30
1 దావీదు, అతని మనుషులు మూడో రోజున సిక్లగు చేరుకొన్నారు. ఇంతలో అమాలేకు✽వాళ్ళు దోపిడికోసం దక్షిణ ప్రాంతంమీద, సిక్లగు మీద దాడి చేశారు. వాళ్ళు సిక్లగును ఓడించి 2 పెద్దలనూ పిన్నలనూ స్త్రీలనూ అందులో ఉన్న వారందరినీ చెరపట్టుకొని దానిని తగలబెట్టారు, ఎవరినీ చంపక వారిని తీసుకొని తమ దారిన వెళ్ళిపోయారు. 3 దావీదు, అతని మనుషులు సిక్లగు చేరినప్పుడు అది తగలబడి ఉండడం, తమ భార్యలూ కొడుకులూ కూతుళ్ళూ బందీలుగా పోయి ఉండడం చూశారు. 4 కనుక దావీదు, అతని మనుషులు ఇంకా ఏడవడానికి బలం లేనంతవరకు గట్టిగా ఏడ్చారు. 5 దావీదు ఇద్దరు భార్యలను– యెజ్రెల్ పురవాసి అహీనోయమ్నూ కర్మెల్ గ్రామంవాడైన నాబాల్ భార్య అబీగేల్‌నూ– కూడా చెరపట్టుకుపోవడం జరిగింది.6 ✽ తమ కొడుకుల విషయం, కూతుళ్ళ విషయం అందరూ కుమిలిపోతూ, “రాళ్ళు రువ్వి దావీదును చంపుదామ”ని చెప్పుకొన్నారు. దావీదు చాలా దుఃఖించాడు గాని అతడు తన దేవుడు యెహోవా మూలంగా ధైర్యం తెచ్చుకొన్నాడు✽.
7 ✝అహీమెలెక్ కొడుకైన అబ్యాతారును పిలిచి దావీదు “ఏఫోదు తీసుకురా” అన్నాడు. అతడు దానిని తీసుకు వచ్చినప్పుడు, 8 దావీదు “నేను ఈ దోపిడీదారుల గుంపును తరుమాలా? దానిని కలుసుకోగలనా?” అని సంప్రదించాడు.
యెహోవా, “వాళ్ళను తరుము. నీవు వారిని కలుసుకొని తప్పక నీవారందరినీ దక్కించుకొంటావు” అన్నాడు.
9 అందుచేత దావీదు, అతనితో ఉన్న ఆరు వందలమంది తరలి వెళ్ళారు. వారు బెసోరు వాగు ఒడ్డుకు చేరినప్పుడు వారిలో కొంతమంది వెనుక ఉండిపోయారు. 10 ఎందుకంటే, రెండు వందలమంది వాగు దాటలేనంతగా అలసిపోయారు. దావీదు మిగతా నాలుగు వందలమంది అమాలేకువాళ్ళను వెంటాడుతూ వెళ్ళారు. 11 వారు వెళ్తూ ఉంటే పొలంలో ఈజిప్ట్ దేశస్థుడొకడు కనిపించాడు. వారు అతణ్ణి దావీదు దగ్గరికి తీసుకువచ్చారు. అతడికి భోజనం పెట్టి దాహమిచ్చారు. 12 అంజూరు పండ్ల బిళ్ళలో ఉన్న ముక్కనూ రెండు ఎండిన ద్రాక్ష పండ్ల అడలనూ కూడా అతడికిచ్చారు. అతడు మూడు రాత్రింబగళ్ళు ఏమీ తినలేదు, నీళ్ళు త్రాగలేదు. అతడు తిన్న తరువాత బలం పుంజుకొన్నాడు.
13 దావీదు అతణ్ణి చూచి “నీవు ఏ దేశానికి చెందిన వాడివి? ఎక్కడనుంచి వచ్చావు?” అని అడిగాడు. అతడు “నేను పుట్టుకతో ఈజిప్ట్‌దేశస్తుణ్ణి. అమాలేకువాడికి బానిసనయ్యాను. మూడు రోజుల క్రితం నాకు జబ్బు చేసింది. నా యజమాని నన్ను విడిచి వెళ్ళిపోయాడు. 14 మేము కేరేతువాళ్ళ దక్షిణ దేశంమీద, యూదా ప్రదేశంమీద, కాలేబువాళ్ళకు చెందిన దక్షిణ ప్రాంతంమీద దాడి చేసి వాటిని దోచుకొన్నాం. సిక్లగును తగలబెట్టాం” అని జవాబిచ్చాడు.
15 దావీదు “నీవు ఆ దోపిడీదారుల గుంపు దగ్గరికి నాకు త్రోవ చూపగలవా?” అని అడిగినప్పుడు అతడు “మీరు నన్ను చంపరనీ నా యజమానికి అప్పగించరనీ మీరు దేవుని పేర ఒట్టుపెట్టుకుంటే నేను మిమ్మల్ని ఆ గుంపు దగ్గరికి తీసుకుపోతాను” అని చెప్పాడు.
16 అతడు దావీదును ఆ దోపిడీదారుల దగ్గరికి తీసుకు వెళ్ళాడు. వాళ్ళు ఆ స్థలమంతా చెదరి ఉండి తింటూ త్రాగుతూ ఉన్నారు. తాము ఫిలిష్తీయదేశంనుంచీ యూదా ప్రదేశంనుంచీ దోపిడీ కారణంగా సంబరపడుతూ ఉన్నారు. 17 దావీదు ముని చీకటినుంచి మరుసటి రోజు సాయంత్రం వరకు వాళ్ళను హతమార్చాడు. వాళ్ళలో నాలుగు వందలమంది యువకులు ఒంటెలపై ఎక్కి పారిపోయారు. వాళ్ళు తప్ప ఇంకెవ్వరూ తప్పించుకోలేక పోయారు. 18 ✽అమాలేకువాళ్ళు ఎత్తుకుపోయిన దానంతటినీ దావీదు మళ్ళీ స్వాధీనం చేసుకొన్నాడు. అతడు తన ఇద్దరు భార్యలను కూడా రక్షించాడు. 19 ఆ దోపిడీలో ఏదీ పోలేదు. చిన్నవాటినీ పెద్దవాటినీ దోపిడీ అంతటినీ కొడుకులనూ కూతుళ్ళనూ అందరినీ దావీదు తిరిగి తనవెంట తీసుకువెళ్ళాడు. 20 దావీదు గొర్రెలనూ పశుమందలనూ పట్టుకొన్నాడు. ప్రజలు తమ పశువులకు ముందు వాటిని తోలుకుపోయి “ఇవి దావీదు దోపిడీసొమ్ము” అని చెప్పారు.
21 అలసటచేత దావీదును వెంబడించలేక, బెసోరు వాగు దగ్గర ఆగిపోయిన రెండు వందలమంది దగ్గరికి దావీదు తిరిగి వెళ్ళాడు. వారు దావీదునూ అతని మనుషులనూ కలుసు కోవడానికి కొద్ది దూరం నడిచారు. దావీదు వారిదగ్గరికి చేరి వారి యోగక్షేమాలు అడిగాడు. 22 అయితే దావీదుతో వెళ్ళినవారిలో దుర్మార్గులూ✽ నీచులంతా ఇలా అన్నారు: “వీళ్ళు మనతో కూడా రాలేదు గదా. కనుక మనకు మళ్ళీ వచ్చిన దోపిడీసోమ్ములో మనం వీళ్ళకేమీ ఇవ్వం. వాళ్ళు తమ భార్యలనూ పిల్లలనూ మాత్రం తీసుకుపోవచ్చు.”
23 అందుకు దావీదు బదులు చెప్పాడు, “నా సోదరులారా, యెహోవా మనకిచ్చిన వాటితో మీరు ఆ విధంగా చేయ కూడదు. యెహోవా మనల్ని కాపాడాడు. మనపైబడ్డ ఆ గుంపును మన వశం చేశాడు. 24 ✽ మీరు చెప్పినది ఎవరు అంగీకరిస్తారు? యుద్ధానికి వెళ్ళినవాడి భాగం ఎంతో, సామాను దగ్గర ఉండిపోయినవాడి భాగం అంతే. వారు సమానంగా పంచుకొంటారు.”
25 ఆ రోజునుంచి దావీదు ఆ పద్ధతిని ఇస్రాయేల్ ప్రజలకు చట్టంగా నియమించాడు. ఆ నియమం ఈ రోజువరకు నిలిచి ఉంది.
26 ✽దావీదు సిక్లగుకు చేరుకొన్నప్పుడు తనకు మిత్రులుగా ఉన్న యూదా పెద్దలకు దోపిడీలో భాగం పంపాడు. “యెహోవా శత్రువుల దగ్గర నేను దోచుకొన్న సొమ్ములో కొంత కానుకగా మీకిస్తున్నాను” అని కబురంపాడు. 27 అతడు ఈ పెద్దలకు పంపాడు. బేతేల్‌లో, దక్షిణ రామోతులో, యత్తీరులో, 28 ఆరోయేర్‌లో, షిప్‌మోతులో, ఎష్తెమోనలో, 29 రాకాల్‌లో యెరహ్మేల్‌వాళ్ళ ఊళ్ళలో, కేనువాళ్ళ ఊళ్ళలో, 30 హోర్మాలో, బోర్ ఆషానులో, ఆతాకులో, 31 హెబ్రోనులో, దావీదు అతని మనుషులు సంచరించిన ఇతర స్థలాలన్నిటిలో ఉన్న పెద్దలు.