2
1 ✽ అప్పుడు హన్నా ఇలా ప్రార్థన చేసింది:“యెహోవామూలంగా నా హృదయం
ఆనంద✽మయమయింది.
యెహోవామూలంగా నా కొమ్ము✽ ఎత్తబడింది.
నీవు ప్రసాదించిన రక్షణ విషయం నేను
సంతోషిస్తూ ఉన్నాను,
గనుక నా విరోధులను గురించి నేను ధైర్యంగా
మాట్లాడుతున్నాను.
2 యెహోవా వంటి పవిత్రుడు✽ ఎవ్వడూ లేడు.
నీవు తప్ప మరే దేవుడూ లేడు.
మా దేవుడు మాకు ఆధారశిల✽ లాంటివాడు.
అలాంటివాడు ఇంకెవ్వడూ లేడు.
3 యెహోవా అనంత జ్ఞానం✽ ఉన్న దేవుడు.
ఆయన మనుషుల కార్యకలాపాలను
పరిశీలిస్తాడు.
గనుక మీరు ఇకనుంచి గర్వంగా మాట్లాడకండి.
అహంభావ✽ మయమైన మాటలు మీ నోటినుంచి
రానివ్వకండి.
4 ✝యుద్ధవీరుల విండ్లు విరిగిపోయాయి.
మునుపు తొట్రుపడ్డవారు తమకు బలాన్ని
కట్టబెట్టుకొన్నారు.
5 ✽ఒకప్పుడు బాగా తృప్తిగా తిన్నవాళ్ళు
తిండికోసం కూలిపనులకు వెళ్తున్నారు. అప్పుడు ఆకలితో బాధపడ్డవారికి ఆకలి లేదు.
గొడ్రాలు ఏడుగురు పిల్లలను కన్నది.
చాలామంది పిల్లలను కన్న తల్లి నీరసించి పోతున్నది.
6 ✝యెహోవా ప్రజలను నాశనం చేస్తాడు, బ్రతికిస్తాడు.
ఆయన వారిని మృత్యులోకానికి✽ పంపిస్తాడు,
అక్కడ నుంచి రప్పిస్తాడు.
7 ✝యెహోవా మనిషిని దరిద్రుణ్ణి చేస్తాడు,
లేక ధనవంతుణ్ణి చేస్తాడు.
హీనదశకు తెస్తాడు, పైకెత్తుతాడు.
8 ఆయన దరిద్రులను ధూళినుంచి లేవనెత్తుతాడు,
అక్కరలో ఉన్నవారిని చెత్త కుప్పమీదనుంచి
పైకెత్తుతాడు.
వారిని గొప్పవారితో కూర్చోబెడతాడు.
వారిని మహిమగల సింహాసనాలెక్కిస్తాడు.
భూమి పునాదులు✽ యెహోవా వశం.
ఆయన లోకాన్ని వాటిమీద నిలిపాడు.
9 తన భక్తుల అడుగులను ఆయన కాపాడుతాడు✽.
కానీ దుర్మార్గులు చీకటి✽లో నాశనమవుతారు.
కేవలం బలం✽తో ఎవ్వడూ విజయాన్ని సాధించడు.
10 యెహోవాను ఎదిరించినవాళ్ళు చితికిపోతారు.
పైనుంచి ఆయన వాళ్ళమీద ఉరుము✽లాగా
గర్జిస్తాడు.
యెహోవా భూమి కొనలవరకు ఉన్నవారికి
తీర్పు✽ తీరుస్తాడు.
తాను నియమించిన రాజును బలపరుస్తాడు,
తాను అభిషేకించినవాని✽ కొమ్ము పై కెత్తిస్తాడు.”
11 తర్వాత ఎల్కానా రమాలో తన ఇంటికి వెళ్ళిపోయాడు గాని పిల్లవాడు యాజి అయిన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య✽ చేయసాగాడు.
12 ఏలీ కొడుకులు వట్టి దుర్మార్గులు. యెహోవా✽అంటే వాళ్ళకు లెక్కే లేదు✽. బలి అర్పణ విషయంలో యాజులకు ప్రజలతో ఉండే వ్యవహారంలో ఒక ఆచారం ఉండేది. 13 ✝ఎవరైనా బలి అర్పించిన తరువాత మాంసం ఉడుకుతూ ఉంటే, యాజి పనివాడు మూడు ముండ్ల గరిటెను చేతపట్టుకువస్తాడు, 14 డేక్సాలో లేక అండాలో లేక కొప్పెరలో లేక కుండలో దానిని గుచ్చి వెలుపలికి తీసేవాడు. ముండ్ల గరిటెకు గుచ్చుకొన్న మాంసమంతా యాజి తీసుకొనేవాడు. షిలోహుకు వచ్చిన ఇస్రాయేల్ ప్రజలందరి పట్లా ఈ విధంగా వ్యవహరించేవారు. 15 అయితే వారు బలి క్రొవ్వు✽ను కాల్చివేసేముందే యాజి పనివాడు వచ్చి బలి అర్పించినవానితో ఇలా చెప్పేవాడు: “కాల్చి పక్వం చేయడానికి నువ్వు యాజికి మాంసం ఇవ్వాలి. ఉడకబెట్టిన మాంసం అతడు మీ దగ్గర తీసుకోడు. పచ్చి మాంసం మాత్రమే కావాలి.”
16 ఒకవేళ ఆ మనిషి “మొదట క్రొవ్వు కాలిపోనియ్యి. తరువాత నీకేం కావాలో తీసుకో” అని చెపితే, పనివాడు “వీల్లేదు. ఇప్పుడే నీవు మాంసాన్ని ఇవ్వాలి. లేకపోతే దానిని బలవంతంగా తీసుకుంటాను” అని చెప్పేవాడు. 17 ✽ఈ విధంగా ఆ యువకులు యెహోవాకు అర్పణలు అర్పించడం విషయంలో ప్రజలకు తిరస్కారభావాన్ని కలిగించారు, గనుక యెహోవా దృష్టిలో వాళ్ళ అపరాధం చాలా ఘోరంగా ఉంది. 18 సమూయేలు పిల్లవాడుగా నారతో నేసిన ఏఫోదు✽ వేసుకొని యెహోవాకు పరిచర్య✽ చేసేవాడు. 19 ✽ఏటేటా అతడి తల్లి అతడికోసం చిన్న వస్త్రాన్ని కుట్టి, వార్షిక సమర్పణను అర్పించడానికి తన భర్తతో కూడా వచ్చినప్పుడు ఆ వస్త్రాన్ని తెచ్చి అతడికి ఇచ్చేది. 20 ✽ ఏలీ “ఈమె యెహోవాకు అంకితం చేసిన ఈ పిల్లవాడికి బదులుగా యెహోవా ఈమెవల్ల నీకు సంతానాన్ని ప్రసాదిస్తాడు గాక” అంటూ ఎల్కానానూ అతడి భార్యనూ దీవించేవాడు. అప్పుడు వారు తమ ఇంటికి తిరిగి వెళ్ళేవారు. 21 యెహోవా హన్నాను దయ చూశాడు. ఆమె గర్భవతి అయి ముగ్గురు మగబిడ్డలనూ ఇద్దరు ఆడబిడ్డలనూ కన్నది. ఇంతలో బాలుడు సమూయేలు యెహోవా సన్నిధానంలో✽ పెరుగుతూ ఉన్నాడు. 22 ✽ఏలీ చాలా ముసలివాడు. తన కొడుకులు ఇస్రాయేల్ ప్రజలందరికీ చేసినవాటన్నిటి విషయం, వాళ్ళు సన్నిధి గుడార ద్వారం దగ్గర పరిచర్య చేసే స్త్రీలతో పోవడం విషయం అతనికి వినబడింది. 23 ✽అతడు వాళ్ళతో ఇలా అన్నాడు: “ఇలాంటి పనులు మీరెందుకు చేస్తున్నారు? మీరెంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారో ప్రజలందరి మూలంగా నాకు వినబడింది. 24 నా కుమారులారా, ఇక ఈ పనులు చేయడం మానండి. యెహోవా యొక్క ప్రజల మధ్య వ్యాపిస్తూ ఉన్న ఈ విషయం నేను విన్నాను. ఇది మంచిది కాదు. 25 ఒక వ్యక్తి మరో మనిషికి వ్యతిరేకంగా పాపం చేస్తే అతడికోసం దైవ ప్రతినిధులు మధ్యవర్తిత్వం✽ చేయవచ్చు. కానీ ఎవరైనా యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేస్తే అతడి తరఫున ఎవరు విన్నపం చేస్తారు?” యెహోవా వాళ్ళను నాశనం✽ చేయాలని ఉన్నాడు✽, గనుక వాళ్ళు తమ తండ్రి హెచ్చరికను వినలేదు. 26 ✽ అయితే బాలుడు సమూయేలు ఇంకా పెరుగుతూ దేవుని దయ, మనుషుల దయ అనుభవిస్తూ వర్ధిల్లాడు.
27 ✽దేవుని మనిషి ఒకడు ఏలీ దగ్గరికి వచ్చి అతనితో ఇలా అన్నాడు: “యెహోవా చెప్పేదేమిటంటే, నీ పూర్వీకుడి వంశం✽ వారు ఈజిప్ట్‌లో ఫరో క్రింద బానిసలుగా ఉన్నప్పుడు నేను వారికి ప్రత్యక్షమయ్యాను. 28 ✝ఇస్రాయేల్ గోత్రాల వారందరిలో నీ పూర్వీకుణ్ణి నాకు యాజిగా ఉండడానికి ఎన్నుకొన్నాను. నా సన్నిధానంలో ఏఫోదు ధరించి నా బలిపీఠం దగ్గరికి రావడానికీ ధూపం అర్పించడానికీ అతణ్ణి నియమించాను. ఇస్రాయేల్ ప్రజలు అర్పించే హోమ వస్తువులన్నిటినీ నీ పూర్వీకుడి వంశంవారికి నియమించాను. 29 నా నివాసానికి నేను నిర్ణయించిన బలులనూ నైవేద్యాలనూ మీరు✽ ఎందుకు కాలదన్నుతున్నారు? నా ఇస్రాయేల్‌ప్రజలు అర్పించే వాటన్నిటిలో శ్రేష్ఠ భాగాలను మీరు తీసుకొని తిని బాగా బలిసిపోవడంవల్ల నన్ను గౌరవించేకంటే నీ కొడుకులను ఎక్కువగా గౌరవిస్తున్నావు. 30 ✽ అందుచేత ఇస్రాయేల్ దేవుడు యెహోవా చెప్పేదేమిటంటే, నీ వంశంవారూ నీ పూర్వీకుడి వంశంవారూ నా ఎదుట ఎప్పటికీ సేవ చేస్తారని నేను మాట ఇచ్చినా, ఇప్పుడు యెహోవా ఇలా అంటున్నాడు: ఆ తలంపు నా మనసుకు దూరమైంది. నన్ను గౌరవించేవారిని✽ నేను గౌరవిస్తాను. నన్ను తృణీకరించేవాళ్ళు తృణీకారానికి గురి అవుతారు. 31 ✽విను. రాబోయే కాలంలో నేను నీ బలాన్ని నీ పూర్వీకుడి వంశం బలాన్ని తక్కువ చేస్తాను. నీ వంశంలో ఎవ్వడూ ముసలి ప్రాయం చేరకుండా చేస్తాను. 32 నా ఆరాధన స్థలంలో ఆపద కలగడం నీవు చూస్తావు. నేను ఇస్రాయేల్ ప్రజలకు మేలు చేసినా నీ వంశంలో ఎవ్వడూ ముసలితనం చేరడు. 33 నా బలిపీఠం దగ్గర సేవ చేయడానికి నీ సంతానంలో నేను బ్రతకనిచ్చినవారి మూలంగా నీ కండ్లు కన్నీళ్ళతో మందగిస్తాయి. నీ మనసు దుఃఖమయమవుతుంది. నీ సంతానమంతా ముసలివారయ్యేముందే చనిపోతారు. 34 నీ ఇద్దరు కొడుకులకు జరగబోయేది నీకు సూచనగా ఉంటుంది. హొఫ్నీ, ఫీనెహాసు ఇద్దరూ ఒకే రోజున చస్తారు. 35 తరువాత నమ్మకమైన యాజి✽ని నేను నియమిస్తాను. అతడు నా హృదయాభిలాషనూ నా మనసులో ఉన్న తలంపులనూ అనుసరించి ప్రవర్తిస్తాడు. నేను అతని వంశాన్ని సుస్థిరం చేస్తాను. నేను అభిషేకించినవాని✽ సమక్షంలో అతడు ఎప్పటికీ సేవ చేస్తాడు. 36 ✽అప్పుడు నీ వంశంలో బ్రతికి మిగిలిన ప్రతి ఒక్కరూ డబ్బుకోసం రొట్టెకోసం వెళ్ళి ఆ యాజి ఎదుట వంగి, ‘నాకు తిండి దొరికేలా యాజుల ఉద్యోగాలలో ఒకదానిలో నన్ను ఉంచమ’ని ప్రాధేయపడతారు.”