1 సమూయేలు
1
1 ఎఫ్రాయిం కొండప్రాంతంలో రమాతయిం సూఫీంలో ఎల్కానా కాపురముండేవాడు. అతడు యెరోహాం కొడుకు. యెరోహాం ఎలీహు కొడుకు. ఎలీహు తోహు కొడుకు. తోహు సూఫు కొడుకు. సూఫు ఎఫ్రాయిం గోత్రంవాడు. 2 ఎల్కానాకు ఇద్దరు భార్యలు ఉన్నారు. వారి పేర్లు హన్నా, పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు ఉన్నారు గాని హన్నాకు పిల్లలు లేరు.
3  ఎల్కానా ప్రతి సంవత్సరం సేనలప్రభువు యెహోవాను ఆరాధించి బలి అర్పించడానికి స్వగ్రామం నుంచి షిలోహుకు వెళ్ళేవాడు. షిలోహులో ఏలీ ఇద్దరు కొడుకులు యెహోవాకు యాజులు. వాళ్ళు హొఫ్నీ, ఫీనెహాసు. 4 ఎల్కానా బలి అర్పించి నప్పుడెల్లా అర్పణలో ఒక భాగం తన భార్య పెనిన్నాకు ఇచ్చేవాడు, ఆమె కొడుకులకూ కూతుళ్ళకూ ఒక్కొక్కరికీ కూడా భాగం ఇచ్చేవాడు. 5  హన్నాను ప్రేమించడంవల్ల, యెహోవా ఆమెకు సంతానం కలగకుండా చేయడం వల్ల, ఆమెకు అర్పణలో రెండు భాగాలు ఇచ్చేవాడు. 6 యెహోవా ఆమెకు సంతానం కలగకుండా చేసినందువల్ల ఆమె ప్రత్యర్థి పెనిన్నా ఆమెకు చికాకు పుట్టించాలని ఆమెను పీడించేది. 7 ఏటేటా ఈ విధంగా జరుగుతూ ఉండేది. హన్నా యెహోవా నివాసానికి వెళ్ళినప్పుడెల్లా ఆమె భోజనం చేయడం మాని ఏడ్చేవరకు పెనిన్నా ఆమెను పీడిస్తూ వచ్చేది.
8 ఆమె భర్త ఎల్కానా “హన్నా, నీవెందుకు ఏడుస్తున్నావు? ఎందుకు భోజనం చేయవు? మనోవిచారమెందుకు నీకు? పదిమంది కొడుకులకంటే నేను నీకు ఎక్కువ కానా?” అని ఆమెతో చెప్పేవాడు.
9 ఒక రోజు వారు షిలోహులో భోజనాలు చేసిన తరువాత హన్నా నిలబడింది. అప్పుడు యాజి అయిన ఏలీ యెహోవా ఆరాధన స్థలం ద్వారం స్తంభం దగ్గర ఉన్న తన కుర్చీ మీద కూర్చుని ఉన్నాడు. 10 హన్నాకు హృదయం నిండా దుఃఖమే. ఆమె చాలా కన్నీళ్ళు విడుస్తూ, యెహోవాకు ప్రార్థన చేసి ఇలా మొక్కుబడి చేసుకొంది:
11 “సేనలప్రభువు యెహోవా! నేను నీ సేవికను. నా బాధను చూచి నన్ను మరవక మనసులో ఉంచుకొని నాకు పిల్లవాణ్ణి ప్రసాదిస్తే వాడు జీవించే కాలాన్నంతా యెహోవాకు అంకితం చేస్తాను. క్షౌరం చేసే కత్తి వాడి తలను తాకనివ్వను.”
12 యెహోవాకు హన్నా ప్రార్థన చేస్తూ ఉంటే ఆమె పెదవుల కదలికను ఏలీ గమనించాడు. 13 హన్నా మనసులోనే ప్రార్థన చేసింది. ఆమె పెదవులు మాత్రం కదిలాయి గాని ఆమె స్వరం వినబడలేదు. అందుచేత ఏలీ ఆమె త్రాగి మత్తులో ఉందనుకొన్నాడు.
14 “నీవు ఎంత సేపు మత్తులో ఉంటావు? నీ ద్రాక్షమద్యాన్ని విడిచిపెట్టు!” అని ఆమెతో చెప్పాడు.
15 అందుకు హన్నా “అయ్యగారూ, అలా అనుకోవద్దండి. నా మనసు ఎంతో కృంగిపోయింది. నేను ద్రాక్షమద్యాన్ని గానీ మరే మద్యాన్నీ గానీ త్రాగలేదు. యెహోవా ఎదుట హృదయాన్ని విప్పి నా బాధలను ఆయనకు విన్నవించుకొంటున్నాను. 16 మీ సేవికనైన నేను నీచమైనదాన్ని అనుకోవద్దండి. ఇంతవరకు నేను ఎంతో హృదయ వేదనతో, దుఃఖంతో ప్రార్థన చేశాను” అని జవాబిచ్చింది.
17 అప్పుడు ఏలీ “నీవు క్షేమంగా వెళ్ళు. ఇస్రాయేల్ ప్రజల దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీవు అడిగినట్టు ప్రసాదిస్తాడు గాక!” అని చెప్పాడు.
18 “మీరు మీ సేవకురాలైన నన్ను దయ చూడాలి” అని హన్నా చెప్పింది. అప్పుడు ఆమె వెళ్ళిపోయి భోజనం చేసింది. ఆ నాటినుంచి ఆమె దుఃఖవదనం పోయింది.
19 ఉదయమే వారు లేచి యెహోవాను ఆరాధించి రమాలో ఉన్న తమ ఇంటికి వెళ్ళారు. ఎల్కానా తన భార్య హన్నాను కూడాడు. యెహోవా ఆమెను తలచుకొన్నాడు. 20 గనుక హన్నా గర్భం ధరించి నెలలు నిండిన తరువాత మగబిడ్డను కన్నది. ఆమె “నేను యెహోవాకు మొక్కి వీణ్ణి అడుక్కొన్నాను” అని చెప్పి అతడికి సమూయేలు అని పేరు పెట్టింది.
21 తరువాత యెహోవాకు వార్షిక బలి అర్పించడానికీ తన మొక్కుబడి చెల్లించడానికీ ఎల్కానా తన కుటుంబ సమేతంగా షిలోహుకు మరో సారి వెళ్ళాడు. 22 గానీ హన్నా వారితో కూడా వెళ్ళలేదు.
“పిల్లవాడు చనుపాలు మానిన తరువాత నేను వాణ్ణి యెహోవా సన్నిధానంలోకి తీసుకువెళ్తాను. అప్పుడు వాడు జీవించే కాలమంతా అక్కడే ఉంటాడు” అని ఆమె భర్తతో చెప్పింది.
23 అందుకు ఆమె భర్త ఎల్కానా “నీకు ఏది మంచిది అనిపిస్తే ఆ విధంగా చెయ్యి, నువ్వు వాడికి పాలు మాన్పించే వరకు ఆగు. యెహోవా తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు గాక!” అన్నాడు. గనుక ఆమె ఇంటిదగ్గర ఉండి తన కొడుక్కు పాలు మాన్పించేవరకు వాణ్ణి పోషించింది. 24  పాలు మాన్పించిన తరువాత, అతడు ఇంకా బాల్యంలోనే ఉన్నా, ఆమె ఆ పిల్లవాణ్ణి షిలోహులో ఉన్న యెహోవా నివాసానికి తీసుకువెళ్ళింది. ఆమె మూడేళ్ళ కోడెను, తూమెడు పిండిని, ద్రాక్షరసంతో నిండిన తిత్తిని కూడా తీసుకువెళ్ళింది. 25 వారు కోడెను వధించి ఆ పిల్లవాణ్ణి ఏలీ దగ్గరికి తీసుకువెళ్ళారు. 26 ఆమె అతడితో ఇలా అంది: “అయ్యగారూ, మీదగ్గర నిలిచి యెహోవాకు ప్రార్థన చేసిన స్త్రీని నేనే అని మీ జీవంమీద ఆనబెట్టి చెపుతున్నాను. 27 ఈ పిల్లవాణ్ణి దయ చేయమని యెహోవాను ప్రార్థించాను. నేను అడిగినట్టు యెహోవా నాకు ప్రసాదించాడు. 28 గనుక నేను ఇతణ్ణి యెహోవాకు ఇచ్చివేస్తున్నాను. అతడు జీవించే కాల మంతా యెహోవాకు అంకితమై ఉంటాడు.” అప్పుడతడు అక్కడ యెహోవాను ఆరాధించాడు.