3
1 తరువాత రూతు అత్త నయోమి ఆమెతో “నా బిడ్డా, నువ్వు క్షేమంగా ఉండేలా నీ సంరక్షణ విషయం నేను ఆలోచించాలి. 2 నీవు బోయజు పనికత్తెల దగ్గర పని చేస్తున్నావు గదా. బోయజు మనకు బంధువు. ఇదిగో విను. ఆయన ఈ రాత్రి కళ్ళంలో యవలు చెరిగిస్తూవుంటాడు. 3 నీవు స్నానం చేసి, నూనె రాసుకొని, మంచి బట్టలు వేసుకొని, అక్కడికి వెళ్ళు. ఆయన అన్నపానాలు ముగించకముందు నీవు అక్కడున్న సంగతి ఆయనకు తెలియనివ్వకు. 4 ఆయన పడుకొన్నాక ఆయన పడుకొన్న స్థలం గుర్తించు. అప్పుడు వెళ్ళి ఆయన పాదాలమీదనుంచి దుప్పటి తీసి అక్కడే పడుకో. నీవేం చెయ్యాలో ఆయనే నీకు చెప్తాడు” అంది.
5 అందుకు రూతు “నీవు చెప్పినట్టెల్లా నేను చేస్తాను” అంది.
6 అలాగే ఆమె కళ్ళం దగ్గరికి వెళ్ళింది. అత్త ఆదేశించినట్టెల్లా చేసింది. 7 బోయజు తిని, త్రాగి, సంతోషంగా ఉండి, ధాన్యం కుప్ప దగ్గరికి వెళ్ళి పడుకొన్న తరువాత, ఆమె మెల్లిగా వెళ్ళింది, అతని పాదాల మీదనుంచి దుప్పటి తీసి, అక్కడ పడుకొంది. 8 అర్ధరాత్రి అతడు ఉలిక్కిపడి ఆ వైపుకు తిరిగితే ఒక స్త్రీ అతని పాదాల దగ్గర పడుకొని ఉండడం చూశాడు.
9 “ఎవరు నువ్వు?” అని అతడు అడిగాడు.
ఆమె “నేను రూతును, మీ దాసిని, మీరు నన్ను విడిపించగల సమీప బంధువులు. కనుక మీ దాసి అయిన నామీద మీ పైవస్త్రాన్ని కప్పండి” అంది.
10 అతడు అన్నాడు, “అమ్మాయి, యెహోవా నిన్ను దీవిస్తాడు గాక! వారు పేదలు కానీ, ధనికులు కానీ నీవు యువకుల వెంటపడక, మునుపటికంటే ఇప్పుడు మరింత మంచి ప్రవర్తనను కనుపరిచావు. 11 నా కుమారీ, భయపడకు. నీవు చెప్పినట్టెల్లా నీపట్ల జరిగిస్తాను. నీవు గుణవతివని నా ఊరిలో వారందరికీ తెలుసు. 12 నేను నిన్ను విడిపించగల సమీప బంధువుగా ఉన్న సంగతి నిజమే. కానీ, నీకు నాకంటే సమీప బంధువు ఒకడు ఉన్నాడు. 13 ఈ రాత్రి ఇక్కడ ఉండు. పొద్దున అతడు బంధుధర్మం వహించి నిన్ను విడిపిస్తే విడిపించవచ్చు. అలా చేయడానికి అతడికి మనసు లేకపోతే నేనే బంధుధర్మం వహిస్తానని జీవంగల యెహోవా తోడని ప్రమాణం చేస్తున్నాను. తెల్లవారేవరకు పడుకో.”
14 అందుచేత ఆమె ఉదయం వరకు అతని పాదాల దగ్గర పడుకొంది. ఒకరినొకరు గుర్తుపట్టగలిగేటంత వెలుగు రాకముందే ఆమె లేచింది. “ఒక స్త్రీ కళ్ళంలోకి వచ్చినట్టు ఎవ్వరికీ తెలియకూడదు” అని బోయజు అన్నాడు. 15 “నీవు కప్పుకున్న దుప్పటి తెచ్చి పట్టుకో” అని కూడా అతడు చెప్పాడు. ఆమె దుప్పటి తెచ్చి పట్టితే అతడు ఆరు కొలల యవల గింజలను కొలచి ఆమె భుజం పైకి ఎత్తాడు. ఆమె ఊరిలోకి వెళ్ళింది.
16 ఆమె అత్త ఇంటికి వచ్చినప్పుడు నయోమి “నా బిడ్డా, సంగతి ఎలా జరిగింది?” అని అడిగింది. అప్పుడామె బోయజు తనకోసం చేసినదంతా తెలియజేసింది. 17 “అతడు ‘నీ అత్త ఇంటికి వట్టి చేతులతో వెళ్ళవద్దని చెప్పి ఆరు కొలల యవల గింజలు నాకిచ్చాడు” అని ఆమె చెప్పింది.’”
18 అందుకు నయోమి “నా బిడ్డా, ఈ సంగతి ఎలా జరుగుతుందో తెలుసుకొనేవరకు నీవు ఇక్కడే ఉండు, ఇవ్వేళ ఏదో ఒకటి ఆయన తేల్చేస్తాడు. అంతవరకు విశ్రాంతి తీసుకోడు” అంది.