5
1 ఫిలిష్తీయవాళ్ళు దేవుని మందసం పట్టుకొన్న తరువాత దానిని ఎబెనెజరునుంచి అష్డోదుకు తీసుకుపోయారు. 2 అక్కడ వాళ్ళు దానిని దాగోనుదేవుడి గుడిలోకి తీసుకుపోయి దాగోను విగ్రహం ప్రక్కన ఉంచారు. 3 మరుసటి రోజు ప్రొద్దున అష్డోదుప్రజలు లేచి చూస్తే దాగోను యెహోవా మందసం ఎదుట నేల బోర్లపడి ఉంది. వాళ్ళు దాగోనును లేవనెత్తి దాని స్థలంలో మళ్ళీ ఉంచారు. 4 వాళ్ళు ఆ మరుసటి రోజు ప్రొద్దున లేచి చూచినప్పుడు యెహోవా మందసం ఎదుట దాగోను బోర్లపడి ఉంది. దాగోను తల, రెండు చేతులు విరిగి ద్వారం గడపదగ్గర పడి ఉన్నాయి. దాని మొండెం మాత్రమే మిగిలింది. 5 ఈ కారణంచేత ఈ రోజువరకు దాగోను పూజారులూ అష్డోదులో దాగోను గుడిలోకి వచ్చేవాళ్ళూ ఎవరూ దాగోను గుడి గడపను త్రొక్కరు.
6 యెహోవా అష్డోదు ప్రజలను తీవ్రంగా బాధించాడు. ఆ నగర ప్రజలను దాని పరిసరాలలో కాపురమున్న వాళ్ళను ఆపదకు గురిచేశాడు. వాళ్ళకు గడ్డల రోగం కలిగించాడు.
7 జరిగినది చూచి అష్డోదువాళ్ళు “ఇస్రాయేల్‌ప్రజల దేవుడు మన దేవుడైన దాగోనుమీద, మనమీద బలంగా చెయ్యి ఎత్తాడు, గనుక ఆయన పెట్టె ఇంకా మన మధ్య ఉండకూడదు” అని చెప్పుకొన్నారు.
8 అప్పుడు వాళ్ళు ఫిలిష్తీయప్రజల నాయకులందరినీ పిలిపించి “ఇస్రాయేల్‌వాళ్ళ దేవుని మందసాన్ని ఏం చేద్దామంటారు?” అని అడిగారు.
అందుకు ఆ నాయకులు “ఇస్రాయేల్‌వాళ్ళ దేవుని మందసాన్ని గాత్‌కు తీసుకువెళ్ళండి” అన్నారు.
అందుచేత వాళ్ళు ఇస్రాయేల్‌ప్రజల దేవుని మందసాన్ని అక్కడికి తీసుకువెళ్ళారు. 9 అయితే వాళ్ళు దానిని అక్కడికి తీసుకువెళ్ళిన తరువాత, యెహోవా ఆ పట్టణం మీద కూడా చెయ్యి బలంగా ఎత్తి గొప్ప భయాందోళన కలిగించాడు. ఆయన పిన్నలనూ పెద్దలనూ గడ్డల రోగంతో హింసించాడు. 10 గనుక గాత్‌వాళ్ళు దేవుని మందసాన్ని ఎక్రోనుకు పంపి వేశారు. మందసం ఎక్రోనులోకి రాగానే ఎక్రోను ప్రజలు “మనల్నీ మనవాళ్ళనూ చంపడానికి ఇస్రాయేల్ ప్రజల దేవుని మందసాన్ని మనమధ్యకు తీసుకువచ్చారు” అని కేకలు వేశారు.
11 అప్పుడు ఎక్రోనుప్రజలు ఫిలిష్తీయ నాయకులందరినీ పిలిపించి “ఇస్రాయేల్‌వాళ్ళ దేవుని మందసాన్ని పంపివేయండి. అది మనల్నీ మనవాళ్ళనూ చంపకుండా దానిని దాని స్థలానికి వెళ్ళనివ్వండి” అన్నారు.
దేవుడు ఆ నగరవాసులమీద చెయ్యి చాలా బలంగా ఎత్తినందుచేత మరణ భయం పట్టణమంతా ఆవరించింది. 12 అది వరకు చావక మిగిలినవాళ్ళకు గడ్డల రోగం సోకింది. ఆ పురజనుల మొరలు మిన్ను ముట్టాయి.