9
1 కీషు అనే బెన్యామీను గోత్రంవాడు ఉండేవాడు. అతడి తండ్రి అబీయేల్. అబీయేల్ తండ్రి సెరోరు. సెరోరు తండ్రి బెకోరతు. బెకోరతు తండ్రి బెన్యామీను గోత్రంవాడు అఫియ. కీషు గొప్పవాడు. 2 అతడి కొడుకు పేరు సౌలు. సౌలు చాలా అందమైన యువకుడు. ఇస్రాయేల్ ప్రజలందరిలో అతడికంటే అందచందాలుండే వాడెవ్వడూ లేడు. అతడు భుజాలు మొదలుకొని పైకి ఇతరులకంటే పొడుగాటివాడు.
3 సౌలు తండ్రి కీషు గాడిదలు తప్పిపోయాయి. కీషు తన కొడుకు సౌలుతో “మన నౌకరులలో ఒకణ్ణి నీతోకూడా తీసుకువెళ్ళి గాడిదలను వెదకు” అని చెప్పాడు.
4 సౌలు ఎఫ్రాయిం కొండప్రాంతంలోను, షాలిషా ప్రాంతంలోను తిరిగాడు గాని గాడిదలు కనిపించలేదు. తరువాత వారు షయలీం ప్రాంతంగుండా వెళ్ళారు. కాని అక్కడ కూడా అవి దొరకలేదు. అప్పుడు వారు బెన్యామీను ప్రదేశంలో తిరిగి, చూస్తూ ఉన్నారు గాని అవి కనబడలేదు. 5 వారు సూఫు ప్రాంతానికి చేరుకొన్నప్పుడు సౌలు తనతో ఉన్న నౌకరుతో, “మనం తిరిగి వెళ్ళిపోదాం. లేకపోతే మా నాన్న గాడిదలను మరచి మన విషయం కంగారుపడుతాడేమో” అన్నాడు.
6 అందుకు నౌకరు “ఈ ఊరిలో దేవుని మనిషి ఒకడు ఉన్నాడు. అతడు చాలా గౌరవపాత్రుడు. అతడు చెప్పేదంతా అక్షరాల తప్పక జరుగుతుంది. మనం అతడి దగ్గరికి పోదాం. మనం వెళ్ళవలసిన దారి అతడు మనకు చెపుతాడేమో” అని చెప్పాడు.
7 సౌలు తన నౌకరుతో “కానీ మనం అతని దగ్గరికి వెళితే అతనికి ఏమి తీసుకుపోదాం? మన సంచులలో భోజన పదార్థాలు అయిపోయాయి. దేవుని మనిషికి తీసుకుపోవడానికి మన దగ్గర ఏమీ కానుక లేదు” అన్నాడు.
8 ఆ పనివాడు సౌలుతో “నాదగ్గర పావు తులం వెండి ఉంది. మనకు దారి తెలియజేసినందుకు దానిని దేవుని మనిషికి ఇస్తాను” అన్నాడు. 9 (పూర్వం ఇస్రాయేల్ దేశంలో దేవుని నుంచి సందేశం వినాలని ఎవరైనా వెళ్ళితే “దీర్ఘదర్శి దగ్గరికి వెళ్దాం” అని చెప్పేవారు. ప్రవక్తను ఆ కాలంలో “దీర్ఘదర్శి” అని ప్రజలు అనేవారు.)
10 సౌలు తన పనివాడితో “మంచిది. మనం వెళ్దాం, పద” అన్నాడు. వారు దేవుని మనిషి ఉన్న ఊరికి బయలుదేరారు. 11 వారు ఊరివైపుకు కొండెక్కి వెళ్తూ ఉంటే, నీళ్ళు చేదుకోవడానికి ఊరి బయటికి వచ్చిన అమ్మాయిలు కొందరు ఎదురయ్యారు. వారు వారిని చూచి “దీర్ఘదర్శి ఇక్కడ ఉన్నాడా?” అని అడిగారు.
12 అందుకు వారు “ఉన్నాడు. ఆయన మీ ముందరే వచ్చాడు. త్వరగా వెళ్ళి కలుసుకోవచ్చు. ఇవ్వేళ ఎత్తయిన స్థలంమీద ప్రజలు బలి అర్పించబోతున్నారు, గనుక ఈరోజే ఆయన ఈ ఊరు వచ్చాడు. 13 ఊళ్ళోకి మీరు వెళ్ళిన వెంటనే ఆయనను కలుసుకోవచ్చు. ఆయన భోజనం చేయడానికి ఎత్తయిన స్థలానికి వెళ్ళేముందు కలుసుకోవచ్చు. ఆయన బలి గురించి దీవెన పలికిన తరువాత పిలవబడ్డవాళ్ళు భోజనం చేస్తారు. మీరు ఇప్పుడే కొండెక్కి వెళితే ఆయనను చూస్తారు” అన్నారు.
14 వారు ఊరిలో అడుగుపెట్టగానే సమూయేలు వారికి ఎదురయ్యాడు. అతడు ఎత్తయిన స్థలంవైపుకు వెళ్తున్నాడు.
15 సౌలు అక్కడికి రాకముందు రోజు యెహోవా సమూయేలుకు ఈవిధంగా తెలియజేశాడు: 16 “రేపు ఈ సమయానికి బెన్యామీను ప్రదేశంనుంచి ఒక మనిషిని నేను నీదగ్గరికి పంపిస్తాను. నా ఇస్రాయేల్‌ప్రజలమీద అతణ్ణి అధికారిగా అభిషేకించు. అతడు నా ప్రజలను ఫిలిష్తీయవారి చేతిలోనుంచి విడుదల చేస్తాడు. నా ప్రజల మొర నా సన్నిధానం చేరింది. నేను వారిని దయ చూశాను.”
17 సమూయేలు సౌలును చూచిన క్షణమే యెహోవా అతనితో “ఇడుగో, నేను నీతో చెప్పిన మనిషి! ఇతడే నా ప్రజలను పరిపాలిస్తాడు” అన్నాడు.
18 సౌలు ఊరి ద్వారంలో సమూయేలు దగ్గరికి వెళ్ళి “దీర్ఘదర్శి ఇల్లు ఎక్కడుందో దయచేసి నాకు చెప్పండి” అని అడిగాడు.
19 అందుకు సౌలుతో సమూయేలు ఇలా అన్నాడు: “దీర్ఘదర్శిని నేనే. ఎత్తయిన స్థలానికి నాకంటే ముందు వెళ్ళు. ఈరోజే నీవు నాతో కలిసి భోజనం చేయాలి. రేపు ప్రొద్దున నీ హృదయంలో ఉన్నదంతా నేను నీకు తెలియజేసి నిన్ను పంపివేస్తాను. 20 మూడు రోజుల క్రిందట తప్పిపోయిన మీ గాడిదల విషయం విచారపడవద్దు. అవి దొరికాయి. అయితే ఇస్రాయేల్‌ప్రజల అభిలాష ఎవరిమీద ఉంటుంది? నీమీదే నీ తండ్రి కుటుంబంమీదే ఉంటుంది గదా!”
21 సౌలు, “నేను బెన్యామీను వంశంవాణ్ణి గదా. ఇస్రాయేల్ గోత్రాలన్నిటిలో నా గోత్రం అల్పమైనది గదా. బెన్యామీను గోత్రంలో కుటుంబాలన్నిటిలో నా కుటుంబం అల్పమైనది గదా. మీరు నాతో ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు?” అన్నాడు.
22 సమూయేలు సౌలునూ అతడి పనివాణ్ణీ భోజనాల గదిలోకి తీసుకువెళ్ళి పిలవబడ్డవాళ్ళ వరుసలో ప్రథమ స్థానంలో వారిని కూర్చోబెట్టాడు. అతిథులు సుమారు ముప్ఫయిమంది.
23 సమూయేలు వంటవాడితో “వేరుగా ఉంచమని నేను నీకిచ్చిన భాగాన్ని తీసుకురా” అని చెప్పాడు.
24 వంటవాడు వండిన కాలును దానిపై ఉన్న మాంసాన్ని తెచ్చి సౌలుకు వడ్డించాడు. సమూయేలు, “చూడు, ఈ ముక్క నీకోసం ఉంచబడింది. దానిని తిను. నేను అతిథులను ఆహ్వానించినప్పటినుంచి ఈ సందర్భానికి అది నీకోసం వేరుగా ఉంచాం” అని సౌలుతో చెప్పాడు.
ఆ రోజు సౌలు సమూయేలుతో కలిసి భోజనం చేశాడు. 25 వారు ఎత్తయిన స్థలంనుంచి దిగి వచ్చి ఊరిలో ప్రవేశించిన తరువాత సమూయేలు సౌలుతో తన ఇంటి మిద్దెమీద మాట్లాడాడు. 26 ఉదయం కాగానే సమూయేలు లేచి మిద్దెమీద ఉండే సౌలును పిలిచి “లే! నేను నిన్ను సాగనంపుతాను” అన్నాడు. సౌలు లేచినతరువాత వారిద్దరూ బయలుదేరారు. 27 ఊరి పొలిమేరను చేరబోతూ ఉన్నప్పుడు సమూయేలు సౌలుతో, “మనకంటే ముందు వెళ్ళమని పనివాడికి చెప్పు. దేవుని నుంచి వచ్చిన వాక్కు నేను నీకు చెప్పేవరకు నీవు ఇక్కడ ఆగు” అన్నాడు. అప్పుడు పనివాడు వెళ్ళాడు.