19
1 రాజు తన కొడుకుకోసం దుఃఖిస్తూ ఉన్నాడని సైనికులందరూ విన్నారు. గనుక ఆ రోజు విజయం వారందరికీ దుఃఖకారణమైంది. 2 యుద్ధరంగం నుంచి పారిపోయి సిగ్గుపడ్డవాళ్ళలాగా వారు ఆ రోజు మెల్లగా జారిపోతూ పట్టణంలో ప్రవేశించారు.
3 రాజు తన ముఖం కప్పుకొని “అబ్‌షాలోం! నా కుమారా! అబ్‌షాలోం! నా కుమారా! నా కుమారా!” అని బిగ్గరగా రోదనం చేశాడు.
4 రాజు అబ్‌షాలోం కోసం దుఃఖిస్తూ ఏడుస్తూ ఉన్నాడని యోవాబు విని ఇంట్లోకి రాజుదగ్గరికి వెళ్ళి ఇలా చెప్పాడు: 5 “ఈ రోజు నీ మనుషులు నీ ప్రాణాన్నీ నీ కొడుకుల ప్రాణాలనూ నీ కూతుళ్ళు, భార్యలు, ఉంపుడుకత్తెల ప్రాణాలనూ దక్కించారు గానీ నీవు వాళ్ళందరినీ సిగ్గు పాలయ్యేట్టు చేశావు. 6 నిన్ను ద్వేషించేవాళ్ళంటే నీకు ప్రేమ, ప్రేమించేవాళ్ళంటే నీకు అభిమానం లేదని ఇవ్వేళ నీవు తేటతెల్లం చేశావు. అబ్‌షాలోం ఒక్కడే బ్రతికి ఉంటే, మేమంతా చచ్చిపోయినా నీవు సంతోషిస్తావని ఈ రోజు నేను తెలుసుకొన్నాను. 7 ఇప్పుడే నీవు లేచి బయటికి వచ్చి నీ మనుషులను ప్రోత్సాహపరచు. నీవు బయటికి రాకపోతే వాళ్ళలో ఒక్కడూ కూడా ఈ రాత్రి నీ దగ్గర నిలవడని యెహోవా పేరు మీద ఆనబెట్టి చెపుతున్నాను. నీ చిన్నతనం నుంచి ఈ రోజువరకు నీకు ప్రాప్తించిన ఆపదలన్నికంటే అది దుర్భరంగా ఉంటుంది.”
8 అందుచేత రాజు లేచి వచ్చి ద్వారంలో కూర్చున్నాడు. రాజు ద్వారంలో కూర్చుని ఉన్నాడని విని అందరూ అతని సమక్షంలోకి వచ్చారు. అంతలో ఇస్రాయేల్‌వారు తమ ఇండ్లకు పారిపోయారు.
9 అప్పుడు ఇస్రాయేల్ గోత్రాలలో ప్రజలందరి మధ్య వివాదం పుట్టింది. “రాజు మన శత్రువుల బారినుంచీ ఫిలిష్తీయవాళ్ళ చేతిలోనుంచీ మనల్ని విడిపించాడు గదా. ఆయన అబ్‌షాలోం కారణంగా దేశంనుంచి పారిపోయాడు. 10 అయితే మనమీద మనం రాజుగా అభిషేకించిన అబ్‌షాలోం యుద్ధంలో చనిపోయాడు. కనుక మనం రాజును తిరిగి తీసుకురావడం విషయం ఎందుకు ఊరుకొంటున్నాం?” అని చెప్పుకొన్నారు.
11 అప్పుడు దావీదురాజు సాదోకుయాజికీ అబ్యాతారు యాజికీ ఇలా కబురు పంపాడు: “ఇస్రాయేల్‌వారంతా మాట్లాడుకొంటున్న సంగతి రాజు ఉన్న ఇంటివాళ్ళకూ రాజుకూ వినబడింది. మరి, రాజును తన భవనానికి తీసుకురావడానికి అందరికంటే మీరెందుకు ఎక్కువ ఆలస్యం చేస్తున్నారు? 12 మీరు నా సోదరులు, నా రక్త సంబంధులు. రాజు తిరిగి వచ్చేలా చేయడానికి అందరికంటే మీరే ఎక్కువ ఆలస్యం చేస్తున్నారెందుకు? అని యూదా ప్రజల పెద్దలను అడగండి. 13 నీవు నాకు రక్తసంబంధివి గదా. యోవాబుకు బదులు నిన్ను సైన్యాధిపతిగా నేను ఖాయం చేయకపోతే దేవుడు పెద్ద ప్రమాదం నాకు కలిగిస్తాడు గాక! అని అమాశాతో చెప్పండి.”
14 ఈ విధంగా రాజు యూదావారందరి అభిమానాన్ని చూరగొన్నాడు. వారు ఏకగ్రీవంగా “మీరూ మీ మనుషు లందరూ తిరిగి రండి” అని కబురు పంపారు.
15 రాజు తిరిగి రావడానికి బయలుదేరి యొర్దాను దగ్గరికి చేరాడు. యూదావారు రాజును కలుసుకోవడానికి రాజును నది ఇవతలికి తీసుకురావడానికి గిల్గాల్‌కు వెళ్ళారు.
16 బహురీంలో ఉన్న బెన్యామీను గోత్రికుడూ గెరా కొడుకూ అయిన షిమీ కూడా త్వరపడి దావీదు రాజును కలుసుకోవడానికి యూదావారితోపాటు వచ్చాడు.
17 అతనితో వెయ్యిమంది బెన్యామీనువాళ్ళు ఉన్నారు. అంతేగాక సౌలు గృహనిర్వాహకుడైన సీబా, అతడి పదిహేనుమంది కొడుకులూ ఇరవై మంది పనివాళ్ళూ వచ్చారు. 18 వారు యొర్దాను ఒడ్డున ఉన్న రాజు దగ్గరికి త్వరగా వెళ్ళారు. రాజు ఇంటివారిని ఇవతలికి దాటించడానికీ రాజు కోరేదంతా చేయడానికీ రేవు ఉన్న స్థలంలో నది దాటారు.
రాజు యొర్దాను దాటిన తరువాత గెరా కొడుకు షిమీ అతనికి సాష్టాంగ నమస్కారం చేసి ఇలా చెప్పాడు: 19 “నా యజమానీ! నేను చేసిన అపరాధం నామీద మోపకండి. నా యజమానీ రాజూ అయిన మీరు జెరుసలంను విడిచి వచ్చిన రోజు మీ దాసుడైన నేను చేసిన అక్రమ కార్యాన్ని జ్ఞాపకముంచుకోవద్దండి. దానిని మరచిపోండి. 20 మీ దాసుడైన నేను తప్పిదం చేశానని నాకు తెలుసు. కనుకనే నా యజమానులైన రాజును కలుసుకోవడానికి నేను ఇవ్వేళ వచ్చాను. యోసేపు వంశం వాళ్ళందరికంటే ముందుగా వచ్చాను.”
21 అది విని సెరూయా కొడుకు అబీషై “యెహోవా అభిషేకించినవాణ్ణి శపించిన ఈ షిమీని చంపకూడదా?” అని అడిగాడు.
22 అందుకు దావీదు “సెరూయా కొడుకుల్లారా! మీకు నాతో ఏం పొందిక? ఈవేళ మీరు నాకు విరోధులయ్యారు. ఇస్రాయేల్‌ప్రజలలో ఎవరినైనా ఈ రోజు చంపడం మంచిదా? నేను ఇస్రాయేల్‌ప్రజల మీద రాజుగా ఉన్నానని ఈ రోజు తెలుసుకొన్నాను గదా” అన్నాడు. 23 అప్పుడతడు “నీవు చావవు” అని షిమీతో ప్రమాణం చేశాడు.
24 సౌలు మనుమడు మెఫీబోషెతు కూడా రాజును కలుసుకోవడానికి వచ్చాడు. రాజు వెళ్ళిపోయిన రోజునుంచి క్షేమంగా తిరిగి వచ్చిన రోజువరకు మెఫీబోషెతు కాళ్ళు కడుక్కోలేదు, గడ్డం కత్తిరించుకోలేదు, బట్టలు ఉతుక్కోలేదు. 25 రాజును కలుసుకోవడానికి అతడు జెరుసలంనుంచి వచ్చినప్పుడు రాజు, “మెఫీబోషెతు, నీవు నాతో కూడా ఎందుకు రాలేదు?” అని అతణ్ణి అడిగాడు.
26 అందుకు అతడు ఇలా జవాబిచ్చాడు: “నా యజమానులైన నా రాజా! మీ దాసుడైన నేను కుంటివాణ్ణి, గనుక గాడిదమీద జీను వేయించి ఎక్కి రాజుతోకూడా వెళ్ళిపోవాలని అనుకొన్నాను. కానీ నా సేవకుడు సీబా నన్ను మోసం చేశాడు. 27 అంతేగాక అతడు మీ దాసుడైన నా విషయం నా యజమానులూ నా రాజూ అయిన మీతో అపనింద చెప్పాడు. అయితే నా యజమానులూ రాజూ అయిన మీరు దేవదూతలాంటివారు గనుక మీకు ఏది మంచిది అనిపిస్తుందో అది చేయండి. 28 నా తాతయ్య సంతానమంతా నా యజమానులూ రాజూ అయిన మీచేత చావతగ్గవాళ్ళు. అయినా మీరు మీ బల్ల దగ్గర భోజనం చేసేవాళ్ళలో మీ దాసుడైన నన్ను చేర్చారు. అంచేత రాజుతో ఇంకా మొరపెట్టడానికి నాకేం హక్కు ఉంది?”
29 అప్పుడు రాజు “నీవింకా మాట్లాడడం ఎందుకని? నీవు, సీబా ఆ భూమిని పంచుకోవాలని నా నిర్ణయం” అని అతడితో చెప్పాడు.
30 మెఫీబోషెతు “నా యజమానులైన రాజు వారి ఇంటికి క్షేమంగా తిరిగి వచ్చారు. గనుక అతడు అంతా తీసుకోవచ్చు” అన్నాడు.
31 గిలాదువాడు బర్‌జిల్లయి కూడా రాజుతోపాటు యొర్దాను దాటి నది అవతలనుంచి అతణ్ణి సాగనంపడానికి రోగెలీం నుంచి వచ్చాడు. 32 బర్‌జిల్లయి చాలా ముసలివాడు. అతని వయసు ఎనభై ఏళ్ళు. అతడు చాలా ధనవంతుడు కూడా. రాజు మహనయీంలో ఉన్నప్పుడు అతనికి భోజన పదార్థాలు పంపిస్తూ ఉండేవాడు.
33 ఇప్పుడు రాజు “మీరు నాతో కూడా నది దాటి జెరుసలంలో నాదగ్గర ఉండండి. నేను మిమ్మల్ని పోషిస్తాను” అని బర్‌జిల్లయితో చెప్పాడు.
34 అందుకు బర్‌జిల్లయి ఇలా అన్నాడు: “రాజైన మీతో కూడా జెరుసలం రావడానికి ఇక నేనెంతకాలం బ్రతుకుతాను? 35 నా వయసు ఎనభై ఏళ్ళు సుఖదుఃఖాలకున్న భేదాన్ని నేను గుర్తించగలనా? అన్నపానాల రుచి మీ సేవకుడైన నేను తెలుసుకోగలనా? గాయకులు, గాయకురాండ్రు పాటలు పాడితే నేను వినగలనా? మీ సేవకుడైన నేను నా యజమానుడైన రాజుకు ఎందుకు భారంగా ఉండాలి? 36 మీ దాసుడైన నేను మీతోకూడా నది దాటి అవతలకు కొద్దిదూరం వస్తాను గాని రాజైన మీరు నాకంత ఉపకారం చేయడమెందుకు? 37 నేను నా ఊరిలో నా తల్లిదండ్రుల సమాధిదగ్గర చనిపోయేలా అక్కడికి నన్ను తిరిగి వెళ్ళనియ్యండి. అయితే మీ దాసుడైన కింహామ్ ఇక్కడ ఉన్నాడు. నా యజమానుడైన రాజుతో కూడా రావడానికి అతడికి సెలవియ్యండి. మీ దృష్టిలో ఏది మంచిదో అది అతడికి చెయ్యండి.”
38 రాజు “కింహామ్ నాతోకూడా రావచ్చు. మీ దృష్టిలో ఏది మంచిదో అది నేను అతడికి చేస్తాను. అంతేకాక, నా వల్ల మీరు ఏం కోరుతారో అదంతా మీకు చేస్తాను” అని చెప్పాడు.
39 అప్పుడు ప్రజలందరూ, రాజు నది దాటారు. రాజు బర్‌జిల్లయిని ముద్దుపెట్టుకొని దీవించాడు. తరువాత బర్‌జిల్లయి ఇంటికి వెళ్ళిపోయాడు.
40 కింహామ్ను వెంటబెట్టుకొని రాజు గిల్గాల్‌కు వెళ్ళాడు. యూదావారంతా, ఇస్రాయేల్‌వారిలో సగంమంది రాజుతో కూడా వచ్చారు. 41 అప్పుడు ఇస్రాయేల్‌వారంతా రాజుదగ్గరికి వచ్చి “మా సోదరులైన యూదావాళ్ళు ఎందుకు రాజును దొంగిలించుకొని ఆయననూ ఆయన ఇంటివాళ్ళనూ ఆయన మనుషులనూ యొర్దాను ఇవతలకు తీసుకువచ్చారు?” అని అడిగారు.
42 అందుకు యూదావారంతా “రాజు మాకు సమీప బంధువు గదా. మీకు కోపం ఎందుకు? మరి, మాలో ఎవరైనా రాజు సొమ్ము ఏమైనా తిన్నారా? ఆయన మాకు ఏమైనా ఇచ్చాడా?” అని ఇస్రాయేల్‌వారికి జవాబిచ్చారు.
43 అప్పుడు ఇస్రాయేల్‌వారు “రాజులో మాకు పదివంతులు ఉన్నాయి. దావీదు విషయం మీకంటే మాకు ఎక్కువ హక్కు ఉంది. మీరెందుకు మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు? మన రాజును తిరిగి తీసుకురావడం గురించి మొట్టమొదట మాట్లాడినది మేమే గదా” అని యూదావారితో చెప్పారు.
యూదావారు ఇస్రాయేల్‌వారికంటే ఎక్కువ ఘాటుగా మాట్లాడారు.