11
1 అది వసంత రుతువు, రాజులు యుద్ధానికి బయలుదేరే కాలం. దావీదు యోవాబునూ తన మనుషులనూ ఇస్రాయేల్ సైన్యమంతటినీ అమ్మోనువాళ్ళ దేశానికి పంపాడు. వారు అమ్మోనువాళ్ళను చాలామందిని హతమార్చి రబ్బాను ముట్టడించారు. అయితే దావీదు వెళ్ళక జెరుసలంలోనే ఉండిపోయాడు. 2 ఒకసారి సాయంకాల సమయంలో దావీదు పడకమీద నుంచి లేచి రాజభవనం మిద్దెమీద పచార్లు చేయసాగాడు. అక్కడ నుంచి చూస్తూ ఉంటే అతనికి ఒక స్త్రీ కనిపించింది. ఆమె స్నానం చేస్తూ ఉంది. ఆమె చాలా అందకత్తె. 3 ఆమెను గురించి తెలుసుకోవాలని దావీదు ఒక మనిషిని పంపాడు. అతడు “ఆమె ఏలీయాం కూతురు బత్‌షెబ. ఆమె హిత్తివాడైన ఊరియా భార్య” అని తెలియజేశాడు. 4  ఆమెను తీసుకురావడానికి దావీదు మనుషులను పంపాడు. ఆమె అతనిదగ్గరికి వచ్చింది. అతడు ఆమెతో శయనించాడు. తరువాత ఆమె అశుద్ధత నుంచి తనను శుద్ధి చేసుకొని ఇంటికి తిరిగి వెళ్ళింది. 5 ఆ స్త్రీ గర్భవతి అయింది. “నేను గర్భవతినయ్యాను” అని ఆమె దావీదుకు కబురు పంపింది.
6 దావీదు “హిత్తివాడైన ఊరియాను నాదగ్గరికి పంపించు” అని యోవాబుకు కబురు పంపాడు. యోవాబు అతణ్ణి దావీదు దగ్గరికి పంపాడు.
7 ఊరియా వచ్చినప్పుడు దావీదు “యోవాబు, సైనికులు క్షేమంగా ఉన్నారా? యుద్ధ సమాచారం ఏమిటి?” అని అడిగాడు.
8 తరువాత దావీదు “ఇంటికి వెళ్ళి సేద తీర్చుకో” అని ఊరియాకు సెలవిచ్చాడు.
ఊరియా రాజభవనంనుంచి వెళ్ళాడు. అతని వెనుక రాజు కానుకను అతని దగ్గరికి పంపించాడు. 9 అయితే ఊరియా తన ఇంటికి వెళ్ళలేదు. తన యజమాని పనివారందరితోపాటు రాజభవన ద్వారం దగ్గర నిద్రపోయాడు. 10 ఊరియా ఇంటికి వెళ్ళలేదని దావీదు విని ఊరియాను పిలిపించి “నీవు ప్రయాణం చేసి వచ్చావు గదా. ఇంటికి వెళ్ళలేదేం?” అని అడిగాడు.
11 అందుకు ఊరియా దావీదుతో ఇలా చెప్పాడు: “మందసం, ఇస్రాయేల్‌వారు, యూదావారు డేరాలలో ఉంటున్నారు. నా అధిపతి యోవాబు, నా యజమాని మనుషులు బయట శిబిరంలో ఉన్నారు. భోజన పానాలు చేయడానికీ నా భార్యతో పడుకోవడానికీ నేను ఇంటికి వెళ్తానా? నేను ఆ విధంగా చేయనే చేయనని నీమీద నీ ప్రాణంమీద ఆనబెట్టి చెపుతున్నాను.”
12 దావీదు “ఈరోజు కూడా నీవు ఇక్కడుండు. రేపు నేను నిన్ను పంపివేస్తాను” అని ఊరియాతో చెప్పాడు. గనుక ఊరియా ఆ రోజు జెరుసలంలో ఉండిపోయాడు.
13 మరుసటి రోజు దావీదు అతణ్ణి భోజనానికి పిలిచాడు. అతడు దావీదుతో కూడా భోజనపానాలు చేస్తూ ఉంటే దావీదు అతనికి మత్తెక్కేలా చేశాడు. అయినా సాయంకాల సమయంలో అతడు ఇంటికి వెళ్ళలేదు. భవనంనుంచి వెళ్ళి తన యజమాని పనివారి మధ్య పడక మీద పడుకొన్నాడు.
14 ఉదయాన దావీదు యోవాబుకు ఉత్తరం వ్రాసి ఊరియా చేత పంపించాడు. 15 ఉత్తరంలో ఇలా వ్రాశాడు: “యుద్ధం ఎక్కడ ఎక్కువ తీవ్రంగా జరుగుతూ ఉందో ఆ స్థలంలో ఉరియాను ముందు పెట్టు. అప్పుడు అతడు దెబ్బ తిని చనిపోయేలా నీవు అతడి దగ్గరనుండి వెనక్కు తిరుగు.”
16 రబ్బా పట్టణాన్ని యోవాబు ఇంకా ముట్టడిస్తూ ఉన్నాడు. శత్రు వీరులున్న స్థలాన్ని గుర్తించి అతడు ఊరియాను అక్కడే ఉంచాడు.
17 ఆ పట్టణం మనుషులు బయటికి వచ్చి యోవాబుతో యుద్ధం చేసినప్పుడు దావీదు మనుషుల్లో కొంతమంది హతమయ్యారు. హిత్తివాడు ఊరియా కూడా మృతి చెందాడు.
18 యోవాబు దావీదుకు యుద్ధ సమాచారమంతా చెప్పి పంపాడు.
19 అతడు వార్తాహరుడికి ఆదేశం ఇచ్చాడు: “యుద్ధ సమాచారం నీవు రాజుతో చెప్పాక ఒక వేళ రాజు కోపంతో మండిపడి ఈ విధంగా చెప్పవచ్చు: 20 ‘యుద్ధంలో పట్టణానికి అంత దగ్గరికి మీరెందుకు వెళ్ళారు? గోడల మీదనుంచి బాణాలు వేస్తారని మీకు తెలియదా? 21 యెరుబెషెతు కొడుకైన అబీమెలెకు ఎలాగు హతమయ్యాడు? ఒక స్త్రీ మీది తిరుగటిరాయి ఎత్తి గోడమీద నుంచి అతడిపై వేసినందుకే గదా. అతడు తేబేసులో చనిపోయాడు. మీరు గోడదగ్గరికి ఎందుకు వెళ్ళారు?’ అని రాజు నిన్ను ఆ విధంగా అడిగితే నీవు ఆయనతో ‘మీ సేవకుడూ హిత్తివాడూ అయిన ఊరియా కూడా మరణమయ్యాడు’ అని చెప్పు.”
22 ఆ మనిషి వెళ్ళి యోవాబు పంపించిన సమాచార మంతా దావీదుకు తెలియజేశాడు. 23 “ఆ పట్టణంవాళ్ళు మమ్మల్ని ఓడిస్తూ మమ్మల్ని ఎదుర్కోవడానికి బయటికి వన్తూ ఉంటే, మేము వాళ్ళను ముఖ్య ద్వారంవరకు మళ్ళీ వెళ్ళగొట్టాం. 24 అప్పుడు గోడమీదనుంచి విలుకాండ్రు మీ సేవకులమీద బాణాలు వేశారు. రాజు మనుషులలో కొంతమంది చనిపోయారు. మీ సేవకుడూ హిత్తివాడూ అయిన ఊరియా కూడా మరణమయ్యాడు” అన్నాడు.
25 వార్త తెచ్చినవాడితో దావీదు “నీవు యోవాబుతో ఇలా చెప్పు: ఈ సంగతి వల్ల నీవు కంగారుపడకు. ఖడ్గం ఒకసారి ఒక వ్యక్తిని చంపుతుంది, మరోసారి మరో వ్యక్తిని చంపుతుంది. పట్టణం మీద యుద్ధం ఇంకా తీవ్రంగా జరిగించి దాన్ని నాశనం చెయ్యి. అలా చెప్పి యోవాబును ధైర్యపరచు” అన్నాడు.
26 తన భర్త చనిపోయిన సంగతి విని ఊరియా భార్య తన భర్త కోసం విలపించింది. 27 విలాప కాలం తీరిన తరువాత దావీదు మనుషులను పంపి ఆమెను తన భవనానికి తెప్పించుకొన్నాడు. ఆమె అతనికి భార్య అయి అతనికొక మగ బిడ్డను కన్నది. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టిలో చెడుగుగా ఉంది.