14
1 రాజు అబ్‌షాలోం మీద ప్రాణం పెట్టుకొన్నాడని సెరూయా కొడుకు యోవాబు గ్రహించాడు. 2 కనుక అతడు తెకోవకు మనుషులను పంపి అక్కడనుండి యుక్తిగల స్త్రీ ఒకతెను తెప్పించాడు. అతడు ఆమెతో ఇలా చెప్పాడు:
“నీవు దుఃఖిస్తూ ఉన్నట్టు నటించి ఏమీ నూనె పూసు కోకుండా, దుఃఖ సూచకమైన ఉడుపు తొడుక్కో. చనిపోయిన వాళ్ళకోసం చాలా కాలంనుండి శోకిస్తూ ఉన్న స్త్రీలాగా మసులుకో. 3 రాజు దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చెప్పు.” అప్పుడు ఆమె ఏం చెయ్యాలో యోవాబు ఆమెకు చెప్పాడు.
4 తెకోవ స్త్రీ రాజు దగ్గరికి వెళ్ళి, సాష్టాంగ నమస్కారం చేసి “రాజా! నాకు సహాయం చెయ్యి” అంది.
5 రాజు “నీకేం కష్టం వచ్చింది?” అని ఆమెను అడిగినప్పుడు ఆమె ఇలా జవాబిచ్చింది: “నేను నిజంగా విధవరాలను. నా భర్త చనిపోయాడు. 6 మీ సేవిక అయిన నాకు ఇద్దరు కొడుకులు ఉండేవారు. వాళ్ళు పొలంలో కొట్లాడారు. వాళ్ళను వేరు చేయడానికి ఎవ్వరూ లేరు. ఒకడు రెండోవాణ్ణి కొట్టి చంపాడు. 7 ఇప్పుడు నా కుటుంబం వాళ్ళంతా మీ పరిచారిక అయిన నాపై లేచారు. ‘తన తోబుట్టువును చంపినవాణ్ణి మాకు అప్పగించు. తన తోబుట్టువు ప్రాణం తీశాడు, గనుక మేము వాణ్ణి చంపాలి. ఈ విధంగా వారసుణ్ణి నాశనం చేస్తాం’ అని చెపుతున్నారు. వాళ్ళు నాకు మిగిలిన నిప్పుకణికను ఆర్పేసి నా భర్తకు లోకంలో పేరు గానీ, సంతానం గానీ లేకుండా చేయబోతున్నారు.”
8 రాజు “నీవు ఇంటికి వెళ్ళు. నీ విషయం నేను ఆజ్ఞ జారీ చేస్తాను” అని ఆమెతో చెప్పాడు.
9 అప్పుడు తెకోవ ఊరి స్త్రీ “నా యజమానులూ! రాజా! ఆ దోషం నేను, నా తండ్రి కుటుంబం భరించాలి. రాజుకు రాజ సింహాసనానికి మాత్రం దోషం తగలకూడదు” అని రాజుతో చెప్పింది. 10 అందుకు రాజు “ఎవడైనా దీని గురించి నిన్ను ఏమైనా అంటే వాణ్ణి నా దగ్గరికి తీసుకురా. అప్పటినుండి వాడు నిన్ను ఏమీ కలత పెట్టడు” అన్నాడు.
11 ఆమె “హత్యకు ప్రతీకారం చేసే బంధువు ఇంకా కీడు చేసి నా కొడుకును నాశనం చేయకుండా ఉండేట్టు రాజు తమ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేస్తాడు గాక!” అని చెప్పింది.
రాజు “నీ కొడుకు తల వెండ్రుకలలో ఒక్కటి కూడా నేల రాలదని యెహోవా జీవం మీద ఆనబెట్టి చెప్పుతున్నాను” అన్నాడు.
12 ఆమె “నా యజమానులైన రాజుతో మీ పరిచారికనైన నన్ను మరో మాట చెప్పనియ్యండి” అంది. రాజు “చెప్పు” అన్నాడు.
13 అప్పుడా స్త్రీ ఇలా చెప్పింది: “ఇలాంటిది మీరే ఎందుకు దేవుని ప్రజలకు వ్యతిరేకంగా తల పెడుతున్నారు? రాజు అపరాధిగా ఈ విధంగా చెపుతున్నాడు. ఎందుకంటే తాను వెళ్ళగొట్టిన తన కొడుకును తిరిగి రానివ్వడం లేదు. 14 మనమందరమూ చనిపోతాం గదా. నేలను ఒలికిన తరువాత మళ్ళీ ఎత్తలేని నీళ్ళలాగా అవుతాం. అయితే దేవుడు ప్రాణం తీయడు. వెళ్ళగొట్టబడ్డవాళ్ళు తనకు దూరంగా ఉండిపోకూడదని ఏర్పాట్లు కల్పిస్తాడు. 15 నా ప్రజలు నన్ను భయపెట్టారు, గనుక నేను దీని గురించి నా యజమానులైన రాజుతో చెప్పడానికి వచ్చాను. మీ పరిచారికనైన నేను ‘రాజుతో మాట్లాడుతాను. 16 ఆయన నా మనవి ప్రకారం చేస్తాడేమో, రాజు నా విన్నపం అంగీకరించి, దేవుడిచ్చిన వారసత్వాన్ని నేను, నా కొడుకు అనుభవించకుండా మమ్మల్ని నాశనం చేయడానికి చూచేవాడి చేతిలో నుండి నన్ను విడిపిస్తాడేమో’ అనుకొన్నాను. 17 మీ పరిచారికనైన నేను చెప్పేది ఏమంటే, నా యజమానులూ రాజూ అయిన మీరు దేవదూతలా మంచిచెడ్డలను వివేచించగలరు, కనుక నా యజమానులూ రాజూ అయిన మీ మాట నాకు మనశ్శాంతి కలిగిస్తుంది అనుకొంటున్నాను. మీ దేవుడు యెహోవా మీకు తోడుగా ఉంటాడు గాక!”
18 అప్పుడు రాజు ఆమెతో “నేను నిన్ను ఒక సంగతి అడుగుతాను. అది నా నుండి దాచవద్దు” అన్నాడు. ఆమె “నా యజమానులైన రాజా, చెప్పండి” అంది.
19 రాజు “ఈ విషయంలో యోవాబు నిన్ను పురికొలిపాడా?” అని అడిగాడు. అందుకా స్త్రీ ఇలా జవాబిచ్చింది: “నా యజమానులైన రాజా! మీ ప్రాణంతోడు, మీరు చెప్పినదాని నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. మీ సేవకుడు యోవాబు నాకు ఆదేశం ఇచ్చాడు. 20 ఈ మాటలన్నీ మీ పరిచారినైన నాకు నేర్పాడు. పరిస్థితులను మార్చడానికి మీ సేవకుడు యోవాబు ఈవిధంగా చేశాడు. నా యజమానులైన మీరు దేవదూతలాగా జ్ఞానం గలిగి, దేశంలో జరుగుతున్నదంతా తెలుసుకొంటారు”.
21 తరువాత రాజు యోవాబుతో “సరే, నీ విన్నపం ప్రకారం చేస్తాను. నీవు వెళ్ళి, యువకుడు అబ్‌షాలోంను తీసుకురా” అన్నాడు.
22 యోవాబు సాష్టాంగ నమస్కారం చేసి, రాజును దీవించి ఇలా అన్నాడు: “నా యజమానీ, రాజా! నీవు నీ సేవకుడైన నా విన్నపం అంగీకరించావు, గనుక నీవు నీ సేవకుడైన నన్ను దయ చూస్తూ ఉన్నావని నేను ఇవ్వేళ తెలుసుకొన్నాను.” 23 అప్పుడు యోవాబు గెషూరుకు వెళ్ళి, అబ్‌షాలోంను జెరుసలంకు తీసుకువచ్చాడు.
24 అయితే రాజు “అతడు తన ఇంటికి వెళ్ళాలి. నా ముఖాన్ని అతడు చూడకూడదు” అన్నాడు గనుక అబ్‌షాలోం రాజు ముఖాన్ని చూడకుండా సొంత ఇంటికి వెళ్ళాడు.
25 అబ్‌షాలోం చాలా అందగాడు. అందం విషయం ఇస్రాయేల్ దేశమంతటా అతడికి కలిగిన ప్రఖ్యాతి ఇంకెవ్వరికీ లేదు. అరికాలినుంచి నెత్తి వరకు అతడిలో ఏమీ లోపం కనిపించలేదు. 26 అతడి తలవెండ్రుకలు భారంగా ఉండడం చేత అతడు వాటిని కత్తిరిస్తే (సంవత్సరానికి ఒక్కసారే వాటిని కత్తిరించేవాడు), వాటి బరువు రాజ్య పరిమాణం చొప్పున రెండు కిలోగ్రాములకంటే ఎక్కువగా ఉండేది. 27 అబ్‌షాలోంకు ముగ్గురు కొడుకులు, ఒక కూతురు పుట్టారు. కూతురి పేరు తామారు. ఆమె చాలా అందకత్తె. 28 రాజు ముఖాన్ని చూడకుండా అబ్‌షాలోం రెండు నిండు సంవత్సరాలు జెరుసలంలో కాపురమున్నాడు. 29 అప్పుడు యోవాబును రాజుదగ్గరికి పంపాలని అబ్‌షాలోం అతణ్ణి పిలిచాడు గాని, యోవాబు పిలుపును నిరాకరించాడు. అతణ్ణి రెండో సారి పిలిచాడు. యోవాబు రెండో సారి పిలుపును నిరాకరించాడు.
30 అబ్‌షాలోం తన పనివాళ్ళను చూచి “ఇదిగో యోవాబు పొలం నా పొలందగ్గరే ఉంది గదా. అతడి పొలంలో యవలు ఉన్నాయి. మీరు వెళ్ళి వాటిని తగలబెట్టండి” అన్నాడు.
అలాగే అబ్‌షాలోం పనివాళ్ళు ఆ పొలాన్ని తగలబెట్టారు. 31 అప్పుడు యోవాబు లేచి, అబ్‌షాలోం ఇంటికి వచ్చి, “నీ పనివాళ్ళు నా పొలాన్ని ఎందుకు తగలబెట్టారు?” అని అడిగాడు.
32 అందుకు అబ్‌షాలోం ఇలా అన్నాడు: “నీవు రావాలని నేను కబురు పంపాను. ‘గెషూరునుంచి నేను ఎందుకు వచ్చాను? నేనక్కడే ఉండడం మంచిది’ అని నీచేత రాజుతో చెప్పించడానికి నిన్ను రాజుదగ్గరికి పంపాలని నిన్ను పిలిచాను. నేను రాజు ముఖాన్ని చూడాలి. నేను అపరాధినైతే రాజు నన్ను చంపించవచ్చు.”
33 కనుక యోవాబు రాజు దగ్గరికి వెళ్ళి ఆ సంగతి చెప్పాడు. అప్పుడు రాజు అబ్‌షాలోంను పిలిపించాడు. అతడు రాజుదగ్గరికి వచ్చి రాజు ఎదుట సాష్టాంగ నమస్కారం చేశాడు. రాజు అబ్‌షాలోంను ముద్దు పెట్టుకొన్నాడు.