17
1 అహీతోపెల్ అబ్‌షాలోంతో ఇలా అన్నాడు: “మీకు ఇష్టమైతే నేను పన్నెండు వేలమంది సైనికులను ఎన్నుకొని, ఈ రాత్రి దావీదును తరమడానికి బయలు దేరుతాను. 2 అతడు అలసిపోయి నీరసించిన స్థితిలో ఉన్నప్పుడే అతడి పైబడి అతణ్ణి భయపెడతాను. అప్పుడు అతడితో ఉన్నవాళ్ళంతా పారిపోతారు. నేను రాజును మాత్రమే హతమార్చి, 3 ప్రజలందరినీ మీ దగ్గరికి తీసుకువస్తాను. మీరు వెదకే మనిషి తప్ప ప్రజలంతా తిరిగి వస్తారు. ప్రజలంతా క్షేమంగా ఉంటారు.”
4 ఈ మాట అబ్‌షాలోంకు, ఇస్రాయేల్ ప్రజల పెద్దలందరికీ నచ్చింది. 5 అప్పుడు అబ్‌షాలోం “అర్కీవాడు హూషైను పిలువు. అతడు ఏం అంటాడో విందాం” అని చెప్పాడు. 6 హూషై అబ్‌షాలోం దగ్గరికి వచ్చినప్పుడు, అహీతోపెల్ చెప్పిన సలహా అబ్‌షాలోం అతనికి తెలియజేసి, “అతడు చెప్పినట్టు మనం చేయాలా, వద్దా? నీ సలహా చెప్పు” అన్నాడు.
7 హూషై అబ్‌షాలోంతో ఇలా అన్నాడు: “ఈ సారి అహీతోపెల్ చెప్పిన సలహా మంచిది కాదు. 8 మీ తండ్రి అతడి మనుషులు యుద్ధవీరులని మీకు తెలుసు. ఇప్పుడు వాళ్ళు అడవిలో పిల్లలు కోల్పోయిన ఎలుగుబంటిలాగా తీవ్రకోపంతో ఉంటారు. అంతేగాక మీ తండ్రి యుద్ధంలో అనుభవశాలి. ప్రజల దగ్గర రాత్రి గడపడు. 9 ఇప్పుడు కూడా అతడు ఏదైనా గుహలో, లేదా వేరే స్థలంలో దాగి ఉంటాడు. యుద్ధారంభంలో మీ వాళ్ళలో కొంతమంది కూలుతారనుకోండి. దాని గురించి విన్నవాళ్ళు ‘అబ్‌షాలోం అనుచరులు ఓడిపోయారు’ అంటారు. 10 అలాంటప్పుడు మీ మనుషులందరిలో ధైర్యం గలవాళ్ళు కూడా, సింహాల్లాగా భయంలేని వాళ్ళు కూడా, అధైర్యపడతారు. ఎందుకంటే మీ తండ్రి యుద్ధ వీరుడనీ అతడితో ఉన్నవాళ్ళు ధైర్యశాలురనీ ఇస్రాయేల్ ప్రజలందరికీ తెలుసు. 11 అందుచేత నా సలహా ఏమిటంటే, మీరు, దాను పట్టణం నుంచి బేర్‌షెబావరకు ఇస్రాయేల్ వాళ్ళందరినీ – లెక్కకు సముద్రం ఇసుక రేణువులంత మందిని సమకూర్చాలి. మీరు స్వయంగా వాళ్ళతో కూడా యుద్ధానికి వెళ్ళాలి. 12 అప్పుడు అతడు ఎక్కడ ఉన్నా, మనం అక్కడికి వెళ్ళి, నేలమీద మంచు పడేవిధంగా మనం అతడిపై బడతాం. అలా చేస్తే అతడితో ఉన్నవాళ్ళలో ఎవ్వడూ తప్పించుకోలేకపోతాడు. 13 ఒకవేళ అతడు ఏదైనా పట్టణంలోకి వెనక్కుపోతే ఇస్రాయేల్‌వాళ్ళంతా ఆ పట్టణానికి త్రాళ్ళు తీసుకువచ్చి చిన్నరాయి కూడా అక్కడ కనబడకుండా ఆ పట్టణాన్ని లోయలోకి లాగివేస్తారు.”
14 అబ్‌షాలోం, ఇస్రాయేల్‌వారంతా ఈ మాట విని, “అర్కీవాడు హూషై చెప్పిన సలహా అహీతోపెల్ చెప్పిన సలహాకంటే బాగుంది” అని చెప్పారు. ఎందుకంటే యెహోవా అబ్‌షాలోం మీదికి విపత్తు రప్పించాలని అహీతోపెల్ చెప్పిన తెలివైన ఆలోచనను భంగం చేయడానికి సంకల్పించాడు. 15 అప్పుడు హుషై వెళ్ళి, అబ్‌షాలోంకూ ఇస్రాయేల్ ప్రజల పెద్దలందరికీ అహీతోపెల్ చెప్పిన సలహా, తాను చెప్పిన సలహా సాదోకుయాజికీ అబ్యాతారుయాజికీ తెలియజేశాడు.
16 “వెంటనే మీరు దావీదుకు ఈ కబురు పంపండి – మీరు అరణ్యంలో ఉన్న నది రేవుల దగ్గర ఈ రాత్రి ఉండకూడదు. రాజైన మీరు, మీతో ఉన్నవారంతా నాశనం కాకుండా ఉండేలా నది తప్పనిసరిగా దాటిపోవాలి” అని హూషై చెప్పాడు.
17 యోనాతాను, అహిమయసు ఏన్‌రోగేల్ దగ్గర ఉన్నారు. ఎవరికీ కనిపించకూడదని వారు నగరంలోకి రాలేకపోయారు, గనుక ఒక పనికత్తె వారిదగ్గరికి వెళ్ళి హూషై చెప్పిన సంగతి వారికి తెలియజేసింది. దావీదురాజు దగ్గరికి వెళ్ళి, ఆ సంగతి చెప్పడానికి వారు బయలుదేరారు. 18 అయితే ఒక అబ్బాయి వారిని చూచి, అబ్‌షాలోంకు తెలియజేశాడు. కనుక వారిద్దరు త్వరపడి, బహూరీంలో ఒక మనిషి ఇంటికి వెళ్ళారు. ఇంటి ఆవరణంలో బావి ఉంది. వారు దానిలో దిగి దాగుకొన్నారు. 19 ఆ మనిషి భార్య ముతక గుడ్డ తీసుకువచ్చి బావిపైన పరచి, గుడ్డ మీద గోధుమలు ఉంచింది. వారు దాగుకొన్న సంగతి ఎవరికీ తెలియదు.
20 తరువాత అబ్‌షాలోం మనుషులు ఆ ఇంటి ఆమె దగ్గరికి వచ్చి “అహిమయసు, యోనాతానులు ఎక్కడున్నారు?” అని అడిగారు.
అందుకు ఆమె “వాళ్ళు ఆ నీటి కాలువ దాటిపోయారు” అని చెప్పింది.
వాళ్ళు వెళ్ళి వెదికారు గాని, వారిని కనుక్కోలేక జెరుసలంకు తిరిగి వచ్చారు.
21 ఆ మనుషులు వెళ్ళిన తరువాత యోనాతాను, అహిమయసు బావిలోనుంచి బయటికి వచ్చి దావీదురాజు దగ్గరికి వెళ్ళారు, అతనికి వ్యతిరేకంగా అహీతోపెల్ చెప్పిన సలహా తెలియజేసి “మీరు వెంటనే నది దాటిపోవాలి” అని అతనితో చెప్పారు.
22 కనుక దావీదు అతనితో ఉన్నవారందరూ లేచి యొర్దాను దాటారు. ప్రొద్దు పొడిచేటప్పటికి నది దాటని వాడెవ్వడూ మిగలలేదు.
23 అహీతోపెల్ తాను చెప్పిన సలహా అబ్‌షాలోం పాటించకపోవడం చూచి, గాడిదకు జీను వేసి ఎక్కి, స్వగ్రామంలో తన ఇంటికి వెళ్ళాడు. తన ఇంటి విషయాలు చక్కపెట్టినతరువాత అతడు ఉరి పోసుకొని చనిపోయాడు. అతడివాళ్ళు అతడి తండ్రి సమాధిలో అతణ్ణి పాతిపెట్టారు.
24 దావీదు మహనయీంకు చేరుకొన్నాడు. అబ్‌షాలోం ఇస్రాయేల్ మనుషులంతా యొర్దాను దాటిపోయారు. 25 అంతకు ముందు అబ్‌షాలోం యోవాబుకు బదులుగా అమాశాను సైన్యాధిపతిగా నియమించాడు (అమాశా తండ్రి ఇస్రాయేల్‌వాడు ఇత్రా. యోవాబుయొక్క తల్లి సెరుయా సోదరి నాహాషు కూతురైన అబీగేల్‌ను ఇత్రా పెళ్ళి చేసుకొన్నాడు). 26 అబ్‌షాలోం, ఇస్రాయేల్ వారంతా గిలాదు ప్రదేశంలో మకాం చేశారు.
27 దావీదు మహనయీంకు చేరుకొన్నప్పుడు, అతని దగ్గరికి అమ్మోనువాళ్ళ రబ్బాపట్టణం వాడైన నాహాషు కొడుకు షోబీ, లోదెబార్ ఊరివాడైన అమ్మీయేల్ కొడుకు మాకీరు, రోగెలీం పురవాసీ గిలాదువాడూ అయిన బర్‌జిల్లయి వచ్చారు. 28 వారు “ఎడారిలో ప్రజలు అలసిపోయి ఆకలి దప్పులతో ఉంటారు” అనుకొని పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, యవలు, పిండి, వేయించిన గింజలు, చిక్కుడు కాయలు, బఠానీ, పేలాలు, 29 తేనె, పెరుగు, గొర్రెలు, జున్ను ముద్దలు దావీదుకూ అతనితో ఉన్నవారికీ ఆహారంగా తీసుకువచ్చారు.