20
1 ✽తరువాత దావీదు రమాదగ్గర ఉన్న నాయోతునుంచి పారిపోయి యోనాతానుదగ్గరికి వెళ్ళి ఇలా అడిగాడు: “నేను ఏం చేశాను? నా అపరాధమేమిటి? నీ తండ్రి నా ప్రాణం తీయడానికి చూస్తూ ఉన్నాడు. ఆయనకు నాలో ఏ దోషం కనిపించింది?”2 ✽అందుకు యోనాతాను “అలా ఎప్పుడూ అనుకోకు! నీవు చావవు. నాకు తెలియజేయకుండా నా తండ్రి చిన్న పనినైనా పెద్ద పనినైనా చేయడు. ఆయన ఇది ఎందుకు నాకు దాచాలి? నీవు అనుకొన్నది నిజం కాదు” అన్నాడు. 3 కానీ దావీదు “నీవు నన్ను దయ చూస్తున్నావని నీ తండ్రికి బాగా తెలుసు. ‘యోనాతాను నొచ్చుకోకుండా అతడు ఈ విషయం తెలుసు కోకూడదు’ అనుకొన్నాడు నీ తండ్రి. అయితే యెహోవా జీవం మీదా నీ జీవం మీదా ఒట్టు పెట్టి చెపుతున్నాను – నిజంగా నాకూ మరణానికీ అడుగు దూరం మాత్రం ఉంది” అని శపథం చేసి చెప్పాడు.
4 యోనాతాను “నీవు ఏమి చెపుతావో నేను నీకోసం అదే చేస్తాను” అని దావీదుతో చెప్పాడు.
5 అందుకు దావీదు ఇలా అన్నాడు: “ఇదిగో విను, రేపు అమావాస్య✽. నేను తప్పక రాజుతోకూడా కూర్చుని భోజనం చేయాలి. అయినా మూడో రోజు సాయంత్రంవరకు పొలంలో దాగుకోవడానికి నన్ను వెళ్ళనియ్యి. 6 ✽మీ తండ్రి ఒక వేళ నేను కనబడడం లేదని గమనిస్తే నీవు ఈ విధంగా చెప్పు – ‘దావీదు తన బేత్‌లెహేం పురానికి వెళ్ళాలని నన్ను ప్రాధేయపడి సెలవు అడిగాడు. ఎందుకంటే అక్కడ వారి కుటుంబంవారంతా వార్షిక బలి అర్పిస్తారు.’ 7 మీ తండ్రి మంచిదని అంటే నీ సేవకుడైన నాకు క్షేమమే. ఒక వేళ అతడు కోపగిస్తే హాని చేయడానికి నిశ్చయించుకొన్నాడని నీవు తెలుసుకొంటావు. 8 నీవు నీ సేవకుడైన నాతో యెహోవా సమక్షంలో ఒడంబడిక✽ చేసు కొన్నావు గదా. కనుక నన్ను దయ చూడు. ఒకవేళ నాలో ఏదైనా అపరాధం ఉంటే నీవే నన్ను చంపు. మీ తండ్రి దగ్గరికి నన్నెందుకు తీసుకుపోవాలి?”
9 అందుకు యోనాతాను “అలా ఎన్నడూ అనుకోకు! నా తండ్రి నీకు హాని చేయడానికి నిశ్చయించుకొన్నాడని నాకు తెలిస్తే నీకు చెపుతాను గదా” అన్నాడు.
10 “మీ తండ్రి నా విషయం నీతో కఠినంగా మాట్లాడితే అది నాకు ఎవరు తెలియజేస్తారు?” అని దావీదు అడిగాడు.
11 యోనాతాను “పొలంలోకి వెళ్దాం, రా” అన్నాడు. ఇద్దరూ పొలంలోకి వెళ్ళారు.
12 అక్కడ యోనాతాను దావీదుతో అన్నాడు, “ఇస్రాయేల్ ప్రజల దేవుడు యెహోవా సాక్ష్యంగా, రేపు, ఎల్లుండి ఇదే వేళకు నా తండ్రిని నేను ప్రశ్నలడుగుతాను. ఆయన దృక్పథం నీకు అనుకూలమైతే నేను నీకు ఆ వార్తను తెలియజేస్తాను. 13 ✽కానీ నీకు హాని చేసే ఉద్దేశం ఆయనకు ఉంటే, నేను ఆ విషయం నీకు తెలపకుండా నిన్ను క్షేమంగా పంపకపోతే యెహోవా నాకు పెద్ద ప్రమాదం కలిగిస్తాడు గాక! యెహోవా నా తండ్రికి తోడుగా ఉన్నట్టు నీకు కూడా తోడుగా ఉంటాడు గాక! 14 నేను బ్రతికి ఉన్నంతకాలం నీవు నామీద యెహోవా దయ చూపు. 15 యెహోవా దావీదు శత్రువులందరినీ భూమిమీద లేకుండా నాశనం చేసిన తరువాత కూడా నీవు నా కుటుంబంవారిమీద దయ చూపడం ఎప్పటికీ మానవద్దు.”
16 ✽యోనాతాను దావీదు వంశంతో ఒడంబడిక చేశాడు. అతడు “దావీదు యొక్క శత్రువులు లెక్క అప్పగించేలా యెహోవా చేస్తాడు గాక!” అన్నాడు.
17 ✝యోనాతాను తన ప్రాణంతో సమంగా దావీదును ప్రేమించాడు గనుక ఆ ప్రేమ కారణంగా అతడు మళ్ళీ దావీదుచేత ప్రమాణం చేయించాడు. 18 అప్పుడతడు దావీదుతో అన్నాడు, “రేపు అమావాస్య. నీవు ఇక్కడ ఉండవు గనుక నీ కుర్చీ ఖాళీగా ఉండడం నా తండ్రి గమనిస్తాడు. 19 మూడో రోజువరకు నీవు ఆగు. అప్పుడు, ఈ విషయం మొదలైన రోజున నీవు దాగుకొన్న స్థలానికి త్వరగా వెళ్ళు. ఏసెల్ అనే బండదగ్గర ఉండు. 20 నేను వచ్చి గురి చూచి కొట్టినట్టు మూడు బాణాలను ఆ బండ ప్రక్కకు వేస్తాను. 21 అప్పుడు ఒక పిల్లవాణ్ణి పంపి ‘నీవు వెళ్ళి బాణాలను వెదకు’ అని చెపుతాను. ‘ఇవిగో బాణాలు నీకు ఈ వైపున ఉన్నాయి. తీసుకురా’ అని నేను వాడితో చెప్తే, నీవు బయటకు రావచ్చు. యెహోవా జీవంతోడు నీకు ఏ అపాయం రాదు. నీవు సురక్షితంగా ఉన్నావన్నమాట. 22 అయితే ‘బాణాలు నీకు అవతల ఉన్నాయి’ అని నేను ఆ అబ్బాయితో చెపితే నీవు వెళ్ళిపోవాలి. యెహోవా నిన్ను పంపివేస్తున్నాడు. 23 అయితే మనమిద్దరం మాట్లాడిన విషయం✽ గురించి నీకు నాకు మధ్య యెహోవా ఎప్పటికీ సాక్షిగా ఉన్నాడనీ జ్ఞాపకం ఉంచుకో.”
24 అందుచేత దావీదు పొలంలో దాగుకొన్నాడు. అమావాస్య వచ్చినప్పుడు రాజు భోజనం చేయడానికి కూర్చున్నాడు. 25 ఎప్పటిలాగే రాజు గోడదగ్గర తన స్థానంలో కూర్చున్నాడు. యోనాతాను లేచినప్పుడు అబ్నేర్ సౌలు ప్రక్కన కూర్చున్నాడు. అయితే దావీదు స్థలం ఖాళీగా ఉంది.
26 “దావీదుకు ఏదో సంభవించి అశుద్ధం✽ అయ్యాడు. తప్పక అశుద్ధంగా ఉన్నాడు” అని సౌలు అనుకొని ఆ రోజు ఏమీ చెప్పలేదు. 27 రెండో రోజు – అమావాస్య మరుసటి రోజు – దావీదు స్థలం మళ్ళీ ఖాళీగా ఉంది.
అప్పుడు సౌలు “యెష్షయి కొడుకు నిన్న, ఈ రోజు కూడా భోజనానికి ఎందుకు రాలేదు?” అని తన కొడుకు యోనాతానును అడిగాడు. 28 అందుకు యోనాతాను ఇలా జవాబిచ్చాడు: “దావీదు బేత్‌లెహేం వెళ్ళడానికి నన్ను ప్రాధేయపడి సెలవడిగాడు. 29 ‘నన్ను వెళ్ళనియ్యి. ఊరిలో మా కుటుంబంవారు బలి అర్పిస్తారు. నన్ను రమ్మని నా అన్న ఆదేశించాడు. నీవు నన్ను దయ చూస్తే నా అన్నలను చూడడానికి నన్ను వెళ్ళనియ్యి’ అని నాదగ్గర సెలవు తీసుకొన్నాడు. అందుచేత అతడు రాజు బల్లదగ్గరికి భోజనానికి రాలేదు.”
30 యోనాతానును చూచి సౌలు కోపం✽తో మండిపడి అతనితో ఇలా అన్నాడు: “వక్రబుద్ధి గల తిరుగుబోతుదాని కొడుకా! నీకూ, నిన్ను కన్న తల్లికీ అవమానం కలిగేట్టు నీవు యెష్షయి కొడుకును మిత్రుడుగా ఎన్నుకొన్నావని నాకు తెలియదా? 31 యెష్షయి కొడుకు ఈ లోకంలో బ్రతికి ఉన్నంత కాలం నీకైనా నీ రాజ్యానికైనా సుస్థిరత్వం కలగదు. నీవు వాణ్ణి పిలిపించి నాదగ్గరికి తీసుకురా. వాడు తప్పక చావాలి!”
32 ✽యోనాతాను “అతణ్ణి ఎందుకు చంపాలి? అతడు ఏమి చేశాడు?” అని తండ్రిని అడిగాడు.
33 అప్పుడు యోనాతానును పొడవాలని సౌలు ఈటె విసిరాడు. అందుచేత దావీదును చంపాలని తన తండ్రి నిశ్చయించుకొన్న సంగతి యోనాతానుకు తెలిసింది. 34 అతడు తీవ్ర కోపంతో భోజనాల బల్ల దగ్గరనుంచి లేచాడు. దావీదును తన తండ్రి అవమానానికి గురి చేసినందువల్ల యోనాతాను దుఃఖపడుతూ, అమావాస్య అయిన ఆ రెండో రోజున ఉపవాసం ఉన్నాడు.
35 ప్రొద్దున యోనాతాను దావీదుతో చేసిన ఏర్పాటుప్రకారం ఆ పొలానికి వెళ్ళాడు. అతనితో కూడా ఒక అబ్బాయి ఉన్నాడు. 36 ✽అతడు అబ్బాయితో “నీవు పరుగెత్తి వెళ్ళి నేను వేసే బాణాలను వెదకు” అన్నాడు. ఆ కుర్రవాడు పరుగెత్తుతూ ఉండగానే యోనాతాను వాడికి అవతలకు ఒక బాణం వేశాడు. 37 యోనాతాను వేసిన బాణం ఉన్న చోటికి అబ్బాయి వెళ్ళినప్పుడు యోనాతాను “బాణం నీ అవతల ఉంది గదా” అని కేక పెట్టాడు. 38 “నీవు ఆలస్యం చేయవద్దు. త్వరగా వెళ్ళు” అని అతడు మళ్ళీ కేక వేశాడు. అబ్బాయి బాణాన్ని ఎత్తుకొని తన యజమాని దగ్గరికి తీసుకువచ్చాడు. 39 అసలు విషయం వాడికి ఏమీ తెలియదు. యోనాతానుకూ దావీదుకూ మాత్రం తెలుసు. 40 యోనాతాను తన ఆయుధాలను ఆ కుర్రవాడి చేతికిచ్చి “వీటిని ఊరికి తీసుకుపో” అని చెప్పాడు. 41 వాడు వెళ్ళిపోయిన తరువాత దావీదు దక్షిణంవైపునుంచి బయటికి వచ్చాడు. అతడు యోనాతాను ఎదుట మూడుసార్లు సాష్టాంగపడ్డాడు✽. అప్పుడు వారు ఒకరినొకరు ముద్దుపెట్టుకొని ఏడ్చారు. దావీదు మరి ఎక్కువగా ఏడ్చాడు.
42 యోనాతాను దావీదుతో అన్నాడు “మనమిద్దరం యెహోవా పేర ప్రమాణం చేసుకొన్నాం. ‘నీకు నాకు మధ్య నీ సంతానానికి నా సంతానానికి మధ్య యెహోవా ఎప్పటికీ సాక్షిగా ఉంటాడు’ అన్నాం గదా. గనుక క్షేమంగా వెళ్ళు.” అప్పుడు దావీదు వెళ్ళిపోయాడు✽. యోనాతాను ఊరికి తిరిగి వెళ్ళాడు.