10
1 సమూయేలు నూనెతో నిండిన సీసాను చేతపట్టుకొని సౌలు తలపై పోసి అతణ్ణి ముద్దుపెట్టుకొని ఇలా అన్నాడు: “యెహోవా తన సొత్తుగా ఉన్న ప్రజలమీద నిన్ను నాయకుడుగా అభిషేకించి నియమించాడు. 2 ఈవేళ నీవు నాదగ్గరనుంచి వెళ్ళిపోయిన తరువాత, బెన్యామీను సరిహద్దులో సెల్సహులో రాహేలు సమాధి దగ్గర ఇద్దరు వ్యక్తులు నీకు కనిపిస్తారు. వారు నీతో ఈ విధంగా చెపుతారు: మీరు వెదకడానికి వెళ్ళిన గాడిదలు దొరికాయి. ఇప్పుడు మీ తండ్రి, గాడిదలను మరచి మీ విషయం కంగారుపడుతున్నాడు. నా కొడుకు విషయం ఏం చేయాలి? అని అడుగుతున్నాడు. 3 తరువాత నీవు అక్కడనుంచి తాబోరు మైదానంలో ఉన్న పెద్ద చెట్టుదగ్గరికి చేరుకొంటావు. అక్కడ బేతేల్‌కు దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్న ముగ్గురు మనుషులు మీకు ఎదురవుతారు. వారిలో ఒకడు మూడు మేకపిల్లలనూ, ఒకడు మూడు రొట్టెలనూ, మరొకడు ద్రాక్షరసం తిత్తినీ మోసుకువస్తారు. 4 వారు నిన్ను కుశల ప్రశ్నలడిగి నీకు రెండు రొట్టెలు ఇస్తారు. వారి చేతుల నుంచి వాటిని తీసుకో. 5 తరువాత ‘దేవుని కొండ’ చేరుకొంటావు. అక్కడ ఫిలిష్తీయ సైనికుల గుంపు ఉంది. నీవు ఆ ఊరిదగ్గరికి వెళ్ళగానే ఎత్తయిన పూజాస్థలం నుంచి దిగివస్తూ ఉన్న ప్రవక్తల గుంపు నీకు కనిపిస్తుంది. వారికంటే ముందు కొందరు కంజరీలూ పిల్లన గ్రోవులూ వేరు వేరు తంతి వాద్యాలూ వాయిస్తూ వస్తూ ఉంటారు. ఆ ప్రవక్తలు పరవశులై ప్రకటిస్తూ ఉంటారు. 6 అప్పుడు యెహోవా ఆత్మ నిన్ను బలీయంగా ఆవరిస్తాడు. నీవూ వారితో కలిసి పారవశ్యంతో ప్రకటిస్తావు. నీవు వేరొక వ్యక్తిలాగా మారిపోతావు. 7 ఈ సూచనలు నీకు నెరవేరిన తరువాత సమయానికి తగ్గట్టు ప్రవర్తించు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. 8 తరువాత నాకంటే ముందు నీవు గిల్గాల్‌కు వెళ్ళు. హోమబలులూ శాంతిబలులూ అర్పించడానికి నేను నీదగ్గరికి వస్తాను. నేను నీదగ్గరికి వచ్చి నీవు చేయవలసినది నీకు చెపుతాను. కానీ అంతకుముందు నీవు అక్కడ ఏడు రోజులవరకు ఉండి పోవాలి.”
9 సౌలు సమూయేలు దగ్గరనుంచి బయలుదేరడానికి తిరగడంతోనే దేవుడు అతని హృదయాన్ని మార్చాడు. సమూయేలు చెప్పిన సూచకాలన్నీ ఆరోజే జరిగాయి. 10 వారు ఆ కొండ చేరుకోగానే ప్రవక్తల గుంపు సౌలుకు ఎదురైంది. దేవుని ఆత్మ అతణ్ణి బలీయంగా ఆవరించాడు. అతడు ప్రవక్తలతో కలిసి పరవశుడై ప్రకటన చేశాడు. 11 అతడు అలా ప్రవక్తలతో కలిసి ప్రకటించడం చూచి మునుపు అతణ్ణి ఎరిగినవారంతా, “కీషు కొడుక్కు ఏం జరిగింది? సౌలు కూడా ప్రవక్తలలో ఒకడయ్యాడా?” అని ఒకరిని ఒకరు అడిగారు.
12 అక్కడివాడొకడు “వాళ్ళ తండ్రి ఎవరు?” అని అడిగాడు. అందుకు “సౌలు కూడా ప్రవక్తలలో ఒకడయ్యాడు!” అనే సామెత వెలిసింది. 13 సౌలు అలా ప్రకటించడం మానుకొన్న తరువాత ఎత్తయిన ఆరాధన స్థలానికి వెళ్ళాడు.
14 సౌలు పినతండ్రి సౌలునూ అతని పనివాణ్ణీ చూచి “మీరు ఎక్కడికి వెళ్ళారు?” అని అడిగాడు.
అందుకు సౌలు “గాడిదలను వెదకడానికి వెళ్ళాం. అవి ఎక్కడా కనిపించకపోయేసరికి సమూయేలు దగ్గరకి వెళ్ళాం” అని బదులు చెప్పాడు.
15 అతడి పినతండ్రి “సమూయేలు నీతో చెప్పిన విషయాన్ని నాకు చెప్పు” అన్నాడు.
16 సౌలు “గాడిదలు దొరికేశాయి అని అతడు చెప్పాడు” అన్నాడు. కానీ సమూయేలు రాజ్యపరిపాలన విషయం చెప్పినది పినతండ్రికి సౌలు తెలియజేయలేదు.
17 తరువాత సమూయేలు మిస్పాకూ యెహోవా సన్నిధానంలోకీ ఇస్రాయేల్ ప్రజలను పిలిపించి వారితో ఇలా అన్నాడు:
18 “ఇస్రాయేల్ ప్రజల దేవుడు యెహోవా చెప్పేదేమిటంటే, నేను ఇస్రాయేల్‌ప్రజను ఈజిప్ట్‌నుంచి తీసుకువచ్చాను. ఈజిప్ట్ వాళ్ళ వశంలో నుంచీ మిమ్ములను అణచివేసిన అన్ని రాజ్యాల వశంలోనుంచీ మిమ్ములను విడుదల చేశాను. 19 అయితే అన్ని విపత్తులనుంచీ ఆపదలనుంచీ రక్షించే మీ దేవుణ్ణి మీరు ఈవేళ తిరస్కరించారు. ‘మాకు రాజును నియమించమ’ని ఆయనను కోరారు. కనుక మీరు గోత్రాలప్రకారం, కుటుంబాలప్రకారం యెహోవా సన్నిధానంలో నిలబడి ఉండండి.”
20 సమూయేలు ఇస్రాయేల్ గోత్రాలన్నిటినీ దగ్గరగా రప్పించినప్పుడు బెన్యామీను గోత్రానికి చీటి వచ్చింది. 21 బెన్యామీనుగోత్రాన్ని కుటుంబాల ప్రకారం దగ్గరగా రప్పించినప్పుడు మథ్రీ కుటుంబానికి చీటి వచ్చింది. తరువాత కీషు కొడుకు సౌలుకు చీటి వచ్చింది. వారు అతణ్ణి వెదికారు గాని అతడు కనిపించలేదు.
22 కనుక వారు “ఆ మనిషి ఇక్కడికి ఇంకా వచ్చాడా లేదా?” అని యెహోవాను సంప్రదించారు.
యెహోవా “ఇడుగో అతడు సామానులో దాగి ఉన్నాడు” అని జవాబిచ్చాడు.
23 వారు పరుగెత్తివెళ్ళి అతణ్ణి అక్కడనుంచి తీసుకు వచ్చారు. అతడు ప్రజల మధ్య నిలబడితే భుజాలు మొదలు పైకి ఇతరులకంటే పొడుగాటి వాడుగా ఉన్నాడు. 24 సమూయేలు ప్రజలందరితో “యెహోవా ఎన్నుకొన్న వ్యక్తిని చూశారా? ప్రజలందరిలో అతని లాంటివాడెవ్వడూ లేడు” అన్నాడు.
ప్రజలంతా “రాజు చిరంజీవి అవుతాడు గాక!” అని కేకలు వేశారు.
25 సమూయేలు రాజ్యపాలన నియమాలను ప్రజలకు వివరించాడు. అప్పుడతడు వాటిని చుట్టిన కాగితంమీద వ్రాసి దానిని యెహోవా ఆలయంలో ఉంచాడు. తరువాత సమూయేలు ప్రజలందరినీ వారి ఇండ్లకు పంపివేశాడు. 26 సౌలు కూడ గిబియాలో ఉన్న తన ఇంటికి వెళ్ళాడు. అతనితోపాటు దేవునిచేత హృదయంలో కదలిక కలిగిన వీరులు కొందరు వెళ్ళారు.
27 అయితే కొందరు పనికిమాలిన దుర్మార్గులు “అతగాడు మనల్ని ఎలా రక్షించగలడు?” అన్నారు. వాళ్ళు అతణ్ణి చిన్నచూపు చూస్తూ, అతనికి కానుకలు తీసుకురాకుండా ఉన్నారు. సౌలు మౌనం వహించాడు.