12
1 అప్పుడు సమూయేలు ఇస్రాయేల్✽ప్రజలందరితో ఈవిధంగా అన్నాడు: “ఇదిగో వినండి, మీరు✽ నాతో చెప్పినవన్నీ విని నేను మీమీద ఒక రాజును నియమించాను. 2 ✝ఇప్పుడు రాజు మీకు నాయకత్వం వహిస్తాడు. నా తల నెరసింది, ముసలివాణ్ణయ్యాను. నా కొడుకులు మీమధ్య ఉన్నారు. యువదశనుంచి నేటివరకు నేను మీకు నాయకుడుగా ఉన్నాను. 3 ✽ఇదిగో నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. నేను ఏదైనా అపరాధం చేసి ఉంటే యెహోవా ఎదుట, యెహోవా చేత అభిషేకం పొందినవాని ఎదుట నామీద సాక్ష్యం చెప్పండి. కానీ నేను ఎవరి ఎద్దునైనా గాడిదనైనా తీసుకొన్నానా? నేను ఎవరికైనా అన్యాయం చేశానా? ఎవరినైనా బాధ పెట్టానా? న్యాయం చూడకుండేలా ఎవరి దగ్గరైనా లంచం తీసుకొన్నానా? చెప్పండి. నేను ఆ విధంగా చేసి ఉంటే మీ ఎదుటే దానిని సరి చేస్తాను✽.”4 ✽అందుకు వారు “నీవు మాకు ఎలాంటి అన్యాయమూ చేయలేదు. మమ్మల్ని బాధపెట్టలేదు. ఎవరిదగ్గరా నీవు దేనినీ తీసుకోలేదు” అని చెప్పారు.
5 సమూయేలు “నేను అలాంటిది ఏదీ చేయలేదని మీరు చెప్పిన మాటకు ఈ రోజున యెహోవా సాక్షి. ఆయనచేత అభిషేకం పొందినవాడు✽ కూడా సాక్షి” అని ప్రజలతో అన్నాడు.
వారు “అవును, వారు సాక్షులే” అన్నారు. 6 అప్పుడు✽ సమూయేలు ప్రజలతో ఇలా అన్నాడు: “మోషే అహరోనులను నియమించి మీ పూర్వీకులను ఈజిప్ట్‌నుంచి తీసుకువచ్చినది యెహోవాయే. 7 కాబట్టి యెహోవా మీకూ మీ పూర్వీకులకూ చేసిన న్యాయ కార్యాలను యెహోవా ఎదుట మీకు జ్ఞాపకం చేసి మీతో వాదించాలి✽. మీరు ఇక్కడే నిలబడి ఉండండి. 8 ✝యాకోబు ఈజిప్ట్‌కు వెళ్ళిన తరువాత మీ పూర్వీకులు సహాయంకోసం యెహోవాకు మొరపెట్టుకొన్నారు. యెహోవా మోషే అహరోనులను పంపాడు. వారు ఈజిప్ట్‌నుంచి మీ పూర్వీకులను తీసుకువచ్చి ఈ ప్రాంతంలో వారికి కాపురమేర్పరిచారు. 9 ✽అయినా ప్రజలు తమ దేవుడైన యెహోవాను మరచి పోయారు✽. అందుచేత ఆయన వారిని హాసోరు సేనల అధిపతి సీసెరా చేతికీ ఫిలిష్తీయవాళ్ళ చేతికీ మోయాబుదేశం రాజు చేతికీ అప్పగించాడు. వాళ్ళు ఇస్రాయేల్‌ప్రజలమీద యుద్ధం జరిగించారు. 10 ✝అప్పుడు ఇశ్రాయేల్ సహాయంకోసం యెహోవాకు మొరపెట్టి ‘మేము తప్పిదం చేశాం. యెహోవాను విడిచిపెట్టి బయల్‌దేవుళ్ళనూ అష్తారోతు దేవి విగ్రహాలనూ సేవించాం. ఇప్పుడు మమ్మల్ని మా శత్రువుల బారినుంచి రక్షించు. నిన్నే సేవిస్తాం’ అన్నారు. 11 ✝యెహోవా యెరుబ్బయల్‌నూ బెదాన్‌నూ యెఫ్తానూ సమూయేలునూ పంపి నలుదిక్కుల నుంచి మీ శత్రువుల చేతిలోనుంచి మిమ్మల్ని విడిపించాడు గనుక మీరు సురక్షితంగా కాపురమున్నారు.
12 “కానీ అమ్మోనువాళ్ళ రాజు నాహాషు మీపై దాడి చేయడం చూచి మీరు నాతో ‘మమ్మల్ని పరిపాలించడానికి మాకు రాజు కావాలి’ అన్నారు. మీ దేవుడు యెహోవా మీకు రాజు✽గా ఉన్నప్పటికీ మీరు ఆ విధంగా చెప్పారు. 13 ఇప్పుడు మీరు కోరి ఎన్నుకొన్న రాజును చూడండి. ఇడుగో, యెహోవా మీమీద రాజును నియమించాడు. 14 మీరు యెహోవాను భయభక్తులతో సేవిస్తే, ఆయన మాట వింటే, ఆయన ఆజ్ఞలకు తిరగబడకపోతే మీరూ మిమ్మల్ని పరిపాలించే రాజూ మీ దేవుడైన యెహోవాను అనుసరిస్తే మీకు క్షేమం. 15 కానీ యెహోవా మాట వినకుండా ఆయన ఆజ్ఞలకు తిరగబడితే యెహోవా✽ చెయ్యి మీ పూర్వీకులకు✽ వ్యతిరేకంగా ఉన్నట్టే మీకూ వ్యతిరేకంగా ఉంటుంది. 16 ✽ఇప్పుడు మీ కళ్ళెదుట యెహోవా మహాక్రియను చేయబోతున్నాడు. అక్కడ నిలబడివుండి చూడండి. 17 ఇప్పుడు గోధుమ కోతకాలం గదా. ఉరుములనూ వాననూ పంపించమని నేను యెహోవాను వేడుకొంటాను. రాజును నియమించాలని మీరు అడగడంవల్ల యెహోవా దృష్టిలో మీరు చేసినది పెద్ద దోషమని గుర్తించి తెలుసుకోవాలని ఇలా చేస్తున్నాను.”
18 అప్పుడు సమూయేలు యెహోవాను ప్రార్థించాడు✽. ఆరోజే యెహోవా ఉరుములనూ వాననూ పంపించాడు. కనుక ప్రజలంతా యెహోవాకూ సమూయేలు✽కూ చాలా భయపడ్డారు.
19 ✽వారంతా సమూయేలుతో “రాజును నియమించాలని మేము అడగడంవల్ల ఈ దోషాన్ని మేము చేసిన ఇతర పాపాలన్నింటికీ కలుపుకొన్నాం. మేము చనిపోకుండేట్టు నీ సేవకులైన మాకోసం నీ దేవుడు యెహోవాను ప్రార్థించు” అన్నారు.
20 అందుకు సమూయేలు ఈ విధంగా చెప్పాడు: “భయపడకండి✽. మీరు ఈ దోషం చేసిన మాట వాస్తవమే. అయినా యెహోవాను అనుసరించడం మానుకోకండి. హృదయపూర్వకంగా ఆయనను సేవిస్తూ ఉండండి. 21 ✝విగ్రహాలవైపుకు తొలగిపోకండి. అవి పనికిమాలినవి గనుక అవి మీకు మేలు చేయలేవు, విముక్తి కలిగించలేవు. 22 మిమ్మల్ని తన ప్రజగా చేసుకోవడం యెహోవాకు ఇష్టమయింది, గనుక తన గొప్ప పేరు✽కోసం తన ప్రజను విసర్జించకుండా ఉంటాడు. 23 నా విషయం అంటారా? మీకోసం ప్రార్థించక పోవడంవల్ల✽ యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేయడం నాకు దూరం కావాలి. సరైన మంచి మార్గం నేను మీకు ఉపదేశిస్తాను✽. 24 అయితే మీరు యెహోవాపట్ల భయభక్తులు✽ కలిగి నమ్మకంగా హృదయ పూర్వకంగా ఆయనను సేవిస్తూ ఉండండి. ఆయన మీకోసం ఎంతటి మహాక్రియలు✽ చేశాడో ఆలోచించండి. 25 ✝మీరు ఇంకా చెడుగు చేస్తూ ఉంటే మీరు మీ రాజుతోపాటు నాశనమవుతారు.”