19
1 దావీదును చంపాలని✽ సౌలు తన కొడుకు యోనాతానుతో, తన సేవకులందరితో చెప్పాడు. అయితే సౌలు కొడుకు యోనాతానుకు దావీదు అంటే చాలా ఇష్టం✽, 2 గనుక అతడు దావీదుతో “నా తండ్రి సౌలు నిన్ను చంపాలని చూస్తూ ఉన్నాడు. రేపు ప్రొద్దున నీవు జాగ్రత్తగా ఉండి రహస్యమైన స్థలంలో దాక్కో. 3 నీవు ఉన్న పొలంలోకి వచ్చి నా తండ్రిదగ్గర నిలబడి నీ గురించి ఆయనతో మాట్లాడతాను. పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకొని తరువాత నీతో చెపుతాను” అన్నాడు.4 యోనాతాను తన తండ్రి సౌలుతో దావీదును గురించి దయగా మాట్లాడి ఇలా అన్నాడు: “రాజుగారు తన సేవకుడైన దావీదుకు వ్యతిరేకంగా తప్పిదం చేయకూడదు. అతడు మీకు వ్యతిరేకంగా ఏమీ తప్పిదం చేయలేదు. అసలు, అతడు చేసినదానివల్ల మీకు చాలా మేలు కలిగించి 5 తన ప్రాణానికి తెగించి ఆ ఫిలిష్తీయవాణ్ణి చంపినప్పుడు యెహోవా ఇస్రాయేల్ ప్రజలందరికీ గొప్ప విజయాన్ని చేకూర్చాడు. అది చూచి మీరే సంతోషించారు గదా. అయితే నిష్కారణంగా దావీదును చంపి నిర్దోషి ప్రాణం తీసి మీరెందుకు పాపం చేస్తారు?”
6 ✽యోనాతాను చెప్పిన మాట విని సౌలు “అతణ్ణి చంపను. యెహోవా జీవంతోడని ప్రమాణం చేస్తున్నాను” అని శపథం చేశాడు.
7 తరువాత యోనాతాను దావీదును పిలిచి ఈ మాటలన్నీ అతనికి తెలియజేశాడు. అప్పుడతడు దావీదును సౌలుదగ్గరికి తీసుకువెళ్ళాడు. మునుపటిలాగే దావీదు సౌలుదగ్గర ఉండి పోయాడు.
8 మరోసారి యుద్ధం సంభవించింది. దావీదు బయలుదేరి ఫిలిష్తీయవాళ్ళతో పోరాడి వాళ్ళను ఓడించి చాలామందిని హతమార్చాడు. వాళ్ళు అతని ముందునుంచి పారిపోయారు. 9 ✝తరువాత సౌలు తన ఇంట్లో ఈటె చేతపట్టుకొని కూర్చుని ఉన్నప్పుడు, యెహోవా పంపించిన దురాత్మ అతడిమీదికి వచ్చింది. దావీదు తంతివాద్యం వాయిస్తూ ఉన్నాడు. 10 ✝ఉన్నట్టుండి సౌలు దావీదును పొడిచి గోడకు అంటగొట్టి వేయడానికి ఈటె విసిరాడు. దానినుంచి దావీదు తప్పించు కొన్నాడు. ఈటె గోడలోకి దూసుకుపోయింది. ఆ రాత్రి దావీదు తప్పించుకొని పారిపోయాడు. 11 ✽ప్రొద్దున దావీదును చంపాలని పొంచి ఉండడానికి సౌలు అతని ఇంటికి మనుషులను పంపాడు. కానీ దావీదు భార్య మీకాల్ “ఈ రాత్రి మీ ప్రాణాన్ని మీరు దక్కించుకోకపోతే, రేపు మీరు చంపబడతారు” అని దావీదుతో చెప్పింది. 12 ✽మీకాల్ అతణ్ణి కిటికీగుండా దింపింది. అతడు పారిపోయి తప్పించుకొన్నాడు. 13 ✽అప్పుడు మీకాల్ ఒక విగ్రహాన్ని పడకమీద ఉంచి దానిని బట్టతో కప్పివేసింది. తలవైపున మేక వెండ్రుకలు పెట్టింది.
14 ✝దావీదును పట్టుకోవడానికి సౌలు మనుషులను పంపినప్పుడు “ఆయన అనారోగ్యంగా ఉన్నాడు” అని మీకాల్ చెప్పింది. 15 దావీదును చూడడానికి ఆ మనుషులను మళ్ళీ పంపిస్తూ సౌలు “అతణ్ణి నేను చంపేట్టు పడకతో అతణ్ణి తీసుకురండి” అన్నాడు.
16 వారు వచ్చి లోపలికి వెళ్ళి చూచినప్పుడు పడకమీద విగ్రహం, తలవైపున మేక వెండ్రుకలు కనిపించాయి. 17 ✽తరువాత సౌలు మీకాల్‌ను చూచి “నీవు నన్ను ఈ విధంగా ఎందుకు మోసగించావు? నా శత్రువు తప్పించుకొని పారిపోయేట్టు ఎందుకు చేశావు?” అని అడిగాడు. అందుకు మీకాల్ చెప్పింది, “ఆయన అన్నాడు గదా – నేను నిన్ను ఎందుకు చంపాలి? నన్ను వెళ్ళనియ్యి!”
18 ✝ఆ విధంగా దావీదు తప్పించుకొని పారిపోయి రమాలో ఉండే సమూయేలుదగ్గరికి వెళ్ళాడు, సౌలు తనకు చేసినదంతా సమూయేలుకు చెప్పాడు. అప్పుడు అతడు, సమూయేలు నాయోతుకు వెళ్ళి అక్కడ ఉండిపోయారు. 19 దావీదు రమా దగ్గర నాయోతులో ఉన్న సంగతి సౌలుకు వినబడింది. 20 కనుక దావీదును పట్టుకోవడానికి సౌలు మనుషులను పంపాడు. వారు అక్కడ చేరుకొన్నప్పుడు కొంతమంది ప్రవక్తలు పరవశులై ప్రకటించడం, వారికి నాయకుడుగా సమూయేలు అక్కడ నిలబడి ఉండడం చూశారు. వెంటనే దేవుని ఆత్మ సౌలుయొక్క మనుషులను ఆవరించాడు, గనుక వారు కూడా పరవశులై ప్రకటించడం ఆరంభించారు. 21 ఈ సంగతి సౌలుకు వినబడగానే అతడు వేరే మనుషులను పంపాడు. వారు కూడా పరవశులై ప్రకటించారు. మూడోసారి సౌలు మనుషులను పంపాడు. వారు కూడా పరవశులై ప్రకటించారు. 22 చివరికి సౌలు తానే రమాకు బయలుదేరి సెఖూదగ్గర ఉండే పెద్ద బావిదగ్గరికి చేరుకొని “సమూయేలు, దావీదులు ఎక్కడున్నారు” అని అడిగాడు.
అక్కడున్నవారు “వారు రమాదగ్గర నాయోతులో ఉన్నారు” అన్నారు.
23 ✽ సౌలు రమాదగ్గర నాయోతుకు బయలుదేరాడు. దేవుని ఆత్మ అతణ్ణి కూడా ఆవరించాడు, గనుక దారిలోనే అతడు పరవశుడై రమాదగ్గర నాయోతు చేరుకొనేవరకు ప్రకటిస్తూ ఉన్నాడు. 24 అక్కడ అతడు పై వస్త్రాలను తీసివేసి సమూయేలు✽ సమక్షంలో కూడా పరవశుడై ప్రకటించాడు. ఆ రోజంతా పగలు, రాత్రి✽ లోపలి దుస్తులతోనే అక్కడ పడి ఉన్నాడు. అందుచేత “సౌలు కూడా ప్రవక్తలలో ఒకడయ్యాడా?” అనే సామెత పుట్టింది.