21
1 దావీదు పరిపాలన కాలంలో మూడు సంవత్సరాలు వరుసగా కరవు✽ వచ్చింది. గనుక దావీదు యెహోవా సముఖాన్ని వెదికాడు. యెహోవా “కరవు సౌలు కారణంగా రక్తపాతం జరిగించిన అతడి వంశం కారణంగా వచ్చింది. అతడు గిబియోనువాళ్ళను హతమార్చినందుచేత అది వచ్చింది” అన్నాడు. 2 గిబియోనువాళ్ళు✽ ఇస్రాయేల్‌ప్రజలకు చెందినవాళ్ళు కారు. వాళ్ళు అమోరీజాతిలో మిగిలినవారిలో కొందరు. వాళ్ళతో ఇస్రాయేల్‌వారు శపథం చేసి ఒప్పందం చేశారు గాని సౌలు ఇస్రాయేల్ యూదాల వారికోసం అత్యంత ఆసక్తినిబట్టి వాళ్ళను నాశనం చేయడానికి ప్రయత్నించాడు. దావీదురాజు గిబియోనువాళ్ళను పిలిపించి వాళ్ళతో మాట్లాడాడు.3 “నేను మీకు ఏం చేయమంటారు? మీరు యెహోవా సొత్తు✽ ప్రజను దీవించేలా నేను ఏ విధంగా ప్రాయశ్చిత్తం✽ చేయాలి?” అని వాళ్ళను అడిగాడు.
4 అందుకు గిబియోనువాళ్ళు “సౌలు చేసిన నేరానికి అతడి వెండి బంగారాలు గానీ అతడి కుటుంబికుల వెండి బంగారాలు గానీ మాకు వద్దు. ఇస్రాయేల్‌వాళ్ళలో ఎవరినైనా చంపడానికి కూడా మాకు హక్కు లేదు” అని జవాబిచ్చారు.
దావీదు “మీకు నేనేం చేయాలో చెప్పండి. అది చేస్తాను” అన్నాడు.
5 ✽ అప్పుడు వాళ్ళు అన్నారు “యెహోవా ఎన్నుకొన్న సౌలు మమ్మల్ని నాశనం చేస్తూ, ఇస్రాయేల్ సరిహద్దులలో లేకుండా నిర్మూలం చేయడానికి ఉపాయం చేశాడు. 6 అతడి సంతానంలో ఏడుగురు మగవాళ్ళను మాకు అప్పగించండి. మేము సౌలు పట్టణమైన గిబియాలో యెహోవా సమక్షంలో వాళ్ళను ఉరి తీస్తాం.”
రాజు “సరి, నేను వాళ్ళను మీకప్పగిస్తాను” అన్నాడు.
7 ✝అంతకుముందు దావీదు, సౌలు కొడుకు యోనాతాను ఒకరితో ఒకరు యెహోవా పేర ప్రమాణం చేశారు గనుక అతను యోనాతాను కొడుకూ సౌలు మనుమడూ అయిన మోఫీబోషెతును గిబియోనువాళ్ళకు అప్పగించలేదు. 8 అయా కూతురు రిస్పా సౌలుకు ఇద్దరు కొడుకులను కన్నది. వాళ్ళ పేర్లు అర్మోని, మెఫీబోషెతు. సౌలు కూతురైన మెరాబు మెహూల గ్రామంవాడైన బర్‌జిల్లయి కొడుకు అద్రీయేల్‌కు అయిదుగురు కొడుకులను కన్నది. దావీదురాజు ఈ ఏడుగురిని పట్టుకొని గిబియోనువాళ్ళకు అప్పగించాడు. 9 వాళ్ళు వారిని తీసుకువెళ్ళి కొండమీద యెహోవా సమక్షంలో ఉరి తీశారు. ఆ ఏడుగురు ఒకే సమయంలో చనిపోయారు. కోతకాలంలో యవల కోత ఆరంభంలో వారిని చంపడం జరిగింది. 10 అయా కూతురు రిస్పా గోనెపట్ట తీసుకుపోయి ఆ కొండపై ఉన్న బండమీద దానిని పరుచుకొంది. కోతకాలం ఆరంభంనుంచి వర్షాలు✽ ఆ శవాలమీద పడేవరకు ఆమె అక్కడే ఉండిపోయింది. గాలిలో ఎగిరే పక్షులను పగటివేళ ఆ శవాలమీద వాలకుండా, రాత్రివేళ అడవి మృగాలను దగ్గరికి రాకుండా ఆమె చేసింది.
11 అయా కూతురూ సౌలు ఉంపుడుకత్తె అయిన రిస్పా చేసినది దావీదుకు వినబడింది. 12 ✝అప్పుడతడు వెళ్ళి సౌలు ఎముకలనూ అతడి కొడుకు యోనాతాను ఎముకలనూ యాబేష్‌గిలాదువాళ్ళ దగ్గరనుంచి తెప్పించాడు. (ఫిలిష్తీయ వాళ్ళు గిల్బోవకొండలో సౌలును కూల్చినప్పుడు వాళ్ళు సౌలు యోనాతానులను బేత్‌షాను వీధిలో వ్రేలాడగట్టారు. యాబేష్‌గిలాదువారు అక్కడికి వెళ్ళి వారి శవాలను ఎత్తుకుపోయారు.) 13 దావీదు సౌలు ఎముకలనూ అతడి కొడుకు యోనాతాను ఎముకలనూ యాబేష్‌నుంచి తీసుకువచ్చాడు. ఉరి తీయబడ్డవాళ్ళ ఎముకలను కూడా సమకూర్చేలా చేశాడు. 14 సౌలు ఎముకలనూ అతడి కొడుకు యోనాతాను ఎముకలనూ బెన్యామీను ప్రదేశానికి చెందిన సేలా ఊరిలో, సౌలు తండ్రి కీషు సమాధిలో పాతిపెట్టారు. రాజు ఆజ్ఞాపించినట్టెల్లా ప్రజలు చేశారు. అప్పుడు దేవుడు దేశంకోసం వారు చేసిన విన్నపం అంగీకరించాడు✽.
15 తరువాత మరోసారి ఫిలిష్తీయవాళ్ళకూ ఇస్రాయేల్ వారికీ యుద్ధం జరిగింది. దావీదు తన మనుషులతో కూడా యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధం జరుగుతూ ఉంటే దావీదు చాలా అలసిపోయాడు. 16 అక్కడ రెఫాయీం జాతివాడు ఒకడు ఉండేవాడు. అతడి పేరు ఇష్బిబేనోబు. అతడి ఈటె ములికి బరువు మూడున్నర కిలోగ్రాములు. అతడు కట్టుకొన్న ఖడ్గం క్రొత్తది. అతడు “దావీదును హతం చేస్తాను” అన్నాడు. 17 అయితే సెరూయా కొడుకు అబీషై రాజు సహాయానికి వచ్చి ఆ ఫిలిష్తీయవాణ్ణి కొట్టి చంపాడు. అప్పుడు దావీదు మనుషులు “ఇస్రాయేల్‌ప్రజలకు దీపం✽ ఆరిపోకూడదు గనుక మీరు ఇకనుంచి మాతో కూడా యుద్ధానికి రాకూడదు” అని శపథం చేసి అతనితో అన్నారు.
18 గోబు దగ్గర ఫిలిష్తీయవాళ్ళతో మరో సారి యుద్ధం జరిగినప్పుడు హూషా గ్రామంవాడు సిబ్బెకై సఫును చంపాడు. సఫు కూడా రెఫాయీం జాతివాడు. 19 ✽ఇంకో సారి గోబుదగ్గర ఫిలిష్తీయవాళ్ళతో జరిగిన యుద్ధంలో బేత్‌లెహేం పురవాసి యారేయోరెగీం కొడుకు ఎల్‌హానాను గాతు పట్టణంవాడైన గొల్యాతును చంపాడు. ఈ గొల్యాతు ఈటెకర్ర చేనేత పనివాడి అడ్డకర్రంత మందం గలది. 20 మరో యుద్ధం గాతు దగ్గర జరిగింది. అక్కడ చాలా పొడుగాటివాడొకడు ఉండేవాడు. ఒక్కొక్క చేతికి ఆరేసి వ్రేళ్ళు – మొత్తం ఇరవై నాలుగు వ్రేళ్ళు – అతడికి ఉన్నాయి. అతడు కూడా రెఫావాళ్ళలో ఒకడు. 21 అతడు ఇస్రాయేల్‌వారిని దూషించినప్పుడు దావీదు తోబుట్టువైన షిమ్యా కొడుకు యోనాతాను అతణ్ణి చంపాడు. 22 ఈ నలుగురు గాతువాడైన రెఫా సంతానం. వాళ్ళు దావీదుచేత, దావీదు మనుషులచేత హతమయ్యారు.