29
1 ✽ఫిలిష్తీయవాళ్ళు తమ సైన్యాలన్నిటినీ ఆఫెకు దగ్గర సమకూర్చారు. ఇస్రాయేల్‌వారు యెజ్రేల్‌లో నీటి ఊట దగ్గర మకాం వేశారు. 2 ఫిలిష్తీయ నాయకులు తమ సైన్యాలను వందలమంది చొప్పున, వెయ్యిమంది చొప్పున బారులు తీరి ముందుకు సాగారు. దావీదు, అతని మనుషులు ఆకీషుతో కలిసి సైన్యంలో వెనుకటి భాగంలో వస్తూ ఉన్నారు.3 ఫిలిష్తీయ అధిపతులు “హీబ్రూవాళ్ళు ఎందుకు వస్తున్నారు?” అని అడిగారు.
అందుకు ఆకీషు “ఇతడు దావీదు గదా. మునుపు ఇతడు ఇస్రాయేల్ ప్రజల రాజైన సౌలు సేవకుడు గాని సంవత్సరం కంటే ఎక్కువ రోజులు ఇతడు నా దగ్గర ఉన్నాడు. ఇతడు నా దగ్గర చేరినప్పటినుంచి ఈ రోజువరకు ఇతనిలో నాకు ఏ తప్పు కనిపించలేదు” అని ఫిలిష్తీయ అధిపతులతో చెప్పాడు.
4 వారు అతని మీద కోపగించి ఇలా అన్నారు. “నీవు నిర్ణయించిన స్థలానికి ఈ మనిషిని తిరిగి పంపు. అతడు మనతో యుద్ధానికి రాకూడదు. అతడు యుద్ధంలో మనకు శత్రువుగా మారిపోవచ్చునేమో. అతడు తన యజమానితో సమాధానపడాలని ఉంటే మనవారి తలలను అతడికివ్వడం కంటే మంచి విధానం ఉంటుందా? చెప్పు. 5 ✝‘సౌలు వేలకొలది శత్రువులను హతం చేశాడు, దావీదు పది వేలకొలది శత్రువులను హతం చేశాడు’ అని వాళ్ళు నాట్యమాడుతూ, గాన ప్రతిగానం చేస్తూ, పాడిన దావీదు ఇతడే గదా.”
6 అందుచేత ఆకీషు దావీదును పిలిచి అతనితో “యెహోవా జీవంమీద ఆనబెట్టి చెపుతున్నాను, నీవు నిజంగా నిజాయితీపరుడివి, సైన్యంలో నీవు నాతోకూడా రావడం నాకిష్టమే. నీవు నాదగ్గరికి వచ్చిన రోజునుంచి ఈ రోజువరకూ నీలో ఏ తప్పూ నాకు కనిపించలేదు. కానీ నాయకులకు నీవంటే ఇష్టం లేదు. 7 కనుక ఫిలిష్తీయ నాయకులకు చికాకు పుట్టించకుండా నీవు క్షేమంగా వెనక్కు వెళ్ళు” అని చెప్పాడు.
8 ✽దావీదు “నేనేం చేశాను? మీ దగ్గరికి చేరినప్పటినుంచి ఈ రోజువరకు మీ సేవకుడైన నాలో తప్పేమి కనిపించింది? రాజా, నా యజమానీ, నేను మీ శత్రువులతో యుద్ధం చేయడానికి నేనెందుకు రాకూడదు?” అని అడిగాడు.
9 ఆకీషు “నీవు నా దృష్టిలో దేవదూతలాంటి వాడివి. నీవు మంచివాడివని నాకు తెలుసు. కానీ ఫిలిష్తీయ అధిపతులు ‘ఇతడు మనతో కూడా యుద్ధానికి రాకూడదు’ అంటున్నారు గదా. 10 కనుక ఉదయమే లేచి నీవూ నీతోపాటు వచ్చిన నీ యజమాని మనుషులూ తెల్లవారగానే బయలుదేరి వెళ్ళాలి” అని దావీదుకు జవాబిచ్చాడు.
11 అందుచేత దావీదు, అతని మనుషులు ఉదయమే లేచి ఫిలిష్తీయ దేశానికి ప్రయాణమైపోయారు. ఫిలిష్తీయవాళ్ళు యెజ్రెల్‌కు వెళ్ళారు.