18
1 దావీదు సౌలుతో మాట్లాడడం ముగించిన తరువాత యోనాతాను హృదయం దావీదు హృదయంతో పెన వేసుకొంది. అతడు దావీదును తన ప్రాణంతో సమంగా ప్రేమించాడు. 2 ఆ రోజు నుంచి సౌలు దావీదును తన దగ్గరే ఉంచి అతడి తండ్రి ఇంటికి అతణ్ణి వెళ్ళనివ్వలేదు. 3 యోనాతాను దావీదును తన ప్రాణంతో సమంగా ప్రేమించినందుచేత అతనితో ఒక ఒడంబడిక చేసుకొన్నాడు. 4 తాను వేసుకొన్న పై వస్త్రాన్నీ తన ఖడ్గాన్నీ విల్లునూ నడికట్టునూ తీసి దావీదుకు ఇచ్చాడు. 5  సౌలు ఎక్కడికి పంపినా దావీదు వెళ్ళి ప్రతి పనినీ తెలివితేటలతో సాధించే వాడు. గనుక సౌలు అతణ్ణి సైన్యంలో అధిపతిగా నియమించాడు. ఇది ప్రజలందరికీ సౌలు పరివారానికీ కూడా నచ్చింది.
6 దావీదు ఫిలిష్తీయవాణ్ణి చంపిన తరువాత అతడూ మిగతావారూ తిరిగి వస్తూ ఉంటే, ఇస్రాయేల్ ఊళ్ళన్నిటిలో నుంచి స్త్రీలు కంజరీలతో ఇతర వాద్యాలతో ఆనంద గీతాలు పాడుతూ నాట్యం చేస్తూ సౌలురాజును కలుసుకోవడానికి వచ్చారు. 7 ఆ స్త్రీలు వాయిస్తూ ఇలా గాన ప్రతిగానాలు చేశారు: “సౌలు వేల కొలది శత్రువులను హతం చేశాడు. దావీదు పది వేల కొలది శత్రువులను హతం చేశాడు.”
8 ఈ గీతం సౌలుకు ఏమీ నచ్చలేదు. అతడు కోపంతో మండిపడ్డాడు. “దావీదుకు పది వేలకొలది అనీ నాకు వేలకొలది మాత్రమే అనీ వాళ్ళు పాట పాడారు. అతడికి రాజ్యం తప్ప ఇంకేమి లభిస్తుంది?” అని సౌలు అనుకొన్నాడు.
9 ఆ రోజునుంచి సౌలు విషపు చూపు దావీదుమీద నిలిపాడు.
10 మరుసటి రోజు దేవుడు పంపించిన దురాత్మ సౌలు మీదికి బలీయంగా వచ్చింది. అతడు తన ఇంట్లో పరవశుడై ప్రకటించాడు. దావీదు మునుపటిలాగా తంతివాద్యం చేతపట్టుకొని వాయిస్తూ ఉన్నాడు. సౌలు చేతిలో ఈటె ఉంది. 11  “దావీదును పొడిచి గోడకు అంటగొట్టివేస్తాను” అని సౌలు అనుకొని ఈటెను దావీదువైపు విసిరాడు. అయితే దావీదు దానినుంచి రెండు సార్లు తప్పించుకొన్నాడు.
12 యెహోవా సౌలును వదలిపెట్టి దావీదుకు తోడుగా ఉండడం చూచి సౌలు దావీదుకు భయపడ్డాడు. 13 అందుచేత అతడు దావీదును తన దగ్గరనుంచి పంపివేసి వెయ్యిమంది సైనికులమీద అధిపతిగా నియమించాడు. దండయాత్రలలో దావీదు సైనికులకు నాయకత్వం వహించాడు. 14 దావీదుకు యెహోవా తోడుగా ఉండడంవల్ల అతడు అన్ని విధానాలలో తెలివితేటలతో ప్రవర్తించాడు. 15 దావీదు జ్ఞానం గల ప్రవర్తనను చూచి సౌలు అతనికి ఇంకా భయపడ్డాడు. 16 కానీ ఇస్రాయేల్ వారంతా యూదావారంతా దావీదును అభిమానించారు. ఎందుకంటే దండయాత్రలలో అతడు వారికి నాయకత్వం వహించేవాడు.
17 సౌలు దావీదుతో “నా పెద్దమ్మాయి మేరబును నీకు భార్యగా ఇస్తాను. నీవు నాకు ధైర్యంతో సేవ చేస్తూ యెహోవా యుద్ధాలను జరిగించాలి” అన్నాడు. సౌలు “నా చెయ్యి అతడిపై పడకూడదు గాని ఫిలిష్తీయవాళ్ళ చెయ్యి అతడి పై పడాలి” అని అనుకొన్నాడు.
18  అందుకు దావీదు “రాజుకు అల్లుడు కావడానికి నేనెంతటివాణ్ణి? నా స్థితిగతులు ఏపాటివి? ఇస్రాయేల్‌లో నా తండ్రి కుటుంబం ఎంతటిది?” అని సౌలుతో చెప్పాడు.
19 సౌలు కూతురు మేరబును దావీదుకు ఇవ్వవలసిన సమయం వచ్చినప్పుడు సౌలు ఆమెను మెహోలా గ్రామంవాడైన ఆద్రీయేల్ కిచ్చి పెళ్ళి చేశాడు.
20 సౌలు కూతురు మీకాల్ దావీదును ప్రేమించింది. ఈ విషయం తెలుసుకొన్నప్పుడు సౌలు సంతోషించాడు.
21 “నేను ఆమెను అతడికి భార్యగా ఇస్తాను. ఆమె అతడికి ఉరిలాగా అవుతుంది. ఫిలిష్తీయవాళ్ళ చెయ్యి అతడికి వ్యతిరేకంగా ఉంటుంది” అని సౌలు అనుకొన్నాడు.
గనుక అతడు దావీదుతో “నాకు అల్లుడు కావడానికి రెండో అవకాశం నీకు లభించింది” అన్నాడు. 22 తరువాత సౌలు తన సేవకులను పిలిచి “మీరు దావీదుతో రహస్యంగా మాట్లాడి ‘రాజుకు నీవంటే చాలా ఇష్టం. ఆయన సేవకులంతా నిన్ను అభిమానిస్తున్నారు. నీవు రాజుగారి అల్లుడవు కా’ అని చెప్పాలి” అని ఆదేశించాడు.
23 సౌలు సేవకులు ఆ మాటలే దావీదుకు చెప్పారు గాని దావీదు “నేను పేదవాణ్ణి, పేరు ప్రతిష్ఠలు లేని వాణ్ణి. నేను రాజుగారి అల్లుడు కావడం మీకంత తేలికగా కనిపిస్తుందా?” అన్నాడు.
24 సౌలు సేవకులు దావీదు చెప్పిన మాటలు సౌలుకు తెలియచేసినప్పుడు 25 సౌలు ఇలా చెప్పాడు: “రాజుగారు పెళ్ళి ఓలి ఏమీ కోరడు గాని శత్రువులపై పగతీర్చుకోవాలని ఫిలిష్తీయవాళ్ళ మర్మాంగచర్మం కొనలను ఒక వంద మాత్రం కోరుతున్నాడని దావీదుతో చెప్పండి.” ఫిలిష్తీయవాళ్ళ చేత దావీదు కూలిపోవాలని సౌలు ఉద్దేశం.
26 అతని సేవకులు దావీదుకు ఈ మాటలు చెప్పినప్పుడు రాజుకు అల్లుడు కావడం దావీదుకు ఇష్టం అయింది. 27 గడువు దాటేముందే దావీదు తన మనుషులతో వెళ్ళి రెండు వందలమంది ఫిలిష్తీయవాళ్ళను చంపాడు. రాజుకు అల్లుడు కావడానికి వాళ్ళ మర్మాంగ చర్మం కొనలను తెచ్చి అన్నీ రాజుకు ఇచ్చివేశాడు. అప్పుడు సౌలు తన కూతురు మీకాల్‌ను అతనికిచ్చి పెళ్ళి చేశాడు.
28 యెహోవా దావీదుకు తోడుగా ఉండడం, సౌలు కూతురు మీకాల్ అతణ్ణి ప్రేమించడం చూచి 29 సౌలు మరీ ఎక్కువగా దావీదుకు భయపడ్డాడు. సౌలు ఎప్పటికీ దావీదుకు శత్రువుగా ఉన్నాడు. 30 ఫిలిష్తీయవాళ్ళ నాయకులు తరచుగా యుద్ధానికి వచ్చేవాళ్ళు. వాళ్ళు వచ్చినప్పుడెల్లా సౌలు అధిపతులందరి కంటే దావీదు ఎక్కువ తెలివితేటలు ప్రదర్శించాడు. అతని పేరు ప్రఖ్యాతి చెందింది.