13
1 తరువాత దావీదు కొడుకైన అమ్నోను దావీదు కొడుకైన అబ్‌షాలోం యొక్క అందమైన సోదరిని మోహించాడు. ఆమె పేరు తామారు. 2 తామారు కన్య. ఆమెకు ఏమైనా చేయడం అమ్నోను దృష్టిలో కష్ట సాధ్యంగా ఉంది. తన చెల్లెలు తామారు కారణంగా అమ్నోను చింతాక్రాంతుడై నీరసించిపోయాడు. 3 అమ్నోనుకు మిత్రుడు ఒకడు ఉండేవాడు. అతడు దావీదు అన్న షిమ్యా కొడుకు యోనాదాబు. అతడు చాలా యుక్తిగలవాడు.
4 అతడు అమ్నోనును చూచి, “రాజకుమారుడివైన నువ్వు రోజు వెంబడి రోజు ఎందుకు చిక్కిపోతున్నావు? సంగతి నాకు చెప్పవా?” అని అడిగాడు.
అమ్నోను “నా తమ్ముడు అబ్‌షాలోం యొక్క సోదరి తామారు అంటే నాకు ప్రేమ” అని అతడితో అన్నాడు.
5 అందుకు యోనాదాబు ఇలా అన్నాడు: “నీకు జబ్బు చేసినట్టు నటించి నీ పడకమీద పడుకో. నిన్ను చూడడానికి నీ తండ్రి వచ్చేటప్పుడు నీవు ఆయనతో ‘నా చెల్లెలు తామారు వచ్చి నాకు భోజనం పెట్టనివ్వండి. ఆమె నా కళ్ళెదుటే దానిని సిద్ధం చేయాలి. అప్పుడు ఆమె తన సొంత చేత్తో దానిని నాకు పెడితే నేను తింటాను’ అని చెప్పు.”
6 అలాగే తనకు జబ్బు చేసినట్టు అమ్నోను నటించి పడక మీద పడుకొన్నాడు. రాజు అతణ్ణి చూడడానికి వచ్చినప్పుడు అమ్నోను “నా చెల్లెలు తామారు వచ్చి నా కళ్ళెదుటే నాకోసం రెండు అప్పాలు చేయనివ్వండి. అప్పుడు ఆమె తన సొంత చేత్తో వాటిని నాకు పెడితే నేను తింటాను” అని అతనితో చెప్పాడు.
7 దావీదు “నీ అన్న అమ్నోను ఇంటికి వెళ్ళి, అతని కోసం భోజనం సిద్ధం చెయ్యి” అని ఇంట్లో తామారుకు కబురు పంపాడు. 8 తామారు తన అన్న అమ్నోను ఇంటికి వెళ్ళింది. అతడు ఇంకా పడుకొని ఉన్నాడు. ఆమె పిండి తీసుకొని కలిపి, అతని కళ్ళెదుటే అప్పాలు చేసి కాల్చింది. 9 ఆమె పెనం పట్టుకొని అతడికి వడ్డించింది. అతడు వద్దన్నాడు. “అందరూ బయటికి వెళ్ళాలి” అని అమ్నోను చెప్పాడు, గనుక అందరూ బయటికి వెళ్ళారు.
10 అప్పుడు అమ్నోను తామారుతో “నీవు సిద్ధం చేసిన దానిని పడకగదిలోకి తీసుకురా. నీ చేతిమీదుగా నేనది తింటాను” అన్నాడు.
చేసిన అప్పాలను చేతపట్టుకొని తామారు పడక గదిలో ఉన్న తన అన్న అమ్నోను దగ్గరికి వచ్చింది. 11 అతడు తినాలని ఆమె వాటిని తీసుకువచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకొని “చెల్లీ రా! నాతో పడుకో!” అన్నాడు.
12 ఆమె “వద్దు అన్నా! నన్ను అవమానపరచకు! ఇలా చేయడం ఇస్రాయేల్‌వారికి తగదు. నీవు ఈ చెడుగు చేయవద్దు. 13 చేస్తే, నా అవమానాన్ని నేను ఎలా దాచుకోగలను? నీవు ఇస్రాయేల్‌లో దుర్మార్గుల లెక్కలోకి వస్తావు. నీవు రాజుతో మాట్లాడు. ఆయన నన్ను నీకు భార్యగా ఇస్తాడు” అని చెప్పింది. 14 అతడు ఆమె మాట వినలేదు. ఆమెను బలవంతాన లొంగదీసి అవమానపరచాడు. 15 అప్పుడు అమ్నోనుకు ఆమె పట్ల అత్యంత ద్వేషం పుట్టింది. అదివరకు ఆమెను ప్రేమించినంతకంటే మరీ ఎక్కువగా అతడు ఆమెను ద్వేషించాడు.
అమ్నోను “లేచిపో!” అని ఆమెతో చెప్పాడు.
16 ఆమె “వద్దు. నీవు నన్ను బయటికి తోసివేయడం నాకు ఇప్పుడు చేసిన దానికంటే ఎక్కువ చెడుగు” అని అతడితో చెప్పినా, అతడు ఆమె మాటను పెడచెవి పెట్టాడు.
17 అతడు తన దగ్గరి పరిచారకుణ్ణి పిలిచి “దీనిని నా దగ్గరనుంచి వెళ్ళగొట్టి, తలుపు గడియ వెయ్యి!” అని చెప్పాడు.
18 పరిచారకుడు ఆమెను బయటికి వెళ్ళగొట్టి, తలుపు గడియ వేశాడు.
కన్యలైన రాజకుమార్తెలు రంగు చారల నిలువుటంగీలు ధరించేవారు. తామారు ధరించినది అలాంటిదే. 19 తామారు ఆ నిలువుటంగీని చించి, నెత్తిన బుగ్గి పోసుకొని, తల మీద చెయ్యి పెట్టుకొని, రోదనం చేస్తూ వెళ్ళింది.
20 ఆమె అన్న అబ్‌షాలోం ఆమెను చూచి “నీ అన్న అమ్నోను నిన్ను ముట్టాడా? ఊరుకో, చెల్లీ! అతడు నీ అన్న గదా. ఇంతగా కంగారుపడకు.”
తామారు ఓదార్పు పొందక, తన అన్న అబ్‌షాలోం ఇంటిలో ఏకాంతంగా ఉండిపోయింది. 21 ఈ సంగతి దావీదు రాజుకు వినబడ్డప్పుడు అతడు తీవ్ర కోపంతో మండిపడ్డాడు. 22 అబ్‌షాలోం తన అన్న అమ్నోనుతో మంచి చెడ్డలు ఏమీ మాట్లాడలేదు. అయితే తన చెల్లెలు తామారును బలవంతాన అవమాన పరచినందుచేత అమ్నోనును ద్వేషించాడు.
23 రెండు సంవత్సరాలు గడిచాయి. ఒకసారి ఎఫ్రాయిం సరిహద్దు దగ్గర ఉన్న బయల్ హాసోరులో అబ్‌షాలోం పనివాళ్ళు గొర్రెల బొచ్చు కత్తిరిస్తూ ఉన్నప్పుడు అబ్‌షాలోం రాకుమారులందరినీ అక్కడికి విందుకు పిలిచాడు. 24 అతడు రాజుదగ్గరికి “మీ సేవకుడైన నేను గొర్రెల బొచ్చు కత్తిరించే వాళ్ళను రప్పించాను. నాతో కూడా రాజు, రాజ పరివారం అక్కడికి వస్తారా?” అని అడిగాడు.
25 రాజు “కుమారుడా, మమ్ముల్నందరినీ పిలవవద్దు. మేము వస్తే నీకు భారంగా ఉంటాం” అని అబ్‌షాలోంతో అన్నాడు. అబ్‌షాలోం దావీదును బలవంతం చేసినా అతడు వెళ్ళడానికి సమ్మతించలేదు. అయితే దావీదు అబ్‌షాలోంను దీవించాడు.
26 అప్పుడు అబ్‌షాలోం “మీరు రాకపోతే, నా అన్న అమ్నోను అయినా మాతో కూడా రావడానికి సెలవివ్వండి” అన్నాడు.
రాజు “అతడు మీతో ఎందుకు వెళ్ళాలి” అని అడిగాడు.
27 కానీ అబ్‌షాలోం అతణ్ణి బాగా ప్రాధేయపడినందుచేత అమ్నోను, రాకుమారులందరూ వెళ్ళవచ్చునని రాజు అనుమతించాడు.
28 తరువాత అబ్‌షాలోం తన పనివాళ్ళను పిలిచి “వినండి. అమ్నోను ద్రాక్ష మద్యం తాగి సంబరపడుతూ ఉన్నప్పుడు నేను మీతో ‘అమ్నోనును హతం చేయండి’ అంటాను. అప్పుడు భయపడక అతణ్ణి చంపండి. నేనే గదా మీకు ఆజ్ఞ ఇస్తున్నాను. ధైర్యంగా ఉండండి! పౌరుషం చూపండి!” అని ఆదేశించాడు.
29 అబ్‌షాలోం ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం వాళ్ళు అమ్నోనుకు చేశారు. అప్పుడు రాకుమారులంతా లేచి, తమ కంచరగాడిదలమీద ఎక్కి పారిపోయారు.
30 వారు దారిలో ఇంకా ఉండగానే “అబ్‌షాలోం రాకుమారులందరినీ హతం చేశాడు. ఒక్కడూ కూడా మిగలలేదు” అని కబురు దావీదుకు వచ్చింది. 31 రాజు నిలబడి, తాను తొడుకొన్న బట్టలను చింపుకొని, నేలమీద పడుకొన్నాడు. అతని పరివారంలో ప్రతి ఒక్కడూ బట్టలు చింపుకొని దగ్గర నిలబడి ఉన్నారు. 32 కానీ దావీదు అన్న షిమ్యా కొడుకు యోనాదాబు ఇలా అన్నాడు:
“వాళ్ళు రాకుమారులందరినీ చంపారని నా యజమానులైన మీరు అనుకొకండి. అమ్నోను మాత్రమే చనిపోయాడు. అతడు అబ్‌షాలోం చెల్లెలు తామారును చెరచిన రోజునుండి అతణ్ణి చంపాలని అబ్‌షాలోం ఉద్దేశం తెలిపాడు. 33 కనుక ‘రాకుమారులందరూ చనిపోయార’ని నా యజమానులైన మీరు అనుకొని విచారపడకండి. అమ్నోను ఒక్కడే చనిపోయాడు.”
34 (ఈ లోగా అబ్‌షాలోం పరారీ అయ్యాడు.) కావలి వాడు దారిని చూస్తూ ఉంటే, అతడికి పడమరగా ఉన్న కొండ ప్రక్కన ఉన్న త్రోవలో చాలామంది రావడం కనిపించింది.
35 యోనాదాబు “ఇరుగో రాకుమారులు వస్తూ ఉన్నారు. మీ సేవకుడైన నేను చెప్పినట్టే జరిగింది” అని రాజుతో చెప్పాడు.
36 అతడు ఆ మాట చెప్పడంతోనే రాకుమారులు వచ్చి బాగా ఏడవసాగారు. రాజు, అతని సేవకులంతా కూడా కన్నీరు మున్నీరుగా ఏడ్చారు.
37 అబ్‌షాలోం పరారీ అయిపోయి అమీహూదు కొడుకూ, గెషూరుదేశం రాజూ అయిన తల్మయి దగ్గర చేరుకొన్నాడు. దావీదు ప్రతి రోజూ తన కొడుకుకోసం శోకిస్తూ ఉన్నాడు. 38 అబ్‌షాలోం పారిపోయి గెషూరుకు వెళ్ళిన తరువాత అక్కడ మూడు సంవత్సరాలు ఉండిపోయాడు. 39 దావీదురాజు అమ్నోను మృతి విషయం ఓదార్పు పొంది అబ్‌షాలోంను చూడాలని బెంగ పెట్టుకొన్నాడు.