15
1 తరువాత అబ్‌షాలోం ఒక రథాన్ని, గుర్రాలను, తన రథం ముందు పరుగెత్తడానికి యాభై మంది మనుషులను అమర్చుకొన్నాడు. 2 అతడు ఉదయమే లేచి బయలుదేరి నగరద్వారానికి పోయేదారి ప్రక్కనే నిలబడేవాడు. రాజు నిర్ణయంకోసం ఎవరైనా వ్యాజ్యెంతో వస్తే అబ్‌షాలోం వారిని పిలిచి, “మీదే ఊరు?” అని అడిగేవాడు. “మీ సేవకుడైన నేను ఇస్రాయేల్ గోత్రాలలో ఒక దానికి చెందినవాణ్ణి” అని ఆ వ్యక్తి చెప్పినప్పుడు, 3 అబ్‌షాలోం “మీ ఫిర్యాదు సరిగా, న్యాయంగా ఉంది. కానీ దానిని వినడానికి రాజు ఎవరినీ నియమించలేదు” అని చెప్పేవాడు.
4 అబ్‌షాలోం, “నేను ఈ దేశానికి న్యాయమూర్తిగా ఉంటే ఎంత బాగుంటుంది! అప్పుడు ఎవరికైనా వ్యాజ్యం గానీ ఫిర్యాదు గానీ ఉంటే, వాళ్ళు నా దగ్గరికి రాగలుగుతారు. నేను వాళ్ళకు న్యాయం చేకూరుస్తాను” అనేవాడు.
5 అంతేగాక తనకు నమస్కారం చేయడానికి ఎవడైనా తన దగ్గరికి వస్తే అబ్‌షాలోం చెయ్యి చాచి అతణ్ణి పట్టుకొని, ముద్దు పెట్టుకొనేవాడు. 6 నిర్ణయంకోసం రాజుదగ్గరికి వచ్చిన ఇస్రాయేల్ ప్రజలందరిపట్లా ఈ విధంగా వ్యవహరిస్తూ అబ్‌షాలోం ఇస్రాయేల్‌వారిని తనవైపు త్రిప్పుకొన్నాడు.
7 నాలుగు సంవత్సరాలు ఈ విధంగా గడిచాయి. అప్పుడు అబ్‌షాలోం రాజుదగ్గరికి వెళ్ళి, “మీ సేవకుడైన నేను సిరియా దగ్గర ఉన్న గెషూరులో ఉన్నప్పుడు 8 ‘నన్ను జెరుసలంకు తిరిగి చేరేలా యెహోవా చేస్తే, నేను యెహోవాకు సేవ చేస్తాను’ అని మ్రొక్కుకొన్నాను. నేను హెబ్రోనుకు వెళ్ళి యెహోవాకు ఆ మ్రొక్కుబడి చెల్లించడానికి నాకు సెలవియ్యండి” అని మనవి చేశాడు.
9 రాజు “క్షేమంగా వెళ్ళు” అని సెలవిచ్చాడు. కనుక అతడు హెబ్రోనుకు వెళ్ళాడు. 10 అప్పుడు అబ్‌షాలోం ఈ సమాచారం ఇస్రాయేల్ గోత్రాల ప్రదేశాలన్నిటిలోకి బంటులచేత రహస్యంగా చెప్పి పంపించాడు:
“బూరల ధ్వని మీకు వినబడేటప్పుడు ‘అబ్‌షాలోం హెబ్రోనులో రాజయ్యాడు’ అని కేకలు పెట్టండి.”
11 జెరుసలంనుంచి రెండు వందలమంది అబ్‌షాలోంతో కూడా వచ్చారు. అతడు వాళ్ళను పిలిచినప్పుడు వాళ్ళు బయలుదేరారు గాని ఏమీ తెలియక యథార్థ మనసుతో వచ్చారు. 12 బలులు అర్పిస్తూ ఉన్నప్పుడు అబ్‌షాలోం గీలో గ్రామవాసి అహీతోపెల్‌ను గీలోనుంచి పిలిపించాడు. అతడు దావీదుకు సలహాదారుడు. ఈ విధంగా కుట్ర బలంగా అయిపోయింది. అబ్‌షాలోం దగ్గరికి వస్తూ ఉన్న వాళ్ళ సంఖ్య పెరుగుతూ వచ్చింది.
13 “ఇస్రాయేల్‌వాళ్ళు అబ్‌షాలోం పక్షం వహించారు” అని దావీదుకు కబురు వచ్చింది. 14  దావీదు జెరుసలంలో ఉంటున్న తన పరివారమంతటితో “పారిపోదాం రండి! లేకపోతే అబ్‌షాలోం చేతినుంచి తప్పించుకోలేము. అతడు హఠాత్తుగా వచ్చి మనల్ని పట్టుకొని విపత్తుకు గురి చేస్తాడు, నగరాన్ని కత్తిపాలు చేస్తాడు, గనుక మనం వెంటనే వెళ్ళిపోదాం” అని చెప్పాడు.
15 అందుకు రాజు సేవకులు “సరే, మా యజమానులైన రాజు చిత్తానుసారంగా చేయడానికి మీ దాసులైన మేము సిద్ధంగా ఉన్నాం” అన్నారు.
16 అప్పుడు రాజు భవనాన్ని కనిపెట్టుకోవడానికి పదిమంది ఉంపుడుకత్తెలను ఉంచి, తన ఇంటివారందరితో పాటు బయలుదేరాడు. 17 అతడు, అతని ప్రజలంతా తరలివెళ్ళి చివరి ఇంటిదగ్గర ఆగారు. 18 అతని మనుషులంతా అతని ఇరుప్రక్కల నడిచారు. కెరేతివాళ్ళు, పెలేతివాళ్ళు, మునుపు గాతు నుంచి అతనితో కూడా వచ్చిన ఆరు వందలమంది గాతువాళ్ళు రాజుకు ముందు నడిచారు.
19 రాజు గాత్‌వాడైన ఇత్తయితో ఇలా అన్నాడు: “నీవు మాతోకూడా రావడం ఎందుకని? తిరిగి వెళ్ళి రాజు ఉన్న స్థలంలో ఉండు. నీవు విదేశీయుడివి, శరణాగతుడివి. 20 ఇటీవలే వచ్చినవాడివి. ఎక్కడికి వెళ్తున్నామో తెలియని మాతో కూడా వచ్చి ఇవ్వేళ నిన్ను తిరుగులాడేట్టు చేస్తానా? నీ స్వదేశస్థులను వెంటబెట్టుకొని తిరిగి వెళ్ళు. యెహోవా నీ పట్ల అనుగ్రహం, విశ్వసనీయత చూపుతాడు గాక!”
21 అందుకు ఇత్తయి “నేను బ్రతికినా చావవలసివచ్చినా నా యజమానీ నా రాజూ అయిన మీరు ఎక్కడుంటారో అక్కడే మీ దాసుడైన నేనూ ఉంటానని యెహోవా జీవం మీదా నా యజమానీ నా రాజూ అయిన మీ జీవం మీదా శపథం చేస్తున్నాను” అని రాజుతో అన్నాడు.
22 దావీదు “సరే, నీవు ముందుకు సాగిపోవచ్చు” అని ఇత్తయితో చెప్పాడు. అందుచేత గాతువాడు ఇత్తయి, అతడి మనుషులంతా అతడితో ఉన్న కుటుంబంవాళ్ళంతా ముందుకు సాగిపోయారు.
23 వారు సాగిపోతూ ఉంటే ప్రజలంతా గట్టిగా ఏడుస్తూ ఉన్నారు. ఈ విధంగా వారందరూ రాజుతో కూడా కిద్రోను వాగు దాటి ఎడారివైపుకు ప్రయాణమైపోయారు. 24 సాదోకు కూడా వచ్చాడు. అతనితో ఉన్న లేవీగోత్రికులంతా దేవుని ఒడంబడిక పెట్టెను మోస్తూ వచ్చారు. తరువాత వారు దేవుని మందసం దించారు. నగరం నుంచి ప్రజలంతా వచ్చే వరకు అబ్యాతారు అక్కడ నిలుచున్నాడు.
25 అప్పుడు సాదోకును పిలిచి రాజు, ‘దేవుని పెట్టెను నగరంలోకి తిరిగి తీసుకుపో. యెహోవా నన్ను గనుక దయ చూస్తే ఆయన నన్ను తిరిగి వచ్చేలా చేస్తాడు, ఆయన మందసాన్ని నివాస స్థలాన్ని మళ్ళీ చూచేలా చేస్తాడు, 26 ఒకవేళ ఆయన “నీవంటే నాకు ఇష్టం లేదు’ అంటే ఆయన చిత్తం. ఆయనకు ఏది న్యాయమని అనిపించు కొంటుందో అది నా పట్ల జరిగిస్తాడు గాక!” అని చెప్పాడు.
27 రాజు సాదోకుయాజితో ఇంకా అన్నాడు: “నీవు దీర్ఘదర్శివి గదా. నీవు నీ కొడుకు అహిమయసునూ, అబ్యాతారు కొడుకు యోనాతానునూ వెంటబెట్టుకొని నగరానికి తిరిగి వెళ్ళు. నీవు, అబ్యాతారు, మీ ఇద్దరు కొడుకులను తీసుకుపోవాలి. 28 ఇదిగో విను నీ దగ్గరనుంచి నాకు కబురు వచ్చేవరకు నేను అరణ్యంలో ఉన్న నది రేవుల దగ్గర ఆగిపోతాను.” 29 అందుచేత సాదోకు, అబ్యాతారు దేవుని మందసాన్ని జెరుసలంకు తిరిగి తీసుకువెళ్ళి అక్కడ ఉండిపోయారు.
30 దావీదు ఆలీవ్ కొండ ఎక్కుతూ ఏడుస్తూ వెళ్ళాడు. తల కప్పుకొని చెప్పులు లేకుండా నడుస్తూ వెళ్ళాడు. అతనితో ఉన్న ప్రజలంతా కూడా తలలు కప్పుకొని, ఏడుస్తూ కొండెక్కుతూ వెళ్ళారు.
31 “అబ్‌షాలోం చేసిన కుట్రలో అహీతోపెల్ చేరాడు” అని ఎవరో దావీదుకు తెలియజేశారు, గనుక దావీదు “యెహోవా! అహీతోపెల్ సలహాను భంగపరచు” అని ప్రార్థన చేశాడు. 32 దేవుణ్ణి ఆరాధించే స్థలం ఒకటి ఆ కొండమీద ఉండేది. దావీదు అక్కడికి చేరినప్పుడు, అర్కీ జాతివాడైన హూషై అక్కడ అతని కోసం చూస్తూ ఉన్నాడు. హూషై తొడుక్కున్న నిలువుటంగీని చింపుకొని తలమీద బుగ్గిపోసుకున్నాడు.
33 రాజు అతణ్ణి చూచి “నీవు నాతోకూడా వస్తే నాకు భారంగా ఉంటావు. 34 కానీ నీవు నగరానికి వెళ్ళి అబ్‌షాలోంతో ‘రాజా! నేను మీకు సేవకుడుగా ఉంటాను. ఇదివరకు మీ తండ్రికి సేవ చేసినట్టు ఇకనుంచి మీకు సేవ చేస్తాను’ అని చెప్పితే, నీవు నాకోసం అహీతోపెల్ చెప్పే సలహాను భంగం చేయగలవు. 35 సాదోకుయాజి, అబ్యాతారుయాజి అక్కడ ఉండి, నాకు సహాయం చేస్తారు గదా. రాజభవనంలో నీకు వినబడేదంతా వారికి తెలియజేయి. 36 వారి ఇద్దరు కొడుకులు – సాదోకు కొడుకు అహిమయసు, అబ్యాతారు కొడుకు యోనాతాను – అక్కడ ఉంటారు. నీకు వినబడేదంతా వారిచేత నాకు చెప్పి పంపించాలి” అన్నాడు.
37 అందుచేత దావీదు మిత్రుడైన హూషై నగరానికి తిరిగి వెళ్ళాడు. అబ్‌షాలోం జెరుసలంలో ప్రవేశిస్తూ ఉండగా హూషై అక్కడ చేరాడు.