27
1 తరువాత దావీదు “ఏదో ఒక రోజున సౌలుచేత నాశనమవుతాను. నేను ఇక్కడ ఉండడంకంటే ఫిలిష్తీయదేశానికి తప్పించుకుపోవడం మంచిది. అప్పుడు సౌలు ఇస్రాయేల్ దేశం సరిహద్దులలో నన్ను వెదకడం మానుకొంటాడు. ఆ విధంగా నేను అతని చేతిలోనుంచి తప్పించుకొంటాను” అని తనలో అనుకొన్నాడు.
2 అందుచేత దావీదు, అతనితో ఉన్న ఆ ఆరువందలమంది మనుషులు బయలుదేరి మాయోక్ కొడుకూ గాత్‌నగరం రాజూ అయిన ఆకీషుదగ్గరికి వెళ్ళారు. 3 దావీదు, అతని మనుషులు గాత్‌లో ఆకీషుదగ్గర కాపురం చేశారు. వారి కుటుంబాలు వారితోకూడా ఉన్నాయి. దావీదు ఇద్దరు భార్యలు – యెజ్రెల్ గ్రామస్థురాలు అహీనోయం, కర్మెల్ గ్రామస్థురాలు అబీగేల్ (మునుపు ఆమె నాబాల్ భార్య) దావీదుతో కాపురమున్నారు. 4 దావీదు గాత్‌కు పారిపోయిన సంగతి సౌలుకు తెలిసిన తరువాత అతడు దావీదును వెదకడం మానివేశాడు.
5 దావీదు ఆకీషుతో “నీ సేవకుడైన నేను రాజపురంలో నీదగ్గర నివసించడమెందుకని? నీవు నన్ను గనుక దయ చూస్తూ ఉంటే గ్రామప్రాంతాలలో ఒక ఊరిలో నాకు స్థలం ఇప్పించు. నేను అక్కడ కాపురముంటాను” అని అడిగాడు.
6 ఆకీషు ఆ రోజే సిక్లగు గ్రామం అతనికిచ్చాడు. అప్పటినుంచి సిక్లగు యూదా రాజుల స్వాధీనంలో ఉంది. 7 దావీదు ఫిలిష్తీయదేశంలో ఒక సంవత్సరం నాలుగు నెలలు కాపురమున్నాడు. 8  ఆ రోజుల్లో దావీదు, అతని మనుషులు బయలుదేరి దోపిడీ కోసం గెషూరు, గెజెరు, అమాలేకు అనే జాతులవారిపై పడేవారు. (అనాది కాలంనుంచి ఈ జాతులు షూరు ప్రదేశంవరకు, ఈజిప్ట్‌దేశంవరకు ఉన్న ప్రాంతాలలో నివాసం చేసేవి.) 9  దావీదు ఏ ప్రాంతంమీద దాడి చేస్తే ఆ ప్రాంతంవాళ్ళలో మగవాళ్ళనూ ఆడవాళ్ళనూ ఎవ్వరినీ ప్రాణంతో విడువక గొర్రెలనూ ఎద్దులనూ గాడిదలనూ ఒంటెలనూ బట్టలనూ దోచుకొని తిరిగి ఆకీషుదగ్గరికి వెళ్ళేవాడు.
10 ఆకీషు “ఇవ్వేళ దోపిడీకోసం ఎక్కడికి వెళ్ళావు?” అని అడిగినప్పుడు, దావీదు “యూదా దేశంలో ఉన్న దక్షిణ ప్రాంతానికి” లేదా, “యెరహ్మియేల్ వాళ్ళ దక్షిణ ప్రాంతానికి” లేదా, “కేనువాళ్ళ దక్షిణ ప్రాంతానికి” అని చెప్పేవాడు.
11 అతడు ఫిలిష్తీయ దేశంలో ఉన్నంతకాలం ఈ విధంగా చేసేవాడు. దావీదు ఇలా చేశాడని తనగురించి గాతుకు వార్త అందించగల మగవాణ్ణి గానీ ఆడమనిషిని గానీ దావీదు బ్రతకనివ్వలేదు. 12 ఆకీషు దావీదును నమ్మాడు. “దావీదు తన ప్రజలైన ఇస్రాయేల్‌వారు తనను తప్పక అసహ్యించుకొనేట్టు చేశాడు, గనుక అతడు ఎప్పటికీ నాకు సేవకుడుగా ఉంటాడు” అని ఆకీషు అనుకొన్నాడు.