేకించాడు. వారు పొట్టేలుకొమ్ము ఊదుతూ ఉంటే జనమంతా “సొలొమోనురాజు చిరకాలం జీవించాలి” అని కేకలు పెట్టారు. 40 ప్రజలంతా సొలొమోనును అనుసరిస్తూ వచ్చారు. వారు పిల్లనగ్రోవులు ఊదుతూ ఆనందభరితులై సంబరపడుతూ ఉన్నారు. వారు చేసే ధ్వనికి నేల కంపించింది.
41 అదోనీయా, అతనితో ఉన్న అతిథులందరూ తినడం ముగించబోతూవుంటే ఆ శబ్దం వారికి వినిపించింది. పొట్టేలుకొమ్ము ధ్వని విని యోవాబు “నగరం సందడిగా ఉండడం దేనికి?” అన్నాడు.
42 అతడు అలా మాట్లాడుతుండగానే అబ్యాతారుయాజి కొడుకు యోనాతాను అక్కడికి చేరాడు. అదోనీయా అతడితో “లోపలికి రా. నువ్వు వీరుడివి. శుభవార్త తెస్తున్నావు” అన్నాడు.
43 యోనాతాను అదోనీయాకు ఇలా జవాబిచ్చాడు: “కానీ మన యజమానులైన దావీదురాజు సొలొమోన్ను రాజుగా చేశాడు. 44 రాజు సాదోకుయాజినీ నాతానుప్రవక్తనూ యెహోయాదా కొడుకు బెనాయానూ కెరేతివారినీ పెలేతివారినీ అతడితోపాటు పంపించాడు. వారతణ్ణి రాజు కంచరగాడిదపై ఎక్కించి వెళ్ళారు. 45 సాదోకుయాజి, నాతాను ప్రవక్త అతణ్ణి గీహోను దగ్గర రాజుగా అభిషేకించారు. అక్కడనుంచి వారు సంబరపడుతూ వచ్చారు. అందుకే నగరం సందడిగా ఉంది. మీకు వినిపించిన ధ్వని అదే. 46 అంతే గాక, సొలొమోను రాజ్యసింహాసనం మీద కూర్చున్నాడు. 47 పైగా రాజు పరివారం మన యజమానులైన దావీదురాజును దీవించడానికి వచ్చారు, ‘మీ పేరుకంటే సొలొమోను పేరు ఎక్కువ ఘనమైనదిగా, మీ పరిపాలనకంటే ఆయన పరిపాలనను గొప్పదిగా దేవుడు చేస్తాడు గాక!’ అన్నారు. రాజు పడక మీదే దేవుణ్ణి ఆరాధించాడు. 48 రాజు ఇలా చెప్పాడు కూడా: ‘ఈ వేళ ఇస్రాయేల్‌ప్రజల దేవుడు యెహోవా నా సింహాసనం ఎక్కడానికి ఒకణ్ణి ప్రసాదించాడు. ఇది నేను చూడగలిగాను. యెహోవాకు స్తుతులు కలుగుతాయి గాక!’”
49 అప్పుడు అదోనీయా పిలిచినవాళ్ళంతా హడలిపోయి ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. 50 అదోనీయా కూడా సొలొమోనుకు భయపడి లేచి వెళ్ళి బలిపీఠం మీద ఉన్న కొమ్ములను పట్టుకొన్నాడు.
51 సొలొమోనుతో “అదోనీయా సొలొమోనురాజుకు భయపడి, బలిపీఠం మీద ఉన్న కొమ్ములను పట్టుకొని సొలొమోనురాజు తన దాసుడైన తన్ను ఖడ్గంతో చంపడని తనకు శపథం చేయాలంటున్నాడు” అని ఎవరో చెప్పారు.
52 అందుకు సొలొమోను “అతడు నిజాయితీపరుడుగా ఉంటే అతడి తలవెంట్రుక ఒక్కటి కూడా నేలమీదికి రాలదు. కానీ అతడిలో దుర్మార్గం కనిపిస్తే చస్తాడు” అన్నాడు. 53 సొలొమోనురాజు మనుషులను బలిపీఠం దగ్గరికి పంపాడు. వారతణ్ణి అక్కడనుంచి తీసుకువచ్చినప్పుడు అతడు సొలొమోనురాజు ముందర సాష్టాంగపడ్డాడు. సొలొమోను అతడితో “నీవు ఇంటికి వెళ్ళు” అన్నాడు.