8
1  సమూయేలు ముసలివాడయిన తరువాత తన కొడుకులను ఇస్రాయేల్ మీద నాయకులుగా నియమించాడు. 2 అతని పెద్ద కొడుకు పేరు యోవేల్. రెండోవాడి పేరు అబీయా. వారు బేర్‌షెబాలో తీర్పు తీర్చేవాళ్ళు. 3 సమూయేలు కొడుకులు అతని బ్రతుకుతీరును అనుసరించ లేదు. వాళ్ళు అక్రమలాభంకోసం త్రోవతప్పి లంచాలు తీసుకొంటూ, న్యాయాన్ని తారుమారు చేస్తూ ఉండేవాళ్ళు. 4 అందుచేత ఇస్రాయేల్ ప్రజల పెద్దలంతా సమకూడి రమాలో ఉన్న సమూయేలు దగ్గరికి వచ్చి ఇలా అన్నారు:
5 “మీరు ముసలివారు, మీ కొడుకులు మీ బ్రతుకుతీరును అనుసరించడం లేదు. అన్ని దేశాలలో ఉన్నట్టే ఇప్పుడు మమ్మల్ని పరిపాలించడానికి మాకు ఒక రాజును నియమించండి.”
6 వారు “మమ్మల్ని పరిపాలించడానికి మాకు ఒక రాజును నియమించు” అన్నమాటలు సమూయేలుకు నచ్చలేదు. కనుక సమూయేలు యెహోవాకు ప్రార్థన చేశాడు. 7  అందుకు యెహోవా అతనికి ఇలా జవాబిచ్చాడు:
“ప్రజావాణి విని వారు చెప్పినట్లెల్లా జరిగించు. వారు తిరస్కరించినది నిన్ను కాదు. వారిని పరిపాలించకుండా నన్నే తిరస్కరించారు. 8 నేను వారిని ఈజిప్ట్‌నుంచి తీసుకువచ్చిన రోజునుంచి ఈరోజువరకు వారు నన్ను విడిచిపెట్టి ఇతర దేవుళ్ళను పూజిస్తూ వచ్చారు. వారు నాపట్ల జరిగిస్తూ వచ్చినట్టే ఇప్పుడు నీ పట్ల జరిగిస్తున్నారు. 9 వారి మాట అంగీకరించు. అయితే వారిని పరిపాలించబోయే రాజు విధానాలను గురించి వారిని గట్టిగా హెచ్చరించు.”
10 యెహోవా పలికిన మాటలన్నీ రాజు కావాలని తనకు మనవి చేసిన ప్రజలకు సమూయేలు తెలియజేశాడు.
11 అతడు ఇలా అన్నాడు: “మిమ్ములను పరిపాలించబోయే రాజు విధానాలు ఈవిధంగా ఉంటాయి: అతడు మీ కొడుకులను పట్టుకొని తన రథాలను నడిపేలా, తన గుర్రాలను కాపాడేలా చేస్తాడు. వారు అతని రథాలముందు పరుగెత్తవలసి వస్తుంది. 12 కొందరిని తన సైన్యంలో వేయిమందికి యాభైమందికి అధిపతులుగా నియమిస్తాడు. కొందరిని తన పొలాలను దున్నడానికీ పంటకోయడానికీ యుద్ధాయుధాలనూ తన రథాల సామాన్నూ తయారు చేయడానికీ నియమిస్తాడు. 13 మీ కూతుళ్ళను తనకు పరిమళద్రవ్యాలు చేయడానికీ వంటలు చేయడానికీ నియమిస్తాడు. 14 మీ పొలాలలో, ద్రాక్షతోటలలో, ఆలీవ్‌వనాలలో అన్నిటిలో మంచివాటిని పట్టుకొని తన సేవకులకు ఇస్తాడు. 15 మీ ధాన్యంలో, ద్రాక్షపండ్లలో పదో భాగం తీసుకొని తన పరివారానికీ సేవకులకూ ఇస్తాడు. 16 మీ పనివాళ్ళనూ పనికత్తెలనూ మేలిరకం పశువులనూ గాడిదలనూ తీసుకొని తన పని చేయించుకొంటాడు. 17 మీ మందలలో పదో భాగం తీసుకుంటాడు. మీరే అతనికి దాసులవుతారు. 18 మీరు కావాలని కోరుకున్న రాజును గురించి అప్పుడు మొరపెట్టు కొంటారు గానీ యెహోవా మీ మొర ఆలకించడు.”
19 ప్రజలు సమూయేలు మాట చెవిని పెట్టలేదు. వారు “అలా కాదు. ఇతర దేశాలలాగే మాకు రాజు కావాలి. 20 అతడు మాకు న్యాయం తీరుస్తాడు. యుద్ధాలలో మా ముందు నడుస్తూ మాకు నాయకత్వం వహించి పోరాడుతాడు” అన్నారు.
21 వారు చెప్పినదంతా విని సమూయేలు యెహోవాకు చెప్పాడు. 22 అందుకు యెహోవా సమూయేలుకు “వారి మాట విని వారికి ఒక రాజును నియమించు” అని ఆదేశించాడు.
అప్పుడు సమూయేలు “మీరంతా మీ ఊళ్ళకు వెళ్ళండి” అని ఇస్రాయేల్ మనుషులకు చెప్పాడు.