20
1 ఆ సమయంలో బెన్యామీను గోత్రానికి చెందిన పనికిమాలిన వాడొకడు✽ అక్కడ ఉన్నాడు. అతడు బిక్రి కొడుకు షెబ. అతడు బూర ఊది ఇలా బిగ్గరగా అరచాడు: “దావీదులో మనకు వంతు లేదు! యెష్షయి కొడుకులో మనకు వాటా లేదు! ఇస్రాయేల్‌వాళ్ళారా! మీరంతా మీ డేరాలకు పోండి!”2 ✽అప్పుడు ఇస్రాయేల్‌వారంతా బిక్రి కొడుకు షెబను అనుసరించడానికి దావీదును విడిచిపెట్టారు. యూదావారైతే యొర్దానునుంచి జెరుసలం వరకు తమ రాజు దగ్గరే ఉండిపోయారు. 3 ✝దావీదు జెరుసలంలో తన భవనానికి వచ్చినప్పుడు భవనాన్ని చూచుకోవడానికి తాను ఉంచిన ఆ పదిమంది ఉంపుడుకత్తెలను కావలిలో ఉంచాడు అతడు వాళ్ళను పోషించాడు గాని వాళ్ళదగ్గరికి వెళ్ళలేదు. వాళ్ళు చనిపోయే రోజువరకు వితంతువులలాగా ఉండి కావలిలో ఉంచబడ్డారు.
4 తరువాత రాజు అమాశా✽ను పిలిచి “మూడు రోజుల లోపల నీవు నాదగ్గరికి యూదావారినందరినీ సమకూర్చి వారితోకూడా రా” అన్నాడు. 5 అమాశా యూదావారిని సమకూర్చడానికి✽ వెళ్ళాడు గాని రాజు నిర్ణయించిన కాలంలో తిరిగి రాలేదు.
6 ✽దావీదు అబీషైను పిలిచి “అబ్‌షాలోంకంటే ఈ బిక్రి కొడుకు షెబ మనకు ఎక్కువ కీడు చేస్తాడు. నీవు నీ యజమాని మనుషులను వెంటబెట్టుకుపోయి వాణ్ణి తరిమి పట్టుకో. లేకపోతే వాడు ప్రాకారాలూ కోటలూ ఉన్న పట్టణాలలో చొచ్చి మనకు దొరకకుండా ఉంటాడేమో” అని చెప్పాడు.
7 కనుక యోవాబు మనుషులు, కెరేతివాళ్ళు, పెలేతివాళ్ళు✽, యుద్ధవీరులంతా అబీషైతో కూడా జెరుసలంనుంచి బయలుదేరి బిక్రి కొడుకు షెబను తరమడానికి వెళ్ళారు. 8 వారు గిబియోనులో ఉన్న పెద్ద బండదగ్గరికి చేరినప్పుడు అమాశా వారిని కలుసుకోవడానికి అక్కడికి వచ్చాడు. యోవాబు యుద్ధానికి దుస్తులు తొడుకొన్నవాడై అక్కడ నిలబడి ఉన్నాడు. అతడి పైవస్త్రం మీద ఉన్న నడికట్టుకు ఒర ఒకటి కట్టి ఉంది. ఒరలో కత్తి ఉంది. అతడు ముందుకు అడుగుపెట్టినప్పుడు కత్తి ఒరలో నుంచి వచ్చి నేల పడింది. 9 యోవాబు “నా సోదరా! బాగున్నారా?” అని అమాశాతో చెప్పి అతణ్ణి ముద్దు✽పెట్టుకోవడానికి కుడిచేతితో అతడి గడ్డం పట్టుకొన్నాడు. 10 ✝యోవాబు ఎడమ చేతిలో ఉన్న కత్తిని అమాశా చూడక అజాగ్రత్తగా ఉన్నాడు. యోవాబు అతడి కడుపులో దానిని గుచ్చాడు. వెంటనే అమాశా పేగులు బయటికి వచ్చి నేలకు జారిపొయ్యాయి. ఆ ఒక్క దెబ్బతోనే అతడు చనిపోయాడు. అప్పుడు యోవాబు, అతడి తమ్ముడు అబీషై, బిక్రి కొడుకైన షెబను తరమడానికి సాగిపోయారు. 11 యోవాబు మనుషులలో ఒకడు అమాశా దగ్గర నిలిచి “యోవాబు అంటే అభిమానం గలవాళ్ళూ దావీదు పక్షాన ఉన్నవాళ్ళూ అందరూ యోవాబు వెంట వెళ్ళండి” అన్నాడు. 12 అమాశా దారిలో పడి తన రక్తంలో పొర్లుతూ ఉన్నాడు. ఆ చోటికి వచ్చిన వాళ్ళంతా ఆగిపోయారు. అది చూచి ఆ మనిషి అమాశాను దారినుంచి పొలంలోకి లాక్కుపోయాడు. త్రోవలో వచ్చినవాళ్ళు ఆగి తేరి చూడకుండా శవంమీద బట్ట కప్పాడు. 13 అమాశా మృతదేహాన్ని దారినుంచి తీసిన తరువాత అందరూ బిక్రి కొడుకు షెబను తరుమడానికి యోవాబు వెంట వెళ్ళారు.
14 షెబ ఇస్రాయేల్ గోత్రాల ప్రాంతాలన్నిటి ద్వారా ఆబేల్‌బేత్ మయకా✽ వరకు, బెరివాళ్ళ ప్రాంతమంతటా వెళ్ళాడు. వాళ్ళు సమకూడి అతణ్ణి అనుసరించారు. 15 యోవాబు మనుషులు వచ్చి షెబను ఆబేల్‌బేత్‌మయకాలో ముట్టడించారు. వారు దాని గోడలకు బురుజు దగ్గరే ముట్టడి దిబ్బ కట్టారు. యోవాబు మనుషులంతా గోడను పడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా, 16 తెలివైన ఒక స్త్రీ పట్టణంలో నుంచి ఇలా బిగ్గరగా చెప్పింది:
“వినండి! వినండి! నేను యోవాబుతో మాట్లాడాలి. అతణ్ణి ఇక్కడికి రమ్మనండి.”
17 యోవాబు ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆమె “యోవాబు మీరేనా?” అని అడిగింది.
అతడు “నేనే” అన్నాడు.
ఆమె “మీ పరిచారికనైన నేను చెప్పేది వింటారా?” అని అడిగింది.
“వింటున్నాను” అన్నాడు.
18 అప్పుడు ఆమె “పూర్వం ప్రజలు ‘విచారించవలసిన సంగతి ఉంటే ఆబేల్‌కు పోవాలి’ అని చెప్పేవాళ్ళు. ఇక్కడికి వచ్చేవాళ్ళకు సమస్యల పరిష్కారం దొరికిందన్నమాటే. 19 మేము ఇస్రాయేల్‌లో నెమ్మదిపరులం, నమ్మకమైనవాళ్ళం. ఇస్రాయేల్ పట్టణాలలో తల్లి✽లాంటి పట్టణాన్ని నాశనం చేయడానికి చూస్తున్నారు మీరు. యెహోవా సొత్తును మీరెందుకు దిగమింగివేస్తారు?” అని చెప్పింది.
20 అందుకు యోవాబు ఇలా జవాబిచ్చాడు: “అలా చేయడం నాకు దూరం కావాలి! నాశనం చేయడం, దిగమింగివేయడం నాకు ఇష్టం లేదు. 21 సంగతి అది కాదు. ఎఫ్రాయిం కొండ ప్రదేశం వాడొకడు దావీదురాజు మీద చెయ్యి ఎత్తాడు. వాడు బిక్రి కొడుకు షెబ. మీరు ఆ ఒకే మనిషిని మాకు అప్పగిస్తే నేను ఈ పట్టణాన్ని విడిచిపోతాను.”
అప్పుడు ఆమె “సరే వాడి తలను గోడపైనుంచి మీకు పడవేస్తాం” అంది.
22 ఆమె వెళ్ళి తన తెలివైన మాటలు పట్టణం వారందరితో చెప్పింది. కనుక వారు బిక్రి కొడుకు షెబ తలను ఛేదించి దానిని యోవాబు దగ్గర పడవేశారు. వెంటనే అతడు బూర ఊదించాడు. అతడి మనుషులంతా ఆ పట్టణాన్ని విడిచి ఎవరి ఇండ్లకు వారు వెళ్ళిపోయారు. యోవాబు జెరుసలం✽కు రాజు దగ్గరికి తిరిగి వెళ్ళాడు.
23-26 ✝యోవాబు ఇస్రాయేల్ సైన్యమంతటిమీద అధిపతి. అయితే కెరేతివాళ్ళకూ పెలేతివాళ్ళకూ యెహోయాదా కొడుకు బెనాయా అధిపతి. అదోరాం వెట్టిపనులు చేసేవారిమీద అధికారి. అహీలూదు కొడుకు యెహోషాపాతు దస్తావేజులమీద అధికారి. షెవా కార్యదర్శి. సాదోకు, అబ్యాతారు యాజులు. యాయీర్ వంశంవాడు ఈరా దావీదుకు పురోహితుడు.