16
1 తరువాత యెహోవా సమూయేలుతో ఇలా అన్నాడు: “ఇస్రాయేల్‌ప్రజల రాజుగా ఉండకుండా సౌలును నేను తిరస్కరించాను. అతడి విషయం నీవు ఎంతకాలం దుఃఖిస్తావు? నీ దగ్గర ఉన్న కొమ్మును నూనెతో నింపుకో. నేను నిన్ను బేత్‌లెహేం పురవాసి యెష్షయి దగ్గరికి పంపుతున్నాను. అతడి కొడుకులలో ఒకణ్ణి రాజుగా ఎన్నుకొన్నాను.”
2 అందుకు సమూయేలు “నేను ఎలా వెళ్ళగలను? ఈ విషయం సౌలు వింటే నన్ను చంపుతాడు” అన్నాడు. యెహోవా “నీవు ఒక పెయ్యదూడను తీసుకుపోయి నేను యెహోవాకు బలి చేయడానికి వచ్చానని చెప్పు. 3 బలి అర్పించే చోటుకు యెష్షయిని ఆహ్వానించు. తరువాత నీవు చేయవలసినది నేను నీకు తెలియజేస్తాను. నేను నీకు ఎవరిని సూచిస్తానో అతణ్ణి నీవు అభిషేకించు” అని ఆదేశించాడు. 4 యెహోవా చెప్పినట్టే సమూయేలు చేశాడు. అతడు బేత్‌లెహేంకు చేరగానే ఆ ఊరి పెద్దలు వణకుతూ, అతణ్ణి కలుసుకోవడానికి వచ్చి “మీరు ప్రశాంతంగా వస్తున్నారా?” అని అడిగారు. 5 సమూయేలు “యెహోవాకు బలి అర్పించడానికి ప్రశాంతంగానే వచ్చాను. మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకొని నాతోకూడా బలికి రండి” అని జవాబిచ్చాడు. అప్పుడతడు యెష్షయినీ అతడి కొడుకులనూ పవిత్రం చేసి వారిని బలికి పిలిచాడు. 6 వారందరూ అక్కడ చేరినప్పుడు సమూయేలుకు ఏలీయాబు కనిపించాడు. “నిజంగా యెహోవా అభిషేకించినవాడు ఇక్కడ ఆయన సమక్షంలో నిలబడి ఉన్నాడు” అనుకొన్నాడు. 7 అయితే యెహోవా సమూయేలుతో “అతడి ఎత్తునూ ఆకారాన్నీ లక్ష్యపెట్టవద్దు. ఎందుకంటే నేను అతణ్ణి నిరాకరించాను. మనిషిలాగా యెహోవా చూడడు. మనుషులు బయటి ఆకారాన్ని చూస్తారు గాని యెహోవా అంతరంగాన్ని చూస్తాడు” అన్నాడు. 8 యెష్షయి అబీనాదాబును పిలిచి సమూయేలు ముందుకు వచ్చేలా చేశాడు. “యెహోవా ఇతణ్ణి కూడా ఎన్నుకోలేదు” అని సమూయేలు చెప్పాడు.
9 తరువాత యెష్షయి షమ్మాను పిలిచాడు గాని సమూయేలు “యెహోవా ఇతణ్ణి కూడా ఎన్నుకోలేదు” అన్నాడు.
10 యెష్షయి తన కొడుకులలో ఏడుగురిని సమూయేలు ముందుకు రప్పించాడు గాని సమూయేలు “యెహోవా వీళ్ళను ఎన్నుకోలేదు” అని చెప్పాడు.
11 అప్పుడు సమూయేలు “నీ కొడుకులందరూ ఇక్కడున్నారా?” అని యెష్షయిని అడిగాడు. యెష్షయి “అందరికన్న చిన్నవాడున్నాడు. కానీ వాడు గొర్రెలు మేపుతున్నాడు” అని జవాబిచ్చాడు. అందుకు సమూయేలు “నీవు అతణ్ణి ఇక్కడికి పిలిపించి తెప్పించు. అతడు ఇక్కడికి వచ్చేవరకు మనం కూర్చోలేము” అన్నాడు. 12 కనుక యెష్షయి అతణ్ణి పిలిపించి లోపలికి రప్పించాడు. అతడి చాయ ఎరుపు, కళ్ళు ప్రకాశవంతం. అతడు అందమైనవాడు. యెహోవా “లేచి ఇతణ్ణి అభిషేకించు. నేను ఎన్నుకొన్నవాడు ఇతడే” అన్నాడు. 13 సమూయేలు నూనెతో నిండిన కొమ్మును తీసి అతడి అన్నల సమక్షంలో అతణ్ణి అభిషేకం చేశాడు. ఆ రోజు నుంచి దేవుని ఆత్మ దావీదుమీద బలప్రభావాలతో ఉన్నాడు. తరువాత సమూయేలు రమాకు వెళ్ళిపోయాడు.
14 అంతలో యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయాడు. యెహోవా పంపించిన దురాత్మ వచ్చి అతణ్ణి భయపెట్టి వేధించసాగింది.
15 సౌలు సేవకులు అతడితో “దేవుడు పంపించిన దురాత్మ మిమ్మల్ని భయపెట్టి వేధిస్తూ ఉంది గదా! 16 మా యజమానులైన మీరు మీ ముందున్న పరిచారకులైన మాకు ఆదేశిస్తే తంతివాద్యం బాగా వాయించగలవాణ్ణి వెదకడానికి సిద్ధంగా ఉన్నాం. దేవుడు పంపిన ఆ దురాత్మ మీమీదికి వచ్చినప్పుడెల్లా ఆ వ్యక్తి తంతివాద్యం వాయిస్తే మీరు బాగుపడతారు” అన్నారు.
17 సౌలు “బాగా వాయించగలవాణ్ణి కనిపెట్టి నాదగ్గరికి తీసుకురండి” అని తన సేవకులతో చెప్పాడు.
18 ఆ సేవకులలో ఒకడు “బేత్‌లెహేం గ్రామంవాడు యెష్షయి కొడుకులలో ఒకడు బాగా వాయంచగలడు. నేను చూశాను. అతడు ధైర్యశాలి, యుద్ధవీరుడు, చక్కగా మాట్లాడేవాడు, అందమైనవాడు. అంతేగాక యెహోవా అతడికి తోడై ఉన్నాడు” అన్నాడు.
19 గనుక సౌలు యెష్షయి దగ్గరికి మనుషులను పంపి “గొర్రెలు మేపుతున్న నీ కొడుకు దావీదును నాదగ్గరికి పంపించు” అని చెప్పాడు. 20 యెష్షయి రొట్టెలనూ ద్రాక్షరసంతో నిండిన తిత్తినీ మేకపిల్లనూ గాడిదపై పెట్టించి తన కొడుకు దావీదుతోకూడా వాటిని సౌలుదగ్గరికి పంపాడు. 21 దావీదు సౌలుదగ్గరికి చేరి అతని సేవలో ప్రవేశించాడు. అతడు సౌలుకు చాలా నచ్చాడు. అతడు సౌలు ఆయుధాలు మోసేవాళ్ళలో ఒకడయ్యాడు.
22 సౌలు “దావీదు అంటే నాకు చాలా ఇష్టం. అతణ్ణి నా సేవలో ఉండనియ్యి” అని యెష్షయికి కబురు పంపాడు.
23 దేవుడు పంపిన ఆ దురాత్మ సౌలుమీదికి వచ్చినప్పుడెల్లా దావీదు తంతివాద్యం చేతపట్టుకొని వాయించేవాడు. అప్పుడు ఆ దురాత్మ అతణ్ణి విడిచిపోయేది, సౌలుకు కొంత నయమై ఉపశమనం కలిగేది.