6
1 ✝తరువాత దావీదు ఇస్రాయేల్‌వారిలో ముప్ఫయి వేలమంది శూరులను సమకూర్చాడు, యూదాప్రదేశంలో ఉన్న బయలా✽కు బయలుదేరాడు. 2 అక్కడ దేవుని ఒడంబడికపెట్టె✽ ఉంది. కెరూబుల మధ్య ఆసీనుడుగా ఉన్న సేనలప్రభువు యెహోవా అనే పేరు పెట్టబడ్డ ఆ మందసాన్ని అక్కడనుంచి తీసుకురావాలని దావీదు, అతని మనుషులందరూ వెళ్ళారు. 3 ✽వారు దేవుని మందసాన్ని క్రొత్త బండిమీద ఎక్కించి కొండమీద ఉన్న అబీనాదాబు ఇంటినుంచి బయలుదేరారు. దేవుని మందసం ఉన్న ఆ క్రొత్త బండిని కొండమీద ఉన్న అబీనాదాబు ఇంటినుంచి తీసుకువస్తూ ఉన్నప్పుడు 4 అబీనాదాబు కొడుకులు ఉజ్జా, అహియో దానిని తోలుతూ ఉన్నారు. అహియో దాని ముందర నడుస్తున్నాడు. 5 ✝దావీదు, ఇస్రాయేల్‌వారంతా దేవదారు మ్రానుతో తయారైన వేరువేరు తంతి వాద్యాలను, కంజరీలను, మృదంగాలను తాళాలను వాయిస్తూ యెహోవా సన్నిధానంలో సంబరపడుతూ ఉన్నారు. 6 నాకోను కళ్ళం దగ్గరికి వచ్చినప్పుడు ఎద్దులకు కాలు జారింది. వెంటనే ఉజ్జా చెయ్యి చాపి దేవుని మందసాన్ని పట్టుకొన్నాడు✽. 7 ఆ అక్రమ కార్యానికి యెహోవా ఉజ్జామీద తీవ్రంగా కోపగించుకొన్నాడు. అక్కడే దేవుడు అతణ్ణి మొత్తాడు✽. అతడు దేవుని మందసందగ్గర పడి చనిపోయాడు. 8 ✽యెహోవా ఉజ్జాను నాశనం చేసినందుకు దావీదు పరితపించి ఆ స్థలానికి “పెరెజ్ ఉజ్జా✽” అని పేరు పెట్టాడు. ఈ రోజువరకు దానికి అదే పేరు. 9 ✽ఆ రోజు దావీదు యెహోవాకు భయపడి “యెహోవా పెట్టె నా దగ్గరికి ఏ విధంగా వస్తుంది?” అనుకొన్నాడు. 10 అప్పుడు యెహోవా పెట్టెను దావీదు నగరానికి తనతో కూడా తీసుకువెళ్ళ కూడదని నిశ్చయించుకొన్నాడు. దానికి బదులుగా అతడు దారిప్రక్కన గాత్‌వాడైన ఓబేద్‌ఎదోం ఇంటికి దానిని తీసుకుపోయాడు. 11 యెహోవా పెట్టె మూడు నెలలు గాత్‌వాడు ఓబేద్‌ఎదోం ఇంటిలో ఉండిపోయింది. యెహోవా ఆశీస్సులు అతడిమీదకీ, అతడి ఇంటివారందరి మీదకీ వచ్చాయి.12 “దేవుని మందసం ఉండడంవల్ల యెహోవా ఆశీస్సులు ఓబేద్‌ఎదోం ఇంటివాళ్ళమీద, అతడికి చెందిన దానినంతటి మీద వచ్చాయి” అని ఎవరో దావీదుకు తెలియజేశారు. అందుచేత దావీదు వెళ్ళి దేవుని మందసాన్ని ఓబేద్‌ఎదోం ఇంటిలో నుంచి దావీదు నగరానికి✽ సంతోషంతో తీసుకు వచ్చాడు. 13 యెహోవా పెట్టెను మోస్తూఉండేవారు ఆరేసి అడుగులు వేసిన తరువాత దావీదు ఒక ఎద్దునూ ఒక క్రొవ్విన దూడనూ బలిగా అర్పించాడు. 14 ✽నారతో నేసిన ఏఫోదును తొడుగుకొని బలంకొద్ది యెహోవా సన్నిధానంలో నాట్యం చేస్తూ ఉన్నాడు. 15 ఈ విధంగా దావీదు, ఇస్రాయేల్‌వారంతా ఆనంద ధ్వనులతో, బాకానాదాలతో యెహోవా మందసాన్ని తీసుకువచ్చారు.
16 యెహోవా మందసం దావీదు నగరంలోకి వస్తూ ఉంటే సౌలు కూతురు మీకాల్✽ కిటికీలోనుంచి చూస్తూ ఉంది. యెహోవా సన్నిధానంలో దావీదు గంతులు వేస్తూ నాట్యం చేస్తూ ఉండడం ఆమె చూచి అతణ్ణి ఏవగించుకొంది. 17 వారు యెహోవా మందసాన్ని తీసుకువచ్చి దానికోసం దావీదు వేసిన గుడారంలో దాని స్థలంలో ఉంచారు. అప్పుడు దావీదు హోమ బలులు✽ శాంతిబలులు యెహోవా సన్నిధానంలో అర్పించాడు. 18 ✝హోమబలులు శాంతిబలులు అర్పించిన తరువాత సేనలప్రభువు యెహోవా పేర దావీదు ప్రజలను దీవించాడు. 19 అప్పుడతడు ఇస్రాయేల్‌ప్రజల సమూహంలో ప్రతి పురుషుడికీ ప్రతి స్త్రీకీ ఒక రొట్టెనూ అంజూరుపండ్ల అడ ఒకదానినీ ఎండిన ద్రాక్షపండ్ల అడ ఒకదానినీ ఇచ్చాడు. ప్రజలంతా ఎవరి ఇండ్లకు వారు వెళ్ళిపోయారు.
20 తన ఇంటివారిని దీవించడానికి దావీదు ఇంటికి తిరిగి చేరుకొన్నప్పుడు సౌలు కూతురు మీకాల్ అతణ్ణి ఎదుర్కోవడానికి బయలుదేరి వచ్చి ఇలా అంది: “ఇస్రాయేల్ ప్రజల రాజు ఇవ్వేళ ఎంత ఘనంగా ప్రవర్తించాడు! మీ సేవకులు పనికత్తెలు చూస్తూ ఉంటే నీచుడిలాగా మీ బట్టలు✽ విప్పివేశారు!”
21 దావీదు మీకాల్‌తో అన్నాడు “నేను యెహోవా సన్నిధానంలో✽ నాట్యం చేశాను. ఆయన నీ తండ్రినీ అతడి సంతానాన్నీ విసర్జించి తన ఇస్రాయేల్‌ప్రజలమీద పరిపాలకుడుగా నన్ను ఎన్నుకొని నియమించాడు. నేను యెహోవా సమక్షంలో సంబరపడతాను. 22 అంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకారానికి గురి అయి నా దృష్టికి నేను అల్పుడినవుతాను. అయితే నీవు చెప్పిన పనికత్తెలు నన్ను గౌరవిస్తారు.”
23 చనిపోయేంతవరకు సౌలు కూతురు మీకాల్‌కు పిల్లలు పుట్టలేదు.