26
1 ✽తరువాత జీఫువాళ్ళు గిబియాకు సౌలు దగ్గరికి వెళ్ళి “దావీదు యెషీమోనుకు ఎదురుగా ఉన్న హకీలా కొండలో దాగుకొన్నాడు” అని తెలియజేశారు.2 ✝అందుచేత సౌలు దావీదును వెదకడానికి జీఫు ఎడారికి వెళ్ళాడు. మునుపు అతడు ఇస్రాయేల్‌ప్రజలలో ఎన్నుకొన్న మూడు వేలమంది సైనికులు అతడితో కూడా వెళ్ళారు. 3 సౌలు యెషీమోను ఎదుట ఉన్న హకీలా కొండలో దారి ప్రక్కన మకాం చేశాడు. అప్పుడు దావీదు ఎడారిలో ఉన్నాడు. తనను పట్టుకోవడానికి సౌలు ఎడారికి వచ్చాడని విని 4 అతడు గూఢచారులను పంపి సౌలు వచ్చిన వార్త నిజమని తెలుసుకొన్నాడు. 5 దావీదు బయలుదేరి సౌలు మకాం చేసిన చోటికి వచ్చాడు. సౌలు, నేర్ కొడుకూ సౌలు సైన్యాధిపతీ అయిన అబ్నేర్ పడుకొని ఉన్న స్థలాన్ని దావీదు చూశాడు. సౌలు శిబిరం మధ్య పడుకొని ఉన్నాడు. సైనికులు అతనిచుట్టూ ఉన్నారు.
6 దావీదు “శిబిరంలో సౌలు దగ్గరికి నాతోకూడా ఎవరు వస్తారు?” అని హిత్తి జాతి✽వాడైన అహీమెలెకునూ సెరూయా✽ కొడుకూ యోవాబు తోబుట్టువూ అయిన అబీషైనూ అడిగాడు. “నీతో నేను వస్తాను” అని అబీషై చెప్పాడు.
7 దావీదు, అబీషై రాత్రివేళ ఆ మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు సౌలు శిబిరంలో పడుకొని నిద్రపోతూ ఉన్నాడు. అతని ఈటె అతని తలదగ్గర నేలలో నాటి ఉంది. అబ్నేర్, మరి కొంతమంది అతని చుట్టూరా పడుకొని ఉన్నారు.
8 ✽ అబీషై దావీదుతో “దేవుడు ఇవ్వేళ నీ శత్రువును నీ చేతికప్పగించాడు. ఈటెతో ఒక్కపోటు పొడిచి అతణ్ణి భూమికి నాటేస్తాను. సెలవియ్యి. రెండు సార్లు పొడవనవసరం ఉండదు” అన్నాడు.
9 అందుకు దావీదు ఇలా అన్నాడు: “నీవు అతణ్ణి నాశనం చేయవద్దు. యెహోవాచేత అభిషేకం పొందినవాడిమీద చెయ్యి ఎత్తి ఎవరు నిరపరాధి కాగలరు? 10 ✝యెహోవా సజీవుడన్నది ఎంత నిశ్చయమో, అంత నిశ్చయంగా యెహోవా తానే అతణ్ణి హతమారుస్తాడు. అతడు ప్రమాదంవల్ల చనిపోతాడు. లేదా, యుద్ధానికి వెళ్ళి నశిస్తాడు. 11 యెహోవాచేత అభిషేకం పొందినవాడిమీద చెయ్యి ఎత్తకుండా నన్ను యెహోవా ఆపుతాడు గాక! అయితే అతని తలగడ దగ్గర ఉన్న ఈటెనూ నీళ్ళ సీసానూ తీసుకొని మనం వెళ్ళిపోదాం.”
12 సౌలు తలగడ దగ్గర ఉన్న ఈటెనూ నీళ్ళ సీసానూ తీసుకొని దావీదు అబీషైతో కూడా వెళ్ళిపోయాడు. ఎవ్వరూ వారిని చూడలేదు, నిద్ర మేల్కోలేదు. యెహోవా వారందరికీ గాఢ నిద్ర కలిగించినందుచేత వారు నిద్రపోతూ ఉన్నారు✽. 13 దావీదు అవతలివైపుకు వెళ్ళి దూరంగా కొండపై నిలబడ్డాడు. వీరికీ వారికీ మధ్య చాల ఎడముంది. 14 అప్పుడు ప్రజలు, నేర్ కొడుకు అబ్నేర్ వినేలా “అబ్నేర్! నీవు జవాబియ్యవా?” అని దావీదు కేక వేశాడు. అందుకు అబ్నేర్ “రాజును నిద్ర లేపుతున్న నీవు ఎవడివి?” అని అడిగాడు.
15 దావీదు అన్నాడు, “నీవు మగవాడివి కావా? ఇస్రాయేల్ ప్రజలలో నీలాంటివాడెవడు? అయితే నీ యజమాని అయిన రాజుకు నీవెందుకు కాపలా కాయలేదు? రాజును నాశనం చేద్దామని ఒక వ్యక్తి వచ్చాడు. 16 నీవు చేసిన పని సరి కాదు. నీవూ నీ మనుషులూ యెహోవా చేత అభిషేకం పొందిన మీ యజమానిని కాపాడలేదు, గనుక మీరు చావతగ్గవాళ్ళని యెహోవా జీవంమీద ఆనబెట్టి చెపుతున్నాను. రాజుగారి ఈటె ఎక్కడ ఉందో చూడు! ఆయన తలగడ దగ్గర ఉండిన నీళ్ళసీసా ఎక్కడ ఉందోచూడు!”
17 ✝దావీదు స్వరాన్ని సౌలు గుర్తించి “దావీదు! నా కుమారా! ఇది నీ స్వరమేనా?” అన్నాడు.
అందుకు దావీదు అన్నాడు “అవును నా యజమానీ! నా రాజా! నా స్వరమే. 18 నా యజమాని తన సేవకుడైన నన్ను ఈ విధంగా ఎందుకు తరుముతూ ఉన్నాడు? నేనేం చేశాను? నా ప్రవర్తనలో ఏ దోషం ఉంది? 19 ✽ఇప్పుడు నా యజమానులైన మీరు మీ సేవకుని మాటలు ఆలకించండి. ఒక వేళ యెహోవా మిమ్మల్ని నాపై ప్రేరేపించాడు అంటే ఆయన అర్పణ స్వీకరించవచ్చు. కానీ మనుషులు మిమ్మల్ని ప్రేరేపించారు అంటే వాళ్ళు యెహోవా ఎదుట శాపానికి గురి అవుతారు గాక! ఎందుకంటే వాళ్ళు ‘నీవు వెళ్ళి ఇతర దేవుళ్ళను సేవించు’ అని నాతో చెప్పి యెహోవా ప్రసాదించిన వారసత్వంనుంచి నన్ను వెళ్ళగొట్టారు. 20 ఇప్పుడు యెహోవా సన్నిధానానికి దూరంగా నా రక్తాన్ని నేలమీదికి పడనియ్యకండి. ఇస్రాయేల్ రాజు బయలుదేరి కౌజుపిట్టలు కొండలపై వేటాడినట్టు త్రుళ్ళు పురుగులాంటి నన్ను వెదకడానికి వచ్చారు.”
21 ✽అందుకు సౌలు “నేను తప్పిదం చేశాను. ఇవ్వేళ నా ప్రాణం నీ దృష్టిలో విలువైంది, గనుక నేను ఇంకెన్నడూ నీకు హాని చేయను. దావీదు! నా కుమారా! తిరిగి రా✽! నేను తెలివి తక్కువవాడుగా ప్రవర్తించాను. పెద్ద పొరపాటు చేశాను” అన్నాడు.
22 దావీదు ఇలా చెప్పాడు: “రాజా, ఇదిగో, మీ ఈటె నా దగ్గర ఉంది. యువకులలో ఒకడు వచ్చి దానిని తీసుకోవచ్చు. 23 ✝యెహోవా అందరికీ తమ న్యాయ ప్రవర్తనకూ విశ్వసనీయతకూ ప్రతిఫలమిస్తాడు. ఇవ్వేళ ఆయన మిమ్మల్ని నా చేతికి అప్పగించాడు, గాని యెహోవా చేత అభిషేకం పొందినవాడిమీద నేను చెయ్యి ఎత్తలేదు. 24 ఈ రోజు నీ ప్రాణం నా దృష్టిలో విలువైంది గనుక యెహోవా నా ప్రాణాన్ని విలువైందిగా భావించి బాధలన్నిటినుంచి నన్ను రక్షిస్తాడు గాక!”
25 ✽అప్పుడు సౌలు దావీదుతో “దావీదు! నా కుమారా! నీకు ఆశీస్సులు కలుగుతాయి గాక! నీవు ఘనకార్యాలను చేసి విజయం సాధించితీరుతావు” అన్నాడు. అప్పుడు దావీదు తన దారిన వెళ్ళిపోయాడు. సౌలు తన స్థలానికి తిరిగి వెళ్ళిపోయాడు.