23
1 ఫిలిష్తీయవాళ్ళు కెయిలా గ్రామం మీద దాడిచేసి కళ్ళాలలో ధాన్యాన్ని దోచుకుంటున్నారనే వార్త దావీదుకు వచ్చింది.
2 దావీదు “నేను వెళ్ళి ఫిలిష్తీయవాళ్ళ పైబడనా?” అని యెహోవాను అడిగాడు.
యెహోవా “నీవు వెళ్ళి ఫిలిష్తీయవాళ్ళ పైబడి కెయిలాను రక్షించు” అని దావీదుకు జవాబిచ్చాడు.
3 అయితే దావీదుతో ఉన్నవారు “ఇక్కడ యూదా ప్రదేశంలోనే మాకు భయంగా ఉంది. ఫిలిష్తీయ సైన్యాన్ని ఎదుర్కోవడానికి కెయిలాకు పోతే ఇంకెంత భయం కలుగుతుందో!” అని చెప్పారు.
4 దావీదు యెహోవాను మళ్ళీ అడిగాడు. “నీవు కెయిలాకు వెళ్ళు. నేను ఫిలిష్తీయవాళ్ళను నీ వశం చేస్తాను” అని యెహోవా జవాబిచ్చాడు.
5 అందుచేత దావీదు అతనితో ఉన్నవారు కెయిలాకు వెళ్ళి ఫిలిష్తీయవాళ్ళతో పోరాడి చాలామందిని హతమార్చి వాళ్ళ పశువులను దోచుకొన్నారు. ఈ విధంగా దావీదు కెయిలా పురవాసులను రక్షించాడు.
6 అహీమెలెక్ కొడుకు అబ్యాతారు కెయిలాలో ఉన్న దావీదు దగ్గరికి పారిపోయినప్పుడు ఏఫోదు చేతపట్టుకువచ్చాడు.
7 దావీదు కెయిలాకు వెళ్ళిన విషయం సౌలు విని “దావీదు ద్వారాలూ అడ్డగడలూ ఉన్న ఊరిలో చొచ్చి అందులో మూసివేయబడి ఉన్నాడు. దేవుడు అతణ్ణి నా చేతికి అప్పగించాడన్నమాట” అన్నాడు.
8 సౌలు కెయిలాకు వెళ్ళి దావీదునూ అతడితో ఉన్నవారినీ ముట్టడించాలని అందరినీ యుద్ధానికి పిలిచాడు. 9 తనకు సౌలు హాని చేయడానికి కుట్ర పన్నుతున్నాడని దావీదు తెలుసుకొని అబ్యాతారుతో “ఏఫోదును తీసుకురా” అన్నాడు.
10 అప్పుడు దావీదు ఇలా ప్రార్థన చేశాడు: “యెహోవా! ఇస్రాయేల్‌ప్రజల దేవా! నా కారణంగా సౌలు కెయిలాకు వచ్చి ఈ ఊరిని నాశనం చేయదలస్తున్నాడని నీ సేవకుడైన నాకు ఖచ్చితంగా తెలిసింది. 11 కెయిలా ప్రజలు నన్నూ నాతో ఉన్నవారినీ సౌలు చేతికి అప్పగిస్తారా? నీ సేవకుడైన నేను విన్నట్టు సౌలు నిజంగా వస్తాడా? యెహోవా! ఇస్రాయేల్‌ప్రజల దేవా! నీ సేవకుడైన నాకు తెలియజెయ్యి.” యెహోవా “అతడు రావాలని ఉన్నాడు” అని జవాబిచ్చాడు.
12 “కెయిలా ప్రజలు నన్నూ నాతో ఉన్నవారినీ సౌలు చేతికి అప్పగిస్తారా?” అని దావీదు మళ్ళీ అడిగాడు. యెహోవా “వారు మిమ్ములను అప్పగించాలని ఉన్నారు” అని చెప్పాడు.
13 కనుక దావీదూ అతనితో ఉన్న ఆ ఆరు వందలమంది మనుషులూ కెయిలాను విడిచి వారు వెళ్ళగలిగే చోటికి వెళ్ళారు. దావీదు కెయిలానుంచి తప్పించుకొన్న విషయం సౌలు విని అక్కడికి వెళ్ళలేదు.
14 దావీదు ఎడారిలో భద్రమైన స్థలాలలో, జీఫు ఎడారి కొండప్రదేశంలో ఉండిపోయాడు. రోజురోజుకు సౌలు అతణ్ణి వెదకుతూ ఉన్నా, దేవుడు అతణ్ణి సౌలు చేతికి అప్పగించలేదు. 15 తన ప్రాణం తీయడానికి సౌలు బయలుదేరాడని దావీదు తెలుసుకొన్నప్పుడు జీఫు ఎడారిలో హోరేషులో ఉన్నాడు. 16 అప్పుడు సౌలు కొడుకు యోనాతాను హోరేషులో ఉన్న దావీదు దగ్గరికి వెళ్ళి దావీదును దేవునిలో బలపరచాడు.
17 అతడు దావీదుతో అన్నాడు “భయంతో ఉండవద్దు. నా తండ్రి సౌలు నిన్ను పట్టుకోలేడు. నీవు ఇస్రాయేల్‌ప్రజలకు రాజవుతావు. నీ తరువాత హోదాలో నేనుంటాను. నా తండ్రి సౌలుకు కూడా ఈ విషయం తెలుసు.”
18 వారిద్దరు యెహోవా సమక్షంలో ఒడంబడిక చేసుకొన్నారు. అప్పుడు యోనాతాను ఇంటికి వెళ్ళిపోయాడు, దావీదు హోరేషులో ఉండిపోయాడు.
19 తరువాత జీఫువారు సౌలు దగ్గరికి వెళ్ళి “దావీదు హోరేషుదగ్గర మా మధ్య దాగి ఉన్నాడు. అతడు యెషీమోను దక్షిణంగా ఉన్న హకీలా కొండలో భద్రమైన స్థలాలలో ఉన్నాడు. 20 రాజా! నీకు ఎప్పుడు ఇష్టం ఉంటే అక్కడికి రా. మేము అతణ్ణి రాజు చేతికి అప్పగిస్తాం” అన్నారు.
21 అందుకు సౌలు “మీరు నామీద జాలి చూపారు, గనుక యెహోవా మీకు ఆశీస్సులు ప్రసాదిస్తాడు గాక! 22 ఇప్పుడు మీరు వెళ్ళి అతడు ఉన్న స్థలం ఏదో, అతణ్ణి చూచిన వాళ్ళెవరో ఇంకా రూఢిగా తెలుసుకోండి. అతడు చాలా యుక్తితో వ్యవహరిస్తూ ఉన్నాడని నాకు తెలిసింది. 23 అతడు దాక్కొనే స్థలాలను మీరు జాగ్రత్తతో కనిపెట్టి స్పష్టమైన విషయం తెలియజేయడానికి తప్పక నాదగ్గరికి తిరిగి రండి. అప్పుడు నేను మీతో వస్తాను. అతడు ఆ ప్రదేశంలో ఉంటే వేలకొలది మంది యూదావారిలో గాలించి అతణ్ణి పట్టుకొంటాను” అన్నాడు.
24 వారు సౌలుకంటే ముందు బయలుదేరి జీఫుకు తిరిగి వెళ్ళారు. అప్పుడు దావీదు అతని మనుషులు మాయోను ఎడారిలో ఉన్నారు. అది యెషీమోనుకు దక్షిణంగా ఉన్న ఎండిన ప్రదేశంలో ఉంది. 25 సౌలు అతడి మనుషులు తనను వెదకడానికి బయలుదేరిన మాట దావీదు విని మాయోను ఎడారిలో ఉన్న రాతి కొండకు వెళ్ళి అక్కడ ఉండిపోయాడు. అది విని సౌలు మాయోను ఎడారిలో దావీదు వెంటబడ్డాడు. 26 కొండకు ఒకవైపు సౌలు, మరో వైపు దావీదు, అతని మనుషులు ఉన్నారు. సౌలు, అతడి మనుషులు దావీదునూ అతని మనుషులనూ పట్టుకోవడానికి చుట్టుముట్టబోతూ ఉంటే, దావీదు వాళ్ళ బారినుండి తప్పించు కోవడానికి త్వరగా వెళ్ళిపోతూ ఉన్నాడు. 27 అప్పుడే ఒక మనిషి సౌలుకు వార్త చెప్పడానికి వచ్చాడు.
అతడు “మీరు త్వరగా రావాలి. ఫిలిష్తీయవాళ్ళు దండెత్తి వచ్చి దేశంలో చొరబడ్డారు” అని తెలియజేశాడు.
28 వెంటనే దావీదును వెంటాడడం ఆపివేసి సౌలు ఫిలిష్తీయవాళ్ళను ఎదుర్కోవడానికి వెళ్ళాడు. అందుచేత ఆ స్థలాన్ని “హమ్మలెకోతు బండ” అంటారు. 29 తరువాత దావీదు అక్కడనుంచి వెళ్ళి ఏన్‌గెదీలో ఉన్న భద్రమైన స్థలాలలో ఉండిపోయాడు.