7
1 కిర్యత్‌యారీంవారు వచ్చి యెహోవా మందసాన్ని తీసుకువెళ్ళి కొండపై ఉండే అబీనాదాబు ఇంట్లో దానిని ఉంచారు. దాని భద్రతకోసం అబీనాదాబు కొడుకు ఎలియాజరును వారు ప్రతిష్ఠించారు. 2 యెహోవా మందసం చాలా కాలం – ఇరవై సంవత్సరాలు – కిర్యత్‌యారీంలో ఉండిపోయింది. ఆ కాలంలో ఇస్రాయేల్‌ప్రజలంతా దుఃఖపడుతూ యెహోవాను వెదకుతూ ఉన్నారు.
3  సమూయేలు ఇస్రాయేల్ ప్రజలందరితో ఇలా చెప్పాడు: “మీరు హృదయపూర్వకంగా యెహోవా వైపు తిరగాలంటే ఇతర దేవుళ్ళనూ అష్తారోతుదేవి విగ్రహాలనూ తొలగించాలి. మీ హృదయాలను యెహోవావైపే మళ్ళించి ఆయనను మాత్రమే సేవించాలి. అప్పుడు ఆయన మిమ్ములను ఫిలిష్తీయవాళ్ళ బారినుంచి రక్షిస్తాడు.”
4 గనుక ఇస్రాయేల్ ప్రజలు బయల్‌దేవుళ్ళనూ అష్తారోతుదేవి విగ్రహాలనూ తొలగించి యెహోవాను మాత్రమే సేవించసాగారు.
5 తరువాత సమూయేలు “ఇస్రాయేల్ ప్రజలందరినీ మిస్పాకు పిలిపించండి. నేను మీకోసం యెహోవాకు ప్రార్థన చేస్తాను” అని చెప్పాడు.
6 అందరూ మిస్పాలో సమకూడిన తరువాత వారు నీళ్ళు చేది యెహోవా సమక్షంలో కుమ్మరించారు. ఆ రోజు వారు ఉపవాసముండి “మేము యెహోవాకు వ్యతిరేకంగా పాపాలు చేశాం” అని ఒప్పుకొన్నారు. సమూయేలు మిస్పాలో ఇస్రాయేల్ ప్రజలకు తీర్పు తీర్చాడు.
7 ఇస్రాయేల్ ప్రజలు మిస్పాలో సమకూడి ఉన్న సంగతి ఫిలిష్తీయవాళ్ళు విన్నప్పుడు వాళ్ళ నాయకులు ఇస్రాయేల్‌పై దాడి చేయడానికి వచ్చారు. ఇది విని ఇస్రాయేల్ ప్రజలు ఫిలిష్తీయవాళ్ళ విషయం భయపడ్డారు.
8 వారు “మన దేవుడు యెహోవా మనల్ని ఫిలిష్తీయవాళ్ళ బారినుంచి రక్షించేలా నీవు మాకోసం ఆయనకు ప్రార్థన చేయడం మానవద్దు” అని సమూయేలుతో చెప్పారు.
9 పాలు విడవని ఒక గొర్రెపిల్లను తెచ్చి సమూయేలు దానిని విభాగించక యెహోవాకు హోమబలిగా అర్పించి, ఇస్రాయేల్ ప్రజల తరఫున యెహోవాకు ప్రార్థన చేశాడు. యెహోవా అతని ప్రార్థన అంగీకరించాడు. 10 సమూయేలు హోమబలి అర్పిస్తూ ఉండగానే ఇస్రాయేల్ ప్రజలతో యుద్ధం చేయడానికి ఫిలిష్తీయవాళ్ళు సమీపించారు. అయితే ఆ రోజున యెహోవా మహా ఉరుముల ధ్వనితో ఫిలిష్తీయవాళ్ళలో భయాందోళన కలిగించాడు. వాళ్ళు ఇస్రాయేల్‌వారిచేత ఓడిపోయారు. 11 ఇస్రాయేల్‌వారు మిస్పానుంచి బయలుదేరి ఫిలిష్తీయవాళ్ళను బేత్‌కారు వరకు తరుముతూ హతం చేస్తూ ఉన్నారు. 12 అప్పుడు సమూయేలు మిస్పాకూ షేనుకూ మధ్య ఒక రాయి నిలిపి, “ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేశాడు” అని చెప్పి ఆ రాతికి ఎబెనెజరు అని పేరు పెట్టాడు.
13 ఈ విధంగా ఫిలిష్తీయవాళ్ళు అణిగిపోయి మళ్ళీ ఇస్రాయేల్ సరిహద్దును దాటలేదు. సమూయేలు బ్రతికినన్నాళ్ళు యెహోవా చెయ్యి ఫిలిష్తీయ ప్రజలకు వ్యతిరేకంగా ఉంది. 14 మునుపు ఎక్రోనునుంచి గాత్ వరకు ఉన్న పట్టణాలను ఫిలిష్తీయవాళ్ళు ఇస్రాయేల్ వంశంలోనుంచి పట్టుకొన్నారు. ఇప్పుడు అవి తిరిగి ఇస్రాయేల్ స్వాధీనమయ్యాయి. వాటి పరిసర ప్రాంతాలను కూడా ఫిలిష్తీయవాళ్ళ ఆక్రమణలోనుంచి ఇస్రాయేల్ వారు వశం చేసుకొన్నారు. అంతేకాక ఇస్రాయేల్ ప్రజలకూ అమోరీ ప్రజలకూ మధ్య శాంతి ఏర్పడింది. 15 తాను బ్రతికినన్నాళ్ళూ సమూయేలు ఇస్రాయేల్ ప్రజలకు నాయకుడుగా ఉన్నాడు. 16 ప్రతి సంవత్సరం అతడు బేతేల్‌కు, అక్కడనుంచి గిల్గాల్‌కు, అక్కడనుంచి మిస్పాకు పర్యటిస్తూ, ఆ స్థలాలన్నిటిలో ఇస్రాయేల్ ప్రజలకు తీర్పు తీరుస్తూ ఉండేవాడు. 17 అతని ఇల్లు రమాలో ఉంది, గనుక అతడు ఎప్పుడూ అక్కడికి తిరిగి వచ్చేవాడు. అక్కడ కూడా అతడు ఇస్రాయేల్ ప్రజలకు తీర్పు తీర్చేవాడు. అక్కడ అతడు యెహోవాకు బలిపీఠాన్ని నిర్మించాడు.