24
1 సౌలు ఫిలిష్తీయవాళ్ళను తరిమివేసి తిరిగి వచ్చి నప్పుడు దావీదు ఏన్‌గెదీ ఎడారిలో ఉన్నాడని కబురు వచ్చింది. 2 సౌలు ఇస్రాయేల్‌వారిలో మూడు వేలమందిని ఎన్నుకొని యయేలీం బండదగ్గర దావీదునూ అతని మనుషులనూ వెదకడానికి వెళ్ళాడు. 3 దారిలో గొర్రెల దొడ్లను అతడు చేరుకొన్నప్పుడు అక్కడ గుహ ఒకటి కనిపించింది. సౌలు ఉపశమనం పొందడానికి అందులోకి వెళ్ళాడు. అప్పుడు దావీదూ అతని మనుషులూ గుహ వెనుక భాగాలలో ఉన్నారు. 4 దావీదు మనుషులు అతనితో, “యెహోవా నీతో ఏ రోజును గురించి చెప్పాడో ఆ రోజు వచ్చింది. ‘నీ శత్రువును నీ చేతికి అప్పగిస్తాను. అప్పుడు నీకు నీ దృష్టిలో ఏది మంచిదో అది నీవు అతనికి చేయవచ్చు’ అని యెహోవా చెప్పాడు గదా” అన్నారు. దావీదు వచ్చి సౌలుకు తెలియకుండా అతడి పై వస్త్రం అంచును కోశాడు. 5 సౌలు పైవస్త్రం అంచును కోసినందుచేత తరువాత దావీదు మనస్సులో నొచ్చుకొన్నాడు. 6 అతడు తన మనుషులతో, “ఆయన యెహోవాచేత అభిషేకం పొందినవాడు. యెహోవాచేత అభిషేకం పొందిన నా యజమానికి నేను ఇలా చేయడం, ఆయనకు వ్యతిరేకంగా నా చెయ్యి ఎత్తడం నాకు దూరం కావాలి!” అన్నాడు.
7 తన మనుషులను సౌలుపైబడకుండా ఇలాంటి మాటలతో దావీదు ఆపాడు. సౌలు తన ప్రయాణం సాగించడానికి గుహనుంచి బయటికి వెళ్ళాడు.
8 అప్పుడు దావీదు గుహనుంచి బయటికి వెళ్ళి “నా యజమానీ! రాజా!” అని సౌలు వెనుకనుంచి కేక వేశాడు. సౌలు వెనుకకు మళ్ళుకొని చూచినప్పుడు దావీదు నేలవైపు ముఖం వంచుకొని సాగిలపడ్డాడు. 9 అతడు సౌలుతో ఇలా అన్నాడు:
“దావీదు మీకు హాని చేయదలచుకొన్నాడని ప్రజలు చెప్పేది మీరెందుకు వింటారు? 10 ఈవేళ యెహోవా మిమ్మల్ని గుహలో నా చేతికి అప్పగించాడు. మీరు కండ్లారా చూస్తున్నారు గదా. మిమ్ములను చంపాలని కొంతమంది నాతో చెప్పారు గాని నేను మీమీద జాలిపడ్డాను. ‘ఈయన యెహోవాచేత అభిషేకం పొందినవాడు, గనుక నా యజమానికి వ్యతిరేకంగా నా చెయ్యి ఎత్తను’ అనుకొన్నాను. 11 నా తండ్రీ! ఇదిగో చూడు! నా చేతిలో మీ వస్త్రం అంచు ఉంది! నేను మిమ్ములను చంపకుండా ఈ అంచు మాత్రం కోశాను. కనుక మీకు హాని కలిగించే ఉద్దేశం గానీ తిరుగుబాటు చేసే ఉద్దేశం గానీ నాకు లేదని మీరు గ్రహించి తెలుసుకోండి. మీరు నా ప్రాణం తీయాలని నన్ను వెంటాడినా, మీకు వ్యతిరేకంగా నేను ఏమీ తప్పిదం చేయలేదు. 12 మీకూ నాకూ మధ్య యెహోవా న్యాయం తీరుస్తాడు గాక! నాకోసం మీకు ప్రతీకారం చేస్తాడు గాక! నేనైతే మీకు ఏమీ హాని చేయను. 13 దుర్మార్గులనుంచే దుర్మార్గం వెలువడుతుంది అని పూర్వీకుల సామెత ఉంది. నేను మీకు ఏమీ హాని చేయను. 14 ఇస్రాయేల్ ప్రజల రాజు ఎవరిని పట్టుకోవడానికి వచ్చాడు? ఎంతటివాణ్ణి వెంటాడుతూ ఉన్నాడు? చచ్చిన కుక్కలాంటివాణ్ణే గదా! త్రుళ్ళుపురుగునే గదా! 15 మీకూ నాకూ మధ్య యెహోవా తానే న్యాయమూర్తిగా తీర్పు తీరుస్తాడు గాక! ఆయనే చూచి నా పక్షం వహించి మీ చేతినుంచి నన్ను విడిపిస్తాడు గాక!”
16 దావీదు ఇలా మాట్లాడడం ముగించిన తరువాత సౌలు “దావీదు! నా కుమారా! ఈ కంఠం నీదా?” అని అడిగాడు. అప్పుడు అతడు గట్టిగా ఏడ్చి ఇలా చెప్పాడు: 17 “నాకంటే నీవు న్యాయవంతుడివి. నేను నీకు చేసిన కీడుకు నీవు నాకు మంచి చేశావు. 18 యెహోవా నన్ను నీ చేతికి అప్పగించినా నీవు నన్ను చంపక ఇవ్వేళ నాపట్ల నీ దయను ప్రదర్శించావు. 19 ఎవరికైనా శత్రువు దొరికితే అతడు వాణ్ణి క్షేమంగా వెళ్ళనిస్తాడా? ఈ రోజు నీవు నాకు చేసిన మంచికి యెహోవా ప్రతిగా నీకు మంచి చేస్తాడు గాక! 20 నీవు తప్పక రాజవుతావు. నీ చేతిలో ఇస్రాయేల్ రాజ్యం సుస్థిరమవుతుంది. నాకు తెలుసు. 21 నా సంతానాన్ని నాశనం చేయవనీ నా తండ్రి వంశంలో నా పేరు కొట్టివేయవనీ యెహోవా పేర నాకు శపథం చెయ్యి.”
22 దావీదు అలాగే సౌలుకు శపథం చేశాడు. అప్పుడు సౌలు ఇంటికి వెళ్ళిపోయాడు. దావీదు, అతని మనుషులు తమ భద్రమైన స్థలానికి వెళ్ళారు.