3
1 సౌలు వంశంవారికీ దావీదు వంశంవారికీ యుద్ధం చాలా కాలం జరిగింది. క్రమేణ దావీదు బలం ఎక్కువ అవుతూ ఉంది, సౌలు వంశంవారి బలం తక్కువ అవుతూ ఉంది, 2 హెబ్రోనులో దావీదుకు కొడుకులు పుట్టారు. అతనికి మొదట పుట్టినవాడు యెజ్రేల్‌పట్టణస్తురాలు అహీనోయం కన్న అమ్నోను. 3 రెండోవాడు కిల్యాబు. మునుపు కర్మెల్‌వాడైన నాబాల్‌కు భార్యగా ఉన్న అబీగేల్ అతణ్ణి కన్నది. మూడోవాడు అబ్‌షాలోం. గెషూరువాళ్ళ రాజైన తల్మయి కూతురు మయకా అతణ్ణి కన్నది. 4 నాలుగోవాడు అదోనీయా. అతడి తల్లి హగ్గీతు. అయిదోవాడు షేఫట్య. అతడి తల్లి అబీటల్. 5 ఆరోవాడు ఇత్రెయాం. అతడి తల్లి దావీదు భార్య ఎగ్లా. వీరు హెబ్రోనులో దావీదుకు పుట్టిన కొడుకులు.
6 సౌలు వంశీయులకూ దావీదు వంశీయులకూ యుద్ధం జరుగుతూ ఉన్నకాలంలో అబ్నేర్ సౌలు వంశీయులలో అధికారాన్ని అంతకంతకు చేకూర్చుకొంటూవచ్చాడు. 7 మునుపు సౌలుకు ఉంపుడుకత్తె ఉంది. ఆమె అయా కూతురు రిస్పా. ఇష్‌బోషెతు అబ్నేర్‌ను ఇలా అడిగాడు:
“నీవు నా తండ్రి ఉంపుడుకత్తెతో ఎందుకు పోయావు?”
8 ఇష్‌బోషెతు మాటకు అబ్నేర్ చాలా కోపగించుకొని ఇలా చెప్పాడు: “నేను యూదావాళ్ళ పక్షం వహించిన కుక్కలాంటి వాడినా? నిన్ను దావీదు చేతికి అప్పగించలేదు. ఈ రోజువరకు నీ తండ్రి సౌలు కుటుంబంవాళ్ళ పట్ల, అతడి బంధువులపట్ల, మిత్రులపట్ల రాజభక్తితో వ్యవహరిస్తూ ఉన్నాను. అయినా ఇవ్వేళ ఆ స్త్రీ విషయం నామీద నేరం మోపుతున్నావు. 9  సరి, యెహోవా దావీదుకు ప్రమాణం చేసినదానిని అతని పక్షాన నేనిప్పుడు నెరవేరుస్తాను. 10 రాజ్యం సౌలు వంశంవాళ్ళ వశంలో లేకుండా చేస్తాను, దానునుంచి బేర్‌షెబావరకు ఇస్రాయేల్ వాళ్ళ మీదా యూదావాళ్ళ మీదా దావీదు రాజ్యాధికారాన్ని నేను సుస్థిరం చేస్తాను. నేనలా చేయకపోతే దేవుడు నాకు గొప్ప ఆపద కలిగిస్తాడు గాక!” 11 ఇష్‌బోషెతు అబ్నేర్‌కు భయపడి ఇంకా ఒక్క మాట కూడా చెప్పలేకపోయాడు.
12 అబ్నేర్ తన తరఫున దావీదుకు మనుషులచేత ఇలా కబురు పంపాడు: “ఈ దేశం ఎవరిది? మీరు నాతో ఒడంబడిక చేస్తే ఇస్రాయేల్‌వారందరినీ మీ వైపు త్రిప్పడానికి నేను మీకు సాయం చేస్తాను.”
13 అందుకు దావీదు “మంచిది. నేను నీతో ఒడంబడిక చేస్తాను. అయితే నీవు ఒక పని చేయాలి. నన్ను చూడడానికి వచ్చేటప్పుడు సౌలు కూతురు మీకాల్‌ను నా దగ్గరికి తేవాలి. లేకపోతే నీవు నా ముఖాన్ని చూడవు” అని చెప్పాడు.
14 అప్పుడు దావీదు సౌలు కొడుకైన ఇష్‌బోషెతు దగ్గరికి మనుషులను పంపి “నా భార్య మీకాల్‌ను నాకు అప్పగించు. ఆమెకోసం నూరుమంది ఫిలిష్తీయవాళ్ళ మర్మాంగచర్మం కొనలు ఇచ్చి ఆమెను పెండ్లి చేసుకొన్నాను” అని చెప్పాడు.
15 ఇష్‌బోషెతు మనుషులను పంపి ఆమె భర్త, లాయీషు కొడుకైన పల్తీయేల్ దగ్గరనుంచి మీకాల్‌ను తెప్పించాడు. 16 ఆమె భర్త బహురీం వరకు ఆమె వెనుక నడుస్తూ ఏడుస్తూ వచ్చాడు. అబ్నేర్ అతణ్ణి చూచి “తిరిగి వెళ్ళిపో” అన్నాడు. అతడు తిరిగి వెళ్ళిపోయాడు.
17 అప్పుడు అబ్నేర్ ఇస్రాయేల్‌ప్రజల పెద్దలతో మాట్లాడాడు. “మీకు దావీదు రాజు కావాలని కొంతకాలంనుంచి మీరు కోరుతూ ఉన్నారు. 18 ఇప్పుడు మీ కోరిక నెరవేర్చుకోండి! యెహోవా దావీదునుగురించి ఇలా చెప్పాడు గదా ‘నా సేవకుడు దావీదు ద్వారా నా ఇస్రాయేల్‌ప్రజలను ఫిలిష్తీయవాళ్ళ బారినుంచీ శత్రువులందరి బారినుంచీ నేను విడిపిస్తాను’” అని.
19 అబ్నేర్ బెన్యామీనువారితో కూడా స్వయంగా మాట్లాడాడు. తరువాత అతడు హెబ్రోనుకు వెళ్ళి ఇస్రాయేల్ వారికీ, బెన్యామీను వంశంవారందరికీ ఉన్న కోరిక అంతా దావీదుకు తెలియజేశాడు. 20 అబ్నేర్‌తో కూడా ఇరవైమంది మనుషులు వచ్చారు. వారంతా హెబ్రోనులో దావీదుదగ్గరికి చేరిన తరువాత దావీదు వారికి విందు చేయించాడు. 21 అప్పుడు అబ్నేర్ “ఇస్రాయేల్‌ప్రజలంతా నా యజమాని అయిన రాజుతో ఒడంబడిక చేసేలా నేను వెళ్ళి వారిని సమకూరుస్తాను. సెలవివ్వండి”అని దావీదుతో చెప్పాడు. కనుక దావీదు అబ్నేర్‌ను పంపివేశాడు. అబ్నేర్ క్షేమంగా బయలు దేరాడు.
22 ఈలోగా దావీదు మనుషులూ యోవాబూ ఏదో ఒక ప్రాంతం పైబడి చాలా దోపిడీసొమ్ముతో హెబ్రోను తిరిగి వచ్చారు. అబ్నేర్ ఇంకా హెబ్రోనులో దావీదు దగ్గర లేడు. అప్పటికి దావీదు అతణ్ణి పంపివేశాడు, అతడు క్షేమంగా బయలుదేరాడు. 23 యోవాబు, ఆ సైనికులంతా చేరుకొన్నప్పుడు నేర్ కొడుకు అబ్నేర్ రాజుదగ్గరికి వచ్చాడనీ రాజు అతణ్ణి పంపివేశాడనీ అబ్నేర్ క్షేమంగా బయలుదేరాడనీ యోవాబు తెలుసుకొన్నాడు.
24 యోవాబు రాజుదగ్గరికి వెళ్ళి “నీవు చేసింది ఏమిటి? అబ్నేర్ నీదగ్గరికి వచ్చినప్పుడు నీవు అతణ్ణి ఎందుకు పంపివేశావు? అతడు వెళ్ళిపోయాడు! 25 నేర్ కొడుకు అబ్నేర్ నీకు తెలుసు. అతడు వచ్చినది నిన్ను మోసపుచ్చి నీ రాకపోకలను కనిపెట్టి నీవు చేసేదంతా తెలుసుకోవడానికే గదా” అని చెప్పాడు.
26 దావీదు దగ్గరనుంచి వెళ్ళి యోవాబు అబ్నేర్‌ను తీసుకురావడానికి మనుషులను పంపాడు. వాళ్ళు వెళ్ళి సిర్రా అనే బావి దగ్గరనుంచి అతణ్ణి తీసుకువచ్చారు. ఈ సంగతి దావీదుకు ఏమీ తెలియదు. 27  అబ్నేర్ తిరిగి హెబ్రోనుకు వచ్చినప్పుడు, యోవాబు అతనితో రహస్యంగా మాట్లాడవలసి ఉన్నట్టు అతణ్ణి ద్వారం మధ్యకు తీసుకుపోయాడు, తన తోబుట్టువు అశాహేల్ విషయం పగతీర్చుకోవడానికి అతడు అబ్నేర్‌ను కత్తితో కడుపులో పొడిచి చంపాడు.
28 తరువాత ఈ విషయం విన్నప్పుడు దావీదు ఇలా చెప్పాడు: “నేర్ కొడుకు అబ్నేర్ హత్య విషయంలో యెహోవా ఎదుట నామీద గానీ నా రాజ్యంమీద గానీ నేరం ఎన్నడూ ఉండదు. 29 ఈ దోష శిక్ష యోవాబు నెత్తిమీద, అతడి తండ్రి కుటుంబం వాళ్ళందరిమీదా పడుతుంది గాక! యోవాబు వంశంలో స్రావం గల వ్యక్తి గానీ చర్మవ్యాధి గలవాడు గానీ కర్ర పట్టుకొని నడిచేవాడు గానీ కత్తిపాలయ్యేవాడు గానీ ఆహారం లేనివ్యక్తి గానీ ఎప్పటికీ ఉండాలి.”
30 గిబియోను యుద్ధంలో అబ్నేర్ తమ తోబుట్టువు అశాహేల్‌ను చంపినందుచేత యోవాబు, అతడి తోబుట్టువు అబీషై అతణ్ణి చంపారు.
31 దావీదు యోవాబుకూ అతడితో ఉన్న వారందరికీ “మీరు వేసుకొన్న బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని అబ్నేర్ మృతదేహం ముందు నడుస్తూ రోదనం చేయండి” అని ఆజ్ఞ జారీ చేశాడు. రాజు తానే పాడె వెంట నడిచాడు.
32 వారు అబ్నేర్‌ను హెబ్రోనులో పాతిపెట్టారు. రాజు సమాధి దగ్గర గట్టిగా ఏడ్చాడు. ప్రజలంతా కూడా ఏడ్చారు. 33 రాజు అబ్నేర్‌కోసం ఇలా విలాపం చేశాడు:
“అబ్నేర్ వట్టి మూర్ఖుడిలాగా చనిపోవడం యుక్తమా?
34 నీ చేతులకు కట్లు లేవు.
నీ కాళ్ళకు సంకెళ్ళు లేవు.
అక్రమకారుల ముందు ఒకవ్యక్తి
పడిన విధంగా నీవు పడ్డావు.”
ప్రజలంతా అబ్నేర్‌ను గురించి మళ్ళీ ఏడ్చారు.
35 అప్పుడు వారు దావీదు దగ్గరికి వచ్చి ఇంకా పగలు ఉండగా భోజనం చేయాలని అతణ్ణి వేడుకొన్నారు. అయితే దావీదు “ప్రొద్దు క్రుంకే ముందు నేను ఏమైనా తింటే దేవుడు నాకు పెద్ద ఆపద కలిగిస్తాడు గాక!” అని శపథం చేశాడు. 36 ప్రజలంతా ఆ సంగతి ఆలోచనలోకి తెచ్చుకొన్నారు. అది వారిదృష్టిలో సరిగానే ఉంది. అసలు రాజు ప్రవర్తన అంతా ప్రజలందరికీ నచ్చింది. 37 నేర్ కొడుకు అబ్నేర్ హత్యలో రాజు పాల్గొనలేదని ఆ రోజు ప్రజలందరికీ ఇస్రాయేల్ వారందరికీ తెలిసింది.
38 దావీదు తన మనుషులతో ఇలా అన్నాడు: “ఈ రోజు ఇస్రాయేల్‌దేశంలో పడిపోయినది నాయకుడూ, మహనీయుడని మీకు తెలియదా? 39 నేను అభిషేకం పొందిన రాజును అయినా ఈ రోజు బలహీనుడనైపోయాను. ఈ సెరూయా కొడుకులు నాకంటే బలవంతులు. వారు కఠినులు. అక్రమకారుడు చేసిన చెడుగు ప్రకారం అతడికి యెహోవా ప్రతీకారం చేస్తాడు గాక!”