6
1 యెహోవా ఒడంబడికపెట్టె ఫిలిష్తీయవాళ్ళ దేశంలో ఏడు నెలలు ఉన్నతరువాత 2 వాళ్ళు పూజారులనూ శకునగాండ్రనూ పిలిపించి “యెహోవా పెట్టెను ఏం చేద్దామంటారు? దానిని ఏవిధంగా దాని స్థలానికి పంపాలి? మాకు చెప్పండి” అని అడిగారు.
3 అందుకు వాళ్ళు “మీరు ఇస్రాయేల్‌ప్రజల దేవుని మందసాన్ని పంపివేయాలనుకొంటే దానిని ఖాళీగా పంపివేయ కూడదు. దానితోకూడా అపరాధంకోసం అర్పణను ఆయనకు పంపాలి. అప్పుడు మీరు బాగుపడతారు; ఇదివరకు ఆయన మీమీద చెయ్యి ఎత్తడం ఎందుకు మానలేదో మీరు తెల్సుకుంటారు” అన్నారు.
4 వాళ్ళు “మేము అపరాధం కోసమైన ఏ అర్పణను ఆయనకు పంపాలి?” అని అడిగినప్పుడు, వాళ్ళు ఇలా బదులు చెప్పారు: “ఫిలిష్తీయప్రజల నాయకుల సంఖ్య ప్రకారం అయిదు బంగారు బిళ్ళలనూ అయిదు బంగారు పందికొక్కులనూ పంపాలి. ఎందుకంటే మీ అందరికీ, మీ నాయకులకు ఒకే రకమైన రోగం సోకింది. 5 బిళ్ళ బంగారు నమూనాలనూ, ఈ దేశాన్ని పాడు చేస్తూ ఉన్న పందికొక్కుల బంగారు నమూనాలనూ చేసి ఇస్రాయేల్ ప్రజల దేవుణ్ణి ఘనపరచాలి. అప్పుడాయన మీమీద, మీ దేవుళ్ళమీద, మీ దేశంమీద ఉన్న తన చేయి తీసివేస్తాడేమో. 6  ఈజిప్ట్‌ప్రజలూ ఫరో, వాళ్ళు గుండెలు బండబారిపోయేలా చేసుకొన్నట్టు మీరు ఎందుకు చేసుకొంటున్నారు? ఆయన వాళ్ళపట్ల కఠినంగా వ్యవహరించినప్పుడు వాళ్ళు ఇస్రాయేల్ ప్రజను వెళ్ళనిచ్చారు గదా. పర్యవసానంగా వాళ్ళు వెళ్ళిపోయారు గదా. 7 ఇప్పుడు మీరు ఈ విధంగా చేయండి. ఒక క్రొత్త బండి చేయించి కాడి మోయని పాడి ఆవుల జంటను తెచ్చి బండికి కట్టండి. వాటి దూడలను వాటి దగ్గరనుంచి తీసుకుపోయి కొట్టంలో ఉంచండి. 8 యెహోవా మందసం ఆ బండిమీద ఉంచండి. దాని ప్రక్కన మరో పెట్టెలో ఆయనకు అపరాధంకోసమైన అర్పణగా మీరు పంపించే బంగారు వస్తువులను ఉంచండి. అప్పుడు బండిని దానంతట దానిని పోనివ్వండి. 9 అది ఏ వైపుకు పోతుందో చూస్తూ ఉండండి. అది బేత్‌షెమెషు వైపుకు దాని దేశంలోకి పోతే, తీవ్రమైన ఈ ఆపద మన మీదికి రప్పించినది యెహోవాయే అని తెలుసుకుంటాం. కానీ అది ఆ దారిన పోకపోతే మనమీద చెయ్యి ఎత్తినది ఆయన కాదనీ ఈ విపత్తు మనమీదికి దురదృష్టవశాత్తు వచ్చిందనీ తెలుసుకుంటాం.”
10 అలాగే వాళ్ళు రెండు పాడి ఆవులను తెచ్చి బండికి కట్టి వాటి దూడలను కొట్టంలో ఉంచారు, 11 బండిమీద యెహోవా మందసాన్నీ, బిళ్ళ బంగారు నమూనాలూ బంగారు పంది కొక్కులూ ఉన్న పెట్టెనూ ఉంచారు. 12 ఆ ఆవులు బేత్‌షెమెషు పోయే దారిన నడుస్తూ, రంకెలు వేస్తూ కుడికి గానీ ఎడమకు గానీ తిరగకుండా పోయాయి. ఫిలిష్తీయప్రజల నాయకులు బేత్‌షెమెషు పొలిమేర వరకు వాటివెంట వెళ్ళారు. 13 అప్పుడు బేత్‌షెమెషు వారు లోయలో గోధుమ పంటను కోస్తూ ఉన్నారు. వారు తలెత్తి చూస్తే వారికి యెహోవా మందసం కనిపించింది. దానిని చూచి వారు సంతోషించారు. 14 బండి బేత్‌షెమెషు పురవాసి యెహోవాకు హోమబలిగా అర్పించారు. 15 లేవీ గోత్రికులు యెహోవా మందసాన్నీ, బంగారు వస్తువులు ఉన్న పెట్టెనూ దించి ఆ పెద్ద బండమీద ఉంచారు. ఆ రోజే బేత్‌షెమెషు ప్రజలు యెహోవాకు హోమబలులూ ఇతర బలులూ అర్పించారు.
16 ఫిలిష్తీయవాళ్ళు అయిదుగురు నాయకులు జరిగినదంతా చూచి ఆ రోజే ఎక్రోనుకు తిరిగి వెళ్ళిపోయారు. 17 అపరాధం కోసమైన అర్పణగా ఫిలిష్తీయవాళ్ళు యెహోవాకు పంపించిన బంగారు బిళ్ళలు ఏవంటే – అష్డోదువాళ్ళ కోసం ఒకటి, గాజావాళ్ళకోసం ఒకటి, అష్కలోనువాళ్ళకోసం ఒకటి, గాత్‌వాళ్ళకోసం ఒకటి, ఎక్రోనువాళ్ళకోసం ఒకటి. 18 వాళ్ళు పంపించిన బంగారు పందికొక్కులు అయిదుగురు ఫిలిష్తీయ నాయకులకు చెందిన ప్రాకారాలున్న పట్టణాల లెక్కప్రకారం, అవి ఆ పట్టణాల వాళ్ళకోసం, ఆ పట్టణాలకు చెందిన గ్రామాల వాళ్ళ కోసం ఉన్నాయి. యెహోవా మందసం దింపిన పెద్ద బండ దీనికి స్మృతిచిహ్నంగా ఉంది. ఆ బండ ఈనాటి వరకు బేత్‌షెమెషులో యెహోషువ పొలంలో ఉంది.
19 బేత్‌షెమెషు ప్రజలు యెహోవా మందసాన్ని తెరచి చూచినందుచేత వారిలో డెబ్భైమందిని యెహోవా హత మార్చాడు. యెహోవా తమను కొట్టిన ఈ గొప్ప దెబ్బకు ప్రజలు దుఃఖా క్రాంతులయ్యారు. 20 అప్పుడు బేత్‌షెమెషు వారు, “యెహోవా ఎంతో పవిత్ర దేవుడు. ఆయన సన్నిధానంలో ఎవరు నిలబడగలరు? మనదగ్గరనుంచి ఆయన మందసం ఎవరిదగ్గరికి పోవాలి?” అని అడిగారు. 21 వారు కిర్యత్‌యారీం పురవాసుల దగ్గరికి మనుషులద్వారా ఈ కబురు పంపించారు: “ఫిలిష్తీయవాళ్ళు యెహోవా మందసాన్ని మళ్ళీ తీసుకువచ్చారు. మీరు వచ్చి దానిని మీ దగ్గరికి తీసుకు వెళ్ళండి.”