7
1 ✝నలుదిక్కుల ఉన్న శత్రువుల మీద యెహోవా విజయం ఇచ్చి రాజుకు నెమ్మది కలిగించాడు. రాజు తన భవనంలో కాపురం చేశాడు.2 తరువాత రాజు నాతాను✽ ప్రవక్తతో “ఇదిగో, నేను దేవదారు మ్రానుతో కట్టిన భవనంలో కాపురముంటున్నాను. గానీ దేవుని మందసం డేరా✽లో ఉంది” అన్నాడు.
3 ✽అందుకు నాతాను “యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, గనుక నీ మనసులో ఉన్నదంతా నెరవేర్చు” అని రాజుతో చెప్పాడు.
4 ✽✽అయితే ఆ రాత్రి యెహోవానుంచి నాతానుకు ఈ వాక్కు వచ్చింది: 5 “నీవు వెళ్ళి నా సేవకుడు దావీదుతో ఇలా చెప్పు: యెహోవా చెప్పేదేమిటంటే, నాకు నివాసంగా ఒక మందిరాన్ని కట్టిస్తావా? 6 ఈజిప్ట్‌నుంచి నేను ఇస్రాయేల్‌ప్రజలను తీసుకువచ్చిన రోజునుంచి ఈ రోజువరకు మందిరంలో నివసించలేదు. గుడారాన్ని నా నివాసంగా చేసి ప్రయాణాలు చేశాను. 7 ఇస్రాయేల్ ప్రజలందరితో కూడా ప్రయాణం చేస్తూ ఉన్న తావులలో, నా ప్రజకు కాపరులుగా ఉండమని నేను ఆజ్ఞాపించిన నాయకులలో ఎవరినైనా చూచి ‘నా కోసం దేవదారు మ్రానులతో మందిరాన్ని ఎందుకు కట్టించలేదు?’ అని అడిగానా?
8 “ఇప్పుడు నీవు నా సేవకుడైన దావీదుతో ఇలా చెప్పాలి: సేనలప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే, నీవు నా ప్రజ ఇస్రాయేల్‌వారికి నాయకుడుగా ఉండాలని గొర్రెలను మేపే నిన్ను పచ్చిక మైదానాలనుంచి రప్పించాను. 9 నీవు ఎక్కడికి వెళ్ళినా నేను నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నీ ఎదుట లేకుండా నాశనం చేశాను. ఇప్పుడు నీ పేరును లోకంలో ఉన్న మహా ఘనుల పేర్లలాగా చేస్తాను. 10 నా ఇస్రాయేల్‌ప్రజలకోసం ఒక స్థలం ఏర్పరచి అందులో వారిని నాటుతాను. వారు ఇంకా కదలకుండా తమ స్వస్థలంలోనే ఉంటారు. 11 మునుపు జరిగినట్టు – నా ఇస్రాయేల్‌ప్రజల మీద నేను నాయకులను నియమించిన కాలంనుంచి జరిగినట్టు – ఇకమీదట దుర్మార్గులు బాధించరు✽. నీ శత్రువులందరిమీదా నీకు✽ విజయం ఇచ్చి నీకు నెమ్మది కలిగిస్తాను. అంతేకాక, యెహోవా నీకు రాజవంశాన్ని స్థాపిస్తాడని యెహోవా తానే నీతో చెపుతున్నాడు. 12 నీ కాలమైపోయి నీవు నీ పూర్వీకులదగ్గర విశ్రమించేటప్పుడు నీకు పుట్టిన నీ సంతానాన్ని✽ నీ స్థానంలో ఉంచి అతడి రాజ్యాన్ని సుస్థిరం చేస్తాను. 13 ✽ అతడే నా పేరుకు మందిరం కట్టిస్తాడు. నేను అతడి రాజ్యసింహాసనాన్ని✽ శాశ్వతంగా✽ స్థాపిస్తాను. 14 నేను అతడికి తండ్రిగా ఉంటాను. అతడు నాకు కుమారుడుగా ఉంటాడు. అతడు మూర్ఖంగా ప్రవర్తిస్తే నేను మనుషుల✽ దండంతో, మనుషుల దెబ్బలతో అతణ్ణి శిక్షిస్తాను✽. 15 నీ ముందు నేను తొలగించిన సౌలు✽కు నా అనుగ్రహం నేను దూరం చేసినట్టు అతనికి దూరం చేయను. 16 నా ఎదుట నీ రాజవంశం, నీ రాజ్యం ఎప్పటికీ✽ సుస్థిరంగా ఉంటాయి. నీ సింహాసనం శాశ్వతంగా నిలిచి ఉంటుంది.”
17 దైవ దర్శనంలో వచ్చిన ఈ మాటలన్నీ నాతాను దావీదుకు తెలియజేశాడు. 18 అప్పుడు దావీదురాజు లోపలికి వెళ్ళి యెహోవా సన్నిధానంలో కూర్చుని ఇలా ప్రార్థన చేశాడు:
ప్రభువైన దేవా! ఇంతటి పైస్థితికి నీవు నన్ను తేవడానికి నేను ఎంతటివాణ్ణి✽? నా వంశం ఏపాటిది? 19 ప్రభువైన దేవా! ఇది నీ దృష్టిలో స్వల్ప విషయం. నీవు నీ సేవకుడైన నా వంశం భవిష్యత్తును గురించి తెలియజేశావు. ప్రభువైన దేవా! నీవు మనిషిపట్ల ఇలా వ్యవహరించడం మామూలు విషయమా? 20 ✝దావీదు నీతో ఇంకేం చెప్పగలడు? నీ దాసుడైన నేను నీకు తెలుసు కదా. 21 ప్రభువైన దేవా! నీ వాక్కు✽కోసం నీ చిత్తానుసారంగా ఈ గొప్ప క్రియ చేశావు, నీ దాసుడైన నాకు దానిని తెలియజేశావు. 22 యెహోవాదేవా! నీవు అత్యంత మహత్తుగలవాడివి! మా చెవులు విన్నదంతా నిజం. నీవంటివాడెవ్వడూ లేడు✽. నీవు తప్ప మరే దేవుడూ లేడు. 23 ✝లోకం అంతట్లో నీ ఇస్రాయేల్‌ప్రజలాంటి జనం ఏదీ లేదు గదా. నీవు నీ ప్రజను ఈజిప్ట్‌దేశంనుంచీ ఇతర జనాల వశంనుంచీ దేవుళ్ళ దగ్గరనుంచీ విడిపించావు. నీ కోసం ఈ ప్రజను విమోచించడానికీ పేరు ప్రతిష్ఠలు సంపాదించు కోవడానికీ నీ దేశంకోసం నీ ప్రజల ఎదుట మహా భయంకర క్రియలు చేయడానికీ నీవు బయలుదేరావు. 24 ✽ నీ ఇస్రాయేల్ ప్రజను ఎల్లకాలం నీ సొంత ప్రజగా ఉండేలా చేశావు. యెహోవా, నీవే వారికి దేవుడివయ్యావు.
25 “యెహోవాదేవా! నీ దాసుడైన నా విషయం, నా వంశం విషయం నీవు చేసిన వాగ్దానం ఎల్లకాలం స్థిరమయ్యేలా చెయ్యి. 26 నీ పేరుకు శాశ్వతంగా ఘనత చేకూరేలా నీవు చెప్పినట్టు చెయ్యి. అప్పుడు మనుషులు ‘సేనలప్రభువు యెహోవా ఇస్రాయేల్‌ప్రజల దేవుడు’ అంటారు. నీ దాసుడైన దావీదు వంశం నీ ఎదుట సుస్థిరమవుతుంది. 27 ✽ఇస్రాయేల్ ప్రజల దేవా! సేనలప్రభువు యెహోవా! నా కోసం రాజవంశాన్ని స్థాపిస్తావని నీవు నీ దాసుడైన నాకు తెలియజేశావు. కనుక నీ సన్నిధానంలో ఇలా ప్రార్థన చేయడానికి నీ దాసుడైన నాకు ధైర్యం కలిగింది. 28 ప్రభువైన దేవా! నీవే దేవుడివి. నీ దాసుడైన నాకు ఈ మంచి వాగ్దానం చేశావు. నీ మాటలు నమ్మకమైనవి✽. 29 దయచేసి నీ దాసుడైన నా వంశం ఎల్లకాలం నీ సన్నిధానంలో నిలిచి ఉండేలా దానిని దీవించు. ప్రభువైన దేవా! నీవు మాట ఇచ్చావు. నీ దీవెన✽తో నా వంశం ఎల్లకాలం ధన్యం అవుతుంది.”