5
1 ఇస్రాయేల్ ప్రజల అన్ని గోత్రాలవారు✽ హెబ్రోనులో దావీదు దగ్గరికి వచ్చి ఇలా అన్నారు:“మేము మీకు సన్నిహిత బంధువులం. 2 ✽ మునుపు సౌలు ఇంకా మమ్మల్ని పరిపాలిస్తున్నప్పుడు దండయాత్రలలో ఇస్రాయేల్ వారిని నడిపించినది మీరే. యెహోవా నా ఇస్రాయేల్ ప్రజలకు నీవు కాపరిగా ఉంటావు, వారి మీద పరిపాలకుడుగా ఉంటావు అని మీతో చెప్పాడు గదా.”
3 ✝ఇస్రాయేల్ ప్రజల పెద్దలందరూ హెబ్రోనులో దావీదురాజు దగ్గరకు వచ్చిన తరువాత అక్కడ యెహోవా సన్నిధానంలో రాజు వారితో ఒడంబడిక చేశాడు. అప్పుడు వారు దావీదును ఇస్రాయేల్ ప్రజల మీద రాజుగా అభిషేకించారు. 4 దావీదు రాజైనప్పుడు అతని వయసు ముప్ఫయి✽ సంవత్సరాలు. అతడు నలభై సంవత్సరాలు పరిపాలించాడు. 5 హెబ్రోనులో అతడు యూదావారిమీద ఏడు సంవత్సరాలు ఆరు నెలలు పరిపాలించాడు. జెరుసలంలో ఇస్రాయేల్, యూదాల ప్రజలందరిమీదా ముప్ఫయి మూడు సంవత్సరాలు పరిపాలించాడు.
6 ✽ యోబూసిజాతి వాళ్ళు జెరుసలంలో కాపురం ఉన్నప్పుడు వాళ్ళ పై పడడానికి దావీదు, అతని మనుషులు అక్కడికి వెళ్ళారు. యెబూసివాళ్ళు “దావీదు లోపలికి రాలేడు” అను కొని దావీదుతో “నీవు లోపలికి రాలేవు. ఇక్కడి గుడ్డివాళ్ళూ కుంటివాళ్ళూ కూడా నిన్ను తోలివేయగలరు” అన్నారు.
7 అయినా దావీదు, కోట ఉన్న సీయోనును స్వాధీనం చేసుకొన్నాడు. అది దావీదు నగరం.
8 ✝ఆ రోజు దావీదు “దావీదుకు అసహ్యంగా ఉన్న ఆ ‘గుడ్డివాళ్ళ’ పై ‘కుంటివాళ్ళ’ పై పడి యెబూసివాళ్ళను ఎవరైనా ఓడించాలంటే నీటి కాలువగుండా పైకి వెళ్ళాలి” అన్నాడు.
అందుచేత ‘గుడ్డివాళ్ళు’, ‘కుంటివాళ్ళు’ భవనంలో అడుగు పెట్టకూడదంటారు. 9 దావీదు కోట ఉన్న ఆ స్థలంలో కాపురమేర్పరచుకొని దానికి ‘దావీదు నగరం’ అనే పేరు పెట్టాడు. కోటనుంచి లోపలికి, చుట్టూరా ఉన్న స్థలమంతటిలో నగరాన్ని కట్టించాడు. 10 సేనలప్రభువు యెహోవా✽ అతనికి తోడుగా✽ ఉన్నాడు, గనుక దావీదు గొప్ప అభివృద్ధి పొందుతూ వచ్చాడు.
11 ✝తూరు నగరం రాజైన హీరాం✽ రాయబారులను దావీదు దగ్గరికి పంపాడు. వాళ్ళతోకూడా దేవదారు మ్రానులనూ వడ్రంగులనూ తాపీ పనివాళ్ళనూ పంపాడు. వాళ్ళు దావీదుకోసం భవనాన్ని కట్టారు. 12 ✽ఇస్రాయేల్ ప్రజలమీద యెహోవా తనను రాజుగా స్థిరపరచాడనీ దావీదు గ్రహించాడు.
13 ✽దావీదు హెబ్రోనునుంచి వచ్చిన తరువాత జెరుసలంలో ఇంకా కొంతమంది ఉంపుడుకత్తెలనూ భార్యలనూ చేసు కొన్నాడు. అతనికి ఇంకా కొంతమంది కొడుకులూ కూతుళ్ళూ జన్మించారు. 14 జెరుసలంలో అతనికి జన్మించినవాళ్ళ పేర్లు ఇవి: షమ్మూవ, శోబాబు, నాతాను, సొలొమోను, 15 ఇభారు, ఎలీషూవ, నెపెగు, యాఫీయ, 16 ఎలీషామా, ఎల్యాదా, ఎలీపెలెటు.
17 ప్రజలు ఇస్రాయేల్ మీద దావీదును రాజుగా అభిషేకం చేశారని ఫిలిష్తీయవాళ్ళు విన్నప్పుడు అతణ్ణి పట్టుకోవడానికి వాళ్ళంతా దండెత్తి వచ్చారు. అది విని దావీదు తన భద్రమైన స్థలా✽నికి వెళ్ళాడు. 18 ఫిలిష్తీయవాళ్ళు వచ్చి రెఫాయిం లోయలో వ్యాపించారు.
19 ✝దావీదు “నేను వెళ్ళి ఫిలిష్తీయవాళ్ళ పై పడాలా? నీవు వాళ్ళను నా వశం చేస్తావా?” అని యెహోవాను ప్రార్థించాడు. అందుకు యెహోవా “వెళ్ళు. నేను వాళ్ళను నీ వశం చేసితీరుతాను” అని జవాబిచ్చాడు.
20 అందుచేత దావీదు బయల్ పెరాజీంకు వెళ్ళి వాళ్ళను ఓడించాడు. అప్పుడు దావీదు “వరదలు కొట్టుకుపోయే విధంగా యెహోవా నా శత్రువులను నా ఎదుట నాశనం చేశాడు” అని చెప్పాడు. కనుకనే ఆ స్థలాన్ని ‘బయల్ పెరాజీం✽’ అంటారు. 21 ✽అక్కడ ఫిలిష్తీయవాళ్ళు తమ విగ్రహాలను విడిచిపెట్టి పారిపోయారు. దావీదు, అతని మనుషులు వాటిని తీసుకువెళ్ళారు.
22 మరోసారి ఫిలిష్తీయవాళ్ళు వచ్చి రెఫాయిం లోయలో వ్యాపించారు. 23 దావీదు యెహోవాను సంప్రదించినప్పుడు✽ యెహోవా “నీవు తిన్నగా వెళ్ళవద్దు. చుట్టు తిరిగి వాళ్ళ వెనక్కు వెళ్ళి కంబళి చెట్లకు ఎదురుగా వాళ్ళ పైబడు. 24 కంబళి చెట్ల కొనలలో అడుగుల చప్పుడు వినగానే త్వరగా ముందుకు సాగు. ఫిలిష్తీయ సైన్యాన్ని హతం చేయడానికి యెహోవా నీ ముందు బయలు దేరుతున్నాడన్న✽మాట” అని జవాబిచ్చాడు.
25 ✽యెహోవా ఆజ్ఞాపించినట్టే దావీదు చేసి గెబనుంచి గెజెరు వరకు ఫిలిష్తీయవాళ్ళను తరుముతూ హతం చేశాడు.