22
1 దావీదు అక్కడనుంచి అదుల్లాం✽ గుహలోకి తప్పించుకు వెళ్ళాడు. ఆ విషయం విని అతని అన్నలూ✽ అతని తండ్రి ఇంటివారంతా అతని దగ్గరికి వెళ్ళారు. 2 అంతే కాకుండా, ఇబ్బందుల్లో ఉన్నవారూ అప్పులపాలైన వారూ అసంతృప్తిగా ఉన్నవారంతా✽ అతని దగ్గరికి చేరుకొన్నారు. అతడు వారికి నాయకుడయ్యాడు. అతనితో సుమారు నాలుగు వందలమంది ఉన్నారు. 3 దావీదు అక్కడనుంచి మోయాబులో ఉన్న మిస్పేకు వెళ్ళాడు. అతడు మోయాబు✽ రాజుతో, “దేవుడు నాకు ఏం చేస్తాడో నేను తెలుసుకొనేవరకు నా తల్లిదండ్రులు వచ్చి మీ దగ్గర ఉండనివ్వండి” అని విన్నవించు కొన్నాడు.4 దావీదు వారిని మోయాబు రాజు దగ్గరికి తీసుకుపోయి వారిని అక్కడ విడిచిపెట్టి వెళ్ళాడు. దావీదు తన భద్రమైన స్థలంలో ఉన్నంత కాలం వారు మోయాబు రాజు దగ్గర ఉండిపోయారు.
5 తరువాత గాదు✽ ప్రవక్త “ఈ భద్రమైన స్థలంలో ఉండవద్దు. యూదా ప్రదేశానికి వెళ్ళిపో✽” అని దావీదుతో చెప్పాడు. దావీదు వెళ్ళి హారెతు అడవిలో ప్రవేశించాడు.
6 దావీదు, అతని మనుషులు ఉన్నచోటు సౌలుకు తెలిసింది. అప్పుడు సౌలు గిబియాలో ఎత్తు స్థలంమీద ఈటె చేతపట్టుకొని పిచులవృక్షం క్రింద కూర్చుని ఉన్నాడు. అతని చుట్టూ అతని పరివారం నిలబడి ఉన్నారు. 7 ✽సౌలు వారితో అన్నాడు, “బెన్యామీను వంశంవారలారా! వినండి! యెష్షయి కొడుకు మీకందరికీ పొలాలనూ ద్రాక్షతోటలనూ ఇస్తాడా? మిమ్మల్నందరినీ వందమంది సైనికులమీద వెయ్యిమంది సైనికులమీద అధిపతులుగా నియమిస్తాడా? 8 మీరంతా నామీద కుట్ర✽ చేసినది అందుకేనా? నా కొడుకు యెష్షయి కొడుకుతో ఒడంబడిక చేసుకొన్న విషయం నాకు మీరెవ్వరూ తెలపలేదు. నా విషయం మీలో ఎవ్వడికీ విచారం లేదు✽. ఈరోజు జరుగుతూ ఉన్నట్టు, నా దాసుడు నాకోసం పొంచి ఉండేట్టు నా కొడుకు వాణ్ణి ప్రేరేపించాడని ఎవ్వరూ నాతో చెప్పలేదు.”
9 సౌలు పరివారం మధ్య ఎదోం దేశంవాడు దోయేగు✽ నిలబడి ఉన్నాడు. అతడు “యెష్షయి కొడుకు నోబులో అహీటూబు కొడుకు అహీమెలెక్ దగ్గరికి రావడం నేను చూశాను. 10 అహీమెలెక్ అతనికోసం యెహోవాను సంప్రదించి ఆహారాన్నీ ఫిలిష్తీయవాడైన గొల్యాతు ఖడ్గాన్ని అతడికిచ్చాడు” అని చెప్పాడు.
11 అహీటూబు కొడుకు అహీమెలెక్‌యాజినీ నోబులో ఉన్న అతని తండ్రి కుటుంబానికి చెందిన యాజులందరినీ రాజు పిలిపించాడు. వారంతా రాజుదగ్గరికి వచ్చారు.
12 సౌలు “అహీటూబు కొడుకా! విను!” అన్నాడు.
అహీమెలెక్ “వింటాను, నా యజమానీ” అన్నాడు.
13 సౌలు “నీవు యెష్షయి కొడుకుతో కలిసి నామీద ఎందుకు కుట్ర పన్నావు? నీవు వాడికి రొట్టెలనూ ఖడ్గాన్నీ ఇచ్చావు. వాడికోసం దేవుణ్ణి సంప్రదించావు. వాడు నాపై తిరుగుబాటు చేసి నాకోసం ఈ రోజువరకు కూడా పొంచి ఉండడానికి నీవు తోడ్పడ్డావు” అని అతనితో చెప్పాడు.
14 ✽అందుకు అహీమెలెక్ అన్నాడు, “రాజా, దావీదుకంటే నమ్మకమైనవాడు నీ సేవకులలో ఎవరున్నారు? అతడు నీకు అల్లుడు, నీ దేహ రక్షక భటులకు అధిపతి, నీ ఇంట్లో గౌరవనీయుడు. 15 అతని కోసం నేను దేవుణ్ణి సంప్రదించడం ఇది మొదటి సారా? కానే కాదు. రాజా, నీ సేవకుడైన నామీద గానీ నా తండ్రి కుటుంబంవారిలో ఎవరిమీదా గానీ ఈ నేరం మోపకండి. ఈ విషయం కొంత కూడా నాకు తెలియదు.”
16 ✽అయితే రాజు “అహీమెలెక్! నీకూ నీ తండ్రి కుటుంబం వారందరికీ చావు తప్పదు” అన్నాడు.
17 ✽అప్పుడు తన ప్రక్కన నిలబడి ఉన్న రక్షక భటులను చూచి “యెహోవా యాజులైన వీరు దావీదుతో చేతులు కలిపారు. దావీదు పారిపోయిన సంగతి తెలిసి కూడా వాళ్ళు నాకు తెలియజేయలేదు. కనుక వాళ్ళ వైపు తిరిగి వాళ్ళను చంపండి” అని ఆజ్ఞ జారీ చేశాడు. కానీ ఆ భటులు యెహోవా యాజులను చంపడానికి నిరాకరించారు.
18 ✝అప్పుడు రాజు “నీవు అటు తిరిగి ఈ యాజులను కూలగొట్టు!” అని దోయేగుకు ఆదేశించాడు. కనుక ఎదోంవాడు దోయేగు వారివైపు తిరిగి వారిని కూలగొట్టాడు. ఆ రోజు వాడు నార ఏఫోదు ధరించుకొనేవారిని ఎనభై అయిదుమందిని చంపాడు. 19 ✽అంతేగాక, యాజుల ఊరు నోబును కత్తిపాలు చేశాడు. అక్కడి స్త్రీ పురుషులనూ పిల్లలనూ పసిబిడ్డలనూ పశువులనూ గాడిదలనూ గొర్రెలనూ ఖడ్గంతో నాశనం చేశాడు.
20 ✝అయితే అహీటూబు మనుమడూ అహీమెలెక్ కొడుకూ అయిన అబ్యాతారు తప్పించుకొని దావీదుదగ్గరికి పారిపోయాడు. 21 యెహోవా యాజులను సౌలు చంపాడని అతడు దావీదుకు తెలియజేశాడు. 22 ✽దావీదు అబ్యాతారుతో ఇలా చెప్పాడు:
“ఆ రోజు ఎదోంవాడు దోయేగు అక్కడ ఉండడం చూచి వాడు సౌలుకు తప్పక చెపుతాడని నేననుకొన్నాను. మీ తండ్రి కుటుంబంవారందరి మృతికి నేనే కారకుణ్ణి. 23 నీవు నాదగ్గర ఉండు. భయపడవద్దు. నీ ప్రాణం తీయాలని చూస్తున్నవాడు నా ప్రాణం కూడా తీయాలని చూస్తూ ఉన్నాడు. నా దగ్గర నీవు సురక్షితంగా ఉంటావు.”