28
1 ✽ఆ రోజుల్లో ఫిలిష్తీయవాళ్ళు ఇస్రాయేల్‌ప్రజతో యుద్ధం చేయడానికి తమ సైన్యాలను సమకూర్చారు. ఆకీషు దావీదును పిలిచి “నీవూ నీ మనుషులూ యుద్ధానికి సైన్యంతో నాతోకూడా రావాలని నీవు బాగా తెలుసుకో” అన్నాడు.2 దావీదు “సరే. అప్పుడు నీ సేవకుడైన నేను ఏం చేయగలనో నీవు తెలుసుకొంటావు” అన్నాడు.
అందుకు ఆకీషు “మంచిది. నిన్ను ఎప్పటికీ నాకు దేహ రక్షకుడుగా నియమిస్తాను” అని చెప్పాడు.
3 ✽అప్పటికీ సమూయేలు చనిపోయాడు. ఇస్రాయేల్ ప్రజలంతా అతనికోసం దుఃఖించి అతని ఊరు రమాలో అతణ్ణి సమాధి చేశారు. సౌలు కర్ణపిశాచం గలవాళ్ళనూ పూనకం వచ్చి పలికే వాళ్ళనూ దేశం నుంచి వెళ్ళగొట్టాడు.
4 ✽ఫిలిష్తీయవాళ్ళు పోగై వచ్చి షూనేందగ్గర మకాంవేశారు. అంతలో సౌలు ఇస్రాయేల్‌వారందరినీ సమకూర్చి వారితో కూడా గిల్బోవ కొండలలో శిబిరం నెలకొల్పాడు. 5 ✽సౌలు ఫిలిష్తీయ సైన్యాన్ని చూచి హడలిపోయాడు. అతని హృదయం అత్యంత భయంతో నిండిపోయింది. 6 సౌలు యెహోవాను సంప్రదించాడు గాని యెహోవా అతనికి కలల✽ద్వారా గానీ ఊరీం✽ద్వారా గానీ ప్రవక్తల✽ద్వారా గానీ ఏమీ జవాబివ్వలేదు.✽ 7 ✽అప్పుడు సౌలు తన పనివాడికి “నాకోసం పూనకం వచ్చి పలికేస్త్రీని వెదకండి. నేను ఆమె దగ్గరికి వెళ్ళి సంప్రదిస్తాను” అని ఆదేశించాడు.
వారు “ఎన్‌దోరులో పూనకం వచ్చి పలికే స్త్రీ ఉంది” అని అతనికి తెలియజేశారు.
8 అప్పుడు సౌలు వేరే బట్టలు తొడుక్కొని మారువేషం వేసుకొని ఇద్దరు మనుషులను తీసుకొని రాత్రివేళ ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. ఆమెతో “కర్ణ పిశాచంద్వారా నాకు శకునం చెప్పి నేను నీతో చెప్పేవాణ్ణి పైకి రప్పించు” అన్నాడు.
9 అందుకా స్త్రీ “సౌలు చేసినది మీకు తెలుసు. కర్ణ పిశాచం గల వాళ్ళనూ పూనకం వచ్చి పలికే వాళ్ళనూ దేశంలో లేకుండా చేశాడు, గదా. మీరు ఎందుకు నా ప్రాణానికి ఉరియొగ్గి నాకు చావు తెచ్చిపెడతారు?” అని చెప్పింది.
10 సౌలు యెహోవా పేర శపథం చేస్తూ “యెహోవా జీవంతోడు దీనివల్ల నీకు శిక్ష ఎంతమాత్రం రాదు” అని ఆమెతో చెప్పాడు.
11 అప్పుడా స్త్రీ “నేను మీ కోసం ఎవరిని పైకి రప్పించాలి?” అని అడిగింది.
అతడు “సమూయేలును పైకి రప్పించు” అన్నాడు.
12 ✽సమూయేలును చూచినప్పుడు ఆ స్త్రీ గట్టిగా కేక వేసి సౌలుతో “నన్నెందుకు మోసగించారు? సౌలు మీరే” అని అరచింది.
13 అయితే రాజు “భయపడకు! నీవేం చూస్తున్నావు?” అని ఆమెను అడిగాడు.
ఆమె “దేవతలలో ఒకడు భూమిలో నుంచి పైకి రావడం నేను చూస్తున్నాను” అంది.
14 ✝అతడు “ఆయన ఆకారం ఎలా ఉంది?” అనడిగాడు. ఆమె “పైవస్త్రం కప్పుకొని ఉన్న ముసలివాడు పైకి వస్తున్నాడు” అని జవాబిచ్చింది.
అతడు సమూయేలని సౌలు తెలుసుకొని నేల వైపుకు ముఖం వంచి సాష్టాంగపడ్డాడు.
15 ✽సమూయేలు “నన్ను పైకి రమ్మని నాకు ఉన్న నెమ్మది ఎందుకు చెరచావు?” అని సౌలును అడిగాడు.
అందుకు సౌలు “నేను చాలా ఇబ్బందిలో ఉన్నాను. ఫిలిష్తీయవాళ్ళు నా పైకి యుద్ధానికి వచ్చారు. దేవుడు నన్ను విడిచిపెట్టాడు. ఆయన ప్రవక్తలద్వారా గానీ కలలద్వారా గానీ నాకేమీ జవాబివ్వడం లేదు. అందుచేత నేనేం చేయాలో నీవు తెలియజేయాలని నిన్ను పిలిపించుకొన్నాను” అన్నాడు.
16 ✽అప్పుడు సమూయేలు ఇలా చెప్పాడు: “యెహోవా నిన్ను విడిచి నీకు విరోధి అయినప్పుడు నన్ను అడగడం వల్ల ప్రయోజనమేమిటి? 17 యెహోవా నా ద్వారా పలికిన మాట నేరవేరుస్తున్నాడు. రాజ్యాన్ని నీ చేతిలో నుంచి తీసివేసి నీ పొరుగువాడైన దావీదుకు ఇచ్చాడు. 18 ✝నీవు యెహోవా మాట వినలేదు. అమాలేకుజాతి మీద ఆయన తీవ్ర కోపం ప్రకారం నీవు వాళ్ళపట్ల వ్యవహరించలేదు, గనుక యెహోవా ఈ వేళ నీకు ఈ విధంగా చేస్తున్నాడు – 19 యెహోవా నిన్నూ ఇస్రాయేల్ ప్రజనూ ఫిలిష్తీయవాళ్ళ వశం చేస్తాడు. రేపు నీవూ నీ కొడుకులూ నాతో✽ ఉంటారు. యెహోవా ఇస్రాయేల్ సైన్యాన్ని ఫిలిష్తీయవాళ్ళ చేతికి అప్పగిస్తాడు.”
20 సమూయేలు మాటలకు సౌలు చాలా భయపడ్డాడు. వెంటనే అతడు నేలపై బోర్లపడ్డాడు. పగలూ రాత్రీ ఏమీ తినకపోవడం చేత అతడు నీరసించిపోయాడు. 21 అప్పుడా స్త్రీ సౌలు దగ్గరికి వచ్చి అతడు భయంతో నిండిపోయిన స్థితిలో ఉండడం చూచి ఇలా చెప్పింది:
“మీ పరిచారికనైన నేను మీ ఆజ్ఞను శిరసావహించాను. మీరు నాతో చెప్పినట్టు ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకొని నేను చేశాను. 22 ఇప్పుడు మీ పరిచారిక నేను చెప్పేది వినండి. నేను మీకు కొంత భోజనం వడ్డిస్తాను. మీరు తిని ప్రయాణం కోసం బలం పుంజుకోండి.”
23 అతడు “భోజనం చేయను” అని నిరాకరించాడు. అయితే అతడి సేవకులు ఆ స్త్రీతో కలిసి అతణ్ణి బలవంతం చేశారు, చివరికి అతడు వారి మాట విని నేలనుంచి లేచి మంచం మీద కూర్చున్నాడు. 24 ఆ స్త్రీకి ఇంటిదగ్గర క్రొవ్విన దూడ ఒకటి ఉంది. ఆమె వెంటనే దానిని వధించి వండింది. పిండి తీసుకొని పిసికి పొంగచేసే పదార్థం వేయకుండా రొట్టెలు కాల్చింది. 25 మాంసం, రొట్టెలు సౌలుకూ అతడి సేవకులకూ వడ్డించింది. వారు భోజనం చేసి ఆ రాత్రి వెళ్ళిపోయారు.