17
1 ఫిలిష్తీయదేశంవాళ్ళు యూదాప్రదేశంలో శోకో✽లో తమ సైన్యాలను యుద్ధానికి సమకూర్చారు. శోకోకూ అజేకాకూ మధ్య ఉన్న ఏపెస్‌దమ్మీం దగ్గర వాళ్ళు మకాం చేశారు. 2 సౌలు, ఇస్రాయేల్‌వారు సమకూడి ఏలా లోయలో మకాం వేసి ఫిలిష్తీయవాళ్ళను ఎదిరించడానికి సైన్యవ్యూహం ఏర్పరచారు. 3 ఒకవైపు ఉండే కొండమీద ఫిలిష్తీయవాళ్ళు, మరోవైపు ఉండే కొండమీద ఇస్రాయేల్‌వారు ఉన్నారు. వారిమధ్య ఒక లోయ ఉంది. 4 ✽ అప్పుడు ఫిలిష్తీయవాళ్ళ శిబిరంలోనుంచి ఒక వీరుడు ముందుకు వచ్చాడు. అతడు గాత్ పట్టణస్థుడైన గొల్యాతు. అతడి ఎత్తు ఆరు మూరల ఒక బెత్త. 5 అతడు కంచు శిరస్త్రాణం. యుద్ధకవచం ధరించాడు. ఆ కంచు కవచం బరువు యాభై ఏడు కిలోగ్రాములు. 6 అతడి కాళ్ళకు కూడా కంచు కవచం ఉంది. అతడి భుజాలమధ్య కంచు బల్లెం వ్రేలాడుతూ ఉంది. 7 ✽అతడి ఈటెకర్ర చేనేతపనివాడి అడ్డకర్రంత మందం గలది. ఆ కర్రకు ఉన్న ఇనుపకొన బరువు ఏడు కిలోగ్రాములు. ఒక సైనికుడు అతడి డాలును మోస్తూ అతడి ముందు నడుస్తున్నాడు.8 ✽గొల్యాతు నిలిచి ఇస్రాయేల్ సైనికులతో ఇలా అరిచాడు: “మీరు బారులు తీరి యుద్ధానికి ఎందుకు వచ్చారు? నేను ఫిలిష్తీయవాణ్ణి. మీరు సౌలు దాసులు గదా! మీ తరఫున ఒక మనిషిని ఎన్నిక చేసి నాదగ్గరికి పంపండి, చూద్దాం. 9 అతడు నాతో పోరాడి నన్ను చంపగలిగితే మేము మీకు సేవకుల మవుతాం. నేను అతణ్ణి జయించి చంపితే మీరు మాకు సేవకులై పరిచర్య చేయాలి.”
10 ✽ఆ ఫిలిష్తీయవాడు ఇంకా అన్నాడు: “ఈ రోజు నేను ఇస్రాయేల్ సైన్యాలను సవాలు చేస్తున్నాను. నాతో పోరాడడానికి ఒక మనిషిని పంపండి.”
11 ✽సౌలు, ఇస్రాయేల్‌వారంతా ఫిలిష్తీయవాడి మాటలు విన్నప్పుడు హడలిపోయి చాలా భయపడ్డారు.
12 దావీదు ఎఫ్రాతీయుడైన✽ యెష్షయి కొడుకు. యెష్షయి యూదాలోని బేత్‌లెహేం పురవాసి. అతడికి ఎనిమిదిమంది కొడుకులు. సౌలు కాలంలో అతడు చాలా ముసలివాడు. 13 యెష్షయి ముగ్గురు పెద్ద కొడుకులు సౌలుతో కూడా యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళిన ఆ ముగ్గురిలో పెద్దవాడి పేరు ఏలీయాబు, రెండోవాడు అబీనాదాబు, మూడోవాడు షమ్మా. 14 దావీదు కనిష్ఠుడు. పెద్దవాళ్ళు ముగ్గురు సౌలుతో కూడా వెళ్ళారు. 15 ✝గానీ దావీదు సౌలుదగ్గరనుంచి బేత్లెహేంలో ఉన్న తన తండ్రి గొర్రెలను మేపడానికి తరచుగా పోతూ, తిరిగి సౌలుదగ్గరికి వస్తూ ఉండేవాడు. 16 ఫిలిష్తీయవాడు గొల్యాతు నలభై రోజులు ప్రతి ఉదయమూ సాయంత్రమూ ముందుకు వచ్చి లోయలో నిలబడేవాడు.
17 యెష్షయి తన కొడుకు దావీదుతో ఇలా చెప్పాడు: “నీ అన్నలకోసం తూమెడు వేయించిన గోధుమలూ ఈ పది రొట్టెలూ తీసుకొని యుద్ధశిబిరానికి వారిదగ్గరికి త్వరగా వెళ్ళు. 18 ఈ పది జున్నుముక్కలను వారి సహస్రాధిపతికి పట్టుకు వెళ్ళు. నీ అన్నల యోగక్షేమాలు తెలుసుకొని వారి దగ్గరనుంచి ఆనవాలొకటి తీసుకురా. 19 వారు, సౌలు, ఇస్రాయేల్ వారంతా ఏలా లోయలో ఫిలిష్తీయవాళ్ళతో యుద్ధం చేస్తున్నారు.”
20 ✽దావీదు ఉదయమే లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులు తీసుకొని యెష్షయి ఆదేశించినట్టు ప్రయాణమై వెళ్ళాడు. అతడు యుధ్ధ శిబిరాన్ని చేరే సమయానికి సైన్యాలు బారులు తీరి యుద్ధనినాదాలు చేస్తూ, యుద్ధరంగం వైపు సాగుతూ ఉన్నాయి. 21 ఇస్రాయేల్‌వారూ ఫిలిష్తీయవాళ్ళూ తమ సైన్యాలను ఎదురెదురుగా యుద్ధానికి వ్యూహాలేర్పరచారు.
22 దావీదు తెచ్చిన వస్తువులను సామాను భద్రపరచేవాడి దగ్గర ఉంచి సైన్యవ్యూహంలోకి పరుగెత్తిపోయి తన అన్నలను కుశలప్రశ్నలు అడిగాడు. 23 అతడు వారితో మాట్లాడుతూ ఉంటే, గాత్ పట్టణస్థుడైన ఆ ఫిలిష్తీయ వీరుడైన గొల్యాతు ఫిలిష్తీయ సైన్యంలో నుంచి వచ్చాడు, మునుపు చెప్పిన మాటలు మళ్ళీ చెప్పాడు. అతడు చెప్పినది దావీదు విన్నాడు. 24 గొల్యాతును చూచి ఇస్రాయేల్‌వారంతా అధికంగా భయపడి వాడి ఎదుటనుంచి పారిపోయారు.
25 ✽ఇస్రాయేల్‌వారిలో కొందరు “ముందుకు వచ్చిన ఆ మనిషిని చూశారా? అతడు ఇస్రాయేల్‌వారిని ధిక్కరించడానికి వస్తూ ఉన్నాడు. వాణ్ణి చంపినవాడికి రాజు చాలా సొమ్ము బహుకరించి తన కుమార్తెనిచ్చి పెళ్ళి చేస్తాడు. అతడి తండ్రి ఇంటివాళ్ళను ఇస్రాయేల్ బాధ్యతలనుంచి మినహాయిస్తాడు” అని చెప్పుకొన్నారు.
26 ✽దావీదు తనదగ్గర నిలుచున్న వారిని చూచి “జీవంగల దేవుని సైన్యాలను ధిక్కరించడానికి సున్నతి లేని ఈ ఫిలిష్తీయవాడు ఎంతటివాడు? ఎవరైనా వాణ్ణి చంపి ఇస్రాయేల్ ప్రజలనుంచి ఈ నిందను తొలగిస్తే ఏం బహుమతి లభిస్తుంది?” అని అడిగాడు.
27 గొల్యాతును చంపినవాడికి ఏం జరుగుతుందో వారు అతడికి చెప్పారు. 28 దావీదు వారితో మాట్లాడడం అతడి పెద్దన్న ఏలీయాబు విన్నాడు. అతడు దావీదుపై కోపగించుకొని✽, “నీవు ఇక్కడికెందుకు వచ్చావు? నీ గర్వం, నీ హృదయంలోని చెడ్డతనం నాకు తెలుసు. యుద్ధాన్ని చూడడానికే నీవు వచ్చావు” అన్నాడు.
29 ✽అందుకు దావీదు “ఇప్పుడు నేనేం చేశాను? ఒక ప్రశ్న మాత్రం అడిగాను. అంతే గదా” అన్నాడు.
30 దావీదు అతడి వైపునుంచి మరో వైపుకు తిరిగి, మరోసారి ఆ ప్రశ్న వేశాడు. వారు మళ్ళీ ఆ విధంగానే జవాబిచ్చాడు.
31 దావీదు చెప్పిన మాటలు విని ఎవరో సౌలుకు తెలియజేశాడు. సౌలు దావీదును పిలిపించాడు.
32 ✝సౌలుతో దావీదు “ఈ ఫిలిష్తీయవాడి విషయం ఎవరికీ ధైర్యం చెడిపోనక్కరలేదు. మీ సేవకుడైన నేను వెళ్ళి వాడితో పోరాడుతాను” అన్నాడు.
33 ✽సౌలు “ఈ ఫిలిష్తీయవాణ్ణి ఎదుర్కొని వాడితో పోరాడడానికి నీకు శక్తి చాలదు. నీవు అబ్బాయివి. వాడు చిన్నప్పటినుంచి సైనికుడుగా ఉన్నాడు” అని దావీదుతో చెప్పాడు.
34 ✽అందుకు దావీదు సౌలుతో “మీ సేవకుడైన నేను నా తండ్రి గొర్రెలను కాస్తూ ఉండేవాణ్ణి. సింహమైనా ఎలుగుబంటియైనా మందలోనుంచి గొర్రెపిల్లను ఎత్తుకుపోతూ ఉంటే, 35 నేను దాని వెంట పడి కొట్టి దాని నోటనుంచి గొర్రెను విడిపించేవాణ్ణి. అది నాపై పడితే నేను దాని గడ్డం పట్టుకొని కొట్టి చంపేవాణ్ణి. 36 ఈ నీ సేవకుడు సింహాన్ని ఎలుగుబంటినీ చంపాడు. సున్నతి లేని ఈ ఫిలిష్తీయవాడు జీవంగల దేవుని సైన్యాలను ధిక్కరిస్తూ ఉన్నాడు, గనుక ఆ సింహం, ఎలుగుబంటిలో ఒకదానిలాగా చస్తాడు. 37 యెహోవా నన్ను సింహం బారినుంచీ ఎలుగుబంటి బారినుంచీ రక్షించాడు. ఈ ఫిలిష్తీయవాడి చేతినుంచి కూడా నన్ను రక్షిస్తాడు” అన్నాడు.
అందుకు సౌలు “నీవు వెళ్ళు. యెహోవా నీకు తోడుగా ఉంటాడు గాక!” అని దావీదుతో అన్నాడు.
38 ✽అప్పుడు సౌలు తన యుద్ధ వస్త్రాలను – కంచు కుళ్ళాయి, కవచం – దావీదుకు తొడిగించాడు. 39 దావీదు ఆ వస్త్రాలమీద ఖడ్గం కట్టుకొని అటు ఇటు నడవడానికి ప్రయత్నించాడు. ఎందుకంటే అతడు వాటిని అలవాటు చేసుకోలేదు.
అప్పుడు దావీదు “వీటితో నేను వెళ్ళలేను. ఇవి నాకు ఏమీ అలవాటు లేదు” అని సౌలుతో చెప్పి వాటిని తీసివేశాడు.
40 ✽అప్పుడతడు తన చేతి కర్ర పట్టుకొని వాగులోనుంచి అయిదు నున్నని రాళ్ళను ఏరుకొని తనదగ్గర ఉన్న చిక్కంలో వాటిని ఉంచుకొన్నాడు. తన వడిసెల చేతపట్టుకొని ఆ ఫిలిష్తీయవాడి దరిదాపులకు వెళ్ళాడు.
41 డాలు మోసేవాడు తన ముందు నడుస్తూ ఉంటే ఆ ఫిలిష్తీయవాడు ముందుకు సాగి దావీదుకు దగ్గరగా వచ్చాడు.
42 అతడు దావీదును బాగా చూశాడు గాని దావీదు అందమైన ఎర్రటి అబ్బాయి✽ అని చిన్న చూపు చూశాడు.
43 ఆ ఫిలిష్తీయవాడు దావీదుతో “నీవు కర్ర పట్టుకొని నాదగ్గరికి వస్తున్నావేం? నేను కుక్కననుకొన్నావా?” అని చెప్పి తన దేవుళ్ళ పేర దావీదును శపించాడు✽.
44 ఆ ఫిలిష్తీయవాడు దావీదుతో “నాదగ్గరికి రా! నీ శవాన్ని గాలిలో ఎగిరే పక్షులకూ భూమృగాలకూ వేస్తాను” అన్నాడు.
45 అందుకు దావీదు ఆ ఫిలిష్తీయవాణ్ణి చూచి ఇలా అన్నాడు: “నీవు కత్తి, ఈటె✽, బల్లెం ధరించుకొని నామీదికి వస్తున్నావు. అయితే నీవు తిరస్కరించిన సేనల ప్రభువు యెహోవా పేర నేను నీ మీదికి వస్తున్నాను. ఆయన ఇస్రాయేల్ సైన్యాల దేవుడు. 46 ఈ రోజు యెహోవా నిన్ను నాశనం చేస్తాడు. నేను నిన్ను హతమార్చి నీ తలను నరికివేస్తాను. ఇస్రాయేల్ ప్రజలలో దేవుడున్నాడని లోకమంతా తెలుసుకొనేలా✽ నేను ఈ రోజు ఫిలిష్తీయ సైనికుల శవాలను గాలిలో ఎగిరే పక్షులకూ భూజంతువులకూ వేస్తాను. 47 ✝యెహోవా కత్తితో, ఈటెతో రక్షించేవాడు కాడని ఇక్కడ సమకూడినవారంతా తెలుసుకొంటారు. ఈ యుద్ధం యెహోవాదే. ఆయన మిమ్మల్ని మా వశం చేస్తాడు.”
48 దావీదును ఎదుర్కోవడానికి ఫిలిష్తీయవాడు ముందుకు సాగి ఇంకా దగ్గరగా వచ్చాడు. దావీదు ఫిలిష్తీయవాణ్ణి ఎదుర్కోవడానికి వాడి సైన్యం బారులవైపు త్వరగా పరుగెత్తాడు✽, 49 తన చిక్కంలో చెయ్యి పెట్టి ఒక రాయి తీసి వడిసెలతో విసరి ఫిలిష్తీయవాడి నొసట కొట్టాడు. ఆ రాయి వాడి నొసటిలోకి దూసుకుపోయింది. వాడు నేలపై బోర్లా పడ్డాడు. 50 ఈ విధంగా దావీదు వడిసెలతో రాతితో ఆ ఫిలిష్తీయవాడి మీద విజయం సాధించాడు. చేతిలో ఖడ్గం లేకుండానే వాణ్ణి కొట్టి చంపాడు. 51 ✽ అప్పుడు దావీదు పరుగెత్తి వెళ్ళి ఫిలిష్తీయవాడి పైన నిలబడి వాడి ఖడ్గం వరనుంచి లాగాడు; వాణ్ణి చంపిన తరువాత వాడి తలను ఖడ్గంతో నరికివేశాడు.
ఫిలిష్తీయవాళ్ళు తమ వీరుడు చావడం చూచి పారి పోయారు. 52 అప్పుడు ఇస్రాయేల్‌వారూ యూదావారూ జయజయ ధ్వనులతో బయలుదేరి లోయ ప్రవేశంవరకు, ఎక్రోను ద్వారాలవరకు వాళ్ళను తరిమారు. ఫిలిష్తీయవాళ్ళు హతమై షరాయిం త్రోవ పొడుగున గాత్, ఎక్రోను వరకు కూలిపోతూ ఉన్నారు. 53 ఇస్రాయేల్‌వారు ఫిలిష్తీయవాళ్ళను తరమడం మాని తిరిగి వచ్చి వాళ్ళ శిబిరాన్ని దోచుకొన్నారు. 54 దావీదు ఆ ఫిలిష్తీయవాడి తలను జెరుసలంకు తీసుకు వచ్చాడు. ఫిలిష్తీయవాడి ఆయుధాలను తన డేరాలో ఉంచుకొన్నాడు. 55 ✽దావీదు ఫిలిష్తీయవాణ్ణి ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు సౌలు చూచి తన సైన్యాధిపతి అబ్నేర్‌ను పిలిచి “అబ్నేర్, ఈ యువకుడు ఎవరి కొడుకు?” అని అడిగాడు.
అబ్నేర్ “రాజా, నీ ప్రాణంమీద ఒట్టు పెట్టి చెపుతున్నాను, నాకు తెలియదు” అన్నాడు.
56 అందుకు రాజు “ఈ అబ్బాయి ఎవరి కొడుకో విచారణ చేసి తెలుసుకో” అన్నాడు. 57 దావీదు ఫిలిష్తీయవాణ్ణి చంపి తిరిగి వచ్చిన వెంటనే ఫిలిష్తీయవాడి తల అతని చేతిలో ఇంకా ఉండగానే అబ్నేర్ అతణ్ణి సౌలుదగ్గరికి తీసుకువచ్చాడు.
58 సౌలు అతణ్ణి చూచి “యువకుడా, నీవు ఎవరి కొడుకువు?” అని అడిగాడు. అందుకు దావీదు “బేత్‌లెహేంలో ఉన్న మీ సేవకుడైన యెష్షయి కొడుకును నేను” అని జవాబిచ్చాడు.