25
1 సమూయేలు చనిపోయాడు. ఇస్రాయేలంతా సమకూడి అతనికోసం శోకించారు. రమాలో అతని ఇంటిదగ్గర అతణ్ణి సమాధి చేశారు. అప్పుడు దావీదు పారాను ఎడారికి వెళ్ళాడు.
2 మాయోనులో ధనవంతుడొకడు ఉండేవాడు. అతడి వృత్తివ్యాపారాలు కర్మెల్ గ్రామంలో ఉన్నాయి. అతడు చాలా ఆస్తిపరుడు. మూడు వేల గొర్రెలూ వెయ్యి మేకలున్నాయి. అతడు వాటి బొచ్చు కత్తిరించడానికి కర్మెల్‌కు వెళ్ళి అక్కడ ఉన్నాడు. 3 అతడి పేరు నాబాల్. అతడి భార్య పేరు అబీగేల్. ఆమె జ్ఞానం గల స్త్రీ, అందకత్తె కూడా. కానీ అతడు కఠినుడు, అతడి వ్యవహారాలలో దుర్మార్గుడు. అతడు కాలేబు వంశంవాడు. 4 నాబాల్ గొర్రెల బొచ్చు కత్తిరిస్తున్నాడని ఎడారిలో ఉన్న దావీదుకు వినవచ్చింది. 5 దావీదు యువకులను పదిమందిని పిలిచి ఇలా అన్నాడు:
“కర్మెల్‌లో ఉన్న నాబాల్‌దగ్గరికి వెళ్ళి నా పేర కుశల ప్రశ్నలడిగి అతనితో ఈ విధంగా చెప్పండి: 6 ‘మీరు దీర్ఘాయుష్మంతులవుతారు గాక! మీకూ మీ ఇంటికీ మీకున్నదంతటికీ క్షేమం కలుగుతుంది గాక! 7 గొర్రెలబొచ్చు కత్తిరించేవాళ్ళు ఇప్పుడు మీదగ్గర పని చేస్తూ ఉన్నారని నాకు వినబడింది. మీ కాపరులు మా దగ్గర ఉన్నప్పుడు మేము వాళ్ళకు ఏలాంటి కీడు చేయలేదు. వాళ్ళు కర్మెల్‌లో ఉన్నంతకాలం కూడా వాళ్ళకు ఏమీ నష్టం కలగలేదు. 8 ఇది మీ పనివాళ్ళను అడిగితే వారే చెపుతారు. కనుక నేను పంపిన యువకులను దయ చూడండి. ఇది శుభదినం గదా. మీ సేవకులైన ఈ యువకులకూ మీ కొడుకు దావీదుకూ మీ చేతనైనది ఇవ్వండి.”
9 దావీదు పంపిన యువకులు వెళ్ళి దావీదు పేర ఈ సందేశాన్ని నాబాల్‌కు ఇచ్చి ఊరుకున్నారు. 10 దావీదు సేవకులతో నాబాల్ ఇలా చెప్పాడు:
“దావీదు ఎవడు? ఈ యెష్షయి కొడుకెవడు? ఈ రోజుల్లో తమ యజమానులను విడిచి చాలామంది పనివాళ్ళు పారిపోతున్నారు. 11 నా అన్నపానాలనూ గొర్రెబొచ్చు కత్తిరించే నా పనివాళ్ళకోసం నేను వధించిన జంతుమాంసాన్నీ తీసుకొని ఎక్కడనుంచి వచ్చారో నాకు తెలియనివాళ్ళకు ఎలా ఇస్తాను?” 12 దావీదు పంపిన యువకులు వెనక్కు తిరిగి, దావీదు దగ్గరికి వచ్చి నాబాల్ చెప్పిన ప్రతి మాటా తెలియజేశారు.
13 అప్పుడు దావీదు తన మనుషులతో “మీరంతా ఖడ్గాలు కట్టుకోండి” అన్నాడు. వారు, దావీదు కూడా ఖడ్గాలు కట్టుకొన్నారు. సుమారు నాలుగు వందలమంది దావీదుతో బయలుదేరారు. రెండు వందలమంది సామాను దగ్గర ఉండిపోయారు.
14 పనివారిలో ఒకడు నాబాల్ భార్య అబీగేల్‌కు ఆ విషయం తెలియజేశాడు: “అమ్మా, దావీదు ఎడారినుంచి మన యజమానికి శుభాకాంక్షలు తెలుపుతూ మనుషులను పంపితే అతడు వాళ్ళను తిట్టాడు. 15 అయితే వాళ్ళు మాకు చాలా మంచి చేశారు. మేము బయళ్ళలో వాళ్ళమధ్య ఉన్నప్పుడు వాళ్ళు మాకు ఏమీ హాని చేయలేదు. మాకు ఏమీ నష్టం కలగలేదు. 16 మేము గొర్రెలను మేపుతూ ఉన్నప్పుడు వాళ్ళు రాత్రింబగళ్ళు మా చుట్టూరా గోడలాగా ఉన్నారు.
17 “ఇప్పుడైతే మా యజమానికీ ఆయన ఇంటివారందరికీ విపత్తు జరగబోతూ ఉంది. గనుక మీరు ఆలోచించి ఏం చేయాలో నిశ్చయించుకోండి. మన యజమాని పనికిమాలిన దుర్మార్గుడు. ఎవ్వరూ అతడితో మాట్లాడలేరు.”
18 అది విని అబీగేల్ ఆలస్యం చేయలేదు. ఆమె రెండు వందల రొట్టెలనూ ద్రాక్షరసంతో నిండిన రెండు తిత్తులనూ, అయిదు గొర్రెల మాంసాన్నీ అయిదు మానికల వేయించిన ధాన్యాన్నీ వంద ఎండిన ద్రాక్ష పండ్ల అడలనూ రెండు వందల అంజూరు పండ్ల అడలనూ గాడిదల మీద వేయించింది. 19 అప్పుడామె తన పనివాళ్ళతో “మీరు నాకంటే ముందు వెళ్ళండి. నేను మీ వెనుక వస్తాను” అని చెప్పింది. అయితే ఆమె తన భర్త నాబాల్‌కు ఏమీ చెప్పలేదు. 20 ఆమె గాడిదమీద ఎక్కి కొండల సందులో వస్తూ ఉంటే దావీదూ అతని మనుషులూ తనవైపుకు రావడం కనిపించింది. ఆమె వారిని కలుసుకొంది.
21 అంతకుముందు దావీదు ఇలా చెప్పాడు: “నాబాల్‌కు ఈ ఎడారిలో ఉన్న ఆస్తినంతా నేను కాపాడడం నిష్‌ప్రయోజనం. అతడికి ఇక్కడున్నదేదీ పోలేదు గాని అతడు ఉపకారానికి బదులు నాకు అపకారం చేశాడు. 22 తెల్లవారే సరికి అతడికున్న వారిలో ఒక్క మగవాణ్ణి అయినా ఉండనివ్వను. లేదా, దానికంటే దేవుడు దావీదుకు పెద్ద విపత్తు జరిగిస్తాడు గాక!”
23 అబీగేల్ దావీదును చూచినవెంటనే గాడిద మీదనుంచి దిగి దావీదు ఎదుట సాష్టాంగపడింది. అతని పాదాలమీద పడి ఇలా చెప్పింది:
24 “అయ్యగారు! ఈ అపరాధం నాదని భావించండి. మీ పరిచారిక అయిన నన్ను మాట్లాడడానికి అనుమతించండి. నేను చెప్పేది వినండి. 25 అయ్యగారు దుర్మార్గుడైన నాబాల్‌ను లక్ష్యపెట్టవద్దు. అతడి పేరు నాబాల్, మూర్ఖత్వమే అతడి స్వభావం. నా యజమానులైన మీరు పంపిన యువకులను మీ పరిచారికనైన నేను చూడలేదు. 26 అయ్యగారు! ఇప్పుడు మిమ్మల్ని రక్తపాతం చేయకుండా స్వయంగా పగ తీర్చుకోకుండా యెహోవా ఆపాడు. మీ శత్రువులకూ, మీకు హాని చేయదలచుకొన్న వారందరికీ పట్టేగతి నాబాల్‌కు పట్టే గతిలా ఉండాలని నేను యెహోవా జీవం మీద మీ జీవం మీద ఒట్టు పెట్టి చెపుతున్నాను. 27 మీ పరిచారిక నేను ఈ కానుకను నా యజమానులైన మీకు తెచ్చాను. మిమ్మల్ని అనుసరిస్తున్న మనుషులకు ఇప్పించండి. 28 మీ పరిచారికనైన నా తప్పు క్షమించండి. నా యజమాని మీరు యెహోవాయొక్క యుద్ధాలను చేస్తూ ఉన్నారు, గనుక ఆయన మిమ్మల్ని సుస్థిరమైన రాజవంశంగా చేస్తాడు. మీరు బ్రతికినన్నాళ్ళు చెడుగు మీలో కనబడలేదు. 29 మిమ్మల్ని హింసించడానికీ మీ ప్రాణం తీయడానికీ ఎవడైనా ప్రయత్నిస్తే, నా యజమానులైన మీ ప్రాణాన్ని మీ దేవుడు యెహోవా సజీవులలో తన దగ్గర భద్రంగా ఉంచుకొంటాడు. కాని, వడిసెలతో రాళ్ళను విసిరినట్టు మీ శత్రువుల ప్రాణాలను ఆయన విసిరివేస్తాడు. 30 నా యజమానులైన మీ గురించి యెహోవా చెప్పిన ప్రతి మంచి విషయాన్నీ నెరవేర్చి మిమ్మల్ని ఇస్రాయేల్ ప్రజలకు నాయకుడుగా నియమిస్తాడు. 31 అప్పుడు ఈ విషయంవల్ల మీకు మనోవేదన, దుఃఖం కలగవు. ఎందుకంటే నా యజమానులైన మీరు ఇప్పుడు నిష్కారణంగా రక్తపాతం చేయలేదు. పగతీర్చుకోలేదు. నా యజమానులైన మీకు యెహోవా ఆ మేలు చేసిన తరువాత మీరు మీ పరిచారికనైన నన్ను జ్ఞాపకం చేసుకోండి.”
32 అందుకు దావీదు అన్నాడు, “ఈ వేళ నన్ను కలుసుకోవడానికి మిమ్మల్ని పంపిన ఇస్రాయేల్ ప్రజల దేవుడు యెహోవాకు స్తుతి! 33 నేను రక్తపాతం చేయకుండా, స్వయంగా పగతీర్చుకోకుండా మీ వివేకంతో మీరు నన్ను ఆపినందుచేత మీకు ఆశీస్సులు కలుగుతాయి గాక! 34 ఒకవేళ మీరు నన్ను కలుసుకోవడానికి త్వరగా రాకపోతే తెల్లవారేలోపుగా నాబాల్‌కు మగవాడు ఒక్కడూ మిగలకుండా ఉండేవాడని మీకు హాని చేయకుండేలా నన్ను ఆపిన ఇస్రాయేల్ ప్రజల దేవుడు యెహోవా మీద ఆనబెట్టి చెపుతున్నాను.”
35 అప్పుడు ఆమె తెచ్చినవాటిని దావీదు స్వీకరించి “నేను మీ మాటలు విని మీ మనవిని అంగీకరించాను. క్షేమంగా మీ ఇంటికి వెళ్ళండి” అని ఆమెతో చెప్పాడు.
36 అబీగేల్ తిరిగి నాబాల్ దగ్గరికి వెళ్ళింది. అతడు రాజులాగా ఇంట్లో గొప్ప విందు చేసి తప్పత్రాగి మత్తుగా ఉండి సంబరపడుతూ ఉన్నాడు. కనుక తెల్లవారేవరకు ఆమె అతడితో ఏమీ చెప్పలేదు. 37 ఉదయం మత్తు తగ్గినప్పుడు అతడి భార్య అతడికి ఆ సంగతులు చెప్పింది. వెంటనే అతడి గుండె చచ్చింది. అతడు రాయిలాగా బిగిసిపోయాడు. 38 పది రోజులైన తరువాత యెహోవా నాబాల్‌ను మొత్తాడు. నాబాల్ చనిపోయాడు.
39 నాబాల్ చనిపోయాడని దావీదు విన్నప్పుడు “నాబాల్ దగ్గర నేను పడ్డ అవమానం విషయం యెహోవా నా పక్షం వహించి అతడు చేసిన కీడుకు ప్రతీకారం చేశాడు. నన్ను చెడుగు చేయకుండేలా కాపాడాడు. యెహోవాకు స్తుతి!” అన్నాడు. అప్పుడు అబీగేల్‌ను పెండ్లి చేసుకోవాలనే ప్రతిపాదనను దావీదు ఆమెకు పంపాడు. 40 దావీదు సేవకులు కర్మెల్‌లో ఉన్న అబీగేల్ దగ్గరికి వెళ్ళి, “దావీదు మమ్మల్ని పంపాడు. అతడు మిమ్మల్ని తన భార్యగా స్వీకరించాలని తీసుకురమ్మన్నాడు” అన్నారు.
41 ఆమె నిలబడి సాష్టాంగపడి “నా యజమాని సేవకుల కాళ్ళు కడగడానికి కూడా నా యజమాని పరిచారిక అయిన నేను సిద్ధంగా ఉన్నాను” అని చెప్పింది.
42 వెంటనే ఆమె లేచి గాడిదమీద ఎక్కి ప్రయాణం అయింది. ఆమె అయిదుగురు పనికత్తెలు, దావీదు పంపిన రాయబారులు ఆమె వెంట వచ్చారు. ఆమె దావీదు దగ్గరికి చేరి అతని భార్య అయింది. 43 మునుపు దావీదు యెజ్రేల్ పట్టణం స్త్రీ అహీనోయమ్ను పెండ్లి చేసుకొన్నాడు. వారిద్దరూ అతనికి భార్యలుగా ఉన్నారు. 44 సౌలు కూతురూ దావీదు భార్యా అయిన మీకాల్‌ను సౌలు వేరే మనిషికి ఇచ్చాడు. అతడు లాయీషు కొడుకు పల్తీయేల్, అతడు గల్లీం గ్రామం వాడు.