16
1 దావీదు కొండ శిఖరం అవతల కొద్ది దూరం వెళ్ళిన తరువాత, మెఫీబోషెతు సేవకుడైన సీబా అతణ్ణి కలుసుకోవడానికి వచ్చాడు. అతడు జీనులు వేసిన రెండు గాడిదలను తీసుకువచ్చాడు. వాటి మీద రెండు వందల రొట్టెలు, నూరు ఎండిన ద్రాక్షపండ్ల అడలు, నూరు అంజూరు అడలు, ద్రాక్షరసం తిత్తి ఒకటి వేసి ఉన్నాయి.
2 రాజు సీబాను చూచి “ఇవి ఎందుకు తెచ్చావు?” అని అడిగాడు.
సీబా “గాడిదలు రాజు ఇంటివాళ్ళు ఎక్కడానికి, రొట్టెలూ పండ్లూ పరివారం తినడానికి ద్రాక్షరసం ఎడారిలో అలసి పోయిన వాళ్ళు త్రాగడానికి తెచ్చాను” అని చెప్పాడు.
3 అప్పుడు రాజు “నీ యజమాని మనుమడు ఎక్కడున్నాడు?” అని అడిగాడు.
అందుకు సీబా “అతడు ఇవ్వేళ ఇస్రాయేల్‌వాళ్ళు తనకు తన తాతగారి రాజ్యాన్ని మళ్ళీ ఇప్పిస్తారని అనుకొని జెరుసలంలో ఉండిపోయాడు” అని జవాబిచ్చాడు.
4 రాజు “మోఫీబోషెతుకు కలిగినదంతా నీదే!” అని సీబాతో అన్నాడు.
సీబా “నా యజమానీ! నా రాజా! మీరు నన్ను దయ చూడాలి. మీకు నమస్కారం” అన్నాడు.
5 దావీదురాజు బహూరీం గ్రామం సమీపించినప్పుడు సౌలు వంశంవాడు ఒకడు అక్కడనుంచి వచ్చాడు. అతడు గెరా కొడుకు షిమీ. అతడు వస్తూనే దావీదును శపిస్తూ ఉన్నాడు. 6 ప్రజలంతా, యుద్ధవీరులంతా దావీదు ఇరుప్రక్కల ఉన్నా, అతడు దావీదు మీద, అతని సేవకులందరి మీదా రాళ్ళు రువ్వాడు.
7 షిమీ, “వెళ్ళిపో! హంతకుడా! దుర్మార్గుడా! వెళ్ళిపో! 8 నీవు సౌలు ఇంటివాళ్ళను హత్య చేసి సౌలు స్థానంలో రాజయ్యావు గాని, నీవు చేసిన రక్తపాతానికి యెహోవా నీకు ప్రతీకారం చేస్తున్నాడు. యెహోవా నీ కొడుకు అబ్‌షాలోం చేతికి రాజ్యాన్ని ఇచ్చివేశాడు. నీవు హంతకుడివి, గనుకనే నీవు చేసిన కీడులో నీవు చిక్కుపడిపోయావు!” అని దూషించాడు.
9 సెరూయా కొడుకు అబీషై “ఈ చచ్చిన కుక్కను నా యజమానుడైన రాజును ఎందుకు శపించనివ్వాలి? నన్ను వెళ్ళి వాడి తల ఛేదించనియ్యి!” అన్నాడు.
10 అందుకు రాజు “సెరూయా కొడుకుల్లారా! మీకు నాతో ఏం పొందిక? వాణ్ణి శపించనియ్యి. దావీదును శపించమని యెహోవా వాడికి చెప్పితే ‘నీవెందుకు ఇలా చేస్తున్నావు?’ అని ఎవడు అడగగలడు?” అని చెప్పాడు.
11 దావీదు అబీషైతో తన సేవకులందరితో ఇంకా అన్నాడు, “నా సొంత కొడుకు నా ప్రాణం తీయడానికి చూస్తూవున్నాడు. ఈ బెన్యామీనువాడు ఇలా చేయడం మరీ నిశ్చయం గదా. వాడి జోలికి పోవద్దు. శపించమని యెహోవా వాడికి చెప్పాడు, గనుక వాణ్ణి శపించనియ్యండి. 12 యెహోవా నా బాధను చూచి, ఇవ్వేళ వాడు పలికిన శాపానికి బదులు యెహోవా నాకు మంచి చేస్తాడేమో.”
13 దావీదు, అతని మనుషులంతా త్రోవలో ముందుకు సాగారు. వారు వెళ్ళిపోతూ ఉంటే షిమీ అతనికి ఎదురుగా కొండప్రక్కన వెళ్తూ దావీదు మీదికి రాళ్ళు రువ్వుతూ, మట్టి విసరివేస్తూ, దూషిస్తూ వచ్చాడు. 14 రాజు, అతనితో ఉన్న వారంతా అలసిపోయి గమ్యం చేరుకొన్నారు. అక్కడ వారు సేదతీర్చుకొన్నారు.
15 ఇంతలో అబ్‌షాలోం, ఇస్రాయేల్‌వారంతా జెరుసలం చేరారు. అతడితోకూడా అహీతోపెల్ వచ్చాడు. 16 అప్పుడు దావీదు మిత్రుడూ, అర్కీ జాతివాడూ అయిన హూషై అబ్‌షాలోం దగ్గరికి వచ్చి అతడితో “రాజు చిరంజీవి అవుతాడు గాక! రాజు చిరంజీవి అవుతాడు గాక!” అన్నాడు.
17 అబ్‌షాలోం “నీ మిత్రుడికి నీవు చూపే అభిమానం ఇంతేనా? నీ మిత్రుడితో కూడా నీవు వెళ్ళలేదేం?” అని అతణ్ణి అడిగాడు.
18 అందుకు హూషై ఇలా జవాబిచ్చాడు: “అలా కాదు. యెహోవా, ఈ ప్రజలు, ఇస్రాయేల్‌వాళ్ళంతా ఎవరిని కోరుకొంటారో నేను ఆయన వాడినవుతాను. ఆయన దగ్గరే ఉంటాను. 19 అంతేగాక, నేను ఎవరికి సేవ చేయాలి? మీ తండ్రి కుమారుడికి నేను సేవ చేయకూడదా? మీ తండ్రికి సేవ చేసినట్టు మీకు సేవ చేస్తాను”.
20 తరువాత అబ్‌షాలోం అహీతోపెల్‌తో “మనం ఏం చేయాలి? సలహా చెప్పు” అన్నాడు. 21 అందుకు అహీతోపెల్ ఇలా అన్నాడు: “భవనాన్ని కనిపెట్టుకొని ఉండడానికి మీ తండ్రి ఉంచిన ఉంపుడుకత్తెలతో శయనించండి. అప్పుడు మీరు మీ తండ్రికి అసహ్యంగా అయ్యారని ఇస్రాయేల్‌ప్రజలంతా తెలుసుకొంటారు. మీ పక్షం వహించినవాళ్ళందరికీ ఎక్కువ ధైర్యం చేకూరుతుంది.”
22 అందుచేత మిద్దె మీద వాళ్ళు అబ్‌షాలోం కోసం డేరా వేశారు. ఇస్రాయేల్ ప్రజల కళ్ళెదుటే అబ్‌షాలోం తన తండ్రి ఉంపుడుకత్తెలతో శయనించాడు. 23 ఆ రోజుల్లో అహీతోపెల్ ఆలోచన చెప్పితే, అది దేవుణ్ణి అడిగి సందేశం పొందిన వాడి మాటలాగా అంగీకారం అయ్యేది. అహీతోపెల్ చెప్పే సలహా అంతా దావీదు, అబ్‌షాలోం అలాగే భావించుకొన్నారు.