13
1 సౌలు పరిపాలించడం మొదలు పెట్టినప్పుడు అతని వయస్సు ముప్ఫయి సంవత్సరాలు. అతడు ఇస్రాయేల్ ప్రజలను రెండు సంవత్సరాలు పరిపాలించిన తరువాత, 2 ఇస్రాయేల్‌ప్రజలలో మూడు వేలమందిని ఎన్నుకొన్నాడు. వారిలో రెండువేలమంది మిక్మషులో, బేతేల్ కొండలో తన దగ్గర ఉన్నారు, వెయ్యిమంది బెన్యామీను ప్రదేశంలో ఉన్న గిబియాలో యోనాతానుదగ్గర ఉన్నారు. మిగతావారిని అతడు వారి ఇండ్లకు పంపివేశాడు. 3 యోనాతాను గెబాలో ఉండే ఫిలిష్తీయ సైనికుల గుంపుపైబడి దానిని ఓడించాడు. దాన్నిగురించి ఫిలిష్తీయవాళ్ళు విన్నారు. అప్పుడు సౌలు దేశమంతటా బూర ఊది “హీబ్రూ వారు వినాలి!” అని ప్రకటన చేయించాడు. 4 సౌలు ఫిలిష్తీయ సైనికుల గుంపుపైబడి దానిని ఓడించాడనీ అందుచేత ఫిలిష్తీయవాళ్ళకు ఇస్రాయేల్‌ప్రజలు అసహ్యులయ్యారనీ ఇస్రాయేల్‌ప్రజలందరికీ వినబడింది. వారు గిల్గాల్‌లో సౌలు దగ్గర సమకూడారు. 5 ఇస్రాయేల్‌వారితో యుద్ధం చేయడానికి ఫిలిష్తీయవాళ్ళు ముప్ఫయివేల రథాలనూ ఆరువేల రౌతులనూ సముద్రతీరాన ఇసుక రేణువులంతగా సైనికులనూ సమకూర్చారు. వాళ్ళు వచ్చి బేత్‌ఆవెనుకు తూర్పు దిక్కున మిక్మషులో మకాం చేశారు. 6 ఇస్రాయేల్‌వారు తాము ఆపదలో, ఇరుకులో చిక్కుకోవడం చూచి గుహలలో, దట్టమైన పొదలలో, బండల సందులలో, పాతరలలో, గుంటలలో దాగుకొన్నారు. 7 ఈ హీబ్రూవారిలో కొందరు యొర్దాను దాటి గాదు, గిలాదు ప్రదేశాలకు వెళ్ళిపోయారు. అయితే సౌలు గిల్గాల్‌లోనే ఉండిపోయాడు. అతని దగ్గర ఉన్నవారంతా భయంతో వణకుతూ ఉన్నారు.
8 సమూయేలు ఆదేశించినట్టు సౌలు ఏడు రోజులు ఆగాడు. కానీ సమూయేలు గిల్గాల్‌కు రాలేదు. ప్రజలు సౌలుదగ్గరనుంచి చెదరిపోసాగారు. 9 కనుక సౌలు “హోమ బలినీ శాంతిబలులనూ నాదగ్గరికి తీసుకురండి” అన్నాడు. తానే హోమబలిని అర్పించాడు. 10 హోమబలి అర్పించడం ముగియగానే సమూయేలు వచ్చాడు. సౌలు అతణ్ణి కలుసుకొని పలకరించడానికి బయటికి వెళ్ళాడు.
11 సమూయేలు “నీవు చేసిన పని ఏమిటి?” అని అడిగాడు.
అందుకు సౌలు ఇలా జవాబిచ్చాడు: “ప్రజలు నా దగ్గరనుంచి చెదరిపోసాగారు. నియామకమైన సమయానికి మీరు రాలేదు. ఫిలిష్తీయవాళ్ళు మిక్మషులో సమకూడారు. 12 నేను యెహోవా అనుగ్రహాన్ని వెదకేముందే ఫిలిష్తీయవాళ్ళు గిల్గాల్‌కు వచ్చి నాపై పడతారనుకొన్నాను. అందుచేతే హోమబలి అర్పించడానికి నన్ను నేనే బలవంతం చేసుకొన్నాను.”
13 సమూయేలు ఈ విధంగా బదులు చెప్పాడు: “నీవు తెలివితక్కువగా ప్రవర్తించావు. నీ దేవుడు యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను నీవు పాటించలేదు. నీవు పాటించి ఉంటే ఆయన ఇస్రాయేల్‌ప్రజలమీద నీ రాజ్యాన్ని ఎప్పటికీ స్థిరపరచేవాడు. 14  కానీ నీ రాజ్యం నిలవదు. యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను నీవు పాటించలేదు, గనుక యెహోవా తన హృదయానికి అనుగుణమైన మనిషిని ఎన్నుకొని తన ప్రజలకు నాయకుడుగా నియమించాడు.”
15  అప్పుడు సమూయేలు గిల్గాల్‌ను విడిచి బెన్యామీను ప్రదేశంలో ఉన్న గిబియాకు వెళ్ళాడు. సౌలు తనదగ్గర ఉన్న వారిని లెక్కపెట్టాడు. వారు సుమారు ఆరు వందలమంది.
16 సౌలు, అతని కొడుకు యోనాతాను, వారి దగ్గర ఉన్న మనుషులు బెన్యామీను ప్రదేశంలో గెబాలో ఉన్నారు. ఫిలిష్తీయవాళ్ళు మిక్మషులో మకాం వేసి ఉండిపోయారు. 17 ఫిలిష్తీయవాళ్ళ శిబిరంనుంచి దోపిడీదారులు మూడు గుంపులుగా బయలుదేరారు. ఒక గుంపు షుయాల్ ప్రాంతంలో ఒఫ్రా వైపుకు వెళ్ళింది. 18 మరో గుంపు బేత్‌హోరోనువైపుకు వెళ్ళింది. ఇంకో గుంపు ఎడారిదగ్గర ఉండే జెబోయిం లోయ దగ్గర ఉండే సరిహద్దువైపుకు వెళ్ళింది.
19 ఆ రోజుల్లో ఇస్రాయేల్‌దేశమంతటా కుమ్మరి వాడొక్కడు కూడా లేడు. “కమ్మరివాళ్ళు ఉంటే హీబ్రూవాళ్ళు కత్తులూ ఈటెలూ చేయించుకోక మానరు” అని ఫిలిష్తీయవాళ్ళు చెప్పుకొని కమ్మరివాళ్ళు లేకుండా చేశారు. 20 కనుక తమ నాగటి కర్రలనూ పారలనూ గొడ్డళ్ళనూ కొడవళ్ళనూ పదును చేయించుకోవడానికి ఇస్రాయేల్‌లో ప్రతి ఒక్కరూ ఫిలిష్తీయ వాళ్ళదగ్గరికి వెళ్ళవలసి వచ్చేది. 21 (నాగటి కర్రలనూ పారలనూ పదును పెట్టడానికి కూలి ఒక పెద్ద వెండి నాణెం. కొంకులనూ గొడ్డళ్ళనూ పదును పెట్టడానికి, మునికోళ్ళనూ సరిచేయడానికి కూలి ఒక చిన్న వెండి నాణెం.) 22 అందుచేత యుద్ధం జరిగిన రోజున సౌలు, యోనాతానుల దగ్గర ఉన్నవారిలో ఎవరి చేతిలో కూడా కత్తి గానీ, ఈటె గానీ లేదు. సౌలుకూ అతని కొడుకు యోనాతానుకూ మాత్రమే అవి ఉన్నాయి. 23 అప్పుడు ఫిలిష్తీయ సైనికులు కొందరు మిక్మషు కనుమకు వెళ్ళి అక్కడ ఉన్నారు.