14
1 ఒకరోజు సౌలు కొడుకైన యోనాతాను అతడి ఆయుధాలు మోసే యువకుణ్ణి పిలిచి “అవతల ఉన్న ఫిలిష్తీయవాళ్ళ యుద్ధ శిబిరానికి పోదాం, రా” అని చెప్పాడు. కానీ అతడు తన తండ్రితో ఆ సంగతి చెప్పలేదు. 2 సౌలు గిబియా పొలిమేరలో మిగ్రోనులో దానిమ్మచెట్టు క్రింద మకాం వేశాడు. అతనితో కూడా సుమారు ఆరు వందలమంది మనుషులు ఉన్నారు. 3 వారిలో ఏఫోదు వేసుకొన్న అహీయా ఉన్నాడు. అతడు ఈకాబోదు తోబుట్టువు అహీటూబు కొడుకు. అహీటూబు తండ్రి ఫీనెహాసు. ఫీనెహాసు తండ్రి షిలోహులో యాజిగా యెహోవాకు సేవ చేసిన ఏలీ. యోనాతాను వెళ్ళిన విషయం ప్రజలకు తెలియదు.
4 యోనాతాను ఫిలిష్తీయవాళ్ళ యుద్ధ శిబిరానికి వెళ్ళదలచిన కనుమకు రెండు వైపులా నిటారుగా ఉన్న కొండలున్నాయి. ఒక కొండ పేరు బొస్సేను. రెండోదాని పేరు సెనే. 5 మిక్మషువైపు ఉత్తరంగా ఒక కొండ శిఖరం, గెబావైపు దక్షిణంగా ఒక కొండ శిఖరం ఉన్నాయి. 6 యోనాతాను అతడి ఆయుధాలు మోసే యువకుడితో, “ఆ సున్నతి లేనివాళ్ళ శిబిరానికి వెళ్దాం, రా. ఒకవేళ యెహోవా మనకోసం క్రియ జరిగిస్తాడేమో. చాలమందిచేత గానీ కొద్దిమందిచేత గానీ విజయం సాధించడానికి యెహోవాకు ఏమీ ఆటంకం లేదు గదా” అన్నాడు.
7 అతడి ఆయుధాలు మోసేవాడు అతడితో “మీ మనసులో ఉన్నదంతా చెయ్యండి. వెళ్దాం. నేను మనసారా మీతో ఉన్నాను” అని చెప్పాడు.
8 అందుకు యోనాతాను ఇలా అన్నాడు: “మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు కనబరచుకొంటాం. 9 ఒకవేళ వాళ్ళు మనతో ‘మేము మీదగ్గరికి వచ్చేవరకు అక్కడ ఆగండి’ అని చెపితే మనం వాళ్ళదగ్గరికి వెళ్ళకుండా అక్కడే ఉండిపోతాం. 10 ఒకవేళ వాళ్ళు ‘మాదగ్గరికి ఎక్కిరండి’ అని చెపితే మనం వాళ్ళదగ్గరికి ఎక్కి వెళ్దాం. యెహోవా వాళ్ళను మన వశం చేశాడని అది మనకు గురుతుగా ఉంటుంది.”
11 అలాగే వారిద్దరు ఫిలిష్తీయ శిబిరంలో ఉన్నవాళ్ళకు తమను కనుపరచుకొన్నప్పుడు “చూడండి! హీబ్రూవాళ్ళు దాక్కొన్న గుంటలలోనుంచి బయటికి వచ్చేస్తున్నారు!” అని ఫిలిష్తీయవాళ్ళు చెప్పారు.
12 అప్పుడు శిబిరంలో ఉన్నవాళ్ళు యోనాతానునూ అతడి ఆయుధాలు మోసేవాణ్ణీ పిలిచి “మాదగ్గరికి ఎక్కిరండి! మీకు ఒక పాఠం నేర్పిస్తాం” అన్నారు. యోనాతాను అతడి ఆయుధాలు మోసేవాడితో “నా వెనక రా. యెహోవా వాళ్ళను ఇస్రాయేల్‌ప్రజల వశం చేశాడు” అని చెప్పాడు.
13 అతడూ అతడి ఆయుధాలు మోసేవాడూ తమ చేతులతో కాళ్ళతో ప్రాకి పైకెక్కిపోయారు. యోనాతాను ఎదుట ఫిలిష్తీయవాళ్ళు కూలారు. అతడి ఆయుధాలు మోసేవాడు అతడి వెనుక వచ్చి కొంతమందిని చంపాడు. 14 ఆ మొదటి వధలో యోనాతాను, అతడి ఆయుధాలు మోసేవాడు సుమారు ఇరవైమందిని అర ఎకరం స్థలంలో హతమార్చారు.
15 అప్పుడు ఫిలిష్తీయ సైన్యంలో – బయట ఉన్నవాళ్ళలో సైనికులందరిలో గొప్ప భయాందోళన బయలుదేరింది. యుద్ధశిబిరాలలో ఉండేవాళ్ళూ దోపిడీదారులూ కూడా భయంతో వణికిపోయారు. భూమి కంపించింది. ఈ భయాందోళన దేవునిమూలంగా కలిగింది. 16 బెన్యామీను ప్రదేశంలో గిబియాలో సౌలు కావలివారు చూస్తూ ఉంటే, ఫిలిష్తీయసైన్యం అన్ని వైపులకూ చెల్లాచెదురైపోవడం కనిపించింది.
17 సౌలు “మీరు లెక్కపెట్టి మనదగ్గర లేనివారెవరో చూడండి” అని తనతో ఉన్నవారికి ఆదేశించాడు.
వారు లెక్కపెట్టి చూస్తే అక్కడ లేనివారు యోనాతాను, అతడి ఆయుధాలు మోసేవాడు.
18 అప్పుడు సౌలు “దేవుని మందసాన్ని ఇక్కడికి తీసుకురా” అని అహీయాతో చెప్పాడు (అప్పుడు దేవుని మందసం ఇస్రాయేల్‌ప్రజల దగ్గర ఉంది). 19 యాజితో సౌలు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఫిలిష్తీయ శిబిరంలో అలజడి మరి ఎక్కువ అవుతూ ఉంది. సౌలు “నీ చేతిని వెనక్కు తీసుకో” అని యాజితో చెప్పాడు.
20 అప్పుడు సౌలు అతనితో ఉన్నవారంతా కలిసి యుద్ధానికి బయలుదేరారు. ఫిలిష్తీయసైన్యంలో అంతా గందరగోళంగా ఉంది. ఒకణ్ణి ఒకడు కత్తిపాలు చేసుకొంటూ ఉన్నారు. 21 అంతకుముందు ఫిలిష్తీయవాళ్ళ వశంలో ఉండి వాళ్ళ శిబిరానికి వాళ్ళతో కూడా వెళ్ళిన హీబ్రూవారు వచ్చి సౌలు యోనాతానుల దగ్గర ఉన్న ఇస్రాయేల్‌వారితో చేరారు. 22 అంతేగాక ఫిలిష్తీయ సైన్యం పారిపోతూ ఉందని విని ఎఫ్రాయిం కొండప్రదేశంలో దాగుకొన్న ఇస్రాయేల్‌వారంతా వాళ్ళను తరిమివేయడానికి యుద్ధంలో చేరారు. 23 ఆ రోజున యెహోవా ఇస్రాయేల్‌ప్రజలను రక్షించాడు. పోరాటం బేత్‌ఆవెను అవతలికి దాటిపోయింది.
24 ఆరోజు ఇస్రాయేల్‌వారు చాలా అలసిపోయారు. ఎందుకంటే సౌలు “నేను నా శత్రువులపై పగతీర్చుకొనేవరకు, సాయంత్రమయ్యేవరకు తిండి ఏదైనా తినేవాడు శాపానికి గురి అవుతాడు గాక” అంటూ ప్రజలచేత శపథం చేయించాడు, కనుక వారిలో ఎవరూ దేనినీ తినలేదు. 25 తరువాత అందరూ ఒక అడవిని చేరారు. అక్కడ నేలమీద తేనె ఉంది. 26 వారు అడవిలో ప్రవేశిస్తూ ఉంటే తేనె కారిపడడం కనిపించింది. అయితే తాము చేసిన శపథానికి భయపడి ఎవ్వరూ దానిని తినలేదు. 27 తన తండ్రి ప్రజలచేత శపథం చేయించిన సంగతి యోనాతాను వినలేదు, గనుక అతడు తన చేతికర్ర కొనను తేనెపట్టులో ముంచి తేనె నోట్లో పెట్టుకొన్నాడు. వెంటనే అతని కండ్లు ప్రకాశించాయి.
28 అప్పుడు మనుషులలో ఒకడు “నీ తండ్రి ఈ విధంగా అన్నాడు - ‘ఈరోజున ఏదైనా తిండి తినేవాడు శాపానికి గురి అవుతాడు గాక’ అంటూ ప్రజలచేత ఖచ్చితంగా శపథం చేయించాడు. అందుచేత ప్రజలు చాలా అలసిపోయారు” అని యోనాతానుతో అన్నాడు.
29 అందుకు యోనాతాను ఇలా అన్నాడు: “నా తండ్రి అందరికీ ఇబ్బంది కలిగించాడు. నేను ఈ తేనె కొంచెం తింటే నా కండ్లు ఎంత ప్రకాశించాయో చూశారా? 30 తాము పట్టుకొన్న శత్రువుల దోపిడీ వస్తువులలో కొంత తిని ఉంటే వారు ఫిలిష్తీయవాళ్ళను ఇంకా ఎక్కువ నాశనం చేసి ఉండేవారు.”
31 ఆరోజు ఇస్రాయేల్‌వారు ఫిలిష్తీయవాళ్ళను మిక్మషు నుంచి అయ్యాలోను వరకు హతం చేసి బాగా అలసిపోయారు. 32 వారు దోపిడీమీద ఎగబడి గొర్రెలనూ ఎద్దులనూ దూడలనూ నేలపై వధించి వాటి మాంసం రక్తంతోనే తిన్నారు.
33 “ప్రజలు మాంసం రక్తంతోనే తినడంవల్ల యెహోవాకు వ్యతిరేకంగా తప్పిదం చేస్తున్నారు” అని కొందరు సౌలుతో చెప్పారు.
అందుకు సౌలు “మీరు ద్రోహులు! ఇప్పుడే నాదగ్గరికి పెద్ద రాయి దొర్లించి తీసుకురండి!” అని చెప్పాడు. 34 అప్పుడతడు ఇంకా అన్నాడు: “మీరు ప్రజల మధ్యకు వెళ్ళి ప్రతి ఒక్కరూ వారి పశువును లేక గొర్రెను ఇక్కడికి తీసుకువచ్చి వధించి తినాలి. మాంసం రక్తంతో తినడంవల్ల యెహోవాకు వ్యతిరేకంగా తప్పిదం చేయకండి.”
అందుచేత వారంతా ఆ రాత్రి వారి పశువులను తీసుకువచ్చి అక్కడ వధించారు. 35 సౌలు యెహోవాకు బలిపీఠం కట్టించాడు. అతడు ఇలా చేయడం అదే మొదటి సారి.
36 ఆ తరువాత సౌలు “ఈ రాత్రి మనం ఫిలిష్తీయవాళ్ళను దోచుకొని వాళ్ళలో ఎవ్వరూ మిగలకుండా చేద్దాం, రండి” అని చెప్పాడు.
అందుకు వారు “నీకు ఏది మంచిదని తోస్తే అది చెయ్యి” అని బదులు చెప్పారు.
కానీ యాజి “ఇక్కడ దేవుణ్ణి సమీపించి అడుగుదాం” అన్నాడు.
37 కనుక సౌలు “నేను ఫిలిష్తీయవాళ్ళను వెంటాడాలా? వాళ్ళను ఇస్రాయేల్‌వారి వశం చేస్తావా?” అని దేవుణ్ణి అడిగాడు. కానీ ఆ రోజున దేవుడు అతనికి జవాబివ్వలేదు.
38 అందుచేత సౌలు “ప్రజల నాయకులంతా నాదగ్గరికి రండి. ఈరోజు ఎవరు తప్పిదం చేశారో విచారణ చేసి తెలుసుకోవాలి. 39 తప్పిదం చేసినది నా కొడుకు యోనాతాను అయినా అతడు తప్పక చస్తాడని ఇస్రాయేల్ ప్రజలను కాపాడే యెహోవా జీవంతోడని ప్రమాణం చేస్తున్నాను” అని చెప్పాడు. ప్రజలలో ఎవ్వరూ అతడికి జవాబివ్వలేదు.
40 అప్పుడు అతడు ఇస్రాయేల్‌వారందరితో “మీరు అక్కడ నిలబడి ఉండండి. నేను, నా కొడుకు యోనాతాను ఇక్కడ నిలబడి ఉంటాం” అన్నాడు. అందుకు ప్రజలు “నీకు ఏది మంచిదనిపిస్తే అది చెయ్యి” అని బదులు చెప్పారు.
41 అప్పుడు సౌలు ఇస్రాయేల్‌ప్రజల దేవుడు యెహోవాకు ప్రార్థన చేసి “చీటి సరిగానే పడేట్టు చెయ్యి” అన్నాడు. సౌలు పేర, యోనాతాను పేర చీటి పడింది గాని ప్రజలు తప్పించుకొన్నారు.
42 “నాకు, నా కొడుకు యోనాతానుకు చీట్లు వేయండి” అని సౌలు అన్నాడు.
యోనాతాను పేర చీటి పడింది.
43 అప్పుడు యోనాతానుతో సౌలు “నువ్వు ఏం చేశావో నాతో చెప్పు” అన్నాడు. యోనాతాను “నేను నా చేతికర్ర కొనతో కొంచెం తేనె తీసుకొని రుచిచూశాను. ఇప్పుడు నేను చావాలన్నమాట” అని సౌలుతో చెప్పాడు.
44 అందుకు సౌలు “యోనాతాను, నీవు తప్పక చావాలి. నేను దానికి ఒప్పుకోకపోతే దేవుడు అంతకంటే ఎక్కువ కీడు నాకు చేస్తాడు గాక!” అన్నాడు.
45 గాని ప్రజలు సౌలుతో ఇలా చెప్పారు: “ఇస్రాయేల్ ప్రజలకు ఇంత గొప్ప విజయం సాధించినది యోనాతానే. అతడు చనిపోవాలా? అలా కాదు. ఈరోజున అతడు సాధించినది దేవుని సాయంతోనే, గనుక అతడి తల వెండ్రుకలలో ఒక్కటి కూడా నేలపై పడదని యెహోవా జీవంతోడని చెపుతున్నాం.”
ఈవిధంగా యోనాతాను చనిపోకుండా ప్రజలు అతణ్ణి కాపాడారు. 46 అప్పుడు సౌలు ఫిలిష్తీయవాళ్ళను తరమడం మానుకున్నాడు. ఫిలిష్తీయవాళ్ళు స్వదేశానికి వెళ్ళిపోయారు.
47 సౌలు ఇస్రాయేల్‌ప్రజలపై పరిపాలించడం మొదలు పెట్టిన తరువాత నలువైపులా ఉన్న వారి శత్రువులతో పోరాడాడు. మోయాబువాళ్ళతో, అమ్మోనువాళ్ళతో యుద్ధం చేశాడు. అతడు ఎవరిమీద యుద్ధం జరిగించినా వారిని ఓడించాడు. 48 అతడు పరాక్రమంతో పోరాడి అమాలేకు జాతివాళ్ళను ఓడించి ఇస్రాయేల్‌ప్రజలను దోపిడీ చేసినవాళ్ళ చేతినుంచి వారిని విడిపించాడు.
49 సౌలు కొడుకుల పేర్లు యోనాతాను, ఇష్వీ, మెల్కీషూవ. అతడి పెద్ద కూతురి పేరు మేరబు, చిన్న కూతురి పేరు మీకాల్. 50 సౌలు భార్య అహీనోయం. ఆమె అహిమయసు కూతురు. సౌలు సైన్యాధిపతి పేరు అబ్నేర్. అతడు నేర్ కొడుకు. నేర్ సౌలుకు పిన తండ్రి. 51 సౌలు తండ్రి కీషు, అబ్నేర్ తండ్రి నేర్ అబీయేల్ కొడుకు.
52 సౌలు బ్రతికినన్నాళ్ళూ ఫిలిష్తీయవాళ్ళతో యుద్ధం ఘోరంగా జరుగుతూనే ఉంది. సౌలు తనకు కనిపించే బలాఢ్యులను వీరులను తన సైన్యంలో చేర్చుకొన్నాడు.