3
1 ఏలీ సముఖంలో బాలుడు సమూయేలు యెహోవాకు పరిచర్య✽ చేస్తూ ఉండేవాడు. ఆ రోజుల్లో యెహోవా తన వాక్కు మనుషులకు పంపించడం అరుదుగా✽ జరిగేది. దర్శనం✽ తరచుగా లభించేది కాదు. 2 అప్పటికి ఏలీ కనుచూపు మందగించింది. అతడు సరిగా చూడలేనివాడు. ఒకరాత్రి ఏలీ తన స్థలంలో పడుకొని ఉంటే 3 దేవుని దీపం✽ ఇంకా ఆరిపోకముందే సమూయేలు యెహోవా నివాసం✽లో పవిత్రమైన ఒడంబడికపెట్టె ఉన్నచోట పడుకొన్నాడు. 4 ✽ఉన్నట్టుండి యెహోవా సమూయేలును పిలిచాడు. 5 ✽సమూయేలు “చిత్తం!” అని ఏలీ దగ్గరికి పరుగెత్తాడు. “చిత్తం! మీరు నన్ను పిలిచారు గదా!” అన్నాడు. అందుకు ఏలీ “నేను నిన్ను పిలువలేదు. వెళ్ళి పడుకో” అని చెప్పాడు. అతడు వెళ్ళి పడుకొన్నాడు. 6 యెహోవా సమూయేలును మళ్ళీ పిలిచాడు. సమూయేలు లేచి ఏలీ దగ్గరికి వెళ్ళి “చిత్తం! మీరు నన్ను పిలిచారు గదా” అని చెప్పినప్పుడు, “కుమారా, నేను నిన్ను పిలువలేదు. వెళ్ళి పడుకో!” అని అతడు అన్నాడు. 7 ✽అప్పటికింకా సమూయేలు యెహోవాను తెలుసుకోలేదు. యెహోవా వాక్కు అతడికి అంతవరకు వెల్లడి✽ కాలేదు. 8 యెహోవా సమూయేలును మళ్ళీ మూడోసారి✽ పిలిచాడు. సమూయేలు లేచి ఏలీ దగ్గరికి వెళ్ళి “చిత్తం! మీరు నన్ను పిలిచారు గదా” అన్నాడు. అప్పుడు ఏలీ ఆ అబ్బాయిని పిలిచింది యెహోవా అని గ్రహించి, 9 ✽ “నీవు వెళ్ళి పడుకో. ఎవరైనా నిన్ను పిలిస్తే ‘యెహోవా! నీ పరిచారకుణ్ణి. నేను వింటున్నాను. మాట్లాడండి’ అని జవాబివ్వు” అన్నాడు.సమూయేలు వెళ్ళి తన స్థలంలో పడుకొన్నాడు.
10 తరువాత యెహోవా వచ్చి దగ్గర నిలబడి ఉండి అంతకుముందు పిలిచినట్లు “సమూయేలు✽! సమూయేలు!” అని పిలిచాడు. సమూయేలు “నీ పరిచారకుణ్ణి. నేను వింటున్నాను. మాట్లాడండి” అన్నాడు.
11 ✽అప్పుడు యెహోవా సమూయేలుతో ఇలా అన్నాడు: “నేను ఇస్రాయేల్‌లో ఒక కార్యం చేయబోతున్నాను. దాన్ని గురించి వినే ప్రతివాడి రెండు చెవులు గింగురుమంటాయి. 12 ✝ఏలీని గురించి నేను చెప్పినదంతా తొలినుంచి తుదివరకు ఆ రోజున జరిగిస్తాను. 13 ✽ అతడి కుటుంబానికి శాశ్వతమైన శిక్ష విధిస్తానని అతడితో చెప్పాను. ఎందుకంటే, అతడి కుటుంబీకులు చేసిన పాపాలు అతడికి తెలుసు. అతడి కొడుకులు తమను శాపానికి పాత్రులుగా చేసుకొన్నారు గానీ వారిని అతడు ఆపలేదు. 14 ✽అందుచేత ఏలీ కుటుంబ దోషం బలిద్వారా గానీ నైవేద్యం ద్వారా గానీ ఎన్నటికీ కప్పివేయడం జరగదని నేను ఏలీ కుటుంబీకుల విషయం శపథం చేస్తున్నాను.”
15 సమూయేలు ఉదయంవరకు పడుకొని ఉండి అప్పుడు లేచి యెహోవా నివాసం తలుపులు తీశాడు. సమూయేలు తనకు కలిగిన ఆ దర్శనాన్ని గురించి ఏలీతో చెప్పడానికి భయపడ్డాడు. 16 అయితే ఏలీ “కుమారా! సమూయేలూ!” అని పిలిస్తే “చిత్తం” అని సమూయేలు జవాబిచ్చాడు.
17 ✽అప్పుడు ఏలీ “యెహోవా నీతో ఏం చెప్పాడు? అది నాకు దాచవద్దు. ఆయన నీకు చెప్పిన విషయాలలో ఏదైనా నీవు దాచావా, దేవుడు నీకు అంతకంటే అధికంగా కీడు కలిగిస్తాడు గాక” అని సమూయేలుతో అన్నాడు. 18 కనుక సమూయేలు దేనినీ దాచక విషయమంతా✽ అతడికి చెప్పాడు. అందుకు ఏలీ “ఆయన యెహోవా. ఆయనకు మంచిదని అనిపించింది✽ ఆయన చేస్తాడు గాక!” అన్నాడు. 19 సమూయేలు పెద్దవాడవుతూ ఉన్నప్పుడు యెహోవా అతడికి తోడై✽ ఉన్నాడు, అతడి మాటలలో ఏదీ తప్పిపోనివ్వలేదు✽. 20 ✽గనుక యెహోవా సమూయేలును ప్రవక్తగా స్థిరపరచాడని దాను పట్టణం మొదలు బేర్‌షెబా వరకు ఇస్రాయేల్ ప్రజలందరూ గుర్తించారు. 21 ✽షిలోహులో యెహోవా మళ్ళీ దర్శనమిస్తూ వచ్చాడు. అక్కడ యెహోవా తన వాక్కుద్వారా సమూయేలుకు ప్రత్యక్షం అవుతూ ఉండడం జరిగింది. సమూయేలునుంచి సందేశాలు ఇస్రాయేల్ ప్రజలందరికీ బయలుదేరసాగాయి.