2
1 నయోమికి భర్త తరఫు బంధువుడొకడు ఉండేవాడు. అతడు ఎలీమెలెకు వంశానికి చెందినవాడు. అతడు గొప్ప ఆస్తిపరుడు. అతని పేరు బోయజు. 2 మోయాబు దేశస్థురాలు రూతు నయోమితో, “నన్ను పొలాలకు వెళ్ళి పరిగే✽ ఏరుకోనియ్యి. ఎవరి దయ నాకు లభిస్తుందో వారి వెనుక ఏరుకొంటాను” అని చెప్పింది. అందుకు నయోమి “నా బిడ్డా, అలాగే వెళ్ళు” అంది.3 ఆమె బయలుదేరి పొలాలకు చేరి✽ పంట కోసేవారి వెనుక ఏరుకోవడం మొదలు పెట్టింది. అనుకోకుండా ఆమె పరిగె ఏరుకొన్న పొలం ఎలీమెలెకు వంశస్థుడైన బోయజుది. 4 ✽ఇంతలో బోయజు బేత్‌లెహేంనుంచి వచ్చి “యెహోవా మీకు తోడుగా ఉంటాడు గాక” అని పంట కోసేవారితో అన్నాడు. వారు “యెహోవా మిమ్మల్ని దీవిస్తాడు గాక!” అని బదులు చెప్పారు.
5 అప్పుడు బోయజు పంట కోసేవారి మీద నియమించిన తన సేవకుడితో “ఆ యువతి ఎవరు?” అని అడిగాడు.
6 అందుకా సేవకుడు “ఈమె మోయాబుదేశం పిల్ల. నయోమితో కూడా మోయాబునుంచి వచ్చింది. 7 ‘కోతవారి వెనుక పనలమధ్య ఏరుకొని కూర్చుకోనివ్వండి’ అని అడిగింది. ఆమె వచ్చి పొద్దుటినుంచి ఇప్పటిదాకా ఏరుకొంటూనే ఉంది. కాసేపు మాత్రం నీడపట్టులో కూర్చుంది” అని జవాబిచ్చాడు.
8 బోయజు రూతుతో “అమ్మాయి, నేను చెప్పేది విను. ఏరుకోవడానికి మరో పొలానికి వెళ్ళవద్దు. దీనిని విడిచిపోవద్దు. ఇక్కడే నా పనికత్తెల దగ్గరే ఉండు. 9 కోతవారు కోసే చేను కనిపెట్టి వారి వెనుక వెళ్ళు. నిన్ను తాకకూడదని యువకులకు ఆజ్ఞ జారీ చేశాను. నీకు దాహం వేస్తే, నీటికుండల దగ్గరికి వెళ్ళి పనివారు తోడి పోసిన నీళ్ళు తాగు” అన్నాడు.
10 అది విని ఆమె సాష్టాంగపడి నేలను తల దించుకొని “నేను పరదేశిని, నన్ను గమనించేటంత దయ మీకు ఎలా కలిగిందో?” అని అడిగింది.
11 ✝అందుకు బోయజు ఆమెతో అన్నాడు, “నీ భర్త చనిపోయిన తరువాత నీ అత్తకు నీవు చేసినదంతా నాకు తెలిసింది. నీవు నీ తల్లిదండ్రులనూ నీ జన్మభూమినీ విడిచి, ఇంతకుముందు నీకు తెలియని ఈ ప్రజలమధ్యకు వచ్చావు. 12 నీవు చేసినదానికి యెహోవా ప్రతిఫలం✽ ఇస్తాడు. ఇస్రాయేల్ దేవుడైన యెహోవా రెక్కల✽కింద శరణు కోరి నీవు వచ్చావు. ఆయన నీకు పరిపూర్ణ బహుమతి ఇస్తాడు.”
13 అందుకు ఆమె “అయ్యగారూ, మీ సేవకులలో నేను ఒకదానిని కాకపోయినా మీరు నన్ను ఆదరించారు, మీ దాసి అయిన నాతో మృదువుగా మాట్లాడారు. నన్నింకా దయ చూడండి” అంది.
14 తరువాత భోజన సమయంలో బోయజు ఆమెతో “నీవు ఇక్కడికి వచ్చి పులిసిన ద్రాక్షరసంలో రొట్టె ముక్కలను ముంచుకొని తిను” అన్నాడు.
పంట కోసేవారి దగ్గర ఆమె కూర్చుని ఉంటే, అతడు ఆమెకు కొన్ని పేలాలు ఇచ్చాడు. ఆమె తృప్తిగా తిని కొన్ని మిగిల్చింది. 15 ✽మళ్ళీ ఏరుకోవడానికి ఆమె నిలబడ్డప్పుడు బోయజు తన సేవకులకు ఇలా ఆజ్ఞ జారీ చేశాడు: “ఆమెను పనలమధ్య కూడా ఏరుకోనివ్వండి. ఆమెను నొప్పించకండి. 16 ఆమె ఏరుకొనేలా మీ మోపులలో పిడికిళ్ళతో పడేసి విడిచిపెట్టండి. ఆమెను మందలించకండి.”
17 ఆమె ప్రొద్దు క్రుంకేవరకు ఆ పొలంలో ఏరుకొని, ఏరుకొన్న పంటను నూర్చింది. అది సుమారు తూమెడు యవలు అయింది. 18 ఆమె దానిని ఎత్తుకొని ఊరిలోకి వచ్చింది. ఆమె ఏరుకొన్నది ఎంతో ఆమె అత్త చూచింది. తాను తృప్తిగా తిన్న తరువాత మిగిల్చిన పేలాలు కూడా రూతు అత్తకు తీసి ఇచ్చింది.
19 ✽ఆమె అత్త “ఈ వేళ నీవు ఎక్కడ ఏరుకొన్నావు? ఎక్కడ పని చేశావు? నిన్ను గమనించి దయ చూపినవాడు దీవెన పొందుతాడు గాక!” అని ఆమెతో చెప్పింది. అప్పుడు రూతు తాను ఎవరిదగ్గర పని చేసిందో ఆ సంగతి తన అత్తకు తెలియజేసింది. “ఈ వేళ నేను ఎవరి దగ్గర పని చేశానో ఆయన పేరు బోయజు” అంది.
20 నయోమి, “యెహోవా ఆయనను దీవిస్తాడు గాక! యెహోవా బతికివున్నవారికీ చనిపోయినవారికీ కృప✽ చూపడం మానలేదు” అని కోడలితో అంది. “ఆ మనిషి మనకు సమీప బంధువుడు✽, మనల్ని విడిపించగల బంధువులో ఒకరు” అని కూడా నయోమి చెప్పింది.
21 మోయాబుదేశస్థురాలైన రూతు “అంతమాత్రమే కాదు. ఆయన నన్ను చూచి తన పంట కోత అంతా ముగిసేవరకు తన పనివారిదగ్గరే ఉండమని నాతో చెప్పాడు” అంది.
22 తన కోడలు రూతుతో నయోమి “నా బిడ్డా, వేరే పొలంలో నీకు హాని కలుగుతుందేమో గనుక ఆయన పనికత్తెలతో కలిసి నీవు పనిమీదికి వెళ్ళడం మంచిది” అని చెప్పింది.
23 కాబట్టి యవల కోత, గోధుమల కోత ముగిసేవరకూ ఆమె బోయజు పనికత్తెలదగ్గరే ఏరుకొంటూ వచ్చింది. తన అత్త ఇంట్లో నివసించింది.