2
1 ఆ తరువాత దావీదు “నేను యూదా పట్టణాలలో ఒకదానికి వెళ్ళిపోవాలా?” అని ప్రార్థన చేస్తూ యెహోవాను అడిగాడు.
అందుకు యెహోవా “వెళ్ళిపో” అని జవాబిచ్చాడు.
“ఎక్కడికి వెళ్ళాలి?” అని దావీదు అడిగితే యెహోవా, “హెబ్రోనుకు వెళ్ళిపో” అని చెప్పాడు.
2 అందుచేత దావీదు తన ఇద్దరు భార్యలతోపాటు హెబ్రోనుకు వెళ్ళిపోయాడు. అతని భార్యలు యెజ్రేల్ పురవాసి అహీనోయం, మునుపు కర్మెల్ గ్రామంవాడైన నాబాల్‌కు భార్యగా ఉన్న అబీగేల్. 3 దావీదు తనతో ఉన్న మనుషులను కూడా కుటుంబసమేతంగా అక్కడికి తీసుకువెళ్ళాడు. వారు హెబ్రోను గ్రామాలలో కాపురమేర్పరచుకొన్నారు. 4 యూదా వారు హెబ్రోనుకు వచ్చి యూదా ప్రజలమీద రాజుగా దావీదును అభిషేకించారు.
5 సౌలును పాతిపెట్టినది యాబేష్‌గిలాదువాళ్ళని దావీదు తెలుసుకొన్నప్పుడు అతడు మనుషులద్వారా వారికి ఇలా చెప్పి పంపాడు: “మీ యజమానియైన సౌలును పాతిపెట్టడంవల్ల మీరు అతనిపట్ల దయ ప్రదర్శించారు. యెహోవా మీకు ఆశీస్సులు ప్రసాదిస్తాడు గాక! 6 యెహోవా మీమీద అనుగ్రహం, విశ్వసనీయత చూపిస్తాడు గాక! మీరు ఆ విధంగా చేసినందుచేత నేను కూడా మీకు మంచి చేస్తాను. 7 మీ యజమాని సౌలు చనిపోయాడు; యూదాప్రజలు తమమీద నన్ను రాజుగా అభిషేకించారు, గనుక మీరు బలంగా, ధైర్యంగా ఉండండి”.
8 అయితే సౌలు సైన్యానికి అధిపతీ నేర్ కొడుకూ అయిన అబ్నేర్, సౌలు కొడుకు ఇష్‌బోషెతును మహనయీం పట్టణం తీసుకుపోయాడు. 9 గిలాదువారి మీద, ఆషూరివారి మీద, యెజ్రేల్‌మీద, ఎఫ్రాయింవారి మీద, బెన్యామీనువారి మీద ఇస్రాయేల్ వారందరిమీద రాజుగా అతణ్ణి నియమించాడు. 10 సౌలు కొడుకు ఇష్‌బోషెతు ఇస్రాయేల్ మీద రాజయి నప్పుడు అతడి వయసు నలభై సంవత్సరాలు. అతడు రెండేళ్ళు పరిపాలించాడు. కానీ యూదావారు దావీదు పక్షాన ఉన్నారు. 11 దావీదు హెబ్రోనులో యూదావారి మీద పరిపాలించిన కాలమంతా ఏడు సంవత్సరాలు ఆరు నెలలు. 12 అంతలో నేర్ కొడుకు అబ్నేర్, సౌలు కొడుకు ఇష్‌బోషెతు అనుచరులు మహనయీంనుంచి గిబియోనుకు వెళ్ళారు. 13 సెరూయా కొడుకు యోవాబు, దావీదు అనుచరులు వెళ్ళి గిబియోను కొలను దగ్గర వారిని కలుసుకొన్నారు. అక్కడ వారంతా కూర్చున్నారు. ఒక గుంపు కొలను అవతల, మరో గుంపు కొలను ఇవతల ఉన్నాయి.
14 అబ్నేర్ యోవాబుతో “యువకులు నిలబడి మన ఎదుట మల్ల యుద్ధం చేస్తారా?” అన్నాడు. అందుకు యోవాబు “సరే, వాళ్ళు చేయవచ్చు” అని చెప్పాడు.
15 లెక్కకు సరిగా బెన్యామీనువారి పక్షాన, సౌలు కొడుకు ఇష్‌బోషెతు పక్షాన పన్నెండుమంది, దావీదు పక్షాన పన్నెండు మంది నిలబడి మధ్యకు వచ్చారు. 16 అప్పుడు ఒక్కొక్కరు తన ఎదుట ఉన్నవాడి తలను పట్టుకొని అతడి ప్రక్కన కత్తి పొడిచారు. అందరూ ఒకటిగా కూలారు. అందుచేత గిబియోనులో ఉన్న ఆ స్థలాన్ని “హెల్కత్ హస్సూరీం” అంటారు. 17 తరువాత ఆ రోజు యుద్ధం తీవ్రంగా జరిగింది. దావీదు అనుచరులు అబ్నేర్‌నూ ఇస్రాయేల్ వారినీ ఓడించారు.
18 అక్కడ సెరూయా ముగ్గురు కొడుకులైన యోవాబు, అబీషై, అశాహేల్ ఉన్నారు. అశాహేల్ అడవి జింక అంత వేగంతో పరుగెత్త గలిగినవాడు. 19 అతడు అబ్నేర్‌ను తరిమాడు. అతడు కుడివైపుకు గానీ ఎడమవైపుకు గానీ తిరగలేదు.
20 అబ్నేర్ వెనుకకు చూచి “అశాహేల్! నీవేనా?” అని అడిగాడు.
అశాహేల్ “అవును, నేనే” అన్నాడు.
21 అబ్నేర్ అతనితో “నీవు కుడివైపుకు గానీ ఎడమవైపు గానీ పో. యువకుల్లో ఒకణ్ణి పట్టుకొని వాడి ఆయుధాలను దోచుకో” అని చెప్పాడు.
అయితే అశాహేల్ అతణ్ణి తరమడం మానలేదు. 22 మరోసారి అబ్నేర్ అశాహేల్‌ను హెచ్చరించాడు, “నన్ను తరమడం మానుకో! నేను నిన్ను ఎందుకు నేలను కూల్చాలి? అలాంటప్పుడు నేను నీ సోదరుడు యోవాబు ఎదుట నా తలను ఎలా ఎత్తుకోగలను?” 23 అశాహేల్ తరమడం మానుకోలేదు గనుక అబ్నేర్ తన ఈటె వెనక భాగంతో అతని కడుపులో పొడిచాడు. ఈటె అతని వీపులో నుంచి బయటికి వచ్చింది. అక్కడే అతడు పడి చనిపోయాడు. అశాహేల్ పడి చనిపోయిన చోటికి వచ్చినవారంతా అక్కడ ఆగిపోయారు. 24 అయితే యోవాబు, అబీషైలు అబ్నేర్‌ను తరమడం మానలేదు. ప్రొద్దు క్రుంకుతూ ఉండగా వారు ఆమా అనే కొండకు చేరుకొన్నారు. అది గిబియోను అరణ్యానికి పోయే త్రోవ దగ్గర ఉన్న గీహకు ఎదురుగా ఉంది. 25 అక్కడ బెన్యామీనువారు అబ్నేర్ దగ్గర మళ్ళీ గుంపుగా సమకూడి ఒక కొండమీద ఆగిపోయారు.
26 అప్పుడు అబ్నేర్ కేక వేసి “కత్తి ఎప్పటికీ నాశనం చేస్తూ ఉంటుందా? దీని అంతం చేదుగా ఉంటుందని నీకు తెలియదా? ‘మీ సోదరులను తరమడం మానండి’ అని నీవు ఎంతవరకు నీ మనుషులకు ఆజ్ఞ జారీ చేయకుండా ఉంటావు?” అని బిగ్గరగా చెప్పాడు. 27 అందుకు యోవాబు “నేను దేవుని జీవంతోడని శపథం చేసి చెపుతున్నాను – నీవు అలా చెప్పకపోతే ఈ మనుషులంతా వారి సోదరులను ఉదయంవరకు తరుముతూ ఉండేవాళ్ళు” అని చెప్పాడు.
28 అప్పుడు యోవాబు బూర ఊదాడు. అతని మనుషులంతా ఆగి ఇస్రాయేల్‌వారిని తరమడం, వారితో యుద్ధం చేయడం మానుకొన్నారు.
29 ఆ రాత్రంతా అబ్నేర్, అతని మనుషులు అరాబా లోయ గుండా ప్రయాణం చేశారు. వారు యొర్దాను దాటి చిత్రోను ప్రాంతమంతటి ద్వారా వెళ్ళి మహనయీంకు చేరుకొన్నారు. 30 అబ్నేర్‌ను తరమడం మాని యోవాబు తిరిగి వచ్చి తన మనుషులను సమకూర్చాడు. దావీదు అనుచరులలో అశాహేల్ గాక ఇంకా పందొమ్మిదిమంది లేరు. 31 కానీ దావీదు మనుషులు అబ్నేర్‌తో ఉన్న బెన్యామీనువారిలో మూడు వందల అరవై మందిని హతం చేశారు. 32 వారు అశాహేల్ మృతదేహాన్ని తీసుకుపోయి బేత్‌లెహేంలో ఉన్న అతని తండ్రి సమాధిలో అతణ్ణి పాతిపెట్టారు. తరువాత యోవాబు, అతని మనుషులు రాత్రి అంతా నడిచి ప్రొద్దు పొడిచే సమయంలో హెబ్రోనుకు చేరుకొన్నారు.