15
1 ✝ఒకరోజు సమూయేలు సౌలుతో ఇలా చెప్పాడు: “ఇస్రాయేల్‌ప్రజల మీద రాజుగా నిన్ను అభిషేకించడానికి యెహోవా పంపినది నన్నే. కనుక ఇప్పుడు యెహోవా నుంచి వచ్చిన వాక్కు విను. 2 ✽ సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే, ఇస్రాయేల్‌ప్రజలు ఈజిప్ట్ నుంచి వస్తున్నప్పుడు అమాలేకువాళ్ళు వారిని ఎదిరించారు గదా. వాళ్ళు ఇస్రాయేల్ ప్రజలకు చేసిన కీడుకు నేను వాళ్ళను శిక్షించబోతున్నాను. 3 ✽ఇప్పుడు నీవు వెళ్ళి అమాలేకుజనాన్ని హతం చెయ్యి. వాళ్ళకు ఉన్నదంతా సమూల నాశనం చెయ్యి. జాలి చూపవద్దు. పురుషులనూ స్త్రీలనూ పిల్లలనూ చంటి బిడ్డలనూ పశువులనూ గొర్రెలనూ ఒంటెలనూ గాడిదలనూ చంపు.”4 అందుచేత సౌలు ప్రజలను పోగు చేసి తెలాయీంలో వారిని లెక్క పెట్టించాడు– కాల్బలం రెండు లక్షలమంది, యూదావారు పది వేలమంది. 5 సౌలు అమాలేకువాళ్ళ పట్టణానికి వెళ్ళి లోయలో పొంచి ఉన్నాడు.
6 ✽అతడు కేనువాళ్ళను చూచి “ఇస్రాయేల్‌ప్రజ ఈజిప్ట్‌నుంచి వచ్చినప్పుడు మీరు వారిమీద దయ చూపారు, గనుక అమాలేకువాళ్ళను నేను నాశనం చేస్తూ ఉంటే వాళ్ళతో కూడా మీరూ నాశనం కాకుండా వాళ్ళను విడిచి వెళ్ళిపోండి” అని చెప్పాడు. అందుచేత కేనువాళ్ళు అమాలేకువాళ్ళ మధ్యనుంచి వెళ్ళిపోయారు. 7 తరువాత సౌలు హవీలానుంచి ఈజిప్ట్ త్రోవలో ఉన్న షూరువరకు✽ అమాలేకువాళ్ళను కొట్టి ఓడించాడు! 8 అతడు అమాలేకువాళ్ళ రాజు అగగును ప్రాణంతో పట్టుకొని ఆ జనాన్ని కత్తిపాలు చేసి సమూలనాశనం చేశాడు. 9 ✽అయితే సౌలు అతడితో ఉన్నవారు అగగునూ మంచి రకం పశువులూ గొర్రెలూ క్రొవ్విన గొర్రెపిల్లలూ మొదలైనవాటినీ చంపక వేరుగా ఉంచారు. పనికిమాలిన బలం లేనివాటన్నిటినీ నిర్మూలించారు.
10 అప్పుడు యెహోవానుంచి వాక్కు సమూయేలుకు వచ్చింది: 11 “సౌలు నన్ను అనుసరించక వెనక్కు తీశాడు. అతడు నా ఆజ్ఞలను పాటించలేదు. కనుక అతణ్ణి రాజుగా నియమించినందుచేత నేను పరితపిస్తూ ఉన్నాను✽” అని యెహోవా అన్నాడు.
సమూయేలు కంగారుపడుతూ✽ రాత్రంతా యెహోవాకు మొరపెట్టుకొంటూ ఉన్నాడు. 12 ప్రొద్దు పొడవడంతోనే సమూయేలు లేచి సౌలును కలుసుకోవడానికి వెళ్ళాడు. అయితే “సౌలు కర్మెల్✽కు వెళ్ళి, అక్కడ తనకు జయస్తూపాన్ని✽ నిలిపాడు. తరువాత గిల్గాల్‌కు వెళ్ళిపోయాడు” అని వార్త సమూయేలుకు తెలిసింది.
13 ✽సమూయేలు సౌలుదగ్గరికి వెళ్ళాడు. సౌలు అతణ్ణి చూచి “యెహోవా నిన్ను దీవిస్తాడు గాక! యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చాను” అన్నాడు.
14 ✽అందుకు సమూయేలు “అయితే నాకు వినబడుతూ ఉన్న గొర్రెల అరుపులేమిటి? ఈ ఎద్దుల రంకెలేమిటి?” అని అడిగాడు.
15 ✽సౌలు “అమాలేకువాళ్ళ దగ్గరనుంచి వాటిని తీసుకువచ్చారు. నీ దేవుడైన యెహోవాకు బలులర్పించడానికి ప్రజలు గొర్రెలలో పశువులలో మంచివాటిని చంపక ఉండనిచ్చారు. మిగిలినవాటిని మేము పూర్తిగా నాశనం చేశాం” అని జవాబిచ్చాడు.
16 అప్పుడు సమూయేలు “ఇక ఊరుకో. పోయిన రాత్రి యెహోవా నాతో ఏమి చెప్పాడో నీకు చెపుతాను, విను” అన్నాడు. సౌలు “చెప్పు” అన్నాడు.
17 సమూయేలు అన్నాడు “నీ దృష్టిలో నీవు అల్పుడు✽గా అనిపించుకొన్నప్పుడు నీవు ఇస్రాయేల్ గోత్రాలకు నాయకుడ వయ్యావు గదా. యెహోవా నిన్ను ఇస్రాయేల్ ప్రజకు రాజుగా అభిషేకించాడు. 18 ✽తరువాత ఒక పని చేయడానికి నిన్ను యెహోవా పంపి ‘అమాలేకువాళ్ళు పాపిష్ఠి జనం. నీవు వెళ్ళి వాళ్ళను పూర్తిగా నాశనం చెయ్యి అని ఆదేశించాడు. 19 నీవు యెహోవా మాట ఎందుకు వినలేదు✽? నీవెందుకు దోపిడీ మీద ఎగబడి యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించావు?”
20 ✽అందుకు సౌలు “అలా కాదు. నేను యెహోవా మాట విన్నాను. ఆయన నాకు నియమించిన పని చేయడానికి వెళ్ళాను. అమాలేకువాళ్ళను పూర్తిగా నాశనం చేసి వాళ్ళ రాజైన అగగును తీసుకువచ్చాను. 21 కానీ ప్రజలు గిల్గాల్‌లో నీ దేవుడు యెహోవాకు బలులు✽ అర్పించడానికి దోపిడీలో నాశనం చేయవలసినదానిలో మంచి రకం గొర్రెలనూ పశువులనూ తీసుకువచ్చారు” అన్నాడు.
22 ✽అందుకు సమూయేలు ఇలా అన్నాడు: “మనం ఆయన మాట వింటే యెహోవా సంతోషించేటంతగా హోమాలూ బలులూ అర్పిస్తే సంతోషిస్తాడా? ఇదిగో విను. బలులు అర్పించడంకంటే ఆజ్ఞ శిరసావహించడం మంచిది. పొట్టేళ్ళ క్రొవ్వును అర్పించడంకంటే ఆయన మాట వినడం మెరుగు. 23 తిరుగుబాటు✽ చేయడం శకునాలు✽ చెప్పడమనే పాపంతో సమానం. మూర్ఖత్వం✽ విగ్రహపూజ అనే దుర్మార్గతతో సమానం. యెహోవా వాక్కును నీవు తిరస్కరించావు, గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను తిరస్కరించాడు✽.”
24 ✽అందుకు సౌలు “నేను తప్పిదం చేశాను. ప్రజలకు భయపడి వారి మాట విన్నాను. అందుచేత నేను యెహోవా ఆజ్ఞనూ నీ మాటలనూ జవదాటాను. 25 ✽కాబట్టి ఇప్పుడు నా తప్పిదం క్షమించమని నిన్ను ప్రాధేయపడుతున్నాను. నేను యెహోవాను ఆరాధించేట్టు✽ నీవు నాతో తిరిగి రా” అని సమూయేలును బతిమాలుకొన్నాడు.
26 సమూయేలు “నేను నీతోకూడా తిరిగి రాను. నీవు యెహోవా వాక్కును తిరస్కరించావు, గనుక యెహోవా నిన్ను ఇస్రాయేల్ ప్రజలపై రాజుగా ఉండకుండా తిరస్కరించాడు” అని సౌలుతో చెప్పాడు.
27 సమూయేలు వెళ్ళిపోవడానికి తిరిగినప్పుడు సౌలు అతడి అంగీ అంచును పట్టుకొన్నాడు. అది చినిగింది.
28 అప్పుడు సమూయేలు అతడితో ఇలా అన్నాడు:
“ఈరోజు యెహోవా ఇస్రాయేల్‌ప్రజల రాజ్యాన్ని నీ చేతిలోనుంచి లాగివేసి నీ పొరుగువారిలో నీకంటే మంచివాడికి✽ అప్పగించాడు. 29 ✝ఇస్రాయేల్ ప్రజలకు మహిమగా ఉన్న దేవుడు అబద్ధమాడడు, తన మనసు మార్చుకోడు. మనసు మార్చుకోవడానికి ఆయన మనిషి కాడు.”
30 అందుకు సౌలు “నేను తప్పిదం చేశాను. కానీ నా ప్రజల పెద్దల ఎదుటా ఇస్రాయేల్‌ప్రజల ఎదుటా నన్ను గౌరవించు✽. నేను నీ దేవుడు యెహోవాను ఆరాధించేట్టు నాతోకూడా తిరిగి రా” అని బతిమాలుకొన్నాడు. 31 ✽కనుక సమూయేలు తిరిగి సౌలుతో కూడా వెళ్ళాడు. సౌలు యెహోవాను ఆరాధించాడు.
32 ✽తరువాత సమూయేలు “అమాలేకువాళ్ళ రాజు అగగును నా దగ్గరికి తీసుకురండి” అని చెప్పాడు. అగగు అతని దగ్గరికి నాజూకుగా వచ్చాడు, “నాకు నిజంగా చావు బాధలు తప్పిపోయాయి” అన్నాడు. 33 ✽ కానీ సమూయేలు “నీ ఖడ్గం స్త్రీలకు సంతానం లేకుండా చేసింది. అలాగే స్త్రీలలో నీ తల్లికి కూడా సంతానం లేకుండా ఉంటుంది” అన్నాడు. అప్పుడు సమూయేలు గిల్గాల్‌లో యెహోవా సన్నిధానంలో అగగును ముక్కలుగా నరికివేశాడు.
34 తరువాత సమూయేలు రమాకు వెళ్ళిపోయాడు. సౌలు తన పట్టణమైన గిబియాలోని తన ఇంటికి వెళ్ళాడు. 35 ✽సమూయేలు చనిపోయే రోజువరకు అతడు ఇంకెన్నడూ సౌలును చూడడానికి వెళ్ళలేదు గాని అతణ్ణి గురించి దుఃఖిస్తూవచ్చాడు. సౌలును ఇస్రాయేల్‌ప్రజల రాజుగా నియమించినందుకు యెహోవా పరితపించాడు.