4
1 ఇస్రాయేల్‌వారు ఫిలిష్తీయవాళ్ళతో యుద్ధం చేయడానికి బయలుదేరి ఎబెనెజరులో మకాం వేశారు. ఫిలిష్తీయ వాళ్ళు✽ ఆఫెకులో మకాం వేశారు. 2 ✽ఇస్రాయేల్‌వారిని ఎదుర్కోవడానికి ఫిలిష్తీయవాళ్ళు సైన్య వ్యూహమేర్పరచారు. పోరాటం తీవ్రమవుతున్నప్పుడు వాళ్ళ చేతుల్లో ఇస్రాయేల్‌వారు ఓడిపోయారు. వారిలో సుమారు నాలుగువేలమంది రణ రంగంలో హతమయ్యారు. 3 ✽సైనికులు శిబిరానికి తిరిగి చేరినప్పుడు ఇస్రాయేల్‌ప్రజల పెద్దలు “ఈవేళ యెహోవా ఫిలిష్తీయవాళ్ళచేత మనల్ని ఎందుకు ఓడించాడు? షిలోహులో ఉన్న యెహోవా ఒడంబడిక పెట్టెను మనం తెప్పిద్దాం. అది మనమధ్య ఉంటే అది మనల్ని శత్రువుల బారినుంచి కాపాడుతుంది” అన్నారు.4 అందుచేత ప్రజలు షిలోహుకు కొందరిని పంపి అక్కడనుంచి కెరూబుల మధ్య ఆసీనుడై ఉన్న సేనల ప్రభువు యెహోవా ఒడంబడికపెట్టెను తెప్పించారు. ఏలీ ఇద్దరు కొడుకులైన హొఫ్నీ, ఫీనెహాసు దేవుని ఒడంబడికపెట్టె దగ్గర ఉన్నారు. 5 యెహోవా ఒడంబడికపెట్టె శిబిరంలోకి వచ్చినప్పుడు ఇస్రాయేల్ వారంతా పెద్ద కేకలు✽ వేశారు. ఆ కేకలకు భూమి కంపించింది. 6 ✽ఫిలిష్తీయవాళ్ళు ఆ కేకల ధ్వని విని “హీబ్రూవాళ్ళ శిబిరంలో ఈ పెద్ద కేకల ధ్వని ఏమిటి?” అని అడిగారు. యెహోవా ఒడంబడికపెట్టె వారి శిబిరంలోకి వచ్చిన సంగతి తెలుసుకొన్నప్పుడు ఫిలిష్తీయవాళ్ళకు భయం వేసింది.
7 వాళ్ళు “వారి శిబిరంలోకి ఒక దేవుడు వచ్చాడు. అయ్యో, మనకు బాధ తప్పదు. ఇలాంటిది ఇంతకు ముందు ఎన్నడూ జరగలేదు. 8 అయ్యో, మనకు బాధ తప్పదు. బలీయమైన ఈ దేవుడి బారినుంచి మనల్ని ఎవరు కాపాడగలరు? ఎడారిలో ఈజిప్ట్✽ప్రజల మీదికి అన్ని రకాల విపత్తులను రప్పించినది ఈ దేవుడే గదా. 9 ఫిలిష్తీయవాళ్ళలారా! ధైర్యం తెచ్చుకోండి! వాళ్ళు మీ వశం అయినట్టు✽ మీరు ఈ హీబ్రూవాళ్ళ వశం కాకుండా ధీరులుగా పోరాడండి” అని చెప్పుకొన్నారు.
10 ✽గనుక ఫిలిష్తీయవాళ్ళు యుద్ధం చేశారు. ఇస్రాయేల్ వారు ఓడిపోయి ఒక్కొక్కరు తమ డేరాలకు పారిపోయారు. యుద్ధంలో పెద్ద వధ జరిగింది. ఇస్రాయేల్ సైన్యంలో ముప్ఫయివేలమంది కాల్బల సైనికులు కూలారు. 11 అంతేగాక, ఫిలిష్తీయవాళ్ళు దేవుని మందసం✽ పట్టుకొన్నారు. ఏలీ ఇద్దరు కొడుకులైన హొఫ్నీ, ఫీనెహాసు చనిపోయారు✽.
12 ఆరోజే బెన్యామీను గోత్రికుడొకడు రణరంగంనుంచి షిలోహుకు చినిగిన బట్టలతో, తలపై దుమ్ము✽తో పరుగెత్తుతూ వెళ్ళాడు. 13 ✽అతడు చేరుకొన్నప్పుడు ఏలీ దారిప్రక్కన కుర్చీమీద కూర్చుని ఉండి దారిని చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని మందసం విషయం అతని గుండె దడదడ కొట్టుకుంటూ ఉంది. ఆ వ్యక్తి పట్టణంలోకి వచ్చి ఆ వార్త చెప్పినప్పుడు అక్కడి ప్రజలంతా కేకలు పెట్టారు. 14 ఆ కేకల ధ్వని విని ఏలీ “ఈ అలజడి ఏమిటి?” అని అడిగాడు. 15 అప్పుడు ఏలీ వయసు తొంభై ఎనిమిది ఏళ్ళు. అతని చూపు మందగించినందుచేత అతని కండ్లు కానరాలేదు. 16 ఆ వ్యక్తి తొందరగా ఏలీ దగ్గరికి వచ్చి, “యుద్ధంనుంచి నేను వచ్చాను. ఇవ్వేళే దానినుంచి పారిపోయి వచ్చాను” అని అతనికి తెలియజేశాడు.
అందుకు ఏలీ “బాబూ, అక్కడ ఏం జరిగింది?” అని అడిగాడు.
17 అందుకు వార్త తెచ్చినవాడు “ఫిలిష్తీయవాళ్ళ బారినుంచి ఇస్రాయేల్‌వారు పారిపోయారు. వారిలో చాలామంది హతమయ్యారు. మీ ఇద్దరు కొడుకులు హొఫ్నీ, ఫీనెహాసు చనిపోయారు. అంతేగాక, దేవుని మందసం పట్టబడింది” అని జవాబిచ్చాడు.
18 అతడు దేవుని మందసం విషయం చెప్పగానే గుమ్మం దగ్గర ఉన్న తన కుర్చీపై నుంచి ఏలీ వెనక్కు పడి మెడ విరిగి చనిపోయాడు. ఎందుకంటే అతడు చాలా ముసలివాడు, లావుగా ఉన్నాడు. అతడు నలభై సంవత్సరాలు ఇస్రాయేల్ ప్రజలకు నాయకుడుగా ఉన్నాడు.
19 ఏలీ కోడలు, ఫీనెహాసు భార్య అప్పుడు గర్భవతిగా ఉంది. ఆమె ప్రసవించే రోజులు దగ్గరపడ్డాయి. దేవుని మందసం శత్రు హస్తగతమైందనీ తన మామ తన భర్త చనిపోయారనీ వార్త ఆమెకు వినబడగానే నొప్పులు పట్టు కొన్నాయి. ఆమె మోకాళ్ళపై పడి ప్రసవించింది. 20 అప్పుడు ఆమె చనిపోతూ ఉండగా ఆమెకు పరిచర్య చేస్తున్న స్త్రీలు “భయపడవద్దు. నీకు కొడుకు కలిగాడు” అని ఆమెతో అన్నారు గాని ఆమె గమనించలేదు, జవాబియ్యలేదు. 21 దేవుని మందసం శత్రుహస్తగతం కావడంవల్ల, తన మామ, భర్త మృతి చెందినందువల్ల ఆమె “ఇస్రాయేల్ నుంచి ప్రభావం పోయింది” అని చెప్పి ఆ పిల్లవాడికి ‘ఈకాబోద్’✽ అని పేరు పెట్టింది. 22 “దేవుని మందసం పట్టుబడింది, గనుక ప్రభావం ఇస్రాయేల్ నుంచి పోయింది” అందామె.