4
1 హెబ్రోనులో అబ్నేర్ చనిపోయాడని సౌలు కొడుకు ఇష్‌బోషెతు విన్నప్పుడు అతడికి ధైర్యం లేకపోయింది. ఇస్రాయేల్ వారంతా కంగారుపడ్డారు. 2 సౌలు కొడుకుకు దోపిడీదారుల గుంపుల అధిపతులు ఇద్దరు ఉన్నారు. ఒకడి పేరు బయనా, మరోవాడి పేరు రేకాబు. వాళ్ళు బెన్యామీను గోత్రంవాడూ బేరోతు పురవాసీ అయిన రిమ్మోను కొడుకులు. బేరోతు బెన్యామీనుగోత్రానికి చెందేదని ప్రజలు ఎంచుతారు. 3 బేరోతు పురవాసులు గిత్తయీంకు పారిపోయి, ఈ రోజువరకు అక్కడ కాపురమున్నారు.
4 (సౌలు కొడుకైన యోనాతానుకు కుంటి వాడైన కొడుకు ఉండేవాడు. యెజ్రేల్‌నుంచి సౌలు యోనాతానులను గురించిన వార్త వచ్చినప్పుడు వాడి వయసు అయిదు సంవత్సరాలు. వాడి దాది వాణ్ణి ఎత్తుకొని తొందరగా పారిపోతూవుంటే వాడు పడి కుంటివాడయ్యాడు వాడిపేరు మెఫీబోషెతు.)
5 బేరోతువాడైన రిమ్మోను కొడుకులు రేకాబు, బయనాలు మంచి ఎండవేళ ఇష్‌బోషెతు ఇంటికి బయలుదేరి వెళ్ళారు. మధ్యాహ్న కాలంలో ఇష్‌బోషెతు పడకమీద పడుకొని ఉన్నప్పుడు వాళ్ళు అక్కడికి చేరుకొన్నారు. 6 గోధుమలు తేవలసి ఉన్నట్టు నటించి వాళ్ళు ఇంటిలో చొచ్చి ఇష్‌బోషెతు పడకగదిలో మంచం పై పడుకొని ఉండగానే అతణ్ణి కడుపులో పొడిచారు. 7 రేకాబు, అతడి తోబుట్టువు బయనా అతణ్ణి పొడిచి చంపిన తరువాత అతడి తలను ఛేదించి తప్పించుకు పోయారు. అతడి తలను తీసుకొని రాత్రి అంతా అరాబా లోయ మీదుగా ప్రయాణం చేశారు. 8 హెబ్రోనులో ఉన్న దావీదు దగ్గరికి ఇష్‌బోషెతు తలను తీసుకువచ్చి వాళ్ళు ఇలా అన్నారు:
“ఇదిగో, సౌలు కొడుకూ మీ శత్రువూ అయిన ఇష్‌బోషెతు తల! అతడు మీ ప్రాణం తీయడానికి చూచినవాడు గదా. ఇవ్వేళ యెహోవా మా యజమాని అయిన రాజు పక్షంగా సౌలుకూ అతడి సంతానానికీ ప్రతీకారం చేశాడు”.
9 బేరోతువాడైన రిమ్మోను కొడుకులు రేకాబు, బయనాలతో దావీదు ఇలా అన్నాడు: “శుభవార్త తెస్తున్నాను అనుకొని ఒక వ్యక్తి నాదగ్గరికి వచ్చి ‘సౌలు చనిపోయాడ’ని తెలియజేసినప్పుడు వాణ్ణి పట్టుకొని సిక్లగులో చంపించాను. 10 వాడు తెచ్చిన వార్తకు నేను ఇచ్చిన బహుమానం అదే! 11 మీకు నేను మరీ నిశ్చయంగా అలా చేస్తాను. మీరు దుర్మార్గులు. మీరు నిరపరాధిని అతడి సొంత ఇంటిలో అతడి పడకమీదే చంపారు. అతని పట్ల మీరు చేసిన రక్తపాతానికి నేను మిమ్మల్ని తుడిచివేయకూడదా? లోకంలో లేకుండా మిమ్మల్ని తుడిచివేయ కూడదా? అలా చేస్తానని అన్ని ఆపదల్లోనుంచి నన్ను రక్షించిన యెహోవా జీవంమీద ఆనబెట్టి చెపుతున్నాను.”
12 అప్పుడు దావీదు తన మనుషులకు ఆజ్ఞ జారీ చేశాడు. వారు రేకాబునూ బయనానూ చంపి వాళ్ళ చేతులనూ కాళ్ళనూ నరికివేసి వాళ్ళ శవాలను హెబ్రోను కొలను దగ్గర వ్రేలాడ కట్టారు. తరువాత వారు ఇష్‌బోషెతు తలను తీసుకువెళ్ళి హెబ్రోనులో అబ్నేర్ సమాధిలో పాతి పెట్టారు.