12
1 అందుచేత యెహోవా నాతానును దావీదు దగ్గరికి పంపాడు. అతడు వచ్చి దావీదుతో ఇలా అన్నాడు: “ఒక ఊరిలో ఇద్దరు మనుషులు ఉన్నారు. ఒకడు ధనికుడు, మరొకడు దరిద్రుడు. 2 ధనికుడికి అనేక గొర్రెలూ గొడ్లూ ఉన్నాయి. 3 అయితే దరిద్రుడికి తాను కొన్న చిన్న ఆడ గొర్రెపిల్ల మాత్రమే ఉంది. ఇంకేమీ లేదు. అతడు దానిని పెంచుకొన్నాడు. అది అతడి దగ్గర, అతడి పిల్లల దగ్గర పెరుగుతూ అతడి చేతి ముద్దలు తింటూ అతడి గిన్నెలోనిది త్రాగుతూ అతడి కౌగిట పడుకొంటూ ఉంది. అది అతడికి కూతురులాగా ఉంది. 4 ఒక రోజు బాటసారి ఒకడు ధనికుడి దగ్గరికి వచ్చాడు. తన దగ్గరికి వచ్చిన బాటసారికోసం భోజనం సిద్ధం చేయడానికి ధనికుడు తన గొర్రెలలో గానీ పశువులలో గానీ ఒకదానిని తీసుకోవడానికి నిరాకరించాడు. దానికి బదులు అతడు ఆ దరిద్రుడి గొర్రెపిల్లను పట్టుకొని తన దగ్గరికి వచ్చినవాడికి దానిని సిద్ధం చేశాడు.”
5 దావీదు ఇది విని ఆ ధనికుడిమీద తీవ్ర కోపంతో మండి పడ్డాడు. “యెహోవా జీవంమీద ఆనబెట్టి చెప్తున్నాను, ఆ పని చేసినవాడు తప్పనిసరిగా చావుకు తగినవాడు! 6  జాలిలేక అలా చేసినందుచేత అతడు ఆ గొర్రెపిల్లకు మారుగా నాలుగు గొర్రెపిల్లల ధర ఆ దరిద్రుడికివ్వాలి” అని నాతానుతో చెప్పాడు.
7 నాతాను దావీదును చూస్తూ “నీవే ఆ మనిషివి! ఇస్రాయేల్ ప్రజల దేవుడు యెహోవా ఇలా అంటున్నాడు: ఇస్రాయేల్ ప్రజల మీద నేను నిన్ను రాజుగా నియమించాను. సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించాను. 8 నీ యజమాని ఇంటిని నీకు అప్పగించి అతడి స్త్రీలను నీ కౌగిట చేర్చాను. ఇస్రాయేల్ ప్రజనూ యూదా ప్రజనూ నీకు అప్పగించాను. ఇది చాలదని నీవు అనుకొని ఉంటే నేను ఇంకా ఎక్కువగా ఇచ్చి ఉండేవాణ్ణి. 9 యెహోవా దృష్టిలో చెడుగు చేయడంవల్ల నీవు యెహోవా వాక్కును ఎందుకు తృణీకరించావు? హిత్తివాడైన ఊరియాను కత్తి పాలయ్యేలా చేసి అతని భార్యను నీకు భార్యగా తీసుకొన్నావు. నీవు అమ్మోను వాళ్ళ ఖడ్గానికి అతణ్ణి గురి చేశావు, 10 గనుక నన్ను అలక్ష్యం చేసి హిత్తివాడైన ఊరియా భార్యను నీకు భార్యగా తీసుకొన్నావు, గనుక ఖడ్గం ఎప్పటికీ నీ ఇంటివారిమీద ఉండక మానదు. 11 యెహోవా చెప్పేదేమిటంటే, విను, నీ ఇంటివారి మూలంగానే నేను నీమీదికి విపత్తును రప్పిస్తాను. నీవు చూస్తూ ఉండగానే నేను నీ భార్యలను మరొకడి స్వాధీనం చేస్తాను. పట్టపగటిలో అతడు వారితో శయనిస్తాడు. 12 నీవు చేసినది రహస్యంగా చేశావు గాని నేను చెప్పినదానిని ఇస్రాయేల్‌వారి కళ్ళెదుటే, పట్టపగలే చేయిస్తాను.
13 అప్పుడు దావీదు నాతానుతో “నేను యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేశాను” అన్నాడు.
అందుకు నాతాను “యెహోవా నీ పాపాన్ని తొలగించాడు. నీవు చనిపోవు. 14 అయితే నీవు చేసినదానివల్ల యెహోవా యొక్క శత్రువులకు ఆయనను దూషించడానికి అవకాశం కలిగించావు, గనుక నీకు పుట్టిన కొడుకు తప్పక చస్తాడు” అని మారు చెప్పాడు.
15 నాతాను ఇంటికి వెళ్ళిన తరువాత ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. 16 దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. 17 ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. వారితో పాటు భోజనం చేయడానికి కూడా అతడు నిరాకరించాడు.
18 ఏడో రోజు ఆ శిశువు చనిపోయాడు. దావీదు సేవకులు “బిడ్డడు ప్రాణంతో ఉన్నప్పుడు మేము దావీదుతో మాట్లాడితేనే ఆయన వినలేదు. ఇప్పుడు, బిడ్డ చనిపోయాడని మనం ఆయనతో ఎట్లా చెప్పగలం? తనకు తాను హాని చేసుకొంటాడేమో” అని చెప్పుకొని శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు.
19 సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. 20 వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు.
21 అతని సేవకులు దావీదును చూచి “బిడ్డడు ప్రాణంతో ఉన్నప్పుడు మీరు ఉపవాసముండి ఏడుస్తూ ఉన్నారు. బిడ్డడు చనిపోతే మీరు లేచి భోజనం చేశారు. మీరెందుకు ఇలా మసులుకొంటున్నారు” అని అడిగారు.
22 అందుకు అతడు “బిడ్డడు ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. 23 ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తిరిగి రాడు” అని జవాబిచ్చాడు.
24 తరువాత దావీదు తన భార్య బత్‌షెబను ఓదార్చాడు. ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెతో శయనించాడు. కాల క్రమేణ ఆమె మగబిడ్డను కన్నది. దావీదు వాడికి సొలొమోను అని పేరు పెట్టాడు. 25 యెహోవా వాణ్ణి ప్రేమించాడు, వాడికి “యదీద్యా” అని పేరు పెట్టమని నాతాను ప్రవక్త ద్వారా చెప్పి పంపాడు.
26 ఇంతలో యోవాబు అమ్మోనువాళ్ళ పట్టణం రబ్బా మీద యుద్ధం చేసి రాజభవనాన్ని పట్టుకొన్నాడు. 27 యోవాబు మనుషులకు ఈ వార్తతో దావీదు దగ్గరికి పంపాడు:
“నేను రబ్బా మీద యుద్ధం చేసి దానికి నీళ్ళు సరఫరా చేసే పేటను పట్టుకొన్నాను. 28 ఇప్పుడు నీవు మిగతా సైనికులను సమకూర్చి వచ్చి ఈ పట్టణాన్ని పట్టుకో. లేకపోతే నేను దానిని పట్టుకోవాలి. అప్పుడు దానికి నా పేరు పెట్టబడుతుంది.”
29 దావీదు సైనికులందరినీ సమకూర్చి రబ్బాకు వెళ్ళి దాని మీద యుద్ధం చేసి దానిని పట్టుకొన్నాడు. 30 వాళ్ళ రాజు తల మీదనుండి కిరీటం తీశాడు. దాని బరువు సుమారు ముప్ఫయి నాలుగు కిలోగ్రాములు. అది విలువ గల రత్నాలు పొదిగినది. వారు దానిని దావీదు తల మీద పెట్టారు. దావీదు ఆ పట్టణంలో నుండి చాలా దోపిడీసొమ్ము పట్టుకుపోయాడు. 31 అక్కడి వాళ్ళను బయటికి తెప్పించి రంపాలతో పదును గల ఇనుప పనిముట్లతో, గొడ్డండ్లతో పని చేసేలా ఇటికలు చేసేలా దావీదు చేశాడు. అమ్మోను వాళ్ళ పట్టణాలన్నిటికీ అతడు ఆ విధంగా చేశాడు. తరువాత దావీదు సైన్యమంతా తిరిగి జెరుసలంకు వచ్చారు.