18
1 దావీదు తన దగ్గర ఉన్నవారికి లెక్క పెట్టి వెయ్యిమంది ఉన్న గుంపులమీద, నూరు మంది ఉన్న గుంపుల మీద అధిపతులను నియమించాడు. 2 వారిని మూడు భాగాలుగా చేసి ఒక భాగాన్ని యోవాబు చేతి క్రింద, మరోభాగాన్ని యోవాబు తోబుట్టువూ సెరూయా కొడుకూ అయిన అబీషై చేతి క్రింద, ఇంకో భాగాన్ని గాతువాడు ఇత్తయి చేతిక్రింద ఉంచాడు. రాజు “నేను స్వయంగా మీతో కూడా బయలు దేరుతాను” అన్నాడు.3 కానీ వారు ఇలా అన్నారు: “మీరు రాకూడదు. మేము పారిపోవలసివస్తే మాలో సగంమంది చనిపోయినా ఎవరూ పట్టించుకోరు. మాలాంటి పది వేలమందితో మీరు సాటి. మీరు పట్టణంలో ఉండిపోయి మాకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండడం మంచిది.”
4 అందుకు రాజు “మీకు ఏది మంచిది అనిపిస్తుందో దాని ప్రకారం చేస్తాను” అని చెప్పాడు. వారందరూ గుంపులుగా వందేసి చొప్పున, వెయ్యేసి చొప్పున బయలుదేరుతూ ఉంటే రాజు ద్వారం ప్రక్కన నిలుచున్నాడు.
5 ✽రాజు యోవాబునూ అబీషైనూ ఇత్తయినూ పిలిచి “నాకోసం యువకుడు అబ్‌షాలోంపట్ల మృదువుగా వ్యవహరించండి” అని ఆదేశించాడు. అబ్‌షాలోం విషయం రాజు అధిపతులలో ఒక్కొక్కరికి ఆజ్ఞ జారీ చేసినప్పుడు ప్రజలంతా విన్నారు.
6 వారు ఇస్రాయేల్ వాళ్ళను ఎదుర్కోవడానికి మైదానంలోకి వెళ్ళారు. యుద్ధం ఎఫ్రాయిం అడవిలో జరిగింది. 7 అక్కడ దావీదు మనుషులు ఇస్రాయేల్‌వాళ్ళను ఓడించారు. ఆ రోజు గొప్ప నాశనం జరిగింది. ఇరవై వేలమంది హతమయ్యారు. 8 యుద్ధం ఆ ప్రాంతమంతా వ్యాపించింది. ఆ రోజు ఖడ్గంచేత కూలిన వాళ్ళకంటే ఎక్కువమంది అడవిలో చిక్కుబడి నాశనమయ్యారు.
9 అబ్‌షాలోం కంచరగాడిద ఎక్కి వెళ్తూ ఉన్నప్పుడు దావీదు మనుషులు ఎదురుపడ్డారు. ఆ కంచరగాడిద దట్టమైన కొమ్మలుగల గొప్ప సిందూర వృక్షం క్రిందికి పోయింది. అబ్‌షాలోం తల చెట్టుకు తగులుకొంది. కంచరగాడిద ముందుకు సాగిపోవడంచేత అతడు ఆకాశానికి భూమికి మధ్య వ్రేలాడిపోయాడు. 10 ఒక మనిషి అది చూచి యోవాబు దగ్గరికి వెళ్ళి “అబ్‌షాలోం సిందూరవృక్షానికి వ్రేలాడుతూ ఉన్నాడు – నేను చూశాను” అన్నాడు.
11 యోవాబు ఆ సంగతి చెప్పినవాడితో “ఏమిటి! నువ్వు చూశావా? మరి నువ్వు వాణ్ణి నేల కూల్చి✽ చంపలేదేం? నువ్వు అలా చేసి ఉంటే పది తులాల వెండినీ నడికట్టునూ నీకిచ్చి ఉండేవాణ్ణి” అని చెప్పాడు.
12 అందుకు ఆ మనిషి ఇలా బదులు చెప్పాడు: “వెయ్యి తులాల వెండి నా చేతిలో పెట్టినా రాజ కుమారుణ్ణి నేను చంపను. యువకుడు అబ్‌షాలోంకు ఎవ్వడూ హాని చేయకుండా జాగ్రత్తగా ఉండాలని రాజు మీకూ అబీషైకీ ఇత్తయికీ ఆజ్ఞ జారీ చేసినప్పుడు మేము విన్నాం. 13 ఒక వేళ నేను ఆయనపట్ల కపటంగా వ్యవహరిస్తే అది రాజు తప్పక తెలుసుకొంటాడు. అప్పుడు మీరు రాజుయెదుట నాకు దూరమవుతారు.”
14 యోవాబు “నీ దగ్గర నేను కాలనష్టం చేయడమెందుకు?” అని చెప్పి మూడు బాణాలను చేతపట్టుకొని వెళ్ళాడు. అబ్‌షాలోం ఇంకా ప్రాణంతో ఉండి సిందూర వృక్షంలో వ్రేలాడుతూ ఉన్నాడు. యోవాబు అతడి గుండెలోకి ఆ బాణాలు దూసుకుపోనిచ్చాడు. 15 ✝యోవాబు ఆయుధాలను మోసేవాళ్ళు పదిమంది అబ్‌షాలోం చుట్టుముట్టి అతణ్ణి కొట్టి చంపారు. 16 అప్పుడు యోవాబు బూర ఊదించి దావీదు మనుషులు ఇస్రాయేల్‌వారిని తరమడం మాని తిరిగి వచ్చేలా చేశాడు. 17 వారు అబ్‌షాలోం మృత దేహాన్ని ఎత్తుకువెళ్ళి అడవిలో లోతైన గోతిలో పడవేసి పెద్ద రాళ్ళకుప్ప దానిమీద ఉంచారు. అంతలో ఇస్రాయేల్‌వారంతా తమ ఇండ్లకు పారిపోయారు.
18 ✽అబ్‌షాలోం బ్రతికి ఉన్నప్పుడు “నా పేరు నిలపడానికి నాకు కొడుకు లేడు” అనుకొని ఒక స్తంభం తీసుకువెళ్ళి తన పేరున దానిని “రాజు లోయ”లో నిలవబెట్టాడు. ఈ రోజు వరకు దానిని “అబ్‌షాలోం స్తంభం” అంటారు.
19 సాదోకు కొడుకు అహిమయసు – “నేను పరుగెత్తి వెళ్ళి శత్రువుల చేతిలోనుంచి యెహోవా ఆయనను విడిపించాడని రాజుతో చెప్తాను. సెలవియ్యండి” అని యోవాబుతో చెప్పాడు.
20 యోవాబు “ఇవ్వేళ నువ్వు వెళ్ళి ఈ కబురు చెప్పతగదు. ఇంకెప్పుడో నువ్వు వెళ్ళి చెప్పవచ్చు. రాజు కొడుకు చనిపోయాడు. గనుక ఇవ్వేళ నువ్వు వార్త తీసుకుపోకూడదు” అని అతడితో చెప్పాడు.
21 అప్పుడతడు కూషువాడొకణ్ణి పిలిచి “నువ్వు వెళ్ళి చూచినదానిని రాజుకు తెలియజెయ్యి” అని ఆజ్ఞాపించాడు. ఆ కూషువాడు యోవాబుకు నమస్కారం చేసి పరుగెత్తి వెళ్ళాడు.
22 సాదోకు కొడుకు అహిమయసు “కూషువాడి వెంట నేను పరుగెత్తుకొని వెళ్ళడానికి సెలవియ్యండి” అని యోవాబుతో మరోసారి మనవి చేశాడు.
యోవాబు “బాబూ, నువ్వు ఎందుకు వెళ్ళాలి? ఈ కబురు చెప్పినా నీకు ఏ బహుమతీ దొరకదు” అన్నాడు.
23 అహిమయసు “అది ఎలాగైనా సరే, నేను పరుగెత్తుకొని వెళ్తాను” అన్నాడు.
అప్పుడు యోవాబు “పరుగెత్తు!” అని సెలవిచ్చాడు. అహిమయసు మైదానం త్రోవలో పరుగెత్తి కూషువాడికంటే ముందుగా చేరాడు.
24 దావీదు రెండు ద్వారాల మధ్య నడవలో కూర్చుని ఉన్నాడు. కావలివాడు ద్వారం పై ఉన్న గోడమీదికి చూస్తూ ఉన్నప్పుడు, ఒంటరిగా పరుగెత్తుకొని వస్తూ ఉన్న ఒక వ్యక్తి కనిపించాడు. 25 రాజు “అతడు ఒంటరిగా ఉంటే చెప్పడానికి అతడికి ఏదో శుభవార్త ఉంటుంది” అన్నాడు. అతడు ఇంకా దగ్గరగా వస్తూ ఉంటే 26 కావలివాడికి పరుగెత్తి వస్తూవున్న మరో వ్యక్తి కనిపించాడు. కావలివాడు “ఇదిగో, మరొకడు ఒంటరిగా పరుగెత్తుకు వస్తూ ఉన్నాడు” అని ద్వార పాలకుడికి బిగ్గరగా చెప్పాడు. కావలివాడు కేక పెట్టి రాజుకు ఆ సంగతి తెలియజేశాడు.
రాజు “అతడు కూడా శుభవార్త తెస్తున్నాడు” అన్నాడు.
27 కావలివాడు “మొదటివాడు పరుగెత్తడం చూస్తే అతడు సాదోకు కొడుకు అహిమయసు అని నాకు తోస్తుంది” అన్నాడు.
రాజు “అతడు మంచివాడు, శుభవార్త తెస్తున్నాడు” అన్నాడు.
28 అహిమయసు “అంతా క్షేమమే!” అని బిగ్గరగా చెప్పాడు. రాజు దగ్గరికి వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి “మీ దేవుడు యెహోవాకు స్తుతి కలుగుతుంది గాక! నా యజమానులైన రాజును చంపడానికి చూచినవాళ్ళను ఆయన మన వశం చేశాడు” అన్నాడు.
29 రాజు “యువకుడు అబ్‌షాలోం క్షేమంగా ఉన్నాడా?” అని అడిగాడు.
అందుకు అహిమయసు “రాజులైన మీ సేవకుడైన నన్ను యోవాబు పంపినప్పుడు పెద్ద అలజడి జరుగుతూ ఉంది. అది చూశాను గాని అదేమిటో నాకు తెలియదు” అని జవాబిచ్చాడు.
30 రాజు “దారిప్రక్కన అక్కడ నిలబడి ఉండు” అన్నాడు. అతడు దారి ప్రక్కకు తొలగి నిలుచున్నాడు.
31 అప్పుడు కూషువాడు వచ్చి “నా యజమానీ! రాజా! నేను మీకు శుభవార్త తెచ్చాను. ఈ రోజు యెహోవా మీమీదికి లేచిన వాళ్ళందరి బారి నుంచి మిమ్మల్ని విడిపించాడు!” అని చెప్పాడు.
32 కూషువాణ్ణి చూచి రాజు “యువకుడు అబ్‌షాలోం క్షేమంగా ఉన్నాడా?” అని అడిగాడు. అందుకు కూషువాడు “నా యజమానులైన రాజుయొక్క శత్రువులూ మీకు హాని చేయడానికి మీ మీదికి వచ్చేవాళ్ళంతా ఆ యువకుడిలాగే అవుతారు గాక!” అని జవాబిచ్చాడు.
33 ✽రాజు కలత, పరితాపం చెందాడు. ద్వారానికి పైగా ఉన్న గదికి ఎక్కిపోయి ఏడ్చాడు. అతడు వెళ్తూ ఉంటే “నా కుమారా! అబ్‌షాలోం! నా కుమారా! అబ్‌షాలోం! నీకు బదులు నేను చనిపోతే ఎంత బాగుండేది! నా కుమారా! నా కుమారా!” అంటూ, ఏడుస్తూ వెళ్ళాడు.