31
1 ఈలోగా ఫిలిష్తీయవాళ్ళు ఇస్రాయేల్‌వారితో యుద్ధం చేశారు. వాళ్ళ ముందునుంచి ఇస్రాయేల్‌వారు పారిపోయారు. చాలామంది హతమై గిల్బోవ పర్వతం మీద కూలారు. 2 ఫిలిష్తీయవాళ్ళు సౌలునూ అతని కొడుకులనూ తరిమి సౌలు కొడుకులైన యోనాతానునూ అబీనాదాబునూ మెల్కీషూవనూ హతమార్చారు. 3 సౌలు చుట్టూరా యుద్ధం తీవ్రమయింది. అతడు అంబులు వేసేవాళ్ళ కంటబడి, వాళ్ళచేత ఘోరంగా గాయపడ్డాడు. 4 సౌలు తన ఆయుధాలు మోసేవాణ్ణి చూచి “నీ కత్తి దూసి నన్ను పొడువు! లేకపోతే సున్నతి లేని వీళ్ళు వచ్చి నన్ను పొడిచి దూషణకు గురి చేస్తారు” అన్నాడు.
కానీ ఆయుధాలు మోసేవాడు చాలా భయపడి అలా చేయడానికి నిరాకరించాడు. అందుచేత సౌలు తన ఖడ్గాన్ని పట్టుకొని దానిపై పడ్డాడు. 5 సౌలు చనిపోయాడని గ్రహించి ఆయుధాలు మోసేవాడు కూడా తన కత్తిమీద పడి చనిపోయాడు. 6 సౌలు, అతని ముగ్గురు కొడుకులు, అతని ఆయుధాలు మోసేవాడు, అతని మనుషులంతా ఒకే రోజున చనిపోయారు.
7 ఇస్రాయేల్ సైన్యం పారిపోయిందనీ సౌలూ అతని కొడుకులూ చనిపోయారనీ తెలుసుకొని లోయ అవతల, యొర్దాను అవతల ఉన్న ఇస్రాయేల్ ప్రజలు వారి ఊళ్ళను విడిచి పారిపోయారు. ఫిలిష్తీయవాళ్ళు వచ్చి వాటిని ఆక్రమించారు. 8 మరుసటి రోజు ఫిలిష్తీయవాళ్ళు హతమైన వారిని దోచుకోవడానికి వచ్చారు. గిల్బోవ కొండమీద పడి ఉన్న సౌలునూ అతని ముగ్గురు కొడుకులనూ చూచి 9 సౌలు తలను ఛేదించి అతని ఆయుధాలను తీసుకొన్నారు. తమ విగ్రహాల గుళ్ళలో, ప్రజలమధ్య ఆ వార్త తెలియజేయడానికి ఫిలిష్తీయ దేశంలో నలుదిక్కులకు మనుషులను పంపారు. 10 సౌలు ఆయుధాలను వాళ్ళు అష్తారోతుదేవి గుడిలో ఉంచారు. అతని శవాన్ని బేత్‌షాను ఊరి గోడకు తగిలించారు.
11 ఫిలిష్తీయవాళ్ళు సౌలుకు చేసినదాని విషయం యాబేష్‌గిలాదు ఊరివారికి వినబడ్డప్పుడు 12 బలంగల వీరులందరూ బయలుదేరి రాత్రంతా ప్రయాణం చేసి బేత్‌షానుకు చేరి దాని గోడపై నుంచి సౌలు మృతదేహాన్నీ అతని కొడుకుల మృత దేహాలనూ దింపారు. వాటిని యబేష్‌కు తీసుకువచ్చి దహనం చేశారు. 13 వారి ఎముకలను యాబేష్‌లో పిచులవృక్షం క్రింద పాతిపెట్టి ఏడు రోజులు ఉపవాసమున్నారు.