2 సమూయేలు
1
1 సౌలు✽ చనిపోయిన తరువాత దావీదు అమాలేకువాళ్ళను ఓడించి సిక్లగు✽కు తిరిగి వచ్చి అక్కడ రెండు రోజులు ఉండిపోయాడు. 2 ✝మూడో రోజున సౌలు శిబిరంనుంచి ఒక మనిషి వచ్చాడు. అతడి బట్టలు చినిగి ఉన్నాయి. అతడి తలమీద బుగ్గి ఉంది. అతడు దావీదు దగ్గరకి చేరుకొని సాష్టాంగపడి నమస్కారం చేశాడు.3 దావీదు అతణ్ణి చూచి “నీవెక్కడనుంచి వచ్చావు?” అని అడిగాడు. అతడు “ఇస్రాయేల్ శిబిరంనుంచి తప్పించుకువచ్చాను” అని జవాబిచ్చాడు.
4 దావీదు “ఏం జరిగింది? నాకు చెప్పు!” అన్నాడు. అందుకా మనిషి “వారు రణరంగంనుంచి పారిపోయారు. చాలామంది కూలిపోయారు. సౌలు, అతడి కొడుకు యోనాతాను కూడా చనిపోయారు” అని చెప్పాడు.
5 ఈ వార్తను తెలియజేసిన ఆ యువకుణ్ణి దావీదు ఇలా అడిగాడు: “సౌలు, అతని కొడుకు యోనాతాను చనిపోయాడని నీకెలా తెలిసింది?”
6 ✽అందుకా యువకుడు ఇలా బదులు చెప్పాడు: “అదృష్టవశాత్తు నేను గిల్బోవ కొండమీద ఉన్నాను. సౌలు తన ఈటెమీద ఆనుకొని ఉండడం కనిపించింది. రథాలూ రౌతులూ అతడి దగ్గరికి వస్తూ ఉన్నారు. 7 అతడు వెనక్కు తిరిగి నన్ను చూచి పిలిచాడు. నేను ‘నన్నేం చేయమంటారు?’ అన్నాను. 8 అతడు ‘నీవెవడివి?’ అని అడిగాడు. నేను ‘అమాలేకువాణ్ణి’ అన్నాను. 9 అప్పుడతడు ‘నేనింకా ప్రాణంతో ఉన్నాను గాని నాకు చాలా బాధగా ఉంది. గనుక నీవు నాదగ్గర నిలబడి నన్ను చంపు’ అన్నాడు. 10 అందుచేత నేను అతడి దగ్గర నిలబడి అతణ్ణి చంపాను. అతడు అలా కూలినతరువాత బతకడని తెలిసింది. అప్పుడు అతడి తలమీద ఉన్న కిరీటాన్నీ✽ చేతిమీద ఉన్న కంకణాన్నీ తీసుకొని నా యజమానులైన మీ దగ్గరికి తెచ్చాను.”
11 ✝అది విని దావీదు, అతని దగ్గర ఉన్నవారంతా తమ బట్టలు చింపుకొన్నారు. 12 ✽సాయంకాలం వరకు వారు ఉపవాసముండి సౌలు, అతని కొడుకు యోనాతాను, యెహోవా ప్రజలు, ఇస్రాయేల్ వంశంవారు కత్తిపాలయ్యారని దుఃఖిస్తూ ఏడుస్తూ ఉన్నారు.
13 దావీదు ఆ వార్త తెచ్చిన యువకుణ్ణి చూచి “నీవు ఎక్కడివాడివి?” అని అడిగాడు. అతడు “నేను పరాయివాడైన అమాలేకువాడి కొడుకును” అన్నాడు.
14 ✽ అందుకు దావీదు “నీ చెయ్యి ఎత్తి, యెహోవాచేత అభిషేకం పొందినవాణ్ణి చంపడానికి నీవెందుకు భయపడ లేదు? 15 యెహోవాచేత అభిషేకం పొందినవాణ్ణి ‘నేను చంపాన’ని నీవే చెప్పావు. నీ మీద సాక్ష్యం నీ నోటి మాటే గనుక నీ చావుకు నీవే బాధ్యుడివి✽” అన్నాడు.
16 అప్పుడు దావీదు తన మనుషులలో ఒకణ్ణి పిలిచి “ఇటు వచ్చి వాణ్ణి చంపు” అని ఆదేశించాడు. అతడు వాణ్ణి కొట్టి చంపాడు.
17 దావీదు సౌలును గురించీ అతని కొడుకు యోనాతానును గురించీ ఈ విలాపం✽ చేశాడు; 18 ఈ ‘వింటి గీతం’ యూదావారికి నేర్పించాలని ఆజ్ఞ జారీ చేశాడు: (ఇది యాషారు✽ గ్రంథంలో వ్రాసి ఉంది).
19 “ఇస్రాయేల్ ప్రజలారా!
మీకు శోభ✽లాంటివారు మీ ఎత్తు స్థలాలమీద
హతమయ్యారు!
అయ్యో, మీ బలాఢ్యులు పడి ఉన్నారు!
20 ✽ ఫిలిష్తీయవాళ్ళ కూతుళ్ళు సంతోషించకూడదు,
ఆ సున్నతి లేనివాళ్ళ కూతుళ్ళు జయధ్వనులు
చేయకూడదు,
గనుక ఈ సంగతి గాత్‌లో చెప్పకండి.
అష్కేలోను వీధులలో చాటించకండి.
21 గిల్బోవ పర్వతపంక్తీ!
నీమీద మంచు గానీ వాన గానీ పడకుండా
ఉంటుంది గాక!
నైవేద్యాలకోసం పంట ఇచ్చే పొలాలు
లేకుండా ఉంటాయి గాక!
ఎందుకంటే, నీమీదే బలాఢ్యుల డాళ్ళు
అవమానానికి గురి అయి పారవేయబడ్డాయి.
నూనె అంటని సౌలు డాలు పారవేయడం జరిగింది.
22 ✝యోనాతాను విల్లు రక్తం ఒలికించి
హతం చేయకుండా,
బలాఢ్యుల క్రొవ్వులో గ్రుచ్చకుండా
వెనక్కు తీయలేదు.
ఎవరినీ హతం చేయకుండా సౌలు ఖడ్గం
వెనక్కు తీయలేదు.
23 సౌలు, యోనాతాను బ్రతికిఉన్నప్పుడు
ప్రజల అభిమానం చూరగొన్నవారు,
మనోహరమైనవారు✽.
చనిపోయినప్పుడు ఒకరినొకరు విడవనివారు.
వారు గరుడపక్షుల కంటే వేగంగా
వెళ్ళగలిగినవారు,
సింహాలకంటే బలం గలవారు.
24 ఇస్రాయేల్ కూతుళ్ళారా!
సౌలు కోసం ఏడ్వండి.
మీరు శ్రేష్ఠమైన ఎర్రని బట్టలు తొడుగుకొనేలా
అతడు చేశాడు.
బంగారు నగలు మీకిప్పించాడు.
25 అయ్యో! రణరంగంలో బలాఢ్యులు పడి ఉన్నారు!
నీ ఎత్తు స్థలాలమీద యోనాతాను హతమయ్యాడు.
26 ✽ యోనాతాను! సోదరా!
నీకోసం దుఃఖిస్తూ ఉన్నాను.
నీవు నాకు ఎంతో మనోహరమైనవాడివి.
నామీద నీకున్న అభిమానం ఆశ్చర్యకరమైనది.
స్త్రీల ప్రేమకంటే అధికమైనది.
27 అయ్యో, బలాఢ్యులు పడి ఉన్నారు!
యుద్ధాయుధాలు నాశనమయ్యాయి!”